Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 34

    నిర్ఘాంత పోయింది రాజవల్లి. ఇది ఆవిడ ఊహకందనిది. ముష్టి కూలీలకోసం అయిదువేలు.... ఆవిడికి చాలా కష్టం తోచింది.    
    "నా కెందుకు చెప్పలేదు?"    
    "చెప్పి వుంటే!"    
    "ఇచ్చివుండేదాన్ని కాను!" అనే సమాధానం శకుంతల ముఖం చూసి ఆగిపోయింది. "ఇందులో సాధక బాధకాలు మనం ఆలోచించుకొనే వాళ్ళం!" అంది.    
    "అమ్మమ్మా! నీకు తెలుసా? వాళ్లకు రిజిష్టరులో వున్నా కూలి ఇయ్యకుండా ఇష్టంవచ్చిన కూలి ఇస్తున్నారు."    
    "అంతే కాదు, వాళ్ళలో చాలామంది పేర్లు అసలు రిజిష్టరులో లేవు. వాళ్ళు డిమాండ్ చేసిన కూలి మనం ఇస్తే లాభం మాట దేవుడెరుగు? అసలు ఫ్యాక్టరీ నడవటమే కష్టమవుతుంది!" ఖంగున రోషంగా పలికింది, మణిక్ లాల్ బొంగురు గొంతు.    
    "ఏదో మనం దయతలచి ఉద్యోగా లివ్వబట్టిగాని, లేకపోతే, వెధవలు! నల్లుల్లా మాడేవారు. నీకు తెలుసా? మన ఫ్యాక్టరీలో ఉద్యోగాలు లేకపోతే ఈ కుంకలు ఎండనక, వాననక -కారుల్లో గుట్టల్లో ఈ రాళ్ళు ఆ కర్రలూ ఏరుతూనే వుంటారు. మనం ఇచ్చేదానిలో సగమైనా సంపాదించుకోలేరు. మనదగ్గర చేసే పనికి డబల్ శ్రమ మనం చేస్తున్న అన్యాయమేముందీ?"    
    అందమైన శకుంతలను నొప్పించటం ఇష్టం లేక మెప్పించే ప్రయత్నంలో అన్నాడు వెంకటపతి.    
    ఈ తర్కం శకుంతలకు అర్ధంకాలేదు. వాళ్ళ పరిస్థితి ఏమీ బాగుండలేదు. గనుక వాళ్ళకు సరియైన న్యాయంచేయాలి. న్యాయమా? ఇదేం న్యాయం? సాటివారి పరిస్థితి బాగుండకపోతే అది మెరుగుపరచటానికి ప్రయత్నిస్తారా? లేక ఆ దుస్థితిని స్వార్ధానికి ఉపయోగించుకోవాలని చూస్తారా? ఇదా మానవజాతి?    
    అదే అడిగింది శకుంతల. ఆ ఆలోచనలకు నివ్వెరపోయారు అందరూ తమలో ఒకరి భావనలు ఇలా ఉండే అవకాశం ఉందని కూడా వాళ్ళ మీద లేదు, కూలీలవైపునుంచి ఆందోళననే వాళ్ళు ఎదుర్కొన్నారు! కానీ ఈ రకమైన మానవతా దృక్పధంతో వాళ్ళముందుకు ఎవరూరాలేదు. శకుంతల తన డబ్బు కూలీలకిచ్చిందంటే, ఏదో చిన్నపిల్ల-ఉక్రోషంతో ఇచ్చిందనుకున్నారు కానీ, ఈ ఆలోచనలు వాళ్ళందరినీ చాలా భయపెట్టాయి.    
    "జరిగిందేదో జరిగింది. ఇకముందు మా వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోకండి! ఫ్యాక్టరీ విషయాలు మేము చూసుకుంటాం! మీకేమైనా నష్టంవస్తే అప్పుడడగండి!"    
    "నా కళ్ళముందు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోను?" ఎదురు తిరిగింది శకుంతల.    
    మణిక్ లాల కోపంతో లేచి బొంగురు గొంతుతో గట్టిగా అన్నాడు.    
    "స్టాపిట్! మేం చేస్తున్న అన్యాయం ఏంలేదు మీరు కల్పించుకోవడమే అన్యాయం వాళ్ళకి ఓసారి డబ్బులిస్తే మళ్ళీ అడుగుతారు. వాళ్ళందరికీ అడిగినంతఇస్తే మనం ఫ్యాక్టరీ రన్ చెయ్యలేం సో, స్టాపిట్! రాజవల్లిగారూ! మీ ముఖంచూసి ఇప్పటికిది వహిస్తున్నాం. మళ్ళీ ఇలాటిది జరిగితే, ఇక్కడ మీరో, మేమో ఒకళ్లమే ఉంటాం ఈ రకంగా మేము బిజినెస్ చెయ్యలేం! ఇంత కాలంగా ఒక కుటుంబంలోని వ్యక్తుల్లాగ ఉంటున్నాం-ఆలోచించుకోండి!"    
