Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 34

   

       "ఎన్ని రోజులు అలా పశువులా నిలబడతావురా వెధవా? సిగ్గు లేదూ....?" అన్నాడు. సోమయాజి మాట్లాడలేదు. దాంతో ఆయన అహం దెబ్బతిన్నది. ప్రధానోపాధ్యాయుడి దగ్గరకు తీసుకువెళ్ళి 'ఇతగాడు ఇంత వరకూ పాఠ్యపుస్తకాలే కొనలేదు. ఇలాంటివాళ్ళు మరికొందరుంటే మన స్కూలు నుంచి ఉత్తీర్ణులయ్యే వాళ్ళ శాతం తగ్గిపోతుంది. ఇప్పటి వరకూ మనకి వున్న మంచి పేరు పోతుంది' అన్నాడు.
   
    "పెద్ద పరీక్షలు ఇంత దగ్గరికి వచ్చేవరకూ పుస్తకాలే కొనలేదా?" అంటూ ఆశ్చర్యపోయాడాయన. ఆయన చాలా మంచివాడు. కానీ ఎంతో ముఖ్యమైన విషయమైతే తప్ప తను నిర్ణయం తీసుకోడు. క్రిందివాళ్ళకే వదిలేస్తాడు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం మార్చుకోడు. ఇంతలో క్లాసు టీచరు అన్నాడు - "ఇతను చేరి రెండు నెలలు అయింది. ఏదో పల్లెనుంచి వచ్చాడు మన స్థాయికి అందుకోలేకపోతున్నాడు."
   
    "ఒక స్కూలునుంచి ఇంకొక డానికి వచ్చేవాళ్ళతో ఇదే చిక్కు అందులో పల్లెటూళ్ళనుంచి వస్తే ఇక చెప్పనక్కర్లేదు."
   
    "ఎందుకు రావల్సి వచ్చింది?" ఆయన అడిగాడు.
   
    "మా తాతయ్య చనిపోయాడు సార్. కుటుంబం విచ్చిన్నమై...." ఆపైన మాట్లాడలేదు. అసలు విచ్చిన్నం అన్నమాట ఉపయోగించటానికే అతనికి అదోలా వుంది.
   
    ప్రధానోపాధ్యాయుడికి జాలేసింది. "చూడవోయ్! నువ్వు పుస్తకాలు కొనక, స్థాయీ పెంచుకోకపోతే పరీక్షకి పంపించి ఏం లాభం? ఇప్పటివరకూ మా స్కూలు నుంచి వెళ్ళినవాళ్ళు నూరుశాతం ఉత్తీర్ణులు అవుతూ వచ్చారు" అన్నాడు.
   
    "నేను బాగా చదువుతను మాస్టారూ" అన్నాడు రుద్దమైన కంఠంతో అతనికి ఎన్నో చెప్పాలని వుంది కానీ చెప్పలేకపోతున్నాడు.
   
    వాళ్ళిద్దరూ ఎక్కువ మాట్లాడుకుంటే ప్రమాదమని లెక్కల మాస్టారు మధ్యలో కల్పించుకుని "ఏం చదువుతావోయ్? ఏం చదువుతావ్? పుస్తకాలు లేకుండా ఇన్నాళ్ళనుంచి నిర్లక్ష్యంగా వస్తున్నవాడివి నీకు చదువంటే ఏం లక్ష్యం వుంటుంది?" అంటూ ఆయనవైపు తిరిగి "ఒకటి రెండ్రోజుల్లో పుస్తకాలు కొని, మన స్థాయికి రాకపోతే అతన్ని పరీక్షలకి పంపొద్దుసార్" అన్నాడు.
   
    "అలాగే" అన్నాడు ప్రదానోపాధ్యాయుడు.

    ఆయన విజయగర్వంతో చూస్తూ వుండగా కళ్ళనీళ్ళతో సోమయాజి బయటకు వచ్చేశాడు.
   
    ఆ రాత్రంతా అతడు ఏడుస్తూనే వున్నాడు. అతడు అప్పటివరకూ అనుభవించిన కష్టాలు చిన్నవి. కానీ ఇది భవిష్యత్తుని నాశనం చేసే సమస్య. అసలు ఏం జరుగుతుందో తలుచుకుంటేనే అతడికి దుఃఖం వస్తూంది.
   
    ఇంటికి వచ్చి పుస్తకాలు కావాలన్న సంగతి రంగారావుకి చెప్పాడు.
   
    "నెలాఖర్లో ఎలా కొంటారా? తర్వాత చూద్దాంలే."
   
