Previous Page Next Page 
భామ కలాపం పేజి 34

 

    ప్రయత్నపూర్వకంగా దృష్టిని మరల్చుకున్నాడు సారధి.

 

    టర్కిష్ టవల్ తో మొహం తుడుచుకుని, ఆయాసం తీర్చుకుంది సుదీర. తర్వాత నేలకు బిగించి వున్న ఎక్సర్ సైజ్ చేసే సైకిలు తొక్కడం మొదలు పెట్టింది.

 

    "మైక్రోకారు స్పెసిఫికేషన్స్ ఏమిటి?"

 

    "ఫైబర్ గ్లాసు బాడి, డ్రైవరు ఒక పాసెంజరు , మొత్తం ఇద్దరూ కూర్చునే స్థలం. 150 సీ.సీ ఇంజను. నాలుగే అడుగుల ఎత్తు."

 

    "ఫాబ్యులస్!{" అనుకుంది సుదీర. ఈ మైక్రో కారు పేరు "సుదీరా" అని పెడుతుంది తను. 'మూ రా' లాంటి జపనీస్ పేర్లలా వినబడుతుంది అది.

 

    దాని షేర్లు రెండొందలు పలుకుతాయి.

 

    సుదీరా హొటల్స్ షేర్లు వందరుపాయలకు ఎగబడి కొంటారు.

 

    తను కుప్పలు తెప్పలుగా డబ్బు సంపాదించేసి, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కోటిశ్వరులు ఫోర్డు, రాక్ ఫెల్లర్, రొత్ షీల్డ్స్, పాల్ గెట్టి , ఒనాసిన్ ల కోవలోకి చేరిపోతుంది.

 

    ఆ తర్వాత మరెన్నో లైన్స్, షిప్పులు, విమానాలు.....ఓహ్! ప్రపంచాన్ని మడిచి, తన హిప్ పాకెట్లో పెట్టేసుకుంటుంది!

    తను-

 

    `సుదీర!

 

    కింద ఎవరో వచ్చిన అలికిడి.

 

    భరత్ ని ఆ పల్లెలోనే వదిలేసి అతని సంగతి పట్టించుకోకుండా కోపంగా తిరిగి వచ్చేశారు సుదీరా, రత్నాకరరావు, అతను పాలేళ్ళ పక్షాన మాట్లాడడం వాళ్ళకు అవమానం అనిపించింది.

 

    రాత్రికి ఆ పల్లెలోనే వుండి, తెల్లరాగానే దసరద్ సైకిలు తీసుకుని తొక్కుకుంటూ సిటికి వచ్చాడు భరత్- యాభైమైళ్ళు!

 

    హైదరాబాద్ చేరేసరికి చెమటతో షర్టు పాంటు తడిసి పోయాయి భరత్.

 

    అతన్ని చూడగానే మొహం చిట్లించి, తల పక్కకి తిప్పుకున్నాడు రత్నాకరరావు.

 

    నేరుగా మేడ మీదికి వెళ్ళిపోయాడు భరత్. గదిలో సుదీర లేదు. ఎక్సర్ సైజు రూమ్ లో నుంచి మాటలు వినబడుతుంటే అక్కడికి వెళ్ళాడు.

 

    కదలకుండా వున్న చోటే వుండి సైకిల్ ని తొక్కుతుంది సుదీర. ఆమె స్పోర్ట్సు బనీను స్వేదంతో తడిసిపోయి, దాదాపు ట్రాన్స్ పేరెంట్ గా కనబడుతోంది.

 

    భరత్ ని చూడగానే బయటికి వెళ్ళిపోయాడు సారధి.

 

    తిరస్కారంగా భరత్ వైపు చూసింది సుదీర.

 

    "బస్సులో వచ్చారా?" అంది పరుషంగా. అతన్ని అక్కడే వదిలేసి తాము కార్లో వచ్చేశామని గుర్తు చెయ్యడం అది.


    "కాదు. సైకిల్ మీద వచ్చాను."

