Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 33

   

       ఆమె చేష్టలు దక్కి అలాగే నిలబడి వుంది. ఆ దృశ్యం ఆమెకి మనోహరంగా కనపడింది. ఒక చంద్రకిరణం అతడి మీదకి జాలువారుతూంది. ఒక శరన్మేఘం అతడిని అభిషిక్తుడిని చేయటానికి ఆయత్తమవుతూంది.
   
    అలికిడికి అతడు వెనుతిరిగాడు. ఆమెను చూసి ఆశ్చర్యపోలేదు. బెదరలేదు. తాపీగా దగ్గిరకొచ్చి, తలెత్తి అన్నాడు.
   
    "నాకు నత్తి పోయింది."
   
    ఆమె మాట్లాడలేదు. ఆశ్చర్యంతో అతడిని చూస్తూ వుండిపోయింది.
   
    "నేను దాన్ని జయించాను. ఏం? నమ్మకం కుదరటం లేదా?"
   
    ఆమె దానికి సమాధానం చెప్పలేదు.

    అతడి అహం దెబ్బతిన్నది ఆమె మౌనాన్ని అతడు వేరేలా అర్ధం చేసుకున్నాడు. కొద్దిగా ఆవేశం మిళితమై స్వరంతో అతడన్నాడు.
   
    "నత్తివాడికి 'క్ష' అనే అక్షరం పలకదు. 'ధ' పలకదు అలాగే - ప- దగ్గిర తడబడతడు. మీకింకా అపనమ్మకముంటే ఇదిగో వినండి" అంటూ ఆ మూడు అక్షరాల్నీ మూడు పాదాల్లో మరీ మరీ పేర్చి అప్పటికప్పుడు ఒక పద్యాన్ని ఆసువుగా చదివాడు అతడి నోటినుంచి వచ్చిన ఆ స్వరం ఒక శార్దూలమై విలసిల్లింది.
   
    "రక్షా రక్ష కటాక్ష వీక్షణ! సురారాత్ భహ్యరక్ష! శ్రీ
    వక్షోజాగ్ర సుగంధ బంధుర లసద్వాక్షా! సరోజాక్ష! నీ   
    యక్షీణా వ్యయ భవ్య సవ్య భరితవ్య శ్రావ్య కావ్య ప్రియా   
    సాక్షాత్కారము లివ్వి శాంభన సంరంభ గంగార్బటుల్."
   
    అని తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోయింది.
   
    ఆరు నెలలపాటూ ఘనీభవించిన హిమసముద్రం కొద్దిగా సూర్యరశ్మి తాకగానే నెమ్మది నెమ్మదిగా కరిగి, ఎలా మందాకిని (మందాకిని అంటే నెమ్మదిగా ప్రవాహించునది) అవుతుందో - అలా ఆమె మనసులో ఒక లాలిత్యమైన అనుభూతి కదిలి, మనసంతా ప్రవహించింది. వళ్ళు అప్రయత్నంగా జలదరించింది.
   
                                  8
   

    సోమయాజి మామూలుగా మాట్లాడగలుగుతున్న సంగతి ఎవరూ గుర్తించలేదు. తప్పుని వెంటనే పట్టుకోవటానికి ఆత్రపడే జనం ఒప్పుని అంత తొందరగా వప్పుకోరు. ఇది లోక సహజం.
   
    సోమయాజి కూడా, ఈ విషయం అందరికీ తెలియాలని పెద్దగా కుతూహలపడలేదు. అతడిప్పుడు ఈ మామూలు కోర్కెలకన్నా పెద్ద బాధలో వున్నాడు. ఒక అద్భుతమైన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. మునకే ఆనందంగా వుంది.
   
    వచ్చిన రెండ్రోజుల్లోనే మందాకిని ఇంటివారితో కలిసిపోయింది. అలా అని గంటలు తరబడి వచ్చి కూర్చుంటుందని కాదు. అవసరమైన చిన్న పనులకోసం బెరుకు లేకుండా లోపలికి వచ్చేసేపాటి చనువు వచ్చింది. పని అవగానే వెళ్ళిపోతుంది. ఆమె వచ్చినప్పుడు సోమయాజి నిటారుగా అవుతాడు. ఆమెవైపే కళ్ళప్పగించి చూస్తాడు. ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ యదాలాపంగా చూస్తే, చటుక్కున కళ్ళు తిప్పుకుంటాడు. ఇదొక అనిర్వచనీయమైన అద్భుతమైన అపురూపమైన బాధ.
   
    అతడికి అన్నిటిమీదా హితవుపోయింది. ఎపుడూ ఏదోగా వుండటం ప్రారంభమైంది. నిస్సహాయమైన ఒంటరితనం ఆవరించినట్టు దిగులుగా ఉండేది. ఎవరైనా పలుకరిస్తే చాలు - కళ్ళ వెంట నీరు వచ్చేది. ఎందుకో అతడికే అర్ధమయ్యేది కాదు. ఇదివరకు అతడికి ప్రపంచంమీద వాంఛ వుండేది. ఇప్పుడు పోయింది.
   
