అంత పొడుగ్గా వున్న పుస్తకం - అదేమిటా అని ఆయన తీసి చూశాడు. మధ్యకి కుట్టి వున్న తెల్లకాగితాల పుస్తకం మీద గణితశాస్త్రం మొదటి పాఠం నుంచి చివర పాఠం వరకూ ఎవరో ఇద్దరు రాత్రంతా కూర్చుని ప్రింటు పుస్తకాన్ని యధాతధంగా తిరిగి వ్రాసినట్టు వుంది.
అందులో ఒక చేతి వ్రాత స్త్రీదిలా వుంది.
* * * *
సురభి కంపెనీవాళ్ళు విరివిగా నాటకాలాడే రోజులవి, ఆ ఊరికి పదిమైళ్ళ దూరంలో పై డేరాలు దింపి పల్లెలో ఆడుతున్నారు, రంగారావు పెద్దన్నగారికి నాటకాల పిచ్చి వుంది, ఆయన యవ్వనంలో వుండగా ఒక నటీమణిని కొంతకాలం చేరతీశాడు, తరువాత భార్య తరపు బంధువులు వచ్చి నిలదీశాక ఆవిడని, ఆవిడతోపాటు నాటకాలనీ వదిలేశాడు. ఆడటమంటే వదిలేశాడు కాని చూడడం వదిలెయ్యలేదు. ఇప్పటికీ మంచి నాటకం ఎక్కడున్నా వెళతాడు. అయితే అతడితో ఒక చిక్కున్నది. తోడు కావాలి, ఈసారి సురభి నాటకానికి సోమయాజిని తీసుకెళ్ళాడు.
ఆ రోజుల్లో నాటకాలు రాత్రి పదింటికీ మొదలయ్యేవి. పూర్తయ్యే సరికి మూడు కొట్టేది. జనాలు బళ్లమీదా, గడ్డివామి పక్కనా పడుకుని నిద్రపోయేవారు. పిల్లలయితే మొదటి నాలుగు వరుసల్లో కూర్చుని మొదటి రంగం కాగానే ఒకరిమీద ఒకరుపడి అలాగే పడుకుని నిద్రపోయేవారు. చాలామంది నాటకం పూర్తికాగానే బళ్లమీద బయల్దేరి పొలంపనులు సమయానికి స్వంత ఊరు చేరుకునేవారు, నాటకం దళం వచ్చిందంటే ఊరు ఊరంతా హుషారే. అప్పుడప్పుడు సర్కసు కూడా వస్తూ వుంటుంది అప్పుడయితే యిక గోల చెప్పనక్కరలేదు. ఒంటెను చూశామని ఒకడు....ఏనుగు స్నానం చేయటం చూశామని ఒకడు....! ఒక కుర్రవాడు ధైర్యంచేసి వెళ్ళి సింహాలని గుండ్రంగా నిలబెట్టి నమస్కారం చేయించే రింగుమాస్టార్ తో "మీరే ఊరినుంచి వచ్చారని" అడిగి సమాధానం పొందినందుకు సంవత్సరం పాటూ వాడిని ఆ గ్రామంలో అందరూ గొప్పగా చూశారు. సర్కసువాడితో మాట్లాడిన వాడితో స్నేహం చేసుకునే నిమిత్తం కుర్రవాళ్ళంతా తహ తహ లాడారు.
ఇలా వుండేవి అక్కడి ప్రదర్సనలు అయితే యువకులకి మాత్రం ఈ సర్కసులూ, నాటకాలూ కన్నా జాతర్లొస్తేనే ఎక్కువ హుషారు దానికి వారికున్న కారణాలు వేరే.
ఏది ఏమైతేనేం ఎనిమిదిన్నరకి బావమరుదులిద్దరూ సైకిలేసుకుని బయల్దేరారు. దాదాపు గంట ప్రయాణం. మధ్యలో కృష్ణరాయపురం దగ్గిర రెండు మిఠాయి కిళ్ళీలు కట్టించాడు ఆయన సోమయాజికి ఒకటిచ్చి బలవంతాన వేయించాడు.
వాళ్ళు పల్లెకి చేరుకునేసరికి పది కావొస్తుంది. తరువాత పావుగంటకి నాటకం మొదలయింది. కృష్ణుడు అదృశ్యమవటం, నారదుడు మేఘాల్లోంచి దిగి రావటం అద్భుతంగా వుండి అందరూ చప్పట్లు కొట్టారు. సోమయాజి బావగారికయితే పాత నాటకాల మిత్రులు దొరికారు. ఒక అప్పటి కబుర్లు ఎప్పటికీ తేలలేదు. నాటకం పూర్తయ్యాక పాతమిత్రుల్ని వదలలేక "ప్రొద్దున్నే వెళదాం లేరా" అన్నాడు సోమయాజితో.
