Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 32

    హాల్లో చుట్టూ గోడలకున్న పటాలని చూస్తూంది గీతాభవాని. పొన్నచెట్టు క్రింద రాధాకృష్ణుల రాసలీల పటం, వెన్నముద్ద చేతిలో పట్టుకొన్న కృష్ణుడు దిగంబరంగా ఉన్న పటం, ఇంకా చాలా పటాలు వరుసగా గోడలకి వైర్ తో బిగించబడి వున్నాయి! ఉయ్యాల బల్లమీద కూర్చొని ఆ పటాలను తమాషాగా చూసేది గీతాభవాని. ఇవాళ అవి తమాషాగా కనిపించడం లేదుగాని, ఏవో గతస్మృతులను కెలుకుతున్నాయి!

    "తీసుకో, గీతా!" పొడుగాటి గ్లాసులో టీ పోసుకు వచ్చింది రుక్మిణమ్మ.

    "నీ పెద్దకూతుర్ని మీ ఆడపడుచు కొడుక్కిస్తారని మీ అమ్మ అంది. నిజమేనేమో?"

    "ఖచ్చితంగా పెళ్ళిమాటలేం జరగలేదు."

    "ఏం ఉద్యోగం చేస్తున్నాడు ఆ అబ్బాయి?"

    "పల్లెలో వ్యవసాయం చేయిస్తున్నాడు."

    "అదేమిటి? చదువుకోలేదూ? మీ కుటుంబంలో మగవాళ్ళు, ఆడవాళ్ళంతా విదేశాల్లో చదివి వస్తారని విన్నానే!"

    "నిజమే. మా విశాల్ కూడా స్టేట్స్ లో చదివి వచ్చాడు. అగ్రికల్చర్ లో డాక్టరేట్ తీసుకొన్నాడు. అతడికి ఉద్యోగమంటే ఇష్టం లేదట. వాళ్ళ అమ్మా నాన్నా వద్దని చెప్పినా అతడు వ్యవసాయం చేయిస్తున్నాడు."

    "మరి అంత చదువూ ఎందుకు చదివాడట?"

    "నేనెప్పుడూ అడగలేదత్తా!"

    గ్లాసులో సగం టీ కూడా తాగలేదు!

    హారన్ బొయ్ బొయ్ మని మ్రోగిస్తూ ఇంటిముందు కారొకటి ఆగింది.

    గీతాభవాని దిగ్గున లేచింది.

    "అరే! ముందు ఉత్తరమైనా వ్రాయకుండా వచ్చేశారే మా వాళ్ళు!" రుక్మిణమ్మ సంబరంగా బయటికి పరిగెత్తింది.

   
                                          11

    ఇంటికి వస్తూనే దండెం మీద ఉన్న బట్టలుతీసి సూట్ కేసులోకుక్కి, మేనల్లుడిని బస్ స్టాండ్ కి పరిగెత్తించింది గీతాభవాని, ఊరికి బస్సుందేమో కనుక్కురమ్మని!

    "తిక్కరేగిన మనిషిలా ప్రవర్తిస్తున్నావు! ఏమిటే ఇది? రేపు ఎలాగా కారు వస్తుంది! వెళ్ళిపోతావు! ఇంత హడావిడిగా ఇప్పుడు ప్రయాణమేమిటి?" తల్లి విస్తుపోతూ నిలబడింది.

    "నా మనసు బాగోలేదు. వెళ్ళిపోతానమ్మా!"

    "ఈ మాత్రం దానికి ఎందుకు వచ్చావట? వచ్చినదానివి కుదురుగా నాలుగురోజులుంటే సంతోషం కాని ఈ ఉరుకులు పరుగులేమిటి? వచ్చి ఇలా వెళ్ళిపోతే మా మనసు బాధపడదూ?"

    "ఈ ఒక్కరోజుకు ఉండు, గీతా! రేపు ఎలాగా వెళ్ళిపోతావు!" వామనరావు వారించాడు.