     రాత్రి మూడింటికే మెలకువ వచ్చేసేది. ఆమె వచ్చి ముగ్గు వేస్తుందన్న ఆలోచనలతో అలాగే కళ్ళు పత్తికాయలు చేసుకుని ఆ చీకటిలో, చలిగాలిలో గుమ్మంవైపు చూసేవాడు. ఆ గుమ్మం కొన్ని యుగాలు గడిచే వరకూ మూసేవుండేది. ఈ లోపులో కాస్త నిద్ర వచ్చేది. మళ్ళీ అంతలోనే ఉలికిపాటుతో మెలకువ వచ్చేది. ఏవేవో ఆలోచన్లు అతడు తన ఆలోచనల ప్రపంచంలో వుండగా కిర్రుమని చప్పుడయ్యేది సర్వేంద్రియాలూ ఒక్కసారిగా ఉత్తేజితంకాగా, అతడు చప్పున అటు దృష్టి నిలిపేవాడు. ఆమె ముగ్గు గిన్నె పట్టుకుని బయటకు వచ్చేది. వెనుకే కాళిదాసు, భానుడు, చేమకూర కవీ -
   
    తను మెలకువగా వున్నానని తెలియకుండా అలాగే ముందు వరండాలో పడుకుని ఆమె ముగ్గెయ్యటం చూస్తూ వుండేవాడు.
   
    అతడితో వచ్చిన చిక్కేమిటంటే వయసుకన్నా ముందే అతడు ఎదిగాడు. ప్రబంధాలు చదవటంవల్ల వచ్చిన చిక్కు అది. ఒక్క ప్రబంధాలనేమిటి? వాల్మీకి మాత్రం తక్కువవాడా ఏమిటి? వసంత ఋతువుని అతడు వర్ణించినట్టు ఎవరూ వర్ణించలేదు. అందులో కిష్కింధకాండలో సీతా వియోగంలో రాముని బాధ.....చంచచ్చంద్రకర స్పర్శ హర్షోన్మీలిత.... అన్నాడు. నాయకుడు చెయ్యి పట్టుకోగానే హర్ష పులకిత అయిన నాయిక, రతి నిమిత్తం తనకు తానే వస్త్రాల్ని జార్చేసినట్టూ ఆకాశం మేఘాల్ని వదల్చి నిర్మలమైందట. 'దర్సయన్తి శరన్నధ్యః' అన్నాడు. 'ప్రియునితో మొట్టమొదటి సంగమంలో యువతులు సిగ్గువల్ల నిదానంగా......ప్రియుని ప్రోత్సాహంవల్ల తప్పనిసరై...... తమ జఘనములను కొద్దికొద్దిగా వెలిచేసినట్టూ- శరదృతువులో నదులు మెల్లమెల్లగా ఇసుక తిన్నెల్ని బహిర్గతం చేస్తున్నవి' అని వ్రాశాడు.
   
    ఇవన్నీ అతడు చదివాడు. భోజనం చేసి, నిలువెత్తు పందిరి మంచంమీద దిళ్ళకి ఆనుకుని, తాతయ్య ఒక్కొక్క తమలపాకూ వేసుకుంటూంటే అతడు చదివి వినిపించేవాడు. కొన్ని అర్ధమయ్యేవి. కొన్ని అర్ధమయ్యేవి కావు. జఘనము అంటే తెలిసేది వెలి చేయటం ఎందుకో తెలిసేది కాదు. ఎప్పుడో చివరికి నోరు జారి, సత్యభామ స్థనాగ్రం గురించి అడిగి చీవాట్లు తిన్న విషయం విదితమే కదా.
   
    ఇప్పుడిక వయసు కూడా దోహదం చేయటం ప్రారంభించింది. అతడి శరీరం మేఘమై వర్షించటం ప్రారంభమై అప్పటికి నెలరోజులు కావొస్తూంది.
   
    వాళ్ళు ఆ భాగంలో దిగిన కొన్ని రోజులకి అతడికి ఆమెతో మామూలుగా మాట్లాడే వీలు కలిగింది. చిన్నక్క పక్కింటికి వెళ్ళి కాస్త నెయ్యి తెమ్మని చెప్పింది.
   
    గుండెలు వడిగా కొట్టుకుంటూ వుండగా అతను గుమ్మంలో అడుగుపెట్టాడు. ఆమె పాదాలకి పసుపు రాసుకుంటూంది. అతడిని చూసి కుచ్చిళ్ళు క్రిందకి వదిలేసి ఏమిటన్నట్టు చూసింది.
   
