Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 33

  

        "ఎందుక్కాదూ? నాకు కాకపోయినా ప్రపంచానికి అర్ధం అవుతుంది. మరీ ఇంత బరితెగిస్తారనుకోలేదు. మధ్యాహ్నప్పూట ముసలి సెక్రటరీతో కళ్ళారా చూసి గడ్డిపెట్టినా మీకు బుద్ది రాలేదన్నమాట."
   
    "....మాధవీ!"
   
    "ఇప్పుడు దాన్ని తీసేసి ఎవరో వగలాడిలా ఉద్యోగమిచ్చి ఇక రాత్రిళ్ళు కూడా అక్కడే మకాం పెట్టారన్నమాట. అయ్యో భగవంతుడా నేనేం చేతున్రా దేముడో" అంటూ గొంతెత్తి రాగం తీయటం ప్రారంభించింది.
   
    "నీకేమన్నా మతిపోయిందా? ఆఫీసులో పని ఎక్కువుండి రాత్రి ఆలస్యంగా వస్తూంటే లిఫ్టు ఆగిపోయింది."
   
    "చెప్పండి చెప్పండి. రంకు నేర్చినమ్మ బొంకు నెర్వదా అని వినేవాళ్ళుంటే ఎన్ని కథలైనా చెప్పుతారు. మా అమ్మా నాన్నలకి చెపుతూనే వున్నాను. నేను చేసుకోను మొర్రో అంటున్నా నిలువునా నా గొంతు కోశారు. ఇప్పుడిక ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సిందే-"
   
    ఆమేనా మాట్లాడుతూంది? తన భార్యేనా మాట్లాడుతూంది? అన్నంతగా నిర్విన్నుడై చూశాడామెని. ఈ లోపులో బయట అలికిడి వినిపించింది. అతడు స్వరం తగ్గించి, "మాధవీ బైట పనివాళ్ళు అందరూ వింటున్నారు కాస్త నెమ్మదిగా మాట్లాడు" అన్నాడు.
   
    "ఏం? ఎందుకు మాట్లాడాలి? ఎవరికి తెలీని భాగోతం? రాత్రంతా ఆఫీసు రూమ్ లో ఆడితే లేదుగానీ, ఇంట్లోవాళ్ళకి తెలుస్తే వచ్చిందా ప్రమాదం. ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే."
   
    అతడి సహనం నశించింది. "ఏమిటి తేలిపోవల్సింది? ఏమిటి తేలుస్తావు చెప్పు" అని అరిచాడు. అతడు అలా ఎదురు తిరిగేసరికి ఆమె కొద్దిగా బెదిరినా, తను కూడా కంఠం హెచ్చిస్తూ, "అయ్యో అయ్యో - అంతవరకూ వచ్చిందా? అదెవత్తో మీకు మందు పెట్టింది. ఇంక ఈ కాపురాన్ని ఆ దేవుడే రక్షించాలి" అంటూ బిగ్గరగా రోదించింది.
   
    "ఎవరూ నాకు మందు పెట్టలేదు. ఈ కాపురంలో విషంపోస్తూంది నువ్వే. ఏనాడైనా ఒక్కరోజైనా సుఖంగా కాపురం చేశావా?" "అనండి. అనండి. నన్నే అనండి."
   
    అతడు వినిపించుకోకుండా కొనసాగించాడు. ఇద్దరూ కొద్దిసేపు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ వినిపించలేదు. అతడు వున్నట్టుండి స్వరం హెచ్చించి-
   
    "నువ్వు అనుకున్నట్టు నాకు ఏ సంబంధమూ లేదు. నేనెవరితోనూ డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని చేతులు చూపించుకోలేదు. నేనెవరితోనూ సెకెండ్ షోలకి వెళ్ళలేదు" అని అరిచాడు.
   
    మాధవి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. "ఏమిటి? ఏమిటన్నారూ?" అంటూ ముందుకొచ్చింది.
   
    "మానసిక వ్యభిచారంకన్నా వ్యభిచారం మంచిదంటున్నాను. ఏం తప్పా?" అతడూ రెట్టించాడు.
   
    "పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడిందని, మీరు తిరుగుబోతులు కాబట్టి - తాగుబోతులు కాబట్టి- నన్నూ-"
   
    ఆమె  మాట పూర్తికాలేదు. అతడు లాగి పెట్టి ఆమె చెంపమీద బలంగా కొట్టాడు. అంతే, ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆమె కనుగుడ్డు మెలిదిరిగినట్టు అయింది. ఎక్- ఎక్ - మన్న శబ్దం ఆమె నోటివెంట వచ్చింది.
   
    వెనక్కి విరుచుకు పడిపోయింది.
   
    అతడు నిరుత్తరుడయ్యాడు.
   