 

    షాకయిపోయినట్లు చూసింది సుదీర. "సైకిలు తొక్కుకుంటూ వచ్చారా! ఆర్ యూక్రేజీ? మేము దివాలా ఎత్తామని, అందుకనే ఇంటల్లుడు సైకిలు తోక్కుతున్నాడని అందరూ నవ్వుకోవాలనేగా మీ వుద్దేశం? సైకిల్ ఎవరిది?"

 

    చెప్పాడు భరత్.

 

    "ఆ అలగా వాళ్ళ పద్దతులే మీవి కూడా!"

 

    "సైకిలు తొక్కడం అలగా వాళ్ళ పద్దతా?"

 

    కోపంగా పెదల్సుని గబగబ తొక్కింది సుదీర. "కాక?"

 

    "రోడ్డుమీద సైకిలు తొక్కుతూ వెళ్ళి పనులు చేసుకోవడం తప్పు! కానీ, ఇంట్లోనే వుంది అంగుళం కదలని సైకిలుని బోలెడంత ఖర్చు చేసి కొని, తొక్కుతూ ఎక్సర్ సైజు చెయ్యడం గొప్ప! అదేనా నువ్వు చెప్పేది?"

 

    "అలగా వెధవలను వెనకేసుకొస్తూ మమ్మల్ని దెప్పి పొడవడం కూడా నేర్చుకున్నారన్నమాట! అసలు వాళ్ళందరి ముందరా ఎందుకలా చేశారు నిన్న?"

 

    "మనుషులని తగలబెడుతుంటే, మౌనంగా వుండిపోవాలంటావా సుదీరా?"

 

    "నిజంగా ఎందుకు తగలబెడతారు?డాడీ ఏమన్నా రాక్షసుడనుకున్నారా ఏమిటి? ఉత్త బెదిరింపు అది! కాస్త సెగ తగిలి పొగలు కమ్మితే గానీ, పొగరణగాదు వెధవలకి! దున్నపోతుని ముల్లు గర్రతో పోడిస్తేనే మాట వింటుందిట. ఏనుగుని అంకుశంతో పొడుస్తూ ఉంటేనే లొంగి ఉంటుందిట. వేప మండలతో కొడితేనే దయ్యం వదులుతుందట. అంతేగాని అయ్యా బాబూ అంటే ఈ వెధవలా వినేది?"

 

    "వాళ్ళు దున్నపోతులు కారు సుదీరా! మనుషులు!"

 

     "అయితే, మేం మనుషులం కాదూ? వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు గానీ, మాకు జరిగిన అవమానం గురించి పట్టించుకోవడం లేదు మీరు! మా డాడీ ఆ ఉరికి రాజు లాంటి వారు. ఆయనకి ఎంత చిన్నతనం కలిగించారో తెలుసా మీరు?"

    
    "రాజులకు రోజులు చెల్లిపోయాయి సుదీరా! మనుషులందరూ ఒక్కటే ఇప్పుడు! బీదా, గొప్ప, కులం, గిలం తేడాలు ఉండకూడదు. ఈ రోజుల్లో!"

 

    "కానీ, అడా , మగా అనే తేడాలు మాత్రం ఎప్పటికి ఉంటాయి. మగాళ్ళు మగాళ్ళలా ఉండాలి. ఈ మాత్రం డానికే తట్టుకోలేని మీరు అసలు మగాళ్ళే కాదు."

 

    "సుదీరా!"

 

    "అవును! మీరు మగవాళ్ళు కాదు. మగతనం ఎందులోనూ లేదు మీలో! అది హనీమూన్ లోనే తెలిసిపోయింది."

 

    "సుదీరా!"

 

    "మనుషుల్లో తేడా లెందుకు లేవు? కొందరు అడ! కొందరు మగ! మీరు ఆ రెండూ కాదు! మధ్య రకం! నా కర్మ కొద్ది దొరికారు!"

 

    రోషంగా చూశాడు భరత్.

 

    "నా వెంటపడి నన్ను ప్రాధేయపడి, నా కాళ్ళ మీద పడి పెళ్ళి చేసుకుంది నువ్వు! గుర్తుందా?"