    "కొ.... కొద్దిగా నెయ్యి కావాలంది చిన్నక్క"
   
    ఆమె పసుపు గిన్నె పక్కనపెట్టి లోపలి వెళ్ళి నెయ్యి తీసుకువచ్చి ఇచ్చింది. అతను అందుకుని వెనుతిరిగి వెళ్ళబోతూ వుండగా "నత్తి పోయిందన్నావ్, మాట ఇంకా తడబడుతూ వుందే" అంది చిరునవ్వుతో అతడు సిగ్గుపడ్డాడు. ఎలాగో నోరు పెగుల్చుకుని "ఇది సిగ్గు కాదు" అన్నాడు.
   
    "మరేమిటో?"
   
    "బెరుకు."
   
    తిరిగి ఆమె నవ్వింది. అతడు గుమ్మం వరకూ వెళ్ళి ఆగి, ఎన్నాళ్ళ నుంచో అదే సమస్యగా కొట్టుమిట్టులాడుతున్న వాడిలా, "నేను.....మిమ్మల్ని....మిమ్మల్ని 'నువ్వు' అనొచ్చునా" అన్నాడు.
   
    ఊహించని ఈ ప్రశ్నకి ఆమె విస్తుబోయి, అంతలోనే తేరుకుని నవ్వేస్తూ 'అలాగే పిలువు అయినా నువ్వసలు ఎప్పుడూ మాట్లాడవు కదా. ఏం పిలుస్తావు?" అని అడిగింది.
   
    తను తక్కువ మాట్లాడతానన్న విషయం ఈమె గమనిస్తూంది అన్న సంగతి అతనికి సంతోషాన్నిచ్చింది. తలవంచుకుని మరేమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అతనికి శిఖరం ఎక్కినంత ఆనందంగా వుంది.

    ఆ మరుసటి రోజు ప్రొద్దున ఆమె ముగ్గేస్తూండగా లేచి దుప్పటి తీసి పక్కనపెట్టి బయటకు వచ్చాడు. అలికిడికి ఆమె తలతిప్పి ఇతడిని చూసింది. అయితే ఏమీ ఆశ్చర్యపోలేదు. "ముగ్గు బావుందా?" అని అడిగింది జడ వెనక్కు వేసుకుంటూ.
   
    "ఊఁ"
   
    రకరకాల కోణాల్లో చూస్తూ దానికి మెరుగులు దిద్దటం ప్రారంభించింది.
   
    అతను మెట్లమీద కూర్చున్నాడు.
   
    వేసవి వచ్చినా ఇంకా తెల్లవారుఝాము చలి పూర్తిగా పోలేదు. తూర్పు ఎర్రబారటానికి చాలా సమయముంది. పుట్టి రెండు రోజులు కాని లేడిపిల్ల తల్లి పక్కలో ఒదిగ్గాపడుకున్నట్టూ, సృష్టి సుషుప్తావస్థలో వుంది. దూరంగా వేపచెట్టుమీద ఒక పక్షి, నిద్రలోనే రెక్కలొకసారి టపటపా కొట్టుకొని మళ్ళా పడుకుంది. ఆమె ముగ్గేస్తూ వుంటే అతను అలా వళ్ళో చేతులు పెట్టుకుని మెట్లమీద కూర్చుని చూస్తూ వుండటం దివ్యమయిన దృశ్యం.
   
    ఆ తరువాత అలా ఎన్నో రాత్రులు అలా గడిచాయి. ఎక్కువ మాటలు కూడా వుండేవికావు. ఆమె ముగ్గు వేయటం పూర్తిచేసి, చెవుల మీదకి జారిన ముంగురుల్ని అరచేతితో వెనుకవైపు పైకి తోసుకుంటూ అలసటతో అతనివైపు చూసి నవ్వేది. అతను అభినందిస్తున్నట్టూ చూసేవాడు - అంతే.
   
    ఒకరోజు అతను రాలేదు.
   
    ఆమె కాసింతసేపు అతని కోసం చూసింది.
   
    అతనింకా లేవలేదు. రాత్రంతా నిద్రలేనివాడు తెల్లవారుఝామునే ఎలా వళ్ళుమరచి నిద్రపోతాడో అలా పడుకుండిపోయాడు. దానికి కారణముంది.
   
    రాత్రంతా చాలా సేపటివరకూ రోదిస్తూనే వున్నాడు.
   
    అతడిని ఆ సంవత్సరం పరీక్షలకి పంపించనని లెక్కల మాస్టారు ఆ క్రితంరోజే చెప్పాడు. మొదటిరోజు అల్లసాని పద్యం చెప్పి ఆయన వంశ గౌరవం మంట కలిపినప్పటినుంచీ ఆయనకి మంటగానే వుంది. అందుకే పుస్తకం తీసుకురాని నెపంమీద వెనుక నుంచోబెట్టడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి అదీ పాతబడింది. తను రాగానే సోమయాజి లేచి వెనక్కి వెళ్ళి నించోవటం అతనికి శిక్షగాకాక, తనకే అవమానకరంగా వున్నట్లు తోచింది.

 Previous Page Next Page