    ఆమె మొహం అటూ ఇటూ కదులుతూంది. నాలుక పళ్ళ మధ్య నలుగుతూంది. ఏదో స్పురించిన వాడిలా అతడు తాళం చేతులు తీసుకొచ్చి గబగబా ఆమె చేతులమధ్య బలవంతంగా పెట్టాడు. అప్పుడే వచ్చినట్టు ఇద్దరు నౌఖర్లు లోపలికి వచ్చారు. అది పట్టించుకోకుండా వారిని పురమాయించి, ఆమెని పక్కమీదకు చేర్చి డాక్టరుకు ఫోన్ చేశాడు.
   
    అయిదు నిముషాల్లో డాక్టరు వచ్చాడు. ఇంజెక్షన్ ఇచ్చి హిస్టీరియా లక్షణాలు కనపడుతున్నాయని చెప్పి వెళ్ళిపోయాడు.
   
    ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. నౌఖర్లందరూ అక్కడక్కడా చేరి గుసగుసలాడుకుంటున్నారు. జరిగిన అసహ్యకరమైన సంఘటనతో అతడికి తల కొట్టేసినట్టయింది. తన గదిలోనే చాలాసేపు కూర్చున్నాడు కాని ఈ రోజు కాకపోయినా రేపయినా బయటి ప్రపంచంలోకి రావల్సిందే కదా అనుకుని కొంచెం సేపట్లో మానసికంగా సన్నద్దుడై బయటకొచ్చాడు.
   
    అతడు క్రుంగిపోతే చూద్దాం అనుకున్న నౌఖర్లకీ, పనివాళ్ళకీ, అయిదు నిముషాల్లో అతడు మామూలు మనిషిగా మారి ఆజ్ఞలివ్వడం చూసి మతిబోయింది. అసలేమీ జరగనట్టు, ఆ మాటకొస్తే మరింత కఠినంగా అతడు వ్యవహరించాడు.
   
    ఆ రోజు ఆఫీసుకి కూడా మామూలుగానే వచ్చేసేడు. తన వెనకాల ఎవరేమనుకున్నారో గానీ, ముందైతె బయటపడలేదు. ఒక్క శర్మకి మాత్రం జరిగింది చెప్పాడు. ఆయన ఎగిరిపడి, మొత్తం టైమ్ ఆఫీసు స్టాపునంతా మార్చేస్తానన్నాడు. ఆయనకి సర్దిచెప్పేసరికి ఎంతో కష్టమయింది.
   
    ఆ తరువాత అరగంటకి పాండేనుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఒక్కడే దీన్నంతా పెద్ద జోక్ గా తీసుకున్నాడు. "అందుకే నేను కారు పంపుతానన్నాను. వినలేదు నువ్వు. మంచి డ్రింకు మిస్సయ్యావు. మంచి నిద్ర మిస్సయ్యవు" అన్నాడు. రవి నవ్వి థాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేశాడు.
   
    అతడికొక్క విషయం స్ఫుటంగా అర్ధమయింది. ఈ ప్రపంచం కుక్కలాటిది. పరుగెడ్తే మొరుగుతూ వెంటపడుతుంది. వేటాడితే పరుగెడుతుంది.
   
    ఈ వార్త అందరికీ తెలిసిందనేసరికి క్రుంగిపోయాడు. ఏమవుతుందో ఏమో అనుకున్నాడు. కానీ తాను లేచి నిలబడి రొమ్ము విరుచుకునేసరికి....ఏమీ అవలేదు. ఇంత చిన్న విషయం కోసం సమాజం- సంఘం-లోకులు ప్రపంచం అనే పదాలు పెట్టుకుని మనుష్యులు నానాబాధలూ పడిపోతూ వుంటారు.
   
    ఈ రకమైన ఆలోచన వచ్చేసరికి అతడికి కొత్త ఉత్సాహం కలిగినట్టయింది. ఇంతకాలం తనెందుకు ఇన్ని సుఖాల్ని వదిలేసుకున్నాడో అర్ధంకాలేదు.
   
    అంతలో మానేజర్ వచ్చి కొత్త ప్రపోజల్ తాలూకు ఫైళ్ళు చూపెట్టాడు. తన ఆలోచన్లని పక్కకునెట్టి ఫైళ్ళు చూడటం ప్రారంభించాడు. పోస్టుద్వారా చౌకధరలకి చీరలు అందించే ప్రపోజల్ అది. అది కార్యరూపం ధరిస్తే - దాదాపు నూరు రూపాయలకే మంచి చీరలు ఇవ్వొచ్చు.
   
    "మళ్ళా ఈ ఫైలు నా దగ్గిరకి ఎందుకు వచ్చింది?" అని అడిగాడు.
   
    "ఒక డైరెక్టరు- 'దీన్ని గురించి మళ్ళీ ఆలోచిద్దాం' అని వ్రాశారు.
   
    "ఒకసారి మీటింగులో మెజారిటీ ఒప్పుకున్నాక మళ్ళీ చర్చించవలసిన పనిలేదని చెప్పండి" అన్నాడు. అదే క్రితంరోజయితే అంత దృఢంగా అనగలిగివుండేవాడు కాడు. అతడికే ఆశ్చర్యం వేసింది.
   
