అప్పటికిగానీ గుండెల్లో గునపంలా గుచ్చుకుని సలుపుతున్న ఈ బాధ తొలగదు తనకి.
అప్రయత్నంగా కరుణ అడుగులు ఆగిపోయాయి.
స్స్ స్స్ స్స్! అబ్బ!" అంది బాధగా.
హరీన్ కూడా ఆగి "ఏమిటి.......ఏమయింది?" అన్నాడు.
"కాల్లో ముల్లుగుచ్చుకున్నట్లుంది " అంది కరుణ - కాలు మడిచి పైకెత్తి పాడంవైపు చూసుకుంటూ, పెద్ద ముల్లు ఒకటి ఆమె పాదంలో లోతుగా దిగబడి, విరిగింది. దానిని తియ్యడానికి ప్రయత్నించింది కరుణ. కానీ ముల్లు రాలేదు.
"ఉండు ........నేను తీస్తాను" అన్నాడు హరీన్ - ఆమె పక్కన కూర్చుని, ఆమె పాదాన్ని తనచేతుల్లోకి తీసుకుంటూ.
ఒంటికాలిమీద అలా నిలబడటం కష్టమైపోయింది కరుణకి. బాలెన్స్ కోసం హరీన్ భుజాల మీద తన రెండు చేతులూ ఆనించింది. గాలి బలంగా వీచితే, ఆమె ఒరిగిపోయి అతన్ని తాకేటంత సన్నిహితంగా వుంది ఆ భంగిమ. అది తలుచుకోగానే నునుసిగ్గు కలిగింది కరుణకి. అతనివైపు క్రీగంట చూసింది.
కానీ ఇదంతా ఏమీ గమనించడంలేదు హరీన్. కరుణ పాదాల మీదే దృష్టి కేంద్రీకరించి ముల్లు తియ్యడానికి ప్రయత్నిస్తున్నాడు అతను.
అప్పుడు అనిపించింది కరుణకి.
చాలా మంచివాడు ఇతను. మాములుగా చాలామంది మొగాళ్ళలో ఉండే వికారాలేవీ ఇతనికి లేవు.
ఇదేగనక మరో మగాడయితే , ఇప్పుడు తాము ఉన్న పరిస్థితిని ఏక్స్ ప్లాయిట్ చేసి, మోజులు తీర్చుకోవడానికి ప్రయత్నించి వుండే వాడే.
అందరిలాంటి వాడు కాదు ఈ హరీన్. ఇతను సత్పురుషుడు.
వాటన్నిటికీ మించి పరోపకార పారయణుడు.
కనుకనే తన శీలం కాపాడటానికి గానూ ప్రాణాలను తెగించి సాహసం చేశాడు ఆ రోజున.
మళ్ళీ ఈరోజున ఈ మృత్యులోయలో నుంచి బయటపడగలిగినా కూడా, రఘుపతి అపాయంలో చిక్కుకున్నారేమోనన్న ఆదుర్దాతో ప్రాణాపాయాన్ని లెక్కచెయ్యకుండా మళ్ళీ లోయలోకి తిరిగి వెళుతున్నాడు.
ఈరోజులలో కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు మిగిలే వున్నారా - కనీసం అక్కడక్కడ.
హరీన్ లాంటి వాళ్లు అక్కడక్కడ వుండటం వల్లనే ఈ లోకంలో మానవత్వం నామమాత్రంగా నన్నా ఇంకా మిగిలి వుంది. అందువల్లనే ప్రపంచం ఈ మాత్రంగానన్నా నడుస్తోంది.
ఆర్ద్రంగా అయిపొయింది కరుణ మనసు.
అంతలోనే మరో ఆలోచన వచ్చింది కరుణకి.
దైవాంశ సంభూతుడులాంటి ఈ హారీన్ తో కలిసి జీవితాన్ని పంచుకోబోయే ఆ అదృష్టవంతురాలేవరో!
అలా అనుకోగానే అదోలా అయిపొయింది కరుణ మనసు.
హరీన్ కి భార్య అయ్యే అదృష్టం వరించాలంటే జన్మజన్మల నుంచి నోములెన్నో నోచి వుండాలి.
