వాటికి తోడుగా కుక్కలు మొరగడం కూడా వినబడింది.
ప్రశ్నార్ధకంగా హరీన్, కరుణా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు.
27
నగరంలో -
హాస్పిటల్ బెడ్ మీద పడుకుని వున్న విశ్వనాధం లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తూ "ప్రియంవదా - " అన్నాడు.
"ఏమిటి ఎప్పుడూ కలవరిస్తున్నట్లు ఆ పిలుపు!" అంది ప్రియంవద విసురుగా.
ఆమెవైపు ఒకసారి ఆర్తిగా చూసి, తర్వాత సంతోషం తెచ్చుకుంటూ అన్నాడు విశ్వనాధం -
"నాకు నెమ్మది నెమ్మదిగా నయమైపోతున్నట్లు వుంది ప్రియంవదా! ఇంక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చునెమో - అడుగు డాక్టర్ గారిని "
"ఏమిటి?" అంది ప్రియంవద. ఆమె గొంతులో అనందం లేదు. ఆశ్చర్యం వుంది. ఆదుర్దా వుంది. "ఏమిటి.........నయమైపోతున్నట్లు వుందా! అప్పుడే?"
"అవును ప్రియంవదా!"
వెంటనే నిందాపూర్వకంగా డాక్టర్ వైపు చూసింది ప్రియంవద. ఆమె తీక్షణదృక్కులకు తడబడ్డాడు డాక్టరు. "ఏమిటి ........నయమవుతున్నట్లు అనిపిస్తోందా? అయితే ఇప్పుడే మరికొన్ని మంచి మందులు ఇవ్వాలి. దానితో మీ రోగం పూర్తిగా కుదురుతుంది" అని ఒక ఇంజెక్షను ఇచ్చాడు. విశ్వనాధానికి స్లో పాయిజన్ లాంటి మందులు ఇవ్వమని చెప్పింది ప్రియంవద.
అందుకని మరింత తీవ్రమైన మందు ఒకటి విస్వనాదానికి ఎక్కించాడు డాక్టరు.
వాళ్ళిద్దరి హావభావాలు చూస్తుంటే అనిపించింది విశ్వనాధానికి.
తనకి జబ్బు తగ్గు ముఖం పడుతోందని వీళ్ళకి చెప్పడమే తప్పయిపోయిందా?
ఈ డాక్టరు తనని బతికించడానికి ప్రయత్నిస్తున్నాడా? లేకపోతే చంపదానికా? అతను తనని చంపడానికే ప్రయత్నిస్తుంటే దాని వెనక ప్రియంవద ప్రమేయం ఉందా?
ఇలాంటి పరిస్థితులలో ఏం చెయ్యాలి తను?
ఎలాగైనా వీళ్ళ కన్నుగప్పి ఇక్కడనుంచి పారిపొతే? లేచి కూర్చోవడానికి ప్రయత్నించాడు విశ్వనాధం. కానీ అది అతని వశం కాలేదు. వళ్ళంతా మగత కమ్మేస్తున్నట్లయింది.
డాక్టరు ఇప్పుడు ఇచ్చిన ఇంజెక్షను ప్రభావమేనా ఇది? ఇంతకీ అది ఏం ఇంజెక్షను? అలా ఆలోచిస్తూ వుండగానే విశ్వనాధం కళ్ళు మూసుకుపోయాయి.
స్పృహ , మెలకువా కాని ఆ స్థితిలో అతనికి తన భార్య వరలక్ష్మి, కొడుకు హరీన్ గుర్తొచ్చారు.
మూసుకున్న అతని కనురెప్పల చాటునుండి వెచ్చటి భాష్పకణం ఒకటి జారి, కృశించిన కణతల మీదుగా , నెరసి పల్చబడిన జుట్టులో కలిసిపోయింది.
"ప్రియంవదా!" అన్నాడు విశ్వనాధం దీనంగా హీనస్వరంతో.
అప్పటికే హాస్పిటల్ బయట ప్రియంవద కారు స్టార్టు అయింది.
* * *
మేడమెట్ల దగ్గర ఉన్న తనని కదలనివ్వకుండా, కాపు వున్న జాగిలాలను చూస్తూ శిలాప్రతిమలా వుండిపోయింది వరలక్ష్మి.
అప్పుడు వినబడింది ఆమెకి కారు శబ్దం. ఆ వెంటనే పాలరాతి గచ్చు మీద హైహీల్సు టకటక వినబడింది.