    ప్రయాణం విరమించుకోక తప్పలేదు గీతాభవానికి. కాని, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తూంది. వెళ్ళి పిల్లలమధ్య పడితే తప్ప తనుకోలుకోదు! వాళ్ళ నవ్వులమధ్య, హాస్యాలమధ్య ఎంతటి బాధనైనా మరిచిపోవచ్చు.

    టేబిల్ మీద ఏవో పుస్తకాలుంటే త్రిప్పేస్తూ కూర్చొంది.

    "హాయ్, మమ్మీ! నేనూ డాడీ వచ్చేశాం. అమ్మమ్మ ఇంట్లో విందులారగిస్తూ మమ్మల్ని మరిచిపోయావుకదూ?" జ్యోతి తల్లి మెడ చుట్టూ చేతులువేసి చిన్నపిల్లలా తల్లివీపుమీద పడింది.

    హఠాత్తుగా ఏదో సుడిగాలి చుట్టి ఎత్తివేసినట్టుగా అయింది గీతాభవానికి. "అబ్బా! పడిపోతాను. లే! ఏమిటది మరీ చిన్నపిల్లలా?" అంటూనే ముందుకు లాక్కొని ముఖంమీద ముద్దులు పెట్టుకొంది గబ గబా.

    ఈ దృశ్యాన్ని నవ్వుముఖాలతో చూస్తున్నారు తల్లీ, వదినా.

    "పిల్లలమీద ఇంత ప్రేమున్నదానివి వాళ్ళని నీతో తీసుకువస్తే ఉన్న నాలుగురోజులైనా సంతోషంగా ఉండేదానివి! ఒక్కదానివి వచ్చావు! మనస్సంతా అక్కడే వాళ్ళమీదే! ఒట్టి కట్టె ఇక్కడ!" అంది వదిన.

    వామనరావు బయట ఆగివున్న కారు దగ్గరికివెళ్ళి బావమరిదిని సాదరంగా ఆహ్వానించి తీసుకు వస్తున్నాడు.

    "డాడీ ఈరోజు రాత్రికి బయల్దేరాలన్నారు."

    కూతుర్ని ఒళ్ళోంచి లేపి నిలబడింది గీతాభవాని, లోపలికి వస్తూన్న గిరిధరంగారిని చూసి.

    వామనరావు కొడుకు మధు, జ్యోతికంటే రెండేళ్ళు చిన్న. చేతులతో అభినయిస్తూ వెక్కిరించాడు.
"బుజ్జిపాపాయిని. అమ్మ ఒళ్ళోదూరి పాలుతాగావు కదూ?"

    "అరే! నిన్ను తంతానురా!"

    మధు వెనుక పరిగెత్తింది జ్యోతి.

    "ఈ రాత్రి ప్రయాణమేమిటి, బావగారూ? రేపు ఉదయం వెళ్ళొచ్చు!" అన్నాడు వామనరావు.

    మౌనం అంగీకారం అన్నట్టుగా కూర్చున్నారు గిరిధరం. ఎవరూ లేనప్పుడు చూసి భార్యతో అన్నారు:
"నీకెప్పుడైనా పుట్టింటిమీద బుద్దిపుడితే ఒక్కదానివే ప్రయాణమై రాకేం? పిల్లల సంగతేమోగాని, నేనే ఉండలేకపోయాను నువ్వులేని ఇంట్లో."

    ఏదో పరధ్యానంలో ఉండిపోకపోతే కొంటెగా, కవ్వింపుగా చూసేదేమో, గీతాభవాని!

    "నువ్వు ఆ ఇంట్లోనే కాదు, ఇంటి యజమాని మనసులోకూడా ఇంత బలీయమైన స్థానం పొందావని, నువ్వు దూరమైన ఈ మూడు రోజుల్లో బాగా స్పష్టమైంది. కారు పంపిస్తే నువ్వు వస్తావు. నేనే వస్తే కొంచెం ముందుగా నిన్ను చూస్తానుకదాని ప్రయాణమై వచ్చేశాను."
   

 Previous Page Next Page