    "అదికాదు ఎల్లుండికి పుస్తకాలు గానీ తీసుకురాకపోతే..." అంటూ చెప్పబోయాడు. కానీ రంగారావు పూర్తిగా వినలేదు. అంతకుముందు నెల పల్లె నుంచి సోమయాజి పోషణ నిమిత్తం పంపిస్తానన్న డబ్బు రాలేదు. అందుకే చిటపటలాడుతున్నాడు. ముందే చెప్పినట్టు అతను డబ్బు దగ్గర చాలా నిక్కచ్చి మనిషి.
   
    "పరీక్షకి పంపించకపోతే వచ్చే ఏడాది వెళ్దుగాన్లేవోయ్! ఇప్పుడు మునిగిపోయిందేముంది? అయినా వాళ్ళన్నది నిజమే. రెండు నెలలలో ఎలా అందుకోగలవు?"
   
    ఈ మాటలతో సోమయాజి ఆఖరి ఆశ కూడా తెగిపోయింది. అందుకే రాత్రంతా ఏడుస్తూనే వున్నాడు. మరుసటి రోజు ప్రొద్దున్న చిన్నక్కమాటలకి తెలివి వచ్చింది. "ఏమిట్రా సోమూ! బారెడు ప్రొద్దెక్కింది, ఇంకా లేవలేదా? అక్కడ పాలయిపోతాయిరా! మనం లేమని తెలిస్తే నీళ్ళు కలిపేస్తాడు" అంటూ మొదలుపెట్టింది.
   
    సోమయాజి ఆదరాబాదరా లేచి పరుగెత్తాడు.
   
    చిన్నక్క అరుపుల్ని మందాకిని వింటూనే వుంది. తెల్లవారుఝామున అతడు రానందుకు ఆమె విస్మయం చెందింది. అతడు ఆలస్యంగా లేవటంతో వంట్లో బాగాలేదేమో అనుకుంది. అతడు పాలకోసం వెళుతూవుంటే వంటింట్లో పనిచేసుకుంటూ కిటికీలోంచి బయటకు చూసింది. అతడి కళ్ళు వుబ్భివున్నాయి.
   
    ఆమెకి కారణం తెలియలేదు. ఆ రోజు అతడు స్కూలుకి వెళ్లలేదు. వెళ్ళికూడా లాభం ఏమిటని అనుకున్నాడు. ప్రధానోపాధ్యాయుడి గదిలో జైర్గిన సంభాషణ అంతా మాస్టారు మళ్ళీ తరగతిలో చెబుతాడు. మళ్ళీ నవ్వులు.
   
    పదింటికి రంగారావూ, పిల్లలూ వెళ్ళిపోయారు. "నువ్వు వెళ్ళవేమిరా?" అని చిన్నక్క అడిగింది. అతడేదో గొణిగాడు. ఆమె దాన్ని అంతగా పట్టించుకోలేదు.
   
    ఆ రోజు మధ్యాహ్నం వరకూ అతడు లోపల్నుంచి బయటకి రాలేదు. సాయంత్రమవుతుండగా అతడు పెరటిలోంచి వస్తూంటే మందాకిని ఎదురయింది.

    "ఏం లేదు" అనేసి వెళ్ళిపోయాడు. కానీ లోపల ఎక్కువసేపు వుండలేకపోయాడు. మళ్ళీ ఆమె దగ్గిరకు వెళ్ళాలన్నతలపు రెపరెపా కొట్టుకోసాగింది మనసులో బాధ ఎవరికన్నా చెప్తేగానీ వుండలేని స్థితి. తిరిగి వాళ్ళ భాగంవైపు వెళ్ళాడు.
   
