Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 33

                                 


    "మీకు తెలీదనుకుంటాను. ఈ మధ్యనో తెలుగు పిక్చర్లో హీరోయిన్ రెండు తూనీగల్ని పెంచుతుంది. బాత్ రూమ్ కెళ్ళినా- కాలేజీ కెళ్ళినా ఎప్పుడూ ఆమెనే అంటిపెట్టుకుని ఉంటాయన్నమాట అని! ఓ విలన్ సినిమా అంతా ఆమెని నానాబాధలు పెడుతూ చివర్లో రేప్ చేయబోతుంటే ఆ రెండు తూనీగలు ఆ విషయం తెలుసుకుని కోపంగా ఎగిరి విమానాల్లా వాడిని ఛేజ్ చేసి చివరికి వాడి మీదపడి రెండు కళ్ళూ పీకేస్తాయ్- కేవలం ఆసీనుకోసమే నూట ఇరవై ఆర్రోజులు ఆడింది ఆ సినిమా!" చెప్పాడు శాయీరామ్.
    "ఇంక వెళ్దామా?" అడిగింది ఎల్వీరా వాంతి ఆపుకుంటున్నట్లు మొఖం పెట్టి- హఠాత్తుగా హాల్లో వున్న ఆడాళ్ళందరూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు.
    "అరె- ఏమయింది? లేడీస్ అంతా ఎందుకలా ఏడుస్తున్నారు" గాబరాగా అడిగింది ఎల్వీరా!
    "ఆడాళ్ళు ఏడవటానికి ఆఖరులో సెంటిమెంట్ సీన్లు పెడతారండీ! భర్తకాళ్ళు కళ్ళకద్దుకుంటూ ఏడ్చేసీన్లు, భర్తామెను చావగొట్టి పీక పిసుకుతున్నా "పతియే ప్రత్యక్షదైవం- ఆదైవం కాదంటే ఉరియే అత్యంత ప్రియం" అని పాడటం. తననొదిలేసి ఇంకో స్త్రీతో సంసారం చేస్తున్న భర్తకోసం, జీవితాంతం పాటలు పాడుతూ ఎదుర్చూడటం, భర్త ఇంకెవర్నయినా ప్రేమిస్తే- తనే వాళ్ళిద్దరికీ పెళ్ళిచేయడం ఇలా చాలా బావుంటాయ్ సీన్లు-"
    "చాలు! చాలు" అంది ఎల్వీరా వికారంగా మొఖం పెట్టి.
    "అయినా మగాడిని ఇక్కడ స్త్రీలు దేవుడు అంటారేమిటి? ఇది నేనెక్కడా చూళ్ళేదు-" అందామె.
    "నేను చూశాను" అన్నాడు రెడ్డి తెలుగువాళ్ళను ఆమె అలా ఇన్సల్ట్ చేయటం భరించలేక.
    "ఎక్కడ?
    "ఏమో గుర్తులేదు! పాకిస్తాన్ లో అనుకుంటాను!" అంటూ తప్పించుకున్నాడు. అందరం హాలు బయటకొచ్చేశాం. రోడ్డుమీద ట్రాఫిక్ అంతా ఆగిపోయివుంది.
    "మళ్ళీ ఏమిటి! రోడ్డు మీద పెళ్ళా? చిరాకుగా అడిగిందామె.
    గోపాల్రావ్ జనంలోంచి ముందుకు చొచ్చుకెళ్ళి సంగతి కనుక్కొచ్చాడు. ఏదో సబ్బుల కంపెనీవాళ్ళు- కొత్తగా తయారు చేసిన సబ్బు పబ్లిసిటీ కోసం వంద తాబేళ్ళను అలంకరించి రోడ్లుమీద బాండ్ మేళంతో ఊరేగింపుగా నడిపిస్తున్నారు. పాపం తాబేళ్ళు కొంచెం స్లోకదా! అందుకని ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటసేపటి తర్వాత తాబేళ్ళు పది గజాల దూరంలో వున్న సెంటర్ దాటాయి.
    ఆ తాబేళ్ళ వెనకే వెడుతున్న బస్ ఎక్కాం అందరం.
    "ఇలా ఆ సబ్బుల కంపెనీవాళ్ళు ట్రాఫిక్కంతా జామ్ చేసేస్తుంటే మీ పోలీసులేం చేస్తున్నారు?" అడిగింది ఎల్వీరా.
    "పోలీసులా అవును! నిజమే! పోలీసులేం చేస్తున్నారు?" అన్నాడు రెడ్డికూడా ఆలోచిస్తూ.
    "పాపం! పోలీసుల్నేం అనకండి! వాళ్ళకి తీరికేది? మినిష్టర్ల ఇళ్ళకికాపలా వుండాలి కాబరే డాన్సులు రోజూ చూసి, ఎప్పుడయినా ఓసారి కేసులు పెట్టాలి. దగ్గరుండి వీడియోపార్లర్లలో బ్లూ ఫిలిమ్స్ వేయించాలి. ఎవరయినా "వేయం" అని ఎదురుతిరిగితే దొంగకేసులు పెట్టాలి. వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించని వాళ్ళను 'నక్సలైట్లు' అని అరిచి కాల్చి పారెయ్యాలి. మా బస్ రాత్రి పన్నెండింటికి తాబేళ్ళ ఊరేగింపు ముగిశాక, స్పీడ్ గా పరుగెత్తి మమ్మల్ని కాలనీకి చేర్చింది.