మరు నిమిషంలో హాలులోకి వచ్చింది ప్రియంవద.
ఆమెని చూడగానే వేడికోలుగా అంది వరలక్ష్మి -
"ప్రియంవదా.......ఎలా వున్నారు అయన? ఎప్పుడొస్తారు ఇంటికి? ఆయన్ని ఒక్కసారి చూడాలని వుంది ప్రియంవదా!"
ఆమె మాటలు విని హేళనగా నవ్వింది ప్రియంవద.
"ఆయనా - ఆయనింకరారు! వెళ్ళదలుచుకుంటే నువ్వే అక్కడికి వెళ్ళాలి"
"హాస్పిటల్ కేనా - ఇప్పుడే వెళతాను" అంది వరలక్ష్మి ఆత్రంగా.
"హాస్పిటల్ కెందుకు? ఏకంగా వల్లకాటికే వెళ్లిపోవచ్చు. ఇవాళో రేపో ఇహ జీవితం చలిస్తాడు అయన. మరి నువ్వు సతీసహగమనం చెయ్యవూ? సీతనీ, సవిత్రినీ చంపి పుట్టిన సాద్విమణివి కదా నువ్వు!"
దుఃఖం పొంగి పొరలుతుండగా అన్నది వరలక్ష్మి.
"ఎందుకలా అశుభాలు పలుకుతావు ప్రియంవదా! అయన లేకపోతే అరక్షణం కూడా బతకలేను నేను ఆయనతోబాటే నేను కూడా -
కుడి కనుబొమ్మ పైకి ఎత్తి విలాసంగా అంది ప్రియంవద.
"ఇద్దరూ కట్టగట్టుకుపోతేసరి! మీ ముద్దుల కొడుకు మీకంటే ముందేపోయి మీకోసం పైన ఎదురు చూస్తున్నాడుగా! త్వరపడండి మరి. నాకు పీడా వదిలిపోతుంది."
ప్రియంవద అలా అనగానే హరీన్ గుర్తొచ్చాడు వరలక్ష్మికి. నోటికి చెంగు అడ్డం పెట్టుకుని, దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ వుండిపోయింది.
* * *
అక్కడ - లోయలో.
గుండెలు అవిసేలా అరుస్తున్న కుక్కలని చూసి ఆగిపోయారు హరీన్, కరుణా.
హటాత్తుగా పొదలమధ్య నుంచి ఉరుకుతూ బయటికి వచ్చాయి నాలుగు వేటకుక్కలు.
అందితే చాలు కరిచి కండలు పీకేసేలా భీకరంగా ఉన్నాయి అవి.
మరోవైపు నుంచి ఆటవికులు పరిగెత్తి వస్తున్న శబ్దం. వాళ్ళ అరుపులు వినబడుతున్నాయి ఈసారి మరింత దగ్గరగా.
కొండమకర హరమకర
హ్హు హ్హు హ్హు య్!
పారిపోతున్న హరీన్ నీ, కరుణ నీ పట్టుకోవడానికి బయలుదేరిన ఆటవికుల బృందం అది.
కొద్దిదూరం నుంచి రఘుపతి యూనిట్ పేలుస్తున్న తుపాకుల శబ్దం వినబడుతోంది.
ఉపిరి బిగాపెట్టి చూస్తున్నారు హరీన్ , కరుణా.
కుక్కలు, నోళ్ళు తెరచి, నాలుకలు బయటికి వేళ్ళాడవేసి , పళ్ళు బయటపెట్టి నురుగులు కక్కుతూ వాళ్ళ దగ్గరికి వచ్చేశాయి.
కళ్ళు మూసేసుకుంది కరుణ. ఆమెకు తెలుసు. మరుక్షణంలో -
కానీ చిత్రం !
ఏమీ జరగలేదు .
నెమ్మదిగా కళ్ళు తెరిచింది కరుణ.
కుక్కలు వాళ్ళదగ్గరికి వచ్చి ఆగిపోయాయి. అంతేకాదు - హరీన్ పాదాలని వాసన చూస్తూ నాకుతున్నాయి అవి.
వాటివైపూ, హరీన్ వైపూ ఆశ్చర్యంగా మార్చి మార్చి చూసింది కరుణ.
కొద్ది క్షణాలు నుదురు చిట్లించి ఆలోచిస్తూ వుండిపోయాడు హరీన్. తర్వాత అతని పెదవుల మీదికి చిరునవ్వు వచ్చింది.