    అటువైపు తిరిగి ఆమె కిటికీలోంచి బైట వీధిలో వున్న కొళాయినీ, పక్కనున్న బిందెల్ని చూస్తూ కాగితం మీద గీస్తోంది., నీడ పడటంతో వెనక్కి తిరిగి "రా......రా.....! ఇదిగో చూడు. చాలాకాలం తర్వాత మళ్ళీ గీయటం మొదలుపెట్టాను. ఎలా వుంది?" అన్నది నిజానికి అది చాలా తొందరగా గీసినదే అయినా బయట దృశ్యం యధాతధంగా ముద్రించబడి వుంది. మామూలు సమయంలో అయితే విప్పారిన కళ్ళతో చూసేవాడే కానీ ప్రస్తుతం అతడు ఈ సమస్యతోనే సతమతమవుతున్నాడు. ప్రేమగానీ, సౌందర్యం గానీ, కోరికగానీ-ఈ ప్రపంచంలో ఏదీ గానీ అతడికి తన చదువుకన్నా ఎక్కువ ఆనందాన్ని యివ్వలేవు. ఆ విషయం మాత్రం నిజం. అతడి గమ్యం వేరు. అంతవరకూ వస్తే ఎదురుగా వున్న ఆమె కూడా అతడి దృష్టిపథంలో ప్రస్తుతం లేదు. అతడి ఊహల్లో ఇప్పుడు ఒక కుర్రవాడు,  భుజానికి చేతిసంచి తగిలించుకుని క్లాసు గదిలో నుంచి బైటకు తోసివేయబడుతున్నాడు. అదే దృశ్యం కనులు మూసుకున్నా తెరిచినా కనపడుతూంది. అంతలో ఆమె నిష్టూరంగా "ఇదేమిటి - అంత మంచి బొమ్మ వేసి చూపించినా ఏమీ అనవ్?" అని కాగితం పక్కన బల్లమీద పెట్టి వెనుదిరుగుతూ అతడింకా మౌనంగానే వుండటం చూసి - "పొద్దున్నే అడుగుదామనుకున్నాను- ఏం వంట్లో బావోలేదా?" అంది.
   
    అతడు దానికి కూడా సమాధానం చెప్పకపోయేసరికి నుదుటిమీద చెయ్యివేసి "చల్లగానే వుందే" అంది. అదే ఆమె అతడిని మొదటిసారి స్పర్శించటం. దిగంతాల మందహాస మల్లీ నవలతాంతాల మాలికలల్లి, దయా శిశిర సుధాభరిత కటాక్షే క్షణముల జల్లి..... నారుపోసిన ముంగిట్లో.....గన్నేరు పూసిన వాకిట్లో....పన్నీరు చల్లిన లోగిట్లో ఇంపై కృష్ణశాస్త్రి కలంలో ఇంకై ... సొంపై.... పులకరింపై ఆ పలకరింపు జలదరింపై వళ్ళంతా పాకింది.
   
    జరిగింది అతడు చెప్పాడు.
   
                           *    *    *    *   
   
    మాష్టారు పాఠం మానేసి తన వంశం గురించి చెపుతున్నాడు. "అప్పుడు మా నాయనగారి తాతగారు - అంటే మా ముత్తాతగారన్న మాట, ఆయన తుపాకి పట్టుకు నిల్చున్నారట. బహుశా ఆయన అక్కడున్నాడని తెలుసుకుందో ఏమో పులి ఆ ఛాయలకే రాలేదట రాత్రంతా...." చెప్పుకుపోతున్న లెక్కల మాష్టారు ఆగాడు. సోమయాజి గుమ్మం దగ్గిర నిలబడి వున్నాడు.
   
    "క్లాసు మొదలై అయిదు నిమిషాలు గడిచింది. ఇప్పుడా మహాశయా మీరు రావటం?"
   
    "అయిదు నిముషాలు ముందే వచ్చాను మాస్టారూ పది నిముషాలు పెద్ద మాస్టారు ఆపుచేశారు. వెరసి అయిదు నిమిషాలు ఆలస్యమయింది."
   
    వెనుక బెంచీల్లో ఎవరో కిసుక్కున నవ్వారు. మాస్టారి మొహం ఎర్రబడింది. నవ్వినా వాడిని ఏమీ చేయలేక, ఆ కోపం సోమయాజి మీద చూపిస్తూ "ఈ సంవత్సరం ఎలాగూ వద్దనుకున్నాంగా, మళ్ళీ ఎందుకొచ్చారు?" అన్నాడు వెటకారంగా.
   
    "పుస్తకం తెచ్చాను మాస్టారూ. ఆ విషయం మాట్లాడుతూ వుంటేనే ఆలస్యమయింది" అన్నాడు అమాయకంగా కానీ ఆ అమాయకత్వం వెనకాల "ఈ విషయం పెద్దాయనతో మాట్లాడేశాను సుమా" అన్న సూచన వుంది, అతడంత తాపీగా అలా అనేసరికి ఆయనకి మతిపోయి మరింత కోపం హెచ్చింది. కానీ అతడి దగ్గిర తరగతి వాచకాలు గానీ, గణితాలు గానీ లేకపోవటంతో తనని ఆట పట్టిస్తున్నాడే అనుకుని, "ఏదిరా పుస్తకం" అని గద్దించాడు. సోమయాజి తాపీగా లోపలికి వచ్చి చేతిలో పుస్తకం బల్లమీద పడేశాడు కాస్త నిర్లక్ష్యంగా విసరటంవల్ల అది పడగానే బల్లమీద చక్రంలా తిరిగింది.

 Previous Page Next Page