    అందరం రాళ్ళు తక్కువగా వుండే గోధుమ రొట్టెలు తిన్నాం.
    "అబ్బ! నిదరొస్తుంది! గుడ్ నైట్" అంది ఎల్వీరా.
    "అప్పుడే గుడ్ నైట్ చెప్తున్నారేమిటి?" రెండింటివరకూ మేలుకోవాలి కదా!" అన్నాడు గోపాల్రావ్.
    "ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగిందామె.
    "రెండింటికి దొంగలొస్తారు ఊరి బయటకాలనీలకు! వాళ్ళొచ్చేటైముకి తలుపులు తెరిచి ఆహ్వానించకపోతే కాల్చిచంపేస్తారు."
    "దొంగల కోసం తలుపులు తెరిచి ఆహ్వానించాలా ఎంతఘోరం?"
    "ఒకప్పుడు చాలా ఘోరమేననుకోండి! కానీ ఇప్పుడు అలవాటుపోయింది."
    "మరి పోలీసులేం జేస్తుం... సారీ! ఇందాకే చెప్పారుకదా!"
    రెండింటికి కాలనీలో ఓ ఇంటికి దొంగలొచ్చి వెళ్ళాక- అందరం గుడ్ నైట్ చెప్పుకుని లేవబోతూంటే బయటినుంచి కేక వినిపించింది.
    "పేపరు ఎవరి దగ్గరుంది మాష్టారూ?"
    "ఎవరిది?" అడిగింది ఎల్వీరా ఆ కేక ఎవరువేస్తారో మా అందరికీ తెలుసు. చివరింటి రామచంద్రం తాలూకు రోజువారి కార్యక్రమం అది. మా కాలనీలో అతనొక్కడే న్యూస్ పేపర్ కొంటాడు. పేపరు రాగానే పక్కింటి అతను తీసుకుంటాడు. ఆ తరువాత ఆ పక్కింటి అతను. అలా తిరిగి తిరిగి ఎక్కడో వుండిపోతుంది. రాత్రి ఎనిమిదింటికి ఆఫీసునుంచి వచ్చాక ఆ పేపర్ కోసం గాలింపు మొదలుపెడతాడు, రామచంద్రం ఇంటింటిముందు అరుస్తూ తిరుగుతాడు. కానీ ఇప్పుడా విషయం చెప్తే ఎల్వీరా తన పుస్తకంలో తెలుగు వాళ్ళు పక్కింటివాళ్ళ పేపరు చదవటమే కాకుండా, మళ్ళీ తిరిగి ఇవ్వరు." అని రాసుకుంటుంది. అందుకే మేము నిజం చెప్పలేదు.
    "అతనెవరో పిచ్చాడులెండి! రోజూ అలాగే అరుస్తుంటాడు" అని చెప్పాను.
    అప్పుడే పోలీస్ వ్యాన్ ప్రకటనలు చేస్తూ కాలనీలో కొచ్చింది.
    "జంట నగరాల్లో మతకల్లోలాలు జరగటం వల్ల రేపు ఉదయం ఆరుగంటల నుంచీ నిరవధికంగా కర్ఫ్యూ విధించడమైనది. ప్రజలందరూ గమనించప్ర్రార్ధన."
    "కర్ఫ్యూనా" ఆందోళనగా అడిగింది. "అది మామూలేలెండి. మేము తరచూ కర్ఫ్యూలోనే వుంటాం" అన్నాడు శాయీరామ్.
    ఆమె వెంటనే తన పుస్తకంలో, "తెలుగు ప్రజలు ఎక్కువకాలం కర్ఫ్యూలోనే గడుపుదురు." అని రాసుకుంది. "ఇంక నిద్రపోండి" అన్నాడు రెడ్డి.
    "నో నో! నేను ఇప్పుడే ఎయిర్ పోర్టుకెళ్ళి పోతాను" అందామె.
    "అదేమిటి?"
    "నా స్టడీ అయిపోయింది. ఇలాంటి నరకంలో ఒక క్షణం కూడా ఉండలేను!" అంది.
    అందరం ఆమెతోపాటు ఎయిర్ పోర్టుకు బయల్దేరాం. టాక్సీవాడు "సౌరుపయా దేనా" అన్నాడు. "అస్సీరుపయా" అన్నాడు గోపాల్రావ్. చివరకు బేరం కుదిరింది.
    "తెలుగు ప్రజలు ఉర్దూ మాట్లాడుదురు." అని రాసుకుంది ఎల్వీరా. మేము చూసికూడా చూడనట్లు వూరుకున్నాం.
    

    

 

                                       * * *

 Previous Page Next Page