"అవును ఇంత రాత్రిపూట సైకిల మీద అంత దూరం ప్రయాణం మంచిది కాదు" అని మిత్రులు వత్తాసు పలికారు.
సోమయాజి గుండెల్లో రాయి పడింది.
పాత మిత్రులు సంభాషణలో పడ్డారు.
అతడు కాసేపు ఇటూ అటూ తచ్చాడాడు. బావగారు అరుగుమీదున్న పాత మంచం చూపించి, "అక్కడ పడుకోరా! ప్రొద్దున్న లేపుతాలే" అన్నాడు.
"కాదు నేను వెళతాను" తటపటాయిస్తూ అన్నాడు సోమయాజి.
"ఇంత రాత్రా."
"నాటకం చూడటానికి మా స్నేహితులు కూడా వచ్చారు. అందరం కలిసి వెళదామంటున్నారు" అని అబద్దమాడాడు చప్పున.
"సర్లే, వెళ్ళు."
విడుదలయిన ఖైదీలా సోమయాజి బయటకొచ్చాడు. రాత్రి మూడయింది. ఆకాశం నిర్మలంగా వుంది. వెళ్ళవలసిన తన ఊరు పది మైళ్ళ దూరంలో ఉంది. నడవటం మొదలుపెట్టాడు. సమయం గుర్తొచ్చి పరుగెత్తాడు. అలసటొచ్చినప్పుడు ఆగాడు. మళ్ళీ నడిచాడు. బలంగా వూపిరి తీసుకుని తిరిగి పరుగెత్తాడు. సమయం ఎంతయిందో తెలీదు. ఆలస్యం అవుతానేమో అన్న భయం ఒకవైపు.
ఇంటికి చేరుకునేసరికి తెలతెల వారుతూంది. తలుపులు యింకా మూసి ఉండటం చూసి తేలిగ్గా వూపిరి పీల్చుకుని "అమ్మయ్య" అనుకున్నాడు. కష్టానికి ఫలితం దక్కింది. అంతలో మందాకిని తలుపు తీసుకుని మామూలుగా బయటకు వచ్చింది. ప్రతి రోజులాగే మెట్లమీద కూర్చుని ఆమె ముగ్గెయ్యటం చూస్తూ మాట్లాడసాగాడు. (తను రోప్పటం ఆమె గుర్తించకుండా వుండటానికి ప్రయత్నం చేస్తూ)
జీవితంలో ఒకసారైనా ప్రేమించిన వారి సంగతి తీసుకుంటే - ఆ తొలిప్రేమ ఇంత బలంగా వుండకపోతే, యింత బలీయమైన సంఘటన వారి జీవితంలో ఒకటన్నా వుండకపోతే అది తొలిప్రేమ కాదు భ్రమ. ప్రేమ అనే భ్రమ.
ఇది ఇక్కడితో ఆగలేదు.
రంగారావు పెద్దన్నగారు మరుసటిరోజు ప్రొద్దున్న వచ్చి నాటకం గురించి రకరకాల విశ్లేషణలతో చెప్పాడు. దానితో ఉత్సాహం వచ్చి మందాకినిని ఆమె భర్త "ఈరోజు మనం వెళదామా" అని అడిగాడు అతడు సాధారణంగా ఎప్పుడూ అలా అడగడు. మందాకిని ఉత్సాహంగా "అలాగే" అంది. "కానీ అంతదూరం ఎలా వెళతాం?"
"జట్కా మాట్లాడుకుందాం-రానూ పోనూ."
ఆ సాయంత్రం ఆరింటికి ఆమె తయారు కావొచ్చింది. బొట్టు పెట్టుకుంటూంటే సోమయాజి మౌనంగా నిలబడి వున్నాడు. ఆమె కాటుక దిద్దుకుంటూ "ఏమిటి ఈ వేళ అదోలా వున్నావ్" అంది. ఏం లేదన్నాడు. చాలామంది ఆడవాళ్ళలా కాటుక అంటిన వేలిని అద్దం పక్కగోడకే వ్రాసేయకుండా ఆమె గుడ్డతో అద్దుకుంటూ "ఏం లేకపోవటం ఏమిటి? ప్రపంచాన్ని పోగొట్టుకున్న వాడి ఫోజులో వుంటేనూ" అంటూ నవ్వింది.
"ఈ రోజు నువ్వు వెళ్లొద్దు"
ఉన్నట్టుండి అతడలా అనేసరికి ఆమె మొహంలో నవ్వు మాయమైంది. తల తిప్పి చూస్తూ విన్నది అర్ధంకాక "ఏమిటి? అంది. అతడు తిరిగి మాట్లాడలేదు.
"ఏమన్నా విప్పడు" అని అడిగింది.