అలా నోచుకుని పుట్టిన అమ్మాయి ఎక్కడో ఉండే వుంటుంది హరీన్ కోసం ఎదురుచూస్తూ.
ఒకటి మాత్రం తెలుసు తనకి.
హరీన్ కి భార్య కాబోయే ఆ అమ్మాయి తనలాంటి నిర్భాగ్యురాలు మాత్రం అయివుండదు.
తనలాంటి దిక్కులేని దానికి అలాంటి అదృష్టం కలలో కూడా పట్టదు. ఒకవేళ ఈలోయలో నుంచి బయటపడటం అంటూ జరిగినా, ఆ తర్వాత తానెవరో, అతనెవరో!
ఒకసారి ఆ మహానగరానికి చేరాక -
అక్కడ అతను సినిమాలలో సూపర్ స్టార్!
తను? తనేమో సినిమా దియేటరులోకి అడుగు కూడా పెట్టలేని అభాగ్యురాలు.
తనేక్కడా........అతనేక్కడా!
మనసు భారంగా మూలిగినట్లయింది కరుణకి.
అంతలోనే అన్నాడు హరీన్.
"ముల్లు వచ్చేసింది కరుణా!"
చటుక్కున ఆలోచనలలోంచి బయటపడింది కరుణ.
"ఎంత పెద్దముల్లో చూశావా?" అన్నాడు హరీన్.
అందుకుని, దానివైపు తీక్షణంగా చూసింది కరుణ.
అలా చూస్తూ వుంటే ఆమెకి చిన్నప్పుడు తను నేర్చుకున్న పాఠం ఒకటి గుర్తొచ్చింది.
తను బంధువుల ఇంట్లో దిక్కుదివాణం లేకుండా, చదువూ, సంధ్యా, తిండీ, తిప్పలూ లేకుండా పెరుగుతున్నప్పుడు ఇంటివాళ్ళు తమ పిల్లలకోసం ట్యూషన్ మాస్టారిని ఏర్పాటు చేస్తే తను దూరంగా గుమ్మం దగ్గర గువ్వలా ముడుచుకు కూర్చుని భయం భయంగా విని నేర్చుకున్న పాఠం - చాణుక్య శపథం!
చాణుక్యుడికి కూడా ఓసారి ఇలాగే ముల్లుగుచ్చుకుంది. దానికి అతను కోపించి , ఆముల్లుని కాల్చి భస్మం చేసి, ఆ బూడిదని నీళ్ళలో కలుపుకుని తాగేశాడట!
అతని ప్రతికార జ్వాల అంత తీవ్రమైనది. అదే విధంగా అతను తనని అవమానించిన వారిమీద పగబట్టి, వాళ్ళని మట్టుబెట్టాడు.
ఆ చాణుక్యుడు తనకి ఆదర్శం!
తన అజ్ఞాత శత్రువు ఎవరో కనిపెట్టాక, ఆ వ్యక్తిని, ఆ వ్యక్తీ తాలూకు కుటుంబాన్ని కూడా రూపుమాపి, అందరిమీదా కసి తిర్చుకుంటుంది తను. శత్రుశేషం లేకుండా నిర్ములిస్తుంది.
ఇలాంటి ఉహాలు వుండటం తప్పేకావచ్చు కానీ తన విషయంలో మాత్రం తప్పనిసరి ఇది!
ప్రపంచంలో ఇంకేవరిమీద ద్వేషం లేదు తనకి.
ఆ అజ్ఞాత శత్రువు మీద ప్రతీకారవాంఛ తప్ప ఈ ప్రపంచంలో మరి దేనిమీదా మక్కువ కూడా లేదు తనకి.
"ఏమిటి కరుణా.......మళ్ళీ ఆలోచనలో పడిపోయావ్?" అన్నాడు హరీన్.
తెప్పరిల్లుకుని, "ఏం లేదు .........ఏం లేదు!" అంది కరుణ.
