ఆ మాటతో బెదిరిపోయింది రాజవల్లి. ఎన్నో సంవత్సరాలుగా 'నా' అనుకోగలిగే వ్యక్తికోసం, తనను ప్రేమించే వ్యక్తికోసం తపించి పోతోందామె. 'భర్త పోయాక ఎందరెందరో తమ పిల్లలను పెంచుకోమని వచ్చినా, నిక్కచ్చిగా తిరస్కరించింది. తన కొడుకే రావాలి. ఈ సంపదను అతడే అనుభవించాలి. అని పట్టుదలగా ప్రయత్నించింది చివరకు ఈనాడు తన జీవితం ముగిసిపోయేటప్పుడు ఈ చిన్నారి వచ్చింది తన దగ్గరకు. ఈ సంపదంతా దానిదే గదా! అయిదువేలు ఇస్తేనేం? కానీ ఎందుకో?'
'ఇలా దుబారా అలవాటైతే ఈ సంపద నిలుపుకోగలదా? ఈ అయిదువేలూ దేనికో? ఆఁ ఏదో కొత్త నగ కొనుక్కోవాలని కోరివుంటుంది. తనను ఆశ్చర్యంలో ముంచి ఆదుకోవాలని ఇలా అల్లారి చేస్తోంది.'
అప్పటికప్పుడు ఇనప్పెట్టె శకుంతల కిచ్చింది. బేంక్ ఎక్కౌంట్ వున్నా ఇనప్పెట్టెలో ఎప్పుడూ ఇరవైవేలకి తక్కువకాకుండా వుంటాయి రాజవల్లి దగ్గిర. ఆ డబ్బు ఖర్చుచేయకుండా చూసుకొని ఆనందించటం ఆమెకు వంశ పారంపర్యంగా వచ్చిన లక్షణం. బంగారమూ, రూపాయలూ తప్ప జీవితంలో మరొక ఆనందముంటుందనేది, అప్పటికే ఆమె ఊహకందనిది.
డబ్బు తీసుకుని శకుంతల ఫ్యాక్టరీకి వచ్చింది. క్లర్క్ దగ్గర నుంచి రిజిష్టర్ తీసుకొని దానిలో వున్నా లెక్కప్రకారం అందరికీ జీతాలిచ్చివేసి ముద్రలు వేయించుకొంది.
బాల సింహం దగ్గరకొచ్చి, "బాబూ! నీకు ఈ చదువు ఎవరు చెప్పారు?" అంది ప్రేమగా.
అతడికి శకుంతల అంటే గురి కుదిరింది "పంతులమ్మా!" అన్నాడు.
"పంతులమ్మా? ఎక్కడుంటుంది?"
"మాకాడే వుంటుంది."
"నా దగ్గరికి తీసుకొస్తావా?"
వాడు కళ్ళు చిట్లించి అనుమానంగా చూశాడు.
"మా పంతులమ్మీడకి రాదు!" అన్నాడు.
"పోనీ నన్నే అక్కడికి తీసుకెళ్ళు!"
"మీరెవరో సెప్పండి- పంతులమ్మకి సెప్తాను. పంతులమ్మ రమ్మంటే పోదాం!"
"నాపేరు శకుంతలా శర్మ శ్రీధర్ శర్మ కూతుర్ని!"
"కాయితంమీద రాసియ్యండి-అట్టుకెళతాను!
చిన్న కాగితం మీద తనపేరు, తండ్రిపేరు రాసిచ్చింది శకుంతల.
పిల్లలంతా బిలబిల లాడుతూ కేరింతలతో వెళ్ళిపోయారు, అప్పుడు చూసింది శకుంతల రాబర్టుని అతడి నిప్పులు కురుస్తున్నాయి.
21
"ఎక్స్యూజ్ మీ!" జీప్ దగ్గరికి వెళ్ళబోతున్న శకుంతలను సమీపించాడు ఒక యువకుడు. ఆమె ప్రశ్నార్ధకంగా చూసింది.
"నా పేరు దినకర్! మీరు నన్ను మరచిపోయినట్లున్నారు. మనం ఇదివరలో కలుసుకున్నాం!"
శకుంతల మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో అదే ప్రశ్న.
"మీరెవరు?" అన్నది.
