Previous Page Next Page 
శతఘ్ని పేజి 33


    
    "మిస్టర్ త్యాగీ....." టైం చూసుకుంటూ అంది "నేను చెప్పినగడువులో అప్పుడే ఆరునిమిషాలు పూర్తయిపోయింది."  

 

    "వెల్..... అసలు విషయానికి వచ్చేముందు మరో నిమిషం నీ గురించి మాట్లాడాలనుంది."
    
    నిశ్శబ్దంగా వుండిపోయింది సౌందర్య.
    
    "నువ్వుచేసిన పొరపాటు....."
    
    అతడి వాక్యం ఇంకా పూర్తి కానేలేదు.
    
    "నీ గురించి నేను పొరపాటుపడలేదు. కరెక్టుగానే అంచనా వేశాను. దానికి సాక్ష్యం డబ్బు తీసుకొని నేను కోరినట్టు ముఖ్యమంత్రి రాజారాంకి అనుకూలంగా రాసేవుకాకపోతే పరోక్షంగా అంతే"
    
    కోపాన్ని నిభాయించుకున్నాడు త్యాగి.
    
    "సైకాలజీనిమాత్రమే బాగాచదివిన నువ్వు షేక్ స్పియర్ నీ చదవాల్సింది సౌందర్యా."
    
    "దేనికో" వ్యంగ్యంగా అంది.
    
    "TEMPTNOT A DESPERATE MAN- ఆయనెప్పుడో చెప్పింది అర్ధమయ్యేవుండాలి."
    
    సౌందర్యలో సహనం నశించిపోతూంది. "నిన్ను నేనేం టెమ్ట్ చేయలేదు. మిస్టర్ డెస్పరేట్ మేన్ ..... చేసినా నీ మూలంగా నాకు హానిజరగదు...... అయామ్ ష్యూరా ఫిట్.....చెప్పు ఇక మిగిలింది రెండున్నర నిమిషాలు....."
    
    మరో పదిహేను సెకండ్ల నిశ్శబ్దం తర్వాత అన్నాను "ఎస్...... నేను నీదగ్గర పదివేలు తీసుకుని సి.ఎం. రాజారాంకి అనుకూలంగా రాశాను. పరోక్షంగా నైనా అదినువ్వు గ్రహించగలిగినందుకు నా అభినందనలు కాని అలా రాస్తే నువ్వు ఆ తర్వాత మరేదో ఇవ్వడానికి సరేనన్నావు?"
    
    "ఆ 'యేదో' యివ్వడానికి నేను సిద్దపడతానని ఎలా అనుకున్నావు?"
    
    "మాటిచ్చారుగా"
    
    "అది అప్పటి మాట"
    
    "అలాంటప్పుడు నాచేత లక్ష డొనేషన్ కి అందరి ముందూ మాటెందుకు తీసుకున్నావ్"
    
    "సింపుల్...... నిన్ను ఫూల్ ని చేయాలని"
    
    ఠక్కున అనేసిన సౌందర్య అప్పుడు చూసింది త్యాగి కళ్ళలో ఎరుపు జీరల్ని.
    
    హఠాత్తుగా ఆవరించిన నిశ్శబ్దం ఏ అనర్ధానికి దారి తీస్తుందో అని ఆమె భయపడుతున్నక్షణంలో ఉద్విగ్నతని అణచుకుంటూ అన్నాడు "సో...... వెంటనే ఆ డబ్బు నా తరపున నువ్వు చెల్లించు."
    
    "దేనికి?"
    
    "నేను ఫూల్ ని కానని మళ్ళీ నువ్వే నిరూపించడానికి"
    
    "నేను నువ్వనుకున్నంతఫూల్ ని కాను మిస్టర్ త్యాగి"
    
    "అని అనిపించింది"
    
    "ఏమనీ?"    

 

    "కొంతశాతం ఫూల్ వని..... "క్షణం ఆగి అన్నాడు "ఇప్పుడు నూరుశాతం ఫూల్ వని నిరూపిస్తాను"
    
    ఆమె విస్మయంగా చూస్తుండగానే జేబులో నుంచి ఓ చిన్న టేప్ రికార్డర్ తీసుకుని ఆన్ చేశాడు.
    
    "మీలాంటి అందమైన అమ్మాయి తన స్నేహితురాళ్ళతో గండిపేట పిక్నిక్కి వచ్చింది...."
    
    ఆ రోజు పార్కులో తమ మధ్యజరిగిన చర్చలు తనకు తెలియకుండా రహస్యంగా టేప్ చేశాడు.
    
    అది కాదు సౌందర్యని కలవరించింది....... రికార్డర్ ని చివరగా విన్నది.
    
    "రేపు నేను రాసేక నాకు కావాల్సింది డబ్బుకాదు సౌందర్యా మీ అందం...... ఓకె అంటే నేనూ రెడీ..... లేదూ అంటే ఈ డబ్బు వెనక్కితీసుకోండి."
    
    "సరే" సౌందర్య జవాబది.
    
    "ఓ ఇన్వెస్టి గెటివ్ జర్నలిస్టుఇలాంటి సరంజామాతోనే ఏ వలయం లోనైనా అడుగుపెట్టి అవసరమైతే యిలాగే సిద్దం చేసుకుంటాడని తెలీని మిస్ సౌందర్యా! ఒక చిన్న గెలుపు కోసం నువ్వే స్థాయికి దిగజారడానికి మాటిచ్చిందీ నీ స్నేహ బృందానికి నేను తెలియచెప్పాలీ అంటే ఇది చాలనుకుంటాను"
    
    సౌందర్యపాలభాగం స్వేదం పేరుకుంది.
    