    ఒకరినొకరు కనుసైగలు చేసుకొని అందరూ వెళ్ళిపోయారు. రాజవల్లి వాళ్ళముందు పెట్టించిన ఫలహారపు పళ్ళేలు ఎవరూ ముట్టుకోలేదు. అది వారి ఆగ్రహానికి గుర్తు. తను వెళ్ళిపోయాక శకుంతలా, రాజవల్లి మిగిలారు! ఇద్దరి మధ్య నిశ్శబ్దం__చివరకు రాజవల్లే మాట్లాడింది.    
    "శకుంతలా! విన్నావుగా! నేను ముసలిదాన్ని నువ్వు పసిపిల్లవి. ఇంతవరకూ మన వ్యవహారాలన్నీ వాళ్ళేచూసి, లాభాలలో మన భాగం మనకిస్తున్నారు. వాళ్ళకు కోపంవస్తే మనం ఏం నిర్వహించుకోగలం?"    
    "లాభాలు, భాగాలు-ఇవితప్ప మరో మాట లేదా అమ్మమ్మా అంది శకుంతల.    
    ఈ మొండితనానికి రాజవల్లికి కోపం వచ్చింది.    
    "లేకేం? ఉన్నాయి. దోపిడీలూ, లూటీలూ, హత్యలూ ఇవికూడా వున్నాయి. నువ్వు ఎవరికయితే మనం అన్యాయం చేశామని బాధపడుతున్నావో, వాళ్ళు గుంపులుగా ఇళ్ళమీద పడి దోచుకు పోవడానికి ఏమీ వెనుకాడరు. అలా అదివరలో జరిగింది. ఇప్పుడు మనం తగిన బందోబస్తులో ఉన్నాం కనుక మన జోలికి రావడంలేదు"    
    శకుంతలకు ఆ సంగతి తెలుసు పాత సంగతులన్నీ వింది. 'ఆది శేషయ్య విగ్రహం గురించీ ముఠా దాడుల గురించీ, తమ ఇంట్లోవున్నా అగాధకూపం గురించీ....అన్నీ తెలుసు.' అనాలనుకొంది.    
    'వాళ్ళు ఎప్పుడూ దోపిడీలకు, అన్యాయాలకు గురి అవుతూనే ఉన్నారు. అంచేత వాళ్ళకు తోటి మానవులలోనే నమ్మకం నశించిపోయింది. మనను చూడగానే వాళ్ళకు వాళ్ళను పీల్చి పిప్పిచేసే రాక్షసులు గుర్తుకొస్తున్నారు తప్ప మనుష్యులు గుర్తురావటం లేదు. రాక్షస బలప్రయోగంతో అవతరించబడ్డ ఆ జాతి అవకాశంరాగానే అమానుషంగా తిరగబడటంలో ఆశ్చర్యం లేదు. వాళ్ళను మనం స్నేహితుల్లాగా చూస్తే వాళ్ళ సుఖజీవనానికి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు మనలో చాలమంది కంటే మంచివాళ్ళు!'    
    కానీ. ఆ మాటలేవీ అనలేక పోయింది. 'రాజవల్లి ఆరోగ్యం ఇప్పుడు నానాటికీ క్షీణిస్తోంది. తన మాటలవల్ల ఆ వృద్దురాలు మానసిక వ్యధకు లోనై మరణిస్తే అది తనకు చాలా పెద్దశిక్ష అవుతుంది. తను చెయ్యగలిగిందేదో చెయ్యాలి. అతికొద్ది రోజుల్లో రాలిపోవడానికి సిద్దంగా ఉన్న ఈ దీనురాలిని దుఃఖపెట్టకూడదు.'    
    "ఆల్ రైట్. అమ్మమ్మా! ఫ్యాక్టరీ విషయాలు నేను కల్పించుకోను-లే!" అని వికసించిన ఆవిడ ముఖంచూసి నిట్టూర్చుకుని తన గదికి వచ్చేసింది!    
    ఒంటరితనం కారణంగా శామి శకుంతలకు చాలా ఆత్మీయురాలై పోయింది. మరెవ్వరికీ చెప్పుకోలేని తన సంగతులనేకం శామి శకుంతలకు చెప్పుకొనేది. వాటిలో అధికభాగం తన రెండోపెళ్ళి గురించిన సంగతులే! ఆశలూ, భయాలూ, బాధలూ, వగైరా-శామిద్వారా వారి జీవిత విధానం లోని విశేషాలు తెలుసుకుంటూండేది శకుంతల.    
    ఆ రకంగా శామికి ఆమె దగ్గర కొద్దిగా చనువు ఏర్పడింది.    
    "అట్లా ఉన్నారేం శకుంతలా?" అని అడిగింది శామీ.    
    "దొరసానీ!" అని పిలవటం మానేసి చాలా రోజులయింది.    
    "నీకు దినకర్ తెలుసా? యూనియన్ ఆర్గనైజర్!"    
    "ఏంటీ, ఆ గెడ్డపాయన! అందర్నీ పోగేసి లెక్చరర్లు కొడతా ఉంటాడూ, ఆయన.... .... ...."    
    శామి మాట్లాడే తీరుకు నవ్వుకొని, "ఆ! ఆయనే!"    
    అతడెక్కడ ఉంటాడో తెలుసా నీకు?" అంది.    
    "తెలుసు! రమేష్ బాబుగారింటిలో ఉంటారు."    
    తన చెవులు తను నమ్మలేకపోయింది శకుంతల.

 Previous Page Next Page