"నేను లేబర్ యూనియన్ ఆర్గనైజర్ని. ఇక్కడ ఓ లేబర్ యూనియన్ ఫార్మ్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను. ఈనాడు మీరు నా ప్రయత్నాలన్నీ భగ్నంచేశారు."
"నేనా?"
"అవును. మీరు ఈనాడు మీ డబ్బుతెచ్చి బేటాలియ్యడం దేనికి?"
"అది... అది మంచిపనే కదూ? పాపం బాధపడుతున్న వాళ్ళకి...."
"ఆ మంచి ఎవరికి మంచి? మీకు మంచి మీ యాజమాన్యానికి మంచి. ఇన్నాళ్ళకు వాళ్ళు వాళ్లకు జరుగుతున్న అన్యాయం గుర్తించారు. ఆందోళన కూడా మొదలయింది. యూనియన్ ఏర్పర్చటానికి దీనిని బలపరచటానికి ఇదే సమయమని నేను అనుకుంటున్న సమయంలో రాజకీయ నాయకుల వాగ్దానాల్లాగా ఏదో ఈ సారికి జీతాలిచ్చేసి వాళ్ళ ఉద్రేకంమీద చన్నీళ్ళు చల్లారు."
"రాజకీయ నాయకుల వాగ్దానాల్లాగా!"
"లేకపోతే తన చుట్టూ ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ఏ రాజకీయ నాయకుడూ పట్టించుకోడు కానీ, అల్లరి, ఆందోళన మొదలుకాగానే కళ్ళు తెరుస్తారు. అప్పుడయినా అసలు సమస్యని అర్ధం చేసుకోరు పరిష్కారం ఆలోచించరు. ముందు గబగబా వాగ్దానాల వర్షం కురిపిస్తారు ఆ తరువాత ఏదో కొద్దిగా చేసినట్లు నటిస్తారు. ఈ వెర్రిబాగుల జనం అది నమ్మేసి చల్లబడిపోతారు. మళ్ళీ వాళ్ళల్లో ఉద్రేకంరగలటానికి మరో జన్మ ఎత్తాల్సిందే!"
"నాకు మోసంచేసే ఉద్దేశం లేదు."
"ఉద్దేశం ఏదైనా జరిగింది మాత్రం మోసమే!"
"మీరు ఈ నెల యిచ్చినట్లుగా ప్రతినెలా యివ్వగలరా? అందుకు మీ ఇతర పార్టనర్స్ ఒప్పుకుంటారా? మీరు అసలు ఆ విషయం ఆలోచించారా? వాళ్ళ నలాగే వదిలేస్తే రగిలిన ఈ అశాంతితో పట్టుదలగా తమ హక్కులు పోరాడి సాధించుకుండేవారు. ఎటూ కాని మీదానంతో వాళ్ళ ఉద్రేకాలు చల్లారిపోయాయి. అంతేకాదు, మీ మీది నమ్మకంతో ముందు ముందు యింత తీవ్రంగా పోరాడక పోవచ్చు. ఇక ఎల్లప్పటికీ వాళ్ళ హక్కులు వాళ్ళు పొందలేక పోవచ్చు."
"అలా ఎందుకు జరుగుతుంది? ప్రతినెలా ఇలాగే జీతం అందేలా చూస్తాను."
"వాట్? మీ కసలు అనుభవం లేదనుకుంటాను. అందుకే ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారు."
నవ్వాడు అతను.
అతడి మాటలెంత నిజమో, ఇంటికి చేరేసరికి తెలిసొచ్చింది శకుంతలకి. వరండాలో రాజవల్లితో పటు మణికే లాల్, విమలాదాస్, వెంకట పతీ మొదలైన వాళ్ళందరూ వున్నారు. వెంకటపతి మిగిలిన వాళ్ళనుచూసి, తనను తాను వెంకటపత్య్గానే వ్యవహరించుకొంటాడు వాళ్ళంతా ఏదో తీవ్రంగా చర్చించుకొంటూ శకుంతలను చూడగానే ఆగిపోయారు. రాజవల్లి ముడతలుపడ్డ ముఖంమీద మబ్బులు.
"శకూ! నా దగ్గర తీసుకున్న అయిదువేలూ ఫ్యాక్టరీలో కూలీలకు పంచావా?" నమ్మలేనట్లు అడిగింది.
"అవును."