    మానేజర్ వెళ్ళిపోయాక శర్మతో ఫోన్లో మాట్లాడాడు.
   
    "రకరకాల వేస్టుఖర్చులు తగ్గించుకుంటే రెండొందల చీరెని వందకే అమ్మొచ్చు. ఇంతకాలం అనవసరంగా జనంమీద ఈ ఖర్చులన్నీ రుద్దాం. ఎందుకు ఎవరో డైరెక్టరు దీన్ని వ్యతిరేకిస్తున్నారట?" అని అడిగాడు.
   
    "పుస్తకమైనా- చీరైనా అందంగా, ఎక్కువ వేలకి చూపిస్తేనే కొంటారనీ, చౌకగా ఇస్తామంటే నాసిరకమేమో అని అనుమానపడతారనీ మన డైరెక్టర్ల భయం-" అన్నాడు అట్నుంచి శర్మ.
   
    "చూద్దాం ఏమవుతుందో. ఈ స్కీము ఫెయిలైతే అదే చీరని మూడొందలకి అమ్ముదాం. అప్పుడు కనీసం ఈ జనాల మూర్ఖత్వాన్ని మార్చలేం అన్న సంతృప్తి అయినా మనకు మిగులుతుంది."
   
    శర్మ నవ్వేడు. "ఇంతకూ అడ్వర్టెయిజ్ మెంట్ బడ్జెట్ ఎంత వేశావు."
   
    "డెబ్బై అయిదు లక్షలు".
   
    "మైగాడ్ అంతా."
   
    "అవును. అంత లేకపోతే ఈ స్కీము జనంలోకి వెళ్ళదు."
   
    "సరే, బెస్టాఫ్ లక్-"
   
    రవితేజ ఫోన్ పెట్టేసి, ట్రేలో కాగితం తీసుకున్నాడు. యధాలాపంగా చూసినవాడల్లా, మిగతాది చదువుతూ వులిక్కిపడ్డాడు. అది ప్రియంవధ రాజీనామా లేఖ. ఆమె ఆ రోజు ఆఫీసుకు రాలేదు.
   
    చాలాసేపు దాన్నే చూస్తూ వుండిపోయాడు.
   
    ఆ సాయంత్రం ఆఫీసు వదలి వెళ్ళబోతున్నప్పుడు మామూలుగా అడిగినట్టు అడిగి పెర్సనల్ ఫైలు తెప్పించుకున్నాడు. అందులో ఆమె అడ్రస్సు చూశాడు.
   
    కార్లో అక్కడికి బయల్దేరాడు. ఎవరన్నా చూస్తారని అతడు ఈసారిభయపడలేదు. క్రితంరోజు జరిగిన సంఘటన అతడికి కొత్త ధైర్యాన్నిచ్చింది.
   
    ప్రియంవద ఇల్లు మెడమీద.

    మెట్లెక్కిబెల్ కొట్టాడు. ఆమెవచ్చి తలుపు తీసింది. ప్రొద్దున్నించి, ఏడుస్తున్నట్టు కళ్ళు వాచి వున్నాయి. అతడిని ఆ సమయంలో వూహించనట్టు ఆమె అడుగు వెనక్కి వేసింది.
   
    అతడు లోపలికి ప్రవేశించాడు. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొన్నారు. ఆమె దగ్గరికి వచ్చిందో, అతడే తీసుకున్నాడో తెలీదు గానీ-క్షణం గడిచేసరికి అతడి ఛాతీమీద ఆమె తల వుంచి రోదిస్తూంది. అతడు నెమ్మదిగా ఆమె తల పైకెత్తి నీళ్ళు తుడిచాడు. అలా దగ్గిరైన మొహాలు వెంటనే.
   
    ఊహ తెలిసిన తరువాత, భార్య తరువాత తనకు తానుగా స్ప్రుశించిన మొదటి స్త్రీ శరీరం అది. ఆ స్పర్శ తరువాత, మెదడు ఆలోచించే స్థితికి చేరుకున్న తరువాత, అతడికీ ఆ తేడా తెలిసింది. చాలా తీవ్రమైన తేడా అది. పదిసార్లు ఉతికిన ఇస్త్రీ చొక్కాకీ, అప్పుడే షాపునుంచి కొన్న చొక్కా వేసుకోవటానికీ వున్నంత తేడా! ప్రెష్ నెస్.....ఉహూ అదొక్కటేకాదు ఇంకా ఏదో వుంది. ఆమె దగ్గిరకి రావటంలోనూ, మెడచుట్టూ చేతులు వేయటంలోనూ!.....అంతకుముందు మాధవి సామీప్యంలో లేని పరిమళం ఏదో కనపడింది అతడికి. 'కళ్ళ'కి కనబడే పరిమళం అది.

 Previous Page Next Page