    నిజమే...... ఇది చాలు ఏళ్లతరబడి తెచ్చుకున్న పేరు నాశనం కావడానికి అదీకాదు......గుంభనంగా, గంభీరంగా బ్రతకడమే అలవాటైనా తను ఇతనితో పోటీపడి తను పొరపాటు చేసింది.
    
    "మాట్లాడు సౌందర్యా మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్న నీ ఫ్రెండ్స్ కి వినిపించమంటావా?"
    
    "వద్దు" కంగారుగా అంది.
    
    "అయితే నేను చెల్లించాల్సిన లక్ష నా తరపున నువ్వు చెప్పించాలి."
    
    ఆమె ఆలోచించలేదు "అలానే"
    
    "డ్రాప్ చేయమంటావా?"
    
    "అక్కర్లేదు"
    
    ఆవేశంగా ముందుకు నడుస్తుంటే, "ఇంటికెళ్ళాక ఏం జవాబు చెబుతావ్?"
    
    "అది నాకు వదిలెయ్"
    
    "కాని నీ ఫ్రెండ్స్ వదిలిపెట్టరు. కనీసం యిందాకటిపజిల్ గురించి అడుగుతారు."
    
    వెంటనే సౌందర్య కది గుర్తుకురాలేదు.    

 

    "అదే సౌందర్యా నాలుగువేళ్ళనివి గల విశ్వరహస్యం గురించి"
    
    ఆగిపోయింది సౌందర్య.
    
    ఇప్పుడు మరో అశ్లీలమైన జవాబు వినబోతోంది.
    
    "ఒకనాడు అక్బర్ మంత్రిగా, మేథావిగా తను గుర్తించినా బీర్బల్ ని అడిగాడు నిజానికి, అబద్దానికి మధ్య దూరం గురించి నాలుగు వేళ్ళు మాత్రమే అన్నాడట. ఇందాకటి మీ ఫ్రెండ్స్ లాగే అదేదో అశ్లీలమైన జవాబులా అనిపించిందట అక్బర్ పాదుషాక్కూడా. వివరించమన్నాడు. అప్పుడు చెప్పాడు బీర్బల్ చూసేది నిజం, విన్నది అబద్దమైతే కంటికీ, చెవికీ మధ్యదూరం నాలుగు వేళ్ళనిడివి మాత్రమే అంటూ ...... అది నీ స్నేహితులకన్నా ప్రత్యేకించి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం సౌందర్యా."    

 

    ఇంటికిరాగానే స్నేహితురాళ్ళు చుట్టుముడతారని తెలుసు. కాని చిత్రంగా మరికొందరు విద్యార్దినులూ వెయిట్ చేస్తున్నారు ఇంటి దగ్గర ముందు అర్ధం కాలేదు.

   
    "మరోవారం రోజుల్లో కొత్తగా కట్టించబడిన యూనివర్సిటీ ఆడిటోరియం ఇనాగరేషన్కి ముఖ్య అతిథిగా ఎవర్ని పిలిస్తే బాగుంటుందో అడగాలని వచ్చాం" అన్నాడు స్టూడెంట్ యూనియన్ సెక్రటరీ, "విద్యా శాఖమంత్రి అయితే బాగుంటుందనుకుంటున్నాం."
    
    అదే సౌందర్యకి యూనివర్శిటీలోవున్న తిరుగులేని గుర్తింపుకు తార్కాణం.
    
    అదికాదు ఆ క్షణంలో సౌందర్య ఆలోచిస్తున్నది సరిగ్గా అదే ఆడిటోరియంలో కొన్ని వందలమంది స్టూడెంట్స్ సమక్షంలో చాలా మేథావిని అనుకుంటున్న త్యాగిని అవమానించాలి అదీ దారుణంగా ఇరుకునపెట్టి.
    
    "మంత్రిగారితోపాటు ప్రముఖ జర్నలిస్టుత్యాగినీ స్పీకర్ గా పిలిస్తే బెటరనుకుంటాను." అప్పటికే త్యాగి చాలామంది ఫేన్స్ ని సృష్టించుకున్న విషయం తెలిసిన యూనియన్ సెక్రటరీ ఆనందంగా అంగీకరించాడు.
    
    అందరూ వెళ్ళాక మరో అరగంటలో అబ్జర్వర్ పత్రికాఫీసుకి ఫోన్ చేసింది సౌందర్య.
    
    అరనిమిషం వ్యవధిలో లైన్ లోకివచ్చాడు త్యాగి.
    
    "నేను సౌందర్యని మాట్లాడుతున్నాను"
    
    "సర్ ప్రయిజ్"    

 

    ముక్తసరిగా అంది సౌందర్య "లక్షరూపాయల నష్టంతో నీ పరువు కాపాడగలిగాను మిస్టర్ త్యాగి. ఇప్పుడు నువ్వు నా పరువు కాపాడాలి"
    
    "కేసెట్టేగా-ఇరేజ్ చేస్తాను"
    
    "నీమాట మీద నమ్మకముంది"

 Previous Page Next Page