"ఏమిటా అవసరం" వీర్రాజు గొంతులో కోపం క్రమంగా ఉధృత మౌతుంది. "నీకు వరసవుతుంది. కాబట్టి నీకు కట్టేయడమా...."
"ముందనుకున్నదేగా."
"ఇప్పుడు ఎవరు కాదన్నారని....."
"అదికాదు మావయ్యా.....ఇప్పుడది చదువుకుని ఉద్యోగం చేయాలా ఊళ్ళేలాలా"
"రాజేందర్" ఈ ప్రసక్తి వెంటనే త్రుంచేయాలనిపించింది....."ఇలా ఆలోచించేది కూతుర్ని గుండెలమీద కుంపటిలా భావించే తల్లి తండ్రులు అది ఈ యింటి యువరాణి.... దాని ఇష్టానికి ఎదురుచెప్పడం నాకూ సాధ్యంకాని పని."
"అంటే నా పెళ్ళి దానితో జరగదన్నమాట."
ఎన్నడూ లేనిది రాజేందర్ ఈరోజిలా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్ధం కావడంలేదు. "అలా ఎవరన్నారు రాజేంద్రా.... నేను ఎప్పుడో మాటిచ్చానుగా!"
జరుగుతున్నది చెప్పాలని ఉద్వేగంగా వున్నా ఎందుకో ఆ సాహసం చేయలేకపోతున్నాడు రాజేందర్. చాలా విషయాల్ని వ్యక్తిగతంగానే పరిష్కరించగల సత్తా వున్న తను ఇప్పుడు శంకూ ప్రసక్తి తీసుకురాలేకపోతున్నాడు. అంతకుమించి సావేరిమీద ఏ చిన్న అభియోగాన్నైనా సహించని తండ్రాయె.
"సావేరి ఈమధ్య....."
"ఈమధ్య...." వీర్రాజు భ్రుకుటి ముడిపడింది.
"నన్ను చాలా నీచంగా చూస్తూంది....."
ఓ పెగ్గు డైల్యూట్ చేయకుండా సిప్ చేశాడు. "అలా జరక్కుండా చూసుకో!"
"ఓ ఆడపిల్ల తండ్రిగా నువ్వివ్వాల్సిన సలహా ఇదికాదు."
"బావమరిదిగా నిన్ను అభిమానిస్తాను. కానీ తండ్రిగా సావేరిని ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ ఇష్టపడతాను. ఇది నీకు కొత్తగా చెప్పాల్సిన ఆగత్యం లేదనుకుంటాను."
"బావా..." వ్యంగ్యంగా అన్నాడు. చాలా ఆస్థి పరపతిగల నీ చూపు దూరంగా విస్తరించి రేపటి నీ రాజకీయ భవితవ్యానికి పునాదులు వేసుకోవడంలో నిమగ్నమైపోయింది తప్ప యిక్కడనీ ఉనిక్కి చీడ పడుతూందన్న సత్యం బోధపడుతున్నట్లులేదు.....ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానూ అంటే నీకు అండగా నేను నడుస్తున్నది స్వార్ధంతోనే ....అది నీ అల్లుడు కావడమనే పాయింటుకన్నా సావేరికి మొగుడు కావడమన్న ఆలోచనతో....వివరాలు అడక్కు.... కాస్త నీ ఇంటి వ్యవహారాల్లోనూ ఏకాగ్రత చూపించు...."
అది హెచ్చరికో, ఎరుకపరచడమో వీర్రాజుకి అర్ధం కాకముందే రాజేందర్ రోషంగా నడుచుకు వెళ్ళిపోయాడు.
రోజులో చాలా భాగం తన వ్యాపారాలమీద, రాజకీయ వ్యవహారాల పైనా దృష్టిని కేంద్రీకరించే వీర్రాజు ఆలోచనలో పడ్డాడు.
తన ఇంటి ఆవరణలో పూచిన అరుదైన పారిజాతం సావేరి.
అలాగే గర్వపడుతున్నాడిన్నాళ్ళూ....
అయితే ఇంత పరపతిగల తాను ఆ మొక్కకి కంచెవేయాలని ఏనాడూ అనుకోలేదు.... రాజేందర్ మాటల్లో అంతరార్ధం అదేనా....
ఇక్కడ వీర్రాజిలా ఆలోచిస్తున్న సమయంలో....
ఇక్కడ వీర్రాజులా ఆలోచిస్తున్న సమయంలో....
లోపల సావేరి మూతిముడుచుకుని తన గదిలో పడుకుని వుంటే తల్లి రాధమ్మ భోంచేయమని బ్రతిమలాడుతూంది.
అప్పటికి అరగంటసేపట్నుంచీ అడుగుతున్న సావేరినుంచి ఎలాంటి జవాబు రావడంలేదు.
మొహానికి అడ్డం పెట్టుకున్న మోచేతికింద తడి ఆరని సావేరి కళ్ళు ఆమె చూసివుంటే ఎంత ఆందోళనపడేదో....
ఎలా చేయాలో, ఏం చేయాలో తెలీడంలేదు సావేరికి.
కానీ రాజేందర్ ని నరికి పోగుచేయాలన్నంత ఉద్రేకంగా వుంది.