ఏమంటాడు? నువ్వు ఇంకొకరితో మాట్లాడితేనె నామనసు విలవిల లాడుతుందని చెపుతాడా? నువ్వు ఇంకొకరితో వున్నప్పుడు - అది స్త్రీ గానీ, పురుషుడుగానీ-నువ్వు వాళ్ళతో మామూలుగా నవ్వినా కూడా నేనది భరించలేనని చెపుతాడా? ఏమీ చెప్పలేడు అందుకే-
"మళ్ళీ ఎప్పుడొస్తారు?" అని మాట మార్చి అడిగాడు.
"అర్దరాత్రి తిరుగు ప్రయాణం ప్రమాదం అంటున్నారు. అందుకని రేప్రొద్దున్నే."
అంతలో ఆమె భర్తవచ్చి "తొందరగా" అని హడావుడి చేశాడు, అతడితో సోమయాజీకి చనువులేదు - కాస్త జంకు - అంటే భయంకాదు మాటల్లో చెప్పలేని దూరం!
అరగంట తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు.
శూన్యం మిగిలింది. ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు. ఒంటరిగా, దిగులుగా అలా వుండిపోయాడు. ఆ రాత్రి అతడు నిద్రపోలేదు. మధ్యలో గొడవుంది. అయితేనేం.....పక్క గదిలో ఆమె లేదన్న భావం చాలు నిద్ర పారద్రోలటానికి. వెళ్ళినవాళ్ళు తమ అభిప్రాయాన్ని మార్చుకుని ఏ అర్ధరాత్రో తిరిగి వచ్చేస్తారేమోనని రాత్రంతా చూశాడు. గుటకపడని అనుభూతి కృష్ణరాయపురం దగ్గిర ఆమె భర్త ఆమెకి కిళ్ళీ కొనిచ్చినట్టూ-నవ్వుతూ మాట్లాడినట్టూ-వాళ్ళిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నట్టూ-
ప్రొద్దున్న ఏడింటికి జట్కా తిరిగి వచ్చేవరకూ అతడీ వ్యధతోనే కొట్టుమిట్టులాడాడు. రెండ్రోజులకుగానీ పూర్తిగా తేరుకోలేదు.
ఆ తర్వాత చిన్న పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పెద్ద పరీక్షలకి వెళ్ళబోయే వాళ్ళని తప్ప సాధారణంగా ఎవరినీ ఆపరు. సోమయాజికి కూడా నలభై యాభైలు వచ్చినాయి.
తీసుకొచ్చి మందాకినికి చూపించాడు.
"నీ మీద చనువు లేదుగానీ లేకపోతే ఏంచేసి వుండేదాన్నో తెలుసా?"
"ఏంచేసి వుండేదానివి?" నవ్వుతూ తలెగరేసి అడిగాడు.
"చెంప పగులగొట్టి వుండేదాన్ని ఉప్పు పాతర వేయించేదాన్ని."
కమ్చీతో కొట్టినట్టయి నవ్వు మాయమైంది. చేతిలో మార్కుల కాగితం అతడి మీదకు విసిరికొడ్తూ "సిగ్గులేదూ! పేరు సోమయాజి పైగా ఏకసంథాగ్రాహి. మార్కులు మాత్రం నలభై దాటవు" అంది అతడి మొహం వివర్ణమయింది.
ఆమె మొహం రుధిర వర్ణపు సూర్యుడిలా వుంది. తర్జని చూపిస్తూ "నిన్ను చూస్తుంటే నాకు అసహ్యమేస్తుంది. చదువుకునే వాడికి చదువు తప్ప మరేం వ్యాపకం వుంటుంది? అలాటి చదువులోనే ఇంత నిరర్ధకామిన వాడివి యిక జీవితంలో ఏం రాణిస్తావ్? ఛీ.... నీ కోసమా నేను రాత్రంతా కూర్చుని వేళ్ళు అరిగిపోయేలా టెక్స్టుబుక్స్ వ్రాసింది. నీ భావి కోసమా వెన్నెల్లో కూర్చుని నేను ఎన్నెన్నో ఆలోచించింది? నాకే సిగ్గేస్తూంది. వెళ్ళు! తెల్లవారుఝామున ఆడాళ్ళ దగ్గిర కూర్చుని కబుర్లు చెప్పటం మానేసి ఇప్పటినుంచయినా చదవటం ప్రారంభించు...."
మానసికంగా అంత దెబ్బ అతనెప్పుడు తినలేదు. శారీరకంగా అతడి తాతయ్య ఒకే ఒకసారి అతడిని కొట్టాడు. ఒకసారి లెక్కల్లో నూటికి తొంభై ఆరు వచ్చినపుడు ఉరుకులూ పరుగులూ మీద వచ్చి ఆనందంగా చెప్పాడు. అప్పుడు "మంచిదిరా అబ్బాయ్! మొదటి మార్కు నీదేనా?" అని అడిగాడాయన.