"గోపీ! నాకోసం యిలా తారట్లాడుతున్నావా?" అంది ఆతృతగా అతని దగ్గరకొచ్చి.
"అస్మితా! నిన్ను చూడకుండా వుండలేకపోతున్నాను."
"నన్ను మరిచిపో గోపీ! మన స్నేహం యింక కొనసాగటం కష్టం."
"ఎందుకని?"
"మా యింట్లో ఎవరికీ యిష్టం లేదు. అందుకని అన్ని రకాలైన ఆంక్షలూ విధించారు. బహుశా కొద్ది రోజుల్లో యిక్కడ్నుంచి నన్ను పంపించేస్తారు?"
"ఎక్కడికి ?"
"తెలీదు."
"మరి ఎలా?"
"మనిద్దరం...విడిపోదాం" ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
"వీల్లేదు" అన్నాడు గోపీకృష్ణ దృఢ స్వరంతో.
"మనిద్దరం కలిసి ఎటయినా వెళ్ళిపోదాం."
"అమ్మో!" అంది అస్మిత. ఆమె గుండె గబగబ కొట్టుకుంటున్నది.
"అవునంతే. మనం విడిపోవటానికి వీల్లేదు."
"నా కంత ధైర్యం లేదు."
"ధైర్యం చేసి తీరాలి."
ఆమెకు తండ్రి గుర్తువచ్చాడు. అతనెంతటి భయంకరమైన మనిషో, తలుచుకుంటే ఎలాంటి కిరాతకానికయినా ఎలా ఒడిగట్టగలడో తమ బంధువర్గంలో, పరిచయస్థులతో ఆయన అనుభవాలు గుర్తొచ్చి వొళ్ళు గగుర్పొడిచింది.
"వొద్దు ప్లీజ్, గోపీ! నన్ను మరిచిపో."
"అది అసంభవం. ఇప్పుడే వచ్చెయ్యి నాతో. ఎటయినా వెళ్ళిపోదాం." అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాగబోయాడు.
ఆమె వేగంగా వెనక్కి కదిలి "అయ్యో! ఇది పబ్లిక్ రోడ్డు. మనిద్దరం చాలా డేంజరస్ సిట్యుయేషన్ లో వున్నామంటే నీ కర్ధం కాదేం ?" అంది.
"నేనర్ధం చేసుకోను" అన్నాడు గోపీకృష్ణ మూర్కంగా.
"గోపీ! నీకు దణ్ణం పెడతాను నన్ను విడిచి వెళ్ళిపో." అంది అస్మిత ప్రాధేయపడుతూన్నట్లుగా.
"అంత భయపడేదానివి నాతో చెలిమి ఎందుకు చేశావు?"
"చేశాను తెలీక. కాని యిప్పటి పరిస్థితి వేరు."
"అంటే నేనంటే నీ కేమీ లేదా?"
అస్మిత ఏమీ జవాబు చెప్పలేదు. లోపల్నుంచి ఉబుకుకుని వస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూండడం వల్ల కళ్ళు ఎర్రబడిపోతున్నాయి.
"మమ్మీ వచ్చేస్తుంది బయటకు. నేనెడతాను" అంటూ అతని సమాధానం కోసం ఎదురుచూడకుండా షాపులోకి వెళ్ళిపోయింది.
* * *
జోరున వర్షం కరుస్తోంది.
టైమయిందని కంగారుపడుతూ ప్రజ్ఞ వర్షం వెలుస్తుందేమోనని కొంతసేపు ఎదురుచూసింది ఎక్కడా వాన వెలిసే చాయలు కనిపించలేదు. ఇంటి గుమ్మంలో నిలబడి, చివరకు ఓ రిక్షా వస్తోంటే ఆపి హాస్పిటల్ కి బేరం చేసుకుని ఎక్కి కూచుంది.
రిక్షా సాగిపోతోంది. జల్లు పడకుండా రిక్షా అతను పట్టాలు కప్పిపుచ్చాడు. కాని అవి ఆమెను తడపకుండా కాపాడలేకపోతున్నాయి.
ఉన్నట్లుండి ప్రజ్ఞ తృళ్ళిపడింది. ఏమీ జరుగుతోందీ తెలుసుకునే లోపలే ఓ ఆకారం మెరుపులా లోపలకు చొరబడి ఆమె ప్రక్కన చతికిలబడింది.
"ఏయ్ రిక్షా! పోనియ్. మా వాళ్ళేలే. ఆపక్కర్లేదు" అంది ఆ ఆకారం.
ప్రజ్ఞ ఆ గొంతు గుర్తుపట్టింది. ఆమె నరాల్లోంచి వొణుకు బయల్దేరింది.
"ప్రజ్ఞా! నిన్ను నేను వొదిలి పెట్టకుండా వెంటాడుతూనే వుంటానని యీ పాటికి తెలుసుకునే వుంటావు. ముఖ్యంగా నీ చెక్కిళ్ళరుచి చూశాక" అన్నాడు యోగి.
"చెయ్యి. నేనన్నిటికీ తెగించివున్న వాడ్ని. నువ్వు నా పెళ్ళానివనీ, నాతో దెబ్బలాడి వెళ్ళిపోతుంటే వెంటపడ్డాననీ అల్లరి చేస్తాను."
ప్రజ్ఞ నిస్సహాయురాలయిపోయినట్లు కూచుంది.
"ప్రజ్ఞా! నా యీ చిన్న జీవితంలో ఎన్ని అనుభవాలున్నాయో ఎంతమంది జీవితాలతో ఆడుకున్నానో నీకు తెలీదు. కాని నిన్ను చూస్తోంటే మనస్పూర్తిగా కావాలనిపిస్తున్నావు. నేను తలుచుకుంటే యిప్పటికిప్పుడు నిన్ను ఎత్తుకుపోగలను. రేప్ చేసి పారెయ్యగలను. నా అవసరాలు తీర్చుకుని నీ శవాన్ని కూడా యీ ప్రపంచానికి దక్కకుండా చెయ్యగలను. కాని నిన్నలా చెయ్యాలని లేదు, నిన్ను పూర్తిగా నాదాన్ని చేసుకోవాలని వుంది. నిన్ను పెళ్ళిచేసుకుంటాను ప్రజ్ఞా !"
"నీలాంటి నీచుడ్ని నేను పెళ్ళిచేసుకుంటాననుకోకు."
"ప్రజ్ఞా! నువ్వు లేనికుటుంబంలో పుట్టావు. నీ అంతస్థుకి ఏ సామన్యుడో తప్ప నాలాంటివాడు దొరకటం అదృష్టం. ప్రపంచాన్ని పరిపాలించేది డబ్బు, గుణం కాదు."
"గుణం లేని డబ్బు లక్షలకు లక్షలు గుమ్మరించినా నేను కన్నెత్తి అయినా చూస్తానానుకోకు. డబ్బు కొన్ని అవసరాలనే తీర్చగలుగుతుంది. గుణం లేని మనిషి నా దృష్టిలో పశువు."