Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 34


    నేనెందుకు సాగరంలో కలవాలీ? అని నది యెన్నడూ అడగదు! శ్రుతిని అనుసరిస్తేనే నా జన్మకి పరమార్ధతా అని లయ అడగదు!
    
    'కైలాస నిలయా.....
    గౌరీ మనోహరా నమస్కారము'
    
    అని ప్రవర చెప్పాక, భక్తిగా పిల్లలచేత నమస్కారం చేయించారు ఘనాపాఠీ శంకరశాస్త్రిగారు.
    
    చిన్నపాటి పిలకలతో, పంచెకట్లూ విభూదిరేఖలతో వేదం వల్లె వేయడం వల్ల వచ్చిన తేజస్సుతో ప్రథమగణాల్లా వున్నారా చిన్నారులు.
    
    నిండా కొంగు కప్పుకుని వచ్చిన పార్వతమ్మ ఒంగి ఆయన పాదాలకి నమస్కరించింది.
    
    "ఏమ్మా? అంతా కుశలమా? రాధమ్మని పెళ్ళికూతుర్ని యెప్పుడు చేస్తున్నారు?" అని అడిగారాయన!
    
    "ఆ విషయం అడగడానికే వచ్చాను అమ్మాయి సంబంధం విషయంమీదే ఆయన హైదరాబాదు వెళ్ళారు. మీరొకసారి దాని జాతకం చూసి ఆ గీత త్వరలో ఉందో, లేదో అని చెప్తారా బాబుగారూ!" అంది వినయంగా.
    
    శంకరశాస్త్రి చెయ్యిజాపారు.
    
    పార్వతమ్మ రాధ జాతకాన్ని అందించింది.
    
    ఆయన భ్రుకుటి ముడిపడింది.
    
    లెక్కలువేసి "శుక్రుడు మూడింటా గురువు.... రెండింటా.... రాహువు అడ్డుపడుతున్నట్లున్నాడు....! అన్నాడు.
    
    పార్వతమ్మ అదురుతున్న పెదవులతో కంగారుగా "ఏదైనా ఆటంకమా?" అంది.
    
    ఆయన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి.
    
    "అమ్మాయికి కళ్యాణయోగం బలంగా కనబడుతోంది. కానీ చిన్నపాటి అడ్డంకులున్నాయి. ఏం ఫరవాలేదు. రోజూ ఈ స్తోత్రం చదువుకోమనమ్మా!" అంటూ ఓ కాగితం ఇచ్చారు.
    
    పార్వతమ్మ అన్యమనస్కంగానే నమస్కరించి వెనుతిరిగింది.
    
    ఎక్కడో ఏదో భయం లీలగా ఆమెను తాకి సన్నగా వణికించింది.
    
    రాధ హృదయం మాధవ నిలయంగా మారిందని ఆ తల్లికి తెలుసు.

    ఇంటి గడపలో కాలు పెడుతుండగానే లోపల్నుండి ఓ కొత్త గొంతు నవ్వుతూ వినిపించింది.
    
    "వి ఆర్ ఫ్రెండ్స్... అంటే మన స్నేహితులం అన్నమాట.
    
    "నేను మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదే?" అంటోంది రాధ.
    
    "ఇప్పుడు చూడు బాగున్నావా?" మళ్ళీ నవ్వు!
    
    పార్వతమ్మ ఆశ్చర్యంగా లోపలికి నడిచి ఆ అమ్మాయిని చూసింది. పాంటూ, షర్టూ వేసుకుని జుట్టు విరబోసుకుని దొరసాని పిల్లలా ఉంది. ఉయ్యాల బల్లమీద రాధతోబాటు కూర్చుని ఊగుతోంది. ఆమె చేతి వేళ్ళకున్న గోళ్ళరంగు చెమ్కీ అద్దినట్టు మెరుస్తోంది. కాళ్ళకి మేజోళ్ళున్నాయి. ఎవరీ కొత్తచుట్టం అన్నట్లు చూసింది పార్వతమ్మ.
    
    "అమ్మా... ఈవిడ పేరు తిలకం పట్నంనుండి వచ్చారుట!" అంది తల్లిని చూసి రాధ.
    
    తిలక పార్వతమ్మకి నమస్కరించి, "నమస్తే! నన్ను అండీ గిండీ కాదు, ఇకనుండి టీచర్ అని పిలు!" అంది.
    