"లే తల్లీ...." మరోసారి రెట్టించింది. రాధమ్మా "నిన్నేనే....అసలేమైందే.... చెప్పకుండా బయటికెళ్ళావు....ఆలస్యంగా యింటికొచ్చావు....నీరసంగా వున్నావేంటే....చెప్పకపోతే నాకెలా తెలిసేను ....బావేమన్నా అన్నాడా....?"
"అప్పుడు తీసింది మోచేతిని....అంతకు రెట్టింపు రోషంగా పైకి లేచి "ఐ హేట్ హిమ్....ఆ బ్రూట్ పేరు నా దగ్గర ఎత్తకు...." అంది కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలుతుంటే.... "అవును మమ్మీ" ఈసారి వెక్కిపడుతూంది. "మీ తమ్ముడున్నాడే.....అతనంటే నాకు చాలా అసహ్యం...."
ఇదేమాట సావేరి కోపంతో చాలాసార్లు అంది.
అలా అనప్పుడల్లా రాధమ్మ నవ్వుతుంది.
కానీ ఇప్పటి మాటల్లో వట్టి కోపం మాత్రమేలేదు, ద్వేషముంది జుగుప్సత స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా కాదు....
సావేరి కళ్ళనుంచి రాలుతున్న నీలాలు నిన్న మొన్నటి నీటి తుంపర్లలా లేవు.....గుండెని కోసుకుని వెలికివస్తున్న రక్తపు చుక్కల్లా అనిపించాయి.
"ఏమైంది సావేరీ.....నా తల్లివికదే! ఏం కష్టమొచ్చిందే?" అక్కున చేర్చుకుంది ఆందోళనగా.
"నా చిట్టితల్లీ! ఏం జరిగిందీ చెప్పకుండా కుమిలిపోవటానికి నువ్వేటిగట్టున కనిపించే ఏటిపువ్వువి కాదే....ఈ యింటపారే కావేరివి.....చెప్పమ్మా!"
"మమ్మీ....నేను...." తల్లి గుండెల్లో తలని ఒత్తిపెట్టింది. గువ్వలా ఒదిగింది. "మరేమో బావని పెళ్ళి చేసుకోను....అంతే...."
"పిచ్చిపిల్లా" అప్పటికి తేరుకుంది రాధమ్మ. "అలా అని బావ వెంటపడ్డాడా.....యింత గడుసుపిల్లవి....ఈమాత్రం దానికే బెంబేలు పడిపోవాలా....అసలు నీకు అప్పుడే పెళ్ళి తొందరేమైందని...."
"ఆలస్యంగానైనా సరే అసలు బావంటే నాకిష్టం లేదు."
"అంతేగా....పోనియ్...."
"మరి నువ్వు బావకి సొంత అక్కవిగా"
"అయితే?" కూతురి కళ్ళు తుడిచింది. "పిచ్చితల్లీ.....వాడూ నేనూ రక్తం పంచుకున్నాం. కానీ నువ్వు నా రక్తంతో రూపుదిద్దుకున్న దానివి నీ ఇష్టానికి వ్యతిరేకంగా మా యింట ఏమీ జరగదమ్మా."
"ప్రామిస్" చేయి చాచింది సావేరి నమ్మకంగా.
ఒట్టేసింది రాధమ్మ.
అమ్మ ఒడిలో తలపెట్టి ఆనందంగా కళ్ళు మూసుకుంది చాలా సేపటిదాకా.
అందమైన స్మృతిలా శంకూ గురించి ఆలోచించుతూంది. ఇందాకటి రాక్షసకాండే గుర్తు కొస్తూంది.
అమ్మ ప్రోద్బలంపై ఏం ఎగిలిపడిందో సావేరికి గుర్తులేదు.
పూదోటలో అడుగు పెట్టలేదు.
కానీ నిద్రపోతున్నా వీర్రాజుని రింగవుతున్న ఫోన్ తట్టి లేపింది.
"హలో" యథాలాపంగా అందుకున్నాడు. "నేను వీర్రాజూ....నీ ఆగర్భ శత్రువిని...."
నిద్రమత్తు వదిలిపోయింది. "ఎవర్నువ్వు?"
"చెప్పినా లాభంలేదు పాపం నీకు ఎలా గుర్తుంటుందని...అసలు ఎన్ని కుటుంబాలను సమాధి చేసిన నువ్వు ఆ భవంతిని సింహాసనంగా మార్చుకున్నావని....ఇన్నాళ్ళూ నిన్నే మార్గంలో దెబ్బతీయాలా అని ఎదురుచూసాన్రా ....ఇప్పటికి తోచింది. నీ అద్భుతమైన బలహీనత నీ పదహారేళ్ళ కూతురని...."
వీర్రాజు నుదురు స్వేదంతో తడిసిపోయింది... ... "అసలు నువ్వు...."
"నువ్వు నీ బావమరిది రాజేందర్ కలిసిచేసిన దండయాత్రలో ఓడి జైలు పాలయినవాన్ని. ఇప్పుడు విడుదలై నీ మీద ఓ అందమైన అవకాశం తీసుకోవాలనుకుంటున్నవాన్ని. పాపం సావేరిని యిక ఎలా రక్షించు కుంటావో మరి."
ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు....
రెండు అంగల్లో సావేరి గదిలోకి పరుగెత్తాడు.