ఆమెవైపు ఒకసారి పరిశీలనగా చూశాడు హరీన్ -
తర్వాత లేచి నిలబడి జింకపిల్ల వైపు చూశాడు హరీన్ -
దాన్ని అక్కడే వదిలేస్తే అది ఎంతోకాలం బతకలేదనీ అతనికి తెలుసు. అతనిది జాలిగుండె . అందుకని అనిపించింది అతనికి దాన్ని కూడా తమతో బాటు తీసుకెళ్ళిపొతే?
కానీ, అతను చూసేసరికి ఆ జింకపిల్ల అక్కడ లేదు. చెంగు చెంగుమని దూకుతూ చెట్ల మధ్య మాయమైపోయింది అది.
ఇక చెసెదెమీ లేక నిట్టూర్చాడు హరీన్.
అతనికి అనిపించింది -
చూస్తుండగానే ఒక్క క్షణంలో అనాధ అయిపొయింది ఈ జింకపిల్ల. ఒక్కసారిగా దాని తల్లినీ, దాని బతుకునీ కూడా మింగేసింది పెద్దపులి.
ఆ పెద్దపులిలాగే తన తండ్రి కూడా ఎవరినో చాటుగా దెబ్బతీసి, అన్యాయంగా, అక్రమంగా డబ్బు సంపాదించి వుంటాడా?
తన తండ్రి చేసిన ఆ దారుణం వల్ల ఏ కుటుంబం అన్నా దిక్కులేనిదైపోయి వుంటుందా?
అలా జరిగినా ఆశ్చర్యం లేదు. అలా జరిగే వుంటుంది బహుశా.
అలాంటప్పుడు, ఆ కుటుంబాన్ని వెదికి పట్టుకుని, ఒకవేళ అ కుటుంబం గనక నిస్సహాయస్థితిలో ఉండివుంటే, వాళ్ళకి ఆసరాగా నిలబడి, ఆడుకోవడం తన ధర్మం. అది చెయ్యకపోతే తృప్తి వుండదు తనకి.
పదేళ్ళక్రితం జరిగిపోయింది తెలుసుకోవాలని, తన తండ్రికి అంత డబ్బు ఎలా వచ్చిందో కూపీలాగాలనీ, ఆ సందర్భంలో నష్టపోయిన వ్యక్తీ ఎవరో ఆచూకీ తెలుసుకోవాలనీ ఎన్నాళ్ళనుంచో ప్రయత్నిస్తున్నాడు తను.
కానీ ఇంతవరకూ తన ప్రయత్నాలూ ఫలించనేలేదు.
ఇప్పుడు గనక ఈ మృత్యులోయలో నుంచి సురక్షితంగా బయటపడగలిగితే, ఈసారి మరింత ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తాడు తను. ఏం జరిగిందో తెలుసుకుని, తన తండ్రి వాతపడ్డ ఆ కుటుంబం ఆచూకీ కనిపెట్టి తీరతాడు. వాళ్ళకి తను తోడూ, నీడగా నిలబడతాడు - అది తప్పదు!
కాని ఆ క్షణంలో హరీన్ కి తెలియదు -
తను ఏ కుటుంబం కోసం ఇన్నాళ్ళ నుంచి వేదుకుతున్నాడో, ఆ కుటుంబంలో మిగిలిన ఏకైక వ్యక్తీ అయిన కరుణ, తన పక్కనే నిలబడి వుందని.
అలాగే కరుణకి కూడా తెలియదు -
ఎవరి కుటుంబాన్నయితే తను నాశనం చెయ్యదలచుకుందో ఆ విశ్వనాధం కొడుకే హరీన్ అనీ!
ఆ శత్రువు కొడుకుకే గుండెలలో గుడికట్టి తను పూజిస్తోందనీనూ!
విధి విన్యాసాలు విచిత్రంగా వుంటాయన్న విషయానికి మరో ఉదాహరణ ఇది.
కొద్దినిమిషాల తర్వాత హరీన్, కరుణా మళ్ళీ నడక సాగించాడు.
తుపాకుల శబ్దాలు ఇంకా వినబడుతూనే వున్నాయి - ఈసారి మరింత దగ్గరగా!