ప్రదీప్ చెప్పింది విని "సుబ్బులా? ఎలా వుంటుంది?" అనడిగాడు.
సునీత, అరుణ చెప్పిన గుర్తులు మననం చేసుకుంటూ ఆమెను వర్ణించాడు.
"ఈమధ్యదాకా యిక్కడే వుండేది. అదీ, వాళ్ళమ్మా కలిసే వుండేవాళ్ళు. గుంట..... ఎక్కడ్నుంచి వచ్చాయోగాని వున్నట్లుండి షోకుషోగ్గా వుండి, పైసలు బాగా ఖర్చు చెయ్యటం మొదలుపెట్టింది. మళ్ళా ఏం జరిగిందో సడన్ గా కనబడటం మానేసింది."
"వాళ్ళ వాళ్ళు కూడా ఎవరూ లేరా?"
"లేరు, అదీ వాళ్ళమ్మా యింకెవరూ లేరు."
"ఇక్కడ యింకెవరినన్నా ఎంక్వయిరీ చేస్తే తెలుస్తుందా?"
అతను తలవిదిలించి "లాభం వుండదు. బహుశా యీ వూరినుంచే మకాం ఎత్తేసినట్లుగా వుంది" అన్నాడు.
ప్రదీప్ జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి అతనికిస్తూ, "ఆమె ఎప్పుడైనా కనిపిస్తే దయవుంచి నా ఎడ్రెస్ కు తెలియచెయ్యండి. కనీసం ఫోనైనా చెయ్యండి" అన్నాడు.
"చాలా అవసరమైన సంగతా?"
ప్రదీప్ అవునన్నట్లుగా తల ఊపాడు.
"అచ్చా సాబ్! అలాగే" అన్నాడు గళ్ళలుంగీ మనిషి వినయంగానే.
తిరగి వస్తుండగా మాలతి "ప్రదీప్! సుబ్బుల్ని యీ పని చేసివుండమని ఎవరైనా నియోగించి వుంటారంటావా?" అనడిగింది.
"నా నమ్మకం అదే" అన్నాడు ప్రదీప్.
* * *
మరునాడు పత్రికలన్నీ యీ కేసుకు ప్రాముఖ్యతనిస్తూ వార్తను ప్రచురించాయి.
"రాధ కంటి ఆపరేషన్ కేసులో కొత్త మలుపు."
"రాధ కుడికంట్లోకూడా కేన్సర్ వుందా?"
"డాక్టర్ అశోక్ తప్పేమీ చేయలేదా?"
రకరకాల హెడ్డింగులతో ప్రచురింపబడింది. అవన్నీ చదువుతుంటే ప్రదీప్ లో రక్తం ఉరకలు వేసినట్లయింది. కాని ఇలా ప్రతీ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుని రంగులు పులిమే ప్రపంచం. ఇవన్నీ ఎదుర్కొని తీరాలి.
సెలవురోజు అవటంవల్ల కోర్టులేదు. పన్నెండు గంటలకు క్యారియర్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి రామూ వెళ్ళిపోయాడు.
ప్రదీప్ ఆఫీసుగదిలో ఒక్కడే కూర్చుని వున్నాడు. ఎవరో లోపలకు వస్తున్నట్లయి తలెత్తి చూశాడు.
'అంకుశం' ఎడిటర్ పరాంకుశం లోపలకు వస్తూ, "నేను మీకు తెలుసుననుకుంటాను" అన్నాడు.
ప్రదీప్ ప్రశ్నార్ధకంగా చూశాడు.
పరాంకుశం "మా అసిస్టెంటు మీదగ్గరకు వచ్చి వుంటాడు కాబట్టి నన్ను మీరు గుర్తుపట్టి వుండకపోవచ్చు" అని తనని పరిచయం చేసుకుని అతను చెప్పకుండానే ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు.
"చెప్పండి ఏం కావాలి?"
"పత్రికలన్నీ చూసి వుంటారు. రాధ ఆపరేషన్ కేసులో హనుమంతరావు సాక్ష్యాన్ని రంగులు పులిమి చిత్రించాయి. నాకు మీ మీద సానుభూతి వుంది. సంఘంలో కుళ్ళుని కడిగెయ్యటమే నా లక్ష్యం నేను మిమ్మల్ని సపోర్టు చేస్తూ రాద్దామనుకుంటున్నాను."
"నన్ను అనవసరంగా ఎవరూ సపోర్టు చేయనక్కరలేదు. కేసులోని నిజానిజాలు, నా లక్ష్యం ప్రపంచంముందు వుంచితే చాలు" అన్నాడు ప్రదీప్.
"ఆ నిజానిజాలు ప్రపంచం ముందు వుంచాలనే వచ్చాను."
"థాంక్స్"
"కాని..."
"చెప్పండి"
"మీకున్నట్లే నాకూ కొన్ని లక్ష్యాలున్నాయి. మిమ్మల్ని అర్ధం చేసుకోనట్లే యీ గ్రుడ్డిసంఘం నన్నర్ధం చేసుకోలేకపోతుంది. అందుకని వున్నట్లుండి ఆర్ధిక యిబ్బందుల్లో పడిపోయాను. అసలీ కేసుమీద స్పెషల్ ఇష్యూ వేద్దామని సంకల్పం వుంది. కాని...."
