Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 32

     'తాను అడ్డుపడి కమీషన్ ఇయ్యకుండా ఆపగలదు కానీ, మరునాటికి ఏదో వంకతో ఆ పసివాడి కూలిపని పోతుంది. తమ పిల్లలను కూలికి పంపకుండా చదివించ వచ్చుననే ఆలోచన ఆ తల్లి, దండ్రులకు రానే రాదు. ఆ బ్రతుకు లలాంటివి. దిన దిన గండం  నూరేళ్ళాయుస్సు. ఏ రోజుకు తిండి వుంటుందో ఏ రోజు వుండదో ఎవరూ చెప్పలేరు.'    
    'ఒకవేళ ఏనాడయినా కాస్త సంపాయించుకున్నా దాచుకోవాలనే జ్ఞానం వాళ్లకు అసలులేదు. దాచుకోవటం ఎలాగో కూడా తెలీదు. చేతిలో డబ్బులు పడిన రోజున కల్లు దుకాణాల వద్ద పండుగ. లేనిరోజున పస్తులు అందరిలా తామూ బ్రతకవచ్చుననే ఆలోచనకూడా రాదు. చదువు పేరు చెబితే అదేదో మహాద్భుతంగా విడ్డూరంగా చూస్తారు. పిల్లలను కూలీకి పంపకుండా చదివించమంటే పిల్లలూ, పెద్దలు కూడా ఎదురు తిరుగుతారు.'    
    'ఏం చెయ్యాలి? ఏం చెయ్యగలదు?'    
    క్లర్క్ రిజిస్టర్ లోకి కళ్ళద్దాల్లోంచి చూసి జీతాలు లెక్కపెట్టి ఇస్తున్నాడు. వేలిముద్రలు వేయించుకుంటున్నాడు.    
    క్యూ క్రమంగా తరుగుతుంది. ఉన్నట్లుండి -౦ "ఆగండి!" అనే గర్జన వినిపించింది. అందరూ నివ్వెరపోయారు. ఆ నివ్వెరపాటులో ఒక్కముహూర్తకాలం నిశ్శబ్దం ఆవరించింది_ఆ పరిసరాలలో ఆ గర్జించిన వాడు పద్నాలుగేళ్ళ పసివాడు_ ముతక కాకీ లాగూలో సింగ కిశోరంలా వున్నాడు.    
    "ఎవడురా నువ్వు?" అని వెనుక నుంచి చెయ్యెతాడు మరొకడు ఫ్యాక్టరీ పోషిస్తున్న గూండాసైన్యంలో ఒకడు కావచ్చు.    
    "హుఁ!" అని విదిలించాడు ఆ పసివాడు ఆ విదిలింపుకే ఎత్తిన చెయ్యి కిందకు వాలింది.    
    "రిజిస్టర్ లో రోజు కెనిమిద్రూపాల్సొప్పున ఇస్తన్నారా? అన్నేయం!"    
    మరొకసారి నివ్వెరపాటు - నిశ్శబ్దం అనేకమంది చిన్నపిలల్లు బిగుసుకున్న పిడికిళ్ళతో బిక్కు బిక్కుమంటూ చూస్తున్నారు అతడి కేసి.    
    "యాంట్రా? యెవడు సెప్పేడ్రా?" వాళ్ళ ఏసని అనుకరిస్తూ అన్నాడు క్లర్క్.
    "ఈ కాయితాలు సెప్తున్నాయ్! వోరంరోజులు కూలి ఇరవయొక్క రూపాయి. అంటే ఇరవయ్యొకటిని మూడెట్టి బాగారిత్తే రోజుకు మూడు. ఇందులో ఉన్నది యాబయ్యారు. అంటే రోజుకెన్మిది!"    
    క్లర్క్ కోపంగా లేచాడు.    
    "ఈ లెక్కలన్నీ నీకెందుకురా గాడ్ది కొడకా? ఇచ్చినదేదో పట్టుకు బయటకు నడు. ఇష్టమయితే చెయ్యి - లేకపోతే ఫో!"    
    ఆ పసివాడు ఈ అరుపులను లెక్కచేయలేదు. తన చేతిలో డబ్బు బల్లమీద పెట్టేశాడు "కామ్రేడ్స్" అన్నాడు గట్టిగా.    
    ఆ సంబోధనకు అక్కడున్న మిగిలిన వారితోపాటు శకుంతల కూడా ఉలిక్కిపడింది. అప్పటివరకూ డబ్బు తీసుకున్న చిట్టి పొట్టి బాల లంతా తమ గుప్పెళ్ళు విప్పి ప్రాణపదంగా దాచుకొన్న డబ్బు బల్లమీద పెట్టేసారు