ఏదో అన్యాయం చేస్తున్నాననీ, ఇది దారికాదనీ ఘోషపెడుతోంది మనసు, అంతవరకే. అంతకు మినహాయించీ పర్యవసానం ఏమీచూపించటం లేదు.
ఈ యిల్లువిడిచిపెట్టాలంటే రాధమ్మగారికి హృదయమంతా వ్యాకులపాటుతో నిండిపోయింది. ఈ యింటిలోకి అడుగుపెట్టి ముప్పై సంవత్సరాలకు పైగా దాటిపోయింది,వచ్చినప్పట్నుంచీ ఇంటికి అంటుకుపోయింది. కాపరానికి వచ్చిన కొత్తలో బలరామయ్యగారు ముక్కోపిగా వుండేవాడు. భార్యను సాధారణంగా గుమ్మందాటి కాలు బయట పెట్టనిచ్చేవాడు కాదు. చీటికి మాటికి చెయ్యిచేసుకుంటూ వుండేవాడు. ఆమె ఏమాత్రం సుఖలాలసత పట్ల ఆసక్తి కనపర్చినా, ఆయన కది వెకిలిచేష్టకా, భోగపరాయణత్వంగా గోచరించేది. సాధించేవాడు. వేధించేవాడు ఉన్నంతలో సంసారంతో సుఖశాంతులు నెలకొనటానికి ఆమె తన అభిరుచులకూ, ఆశలకూ తిలోద కాలివ్వవల్సి వచ్చింది. అట్టే నరసంచారంలేని ఆ భావంతే ఆమెకు సర్వ ప్రపంచమూ అయింది. జమీందారిణిలా హుందాగా మనసులో భావించుకుంటూ ఆ గదిలోంచి ఈ గదిలోకీ, ఈ గదిలోంచీ ఆ గదిలోకీ తిరుగుతూండేది. బలరామయ్యగారు ఆవిడ పుట్టింటివారిని కూడా అవసరమైనంత దూరంలోనే వుంచాడు. క్రమంగా ఆవిడ తల్లి, తండ్రి గతించిపోయారు. తమ్ముడు వీరభద్రం మిగిలాడు. అక్కగారిపట్ల అతను ఆపేక్ష వొలకబోస్తూండేవాడు. అనురాగం ప్రదర్శింస్తూండేవాడు. అతని యింటికే యిప్పుడు ఆమె వెడుతోంది.
జట్కాలో ఎక్కుతూ రాధమ్మగారు తలఎత్తి మేడవైపు చూసింది" ఇన్ని సంవత్సరాలు తాను అందులో కాపురం చేసింది. ఏం జరిగింది? ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మమత పీల్చి పిప్పిచేస్తోంది.
బండి ఎక్కింది.
బండి కదిలింది.
సత్యమూర్తి మేడమీద తనగదిలో కిటికీదగ్గర నిల్చొని చూస్తున్నాడు. అతనికి ఏడుపు వచ్చింది.
ఏడుస్తున్నాడు.
* * *
రామకృష్ణయ్యగారు విశ్రాంతిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆయనకు ప్రాణం తెరిపి యిచ్చినట్లయింది.
బలరామయ్యగారి భవంతి పదమూడు వందల గజాల స్థలంలో వున్నది. మేడ ముందువైపుకన్న వెనుకవైపు ఖాళీస్థలం ఎక్కువ. ఆ స్థలమంతా అరటిచెట్లూ, కొబ్బరిచెట్లూ, అనేక రకాల పూలమొక్కలతో నిండివుంది. కొద్దో గొప్పో కూరగాయల చెట్లూ వున్నాయి.
మేడ క్రిందిభాగంలో యిదివరకు ఓ మందుల ఏజన్సీ కంపెనీ అద్దెకు వుండేది. వ్యాపారంలో నష్టం రావటంచేత ఆ కంపెనీ ఖాళీచేసి వెళ్ళిపోయింది. తర్వాత సరియైన అద్దె రాని కారణంచేత బలరామయ్యగారు ఎవరికీ యివ్వకుండా జాగుచేస్తూ వచ్చేరు. క్రమంగా అది ఖాళీగా వుండిపోయింది. అద్దెల కిచ్చేవాళ్ళ మనస్తత్వంలోని చిత్రం అదే. తమ వాటా ఎన్ని నెలలయినా ఖాళీగా వుండటం ఒప్పుకుంటారుగాని ససేమిరా అద్దె తగ్గించరు.
"అబ్బాయ్!" అంటూ ఓ రోజు ఆధారంగా కొడుకు దగ్గర కొచ్చాడు రామకృష్ణయ్యగారు.
కూర్చుని, కాయితాలు తిరగవేస్తున్న సత్యమూర్తి తల పైకెత్తి చూశాడు.
"క్రిందిభాగమంతా యిలా ఖాళీగా ఎన్నాళ్ళని అట్టే పెడతాంరా? మనకు ఎంత అద్దె నష్టం? గట్టిగా ప్రయత్నంచేసి ఎవరికైనా అద్దెకిస్తేపోలా?" అన్నాడాయన సలహా యిస్తూ.
"ఏం చేస్తాం నాన్నా? మరి ఎవరూ రావడంలేదు."
"అలా అని ఊరుకుంటామురా? చూడబ్బాయ్! ఈ కాకినాడలో బిజినెస్ హడావుడి అట్టేలేదు. అందుకని ఏదో కంపెనీ వచ్చి ప్రవేశిస్తుందని అనుకోవడం భ్రమ. అందులోనూ మెయిన్ బజారువైపయితే పర్వాలేదు గాని యిదంతా ఫామిలీ లొకాలిటీ క్రిందిభాగాన్ని నాలుగయిదు వాటాలుగా విడగొట్టి చిన్న చిన్న కుటుంబాలకు అద్దెకిద్దాం."
"అబ్బ! అలాగైతే ఇల్లంతా గీవురు బావురుమని "గోలగా వుంటుంది నాన్నా!" అన్నాడు కొడుకు చికాగ్గా.
"అలా అని నిక్షేపం వంటి ఆదాయాన్ని వదులుకుంటామురా? అయినకాడికి అన్నివిధాలా రాబడికోసం ఆలోచించాలిగాని. కాస్తశుభ్రంగా ఏవాటా కావాటా విడివిడిగా కట్టించేస్తే ఏ గోలా వుండదు. నెల తిరిగేసరికి బిళ్ళ కుడుముల్లా మూడు నాలుగొందలు చేతిలోకి వస్తాయి."
సత్యమూర్తి కొంచంసేపు ఆలోచించి "మరి ఎవరికీ వాళ్ళకి అన్నీ సపరేట్ గా అమర్చాలంటే కొంత డబ్బు ఖర్చవుతుంది కదా నాన్నా" అన్నాడు.
"అవుతుందిరా అబ్బాయి కొంచం...అయిదారు వేలు."
"అమ్మో! అంత డబ్బే" అన్నాడు కొడుకు భయాశ్చర్యాలతో.
"ఏమిట్రా అట్లా ఆవలిస్తావు?" అన్నాడు తండ్రి కొంచం నిరసనగా. "ఇంటిమీద పెట్టింది ఎక్కడకు పోతుంది? ఈ పెట్టుబడికి ఎంత వడ్డీ గిట్టుబాటు అవుతుందో ఆలోచించు"
చివరకు సత్యమూర్తి అంగీకరించాడు.
* * *