 

    "ఆరోజు మీరు పారిజాతాపహరణం డాన్సు చేస్తుంటే ఆ కృష్ణుడే దిగి వచ్చాడని భ్రమపడి పెళ్ళి చేసుకున్నాను. అంతే గానీ బృహన్నలని పెళ్ళి చేసుకుంటున్నానని మాత్రం అనుకేలేదు."

 

    "సుదీరా! హద్దు దాటుతున్నావు."

 

    "ఇనఫ్ ఈజ్ ఇనఫ్! ఏ విషయంలోనూ మగతనం లేని మీతో ఈ ముగబాధ అనుభవిస్తూ కాపరం చెయ్యలేను. నాకు డైవోర్స్ కావలి! తక్షణం!"

 

    ఆగ్రహంతో ఉగిపోయాడు భరత్.

 

    "చూడు! పెళ్ళి పెళ్ళి అంటూ వెంటపడింది నువ్వు! చెల్లెలి పెళ్ళి చేస్తానంటే అప్పటిదాకా కూడా ఆగలేక తొందరపడింది నువ్వు. దయాకర్ చనిపోయినందుకు, నా చెల్లెలి బ్రతుకు పాడైపోయినందుకు నేను మానసికంగా చిత్రవధ అనుభవిస్తూ, కోలుకోవడానికి ఒక్క మూడు నెలలు టైం అడిగితే, ఇవ్వకుండా హడావుడిగా హనీమూన్ కి లాక్కెళ్ళింది నువ్వు! ఒక మనిషికి జరుగుతున్న అన్యాయం చూసి, సాటిమనిషిగా బాధపడినందుకు రెచ్చిపోయి విడాకులు కావాలంటుంన్నది కూడా మళ్ళీ నువ్వే! సుదీరా! ఇంక చాలు! నువ్వు నన్ను నీ ఇష్టం వచ్చినట్లు ఆడించలేవు! నేను నీకు విడాకులు ఇవ్వను!"

 

    "నువ్విచ్చేదేమిటి?" అంది సుదీర పరుషంగా ఏకవచనంలోకి వచ్చేస్తూ . "కోర్టుకి వెళ్ళి నేనే తెచ్చుకుంటాను" అంటూ ఇంటర్ కమ్ స్వేచ్ నొక్కింది.

 

    సారధి పలికాడు.

 

    "సారధి! నేను డైవోర్స్ తీసుకుందామనుకుంటున్నాను. ఇవాళే పిటిషన్ తయారు చెయ్! ఒకసారి వెంటనే ఇక్కడికి రా! కమ్ అట్ వస్స్!"

 

    భరత్ చివాలున వెనక్కి తిరిగి, అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

 

    అనుకోని ఈ పరిణామాలని చూస్తుంటే సంతోషం ఆపుకోవడం కష్టమైపోతుంది సారధికి.

 

    ఎందుకు సుదీర డైవోర్సు కావాలనుకుంటోంది? ఆ అనాడీ గాడితో ఏ ఆడపిల్ల అయినా ఎక్కువ రోజులు కాపురం చెయ్యడం కష్టం! నిజమే! అయినా ఇంత హఠాత్తుగా ఎందుకిలా...........

 

    తానికటి తలిస్తే దేవుడొకటి తలుస్తాడని అబద్దాలు ప్రచారం చేస్తోంది ఎవరు? తను ఏది తలుచుకుంటే దేవుడు కూడా అదే తలుస్తున్నాడు!

 

    తన అనందం అంతా మొహంలో కనబడితే సుదీరకి అనుమానం కలిగి అసలుకే ,మోసం రావచ్చు. అందుకని మొహం సీరియస్ గా పెటుకుని నిలుచుండిపోయాడు అతను.

 

    "అలా బొమ్మలా నిలబడిపోతావెం? చెబుతోంది నీకు కాదూ! తక్షణం డైవోర్సు పిటిషను తయారు చెయ్యి!" అంది సుదీర. అది తనకు ఇష్టం లేనట్టు, ఆమెకి హితవు చెబుతున్నట్లుగా గొంతు పెట్టి అన్నాడు సారధి.

 

    "సారి మేడం! అది అయ్యేపని కాదు."

 

    డిజపాయింట్ అయినట్లు చూసింది సుదీర.

 Previous Page Next Page