    "టీచరా?" అంది పార్వతమ్మ.
    
    "ఔను మీ అమ్మాయికి ఇంగ్లీషు టీచర్ కావాలని చెప్తేనే.... వచ్చాను!" అంది తిలక.
    
    "ఎవరు చెప్పారు?" అడిగింది ఆనందంగా రాధ.
    
    "ఈ ఇంటి యజమానిగారు!" అంది తిలక.
    
    పార్వతమ్మ ఆ అమ్మాయి వేషాన్ని కిందనుండి మీదదాకా చూసి "పెళ్లికాని పిల్లవి ... ఇంతదూరం ఒక్కదానివే వచ్చావా?" అంది.
    
    తిలక నవ్వి, "పొట్ట తిప్పలమ్మా... తప్పదు" అంది.
    
    ఆ అమ్మాయి నోటినుండి 'అమ్మా'  అన్న పదం రాగానే కాళ్ళకి ఏదో అడ్డుపడ్డట్టయింది పార్వతమ్మకి.
    
    "ముందు స్నానంచేసి రా, భోజనం చేసి మాట్లాడుకుందాం. ఏ వేళప్పుడు తిన్నావో ఏమిటో?" అంది ఆప్యాయంగా.
    
    తిలకకి గణపతి మాటలు గుర్తొచ్చి "ఈవిడ పెద్దత్తయ్య అన్నమాట. కాశీ వెళ్ళక్కర్లేకుండానే అన్నపూర్ణాదేవి దర్శనం అయింది" అనుకుంది.
    
    "ఎవరొచ్చారక్కా?" అంటూ వంటగదిలో నుండి కొంగుతో చేతులు తుడుచుకుంటూ శాంత బయటకు వచ్చింది.
    
    రాధ ఉత్సాహంగా "చిన్నాన్న చూసిన ట్యూషన్ టీచర్, పిన్నీ!" అంది.
    
    శాంత ఆ అమ్మాయివైపు అభిమనంగా చూసి, మా రాధకి నెలలోపు ఇంగ్లీషులో గలగలా మాట్లాడటం నేర్పు తల్లీ! జీతం సంగతి ఆలోచించకు అడిగింది ఇస్తాం?" అని హామీ ఇచ్చింది.
    
    "పచ్చిపాలమీద మీగడా....వేడిపాలమీద వెన్నా ఉందంటే నమ్మే అమాయకపు ఇల్లాలు. ఈవిడే చిన్నత్తయ్య అన్నమాట!" అనుకుంది తిలక.
    
    "నరసమ్మకి స్నానానికి నీళ్ళు తొలపను పాపం, ప్రయాణం చేసొచ్చింది" అంది పార్వతమ్మ.
    
    "ఎవరమ్మాయిటా?" మంచం మీద నుండే తాయారమ్మ అడిగింది.
    
    "ఇకనుండీ మన అమ్మాయే!" చెప్పింది పార్వతమ్మ.
    
    తిలకకి ఆ మాటకి కళ్ళు చెమ్మగిల్లాయి.
    
    స్నానంచేసి నైటీ వేసుకుని వచ్చింది.
    
    "ఈవిడ మా పెద్దత్తయ్య!" అంటూ ఆకువేసి వడ్డిస్తున్న సూరమ్మని పరిచయం చేసింది రాధ.
    
    ఆవిడ కళ్ళనిండా దైన్యం నింపుకుని, "హైదరాబాదులో ఈ సినిమావాళ్ళుండే పేట నీకు తెలుసా తల్లీ?" అని అడిగింది.
    
    ఆ నిమిషంలో మాత్రం తిలకకి గణపతిమీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఈ చల్లని లోగిలిని వదిలిపెట్టి ఏం బావుకుందామని పారిపోయివచ్చాడో అనుకుంది.
    
    "తెలుసండీ!" అంది.
    
    ఆవిడ కందా బచ్చలికూర వడ్డిస్తున్నదల్లా ఆశగా తలెత్తి, నీకెవరైనా తెలిసినవాళ్ళుంటే మా గణపతి కబురు తెలుసేమో కనుక్కో తల్లీ! ఒట్టి వెర్రి వెధవ... ఆకలికి ఆగలేడు. ఏం తింటున్నాడో ఏమో!" అని కొంగుతో కళ్ళు ఒత్తుకుంది.

 Previous Page Next Page