"చెప్పండి."
"ఆర్ధిక పరిస్థితివల్ల పత్రిక తీసుకురావటం కష్టంగా వుంది. అందుకని...."
ప్రదీప్ కు అర్ధమవుతోంది.
"ఆ ఉపేంద్రనూ, డాక్టర్ అశోక్ నూ ఏకిపారేస్తాను. ప్రపంచం ముందు దోషులుగా నిలబెడతాను. దానికి కొంచెం ఆర్ధిక సహాయం అవసరమవుతుంది."
"సారీ! నాకిటువంటివి యిష్టంలేదు" అన్నాడు ప్రదీప్ కటువుగా.
"మీ మంచికోసం చెబుతున్నాను!"
"నా మంచేమిటో నాకు తెలుసు. మీరిహ వెళ్ళవచ్చు."
"సరే" అంటూ పరాంకుశం లేచాడు. "ఒక మంచి అవకాశాన్ని పాడుచేసుకుంటే మీ దురదృష్టానికెవరేం చేస్తారు?" అంటూ కోపంగా బయటకు వెళ్ళిపోయాడు.
అసలు పరాంకుశానికి యీ పాపిష్టి ప్రపంచంమీద పూర్వంకన్నా చాలా అక్కసుగా వుంది. అందులో ఈమధ్య ఒకదానిమీద ఒకటిగా ఎదురుదెబ్బలు తగుల్తున్నాయి. ఆర్ధికబాధ మరీ భారంగా వుంది.
ఆ కోపంలో రిక్షా ఎక్కి మనసు ఎగసిపడుతుండగా యింటికెళ్ళాడు. రిక్షాదిగి రెండురూపాయలు అతనిచేతిలో పెట్టాడు.
"ఇదేటిబాబూ! అంతదూరం తొక్కించి వన్ వే ట్రాఫిక్కులోంచి లాగించి రెండురూపాయలు చేతిలో పెడతారు. ఇంకో రూపాయివ్వండి" అన్నాడు రిక్షా అతను.
"వన్ వే ట్రాఫిక్కులు పెట్టడం నా తప్పంటావా? నువ్వు తొక్కిన దూరానికి రెండురూపాయలు రీజనబుల్. మాట్లాడకుండా తీసుకో..."
"నే తొక్కిన దూరానికి మూడు రూపాయలు రీజనబుల్ చెబుతున్నా మాట్టాడకుండా యివ్వండి."
"నువ్వు చేసే తొక్కుడు ఫ్రొఫెషన్ కు యింగ్లీషు కూడానూ. నేనెవర్నో తెలుసా? అంకుశం ఎడిటర్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఏకిపారేస్తాను నా పత్రికలో, జాగ్రత్త."
"ఏంటయ్యా ఏకేది? నీచేత ఏకబడ్డానికి నేనేటయినా మినిష్టర్నా? సినిమా స్టార్నా? అతి బులబాటంగా వుంటే ఏక్కో ఫోటో వేసి మరీ ఏక్కో మంచి పాపులారిటీ కూడా వొస్తుంది నాకు."
ఏం చదువుకున్నాడో ఏమిటో వెధవ ఇంగ్లీషు ముక్కలూ వీడూనూ, అనవసరంగా వీడితో పెట్టుకున్నానే అని ఆలోచిస్తూన్నాడు.
"ఏమయ్యా! మర్యాదగా యిస్తావా? లేకపోతే..."
ఎవరన్నా విన్నారేమోనని పరాంకుశం అటూ ఇటూ చూశాడు. అదృష్టం బాగుంది దగ్గర్లో ఎవరూ లేరు. జేబులో చెయ్యిపెట్టి రూపాయి తీసిచ్చి "నీలాంటివాడి రిక్షాలో ఎక్కడం నాదే పొరపాటు" అంటూ విసురుగా కదిలి, ఇంటికి వేసి వున్న తాళాన్ని డూప్లికేట్ కీతో తెరచి లోపలకు వెళ్ళాడు.
ఆకలేసింది. పంకజం అన్నంకూడా వండకుండా ఎక్కడికో వెళ్ళింది. ఎక్కడికో ఏమిటి? నూన్ షోకే వెళ్ళి వుంటుంది. దీన్ని....రానియ్ చెబుతాను దీనిపని అంటూ పళ్ళు పటపట కొరికాడు. రామలింగం....! వీడెక్కడికి పోయాడు?
అరగంట తర్వాత వీధిలో ఆటో ఆగింది. మరో నిముషానికి నవ్వులు వినిపించాయి. ఆ నవ్వుల వెనక పంకజం, ఆమెతోబాటు రామలింగం లోపలి వచ్చారు.
"ఇదేమిటి? మీరిద్దరూ ఎక్కడ కలిశారు?" అనడిగాడు పరాంకుశం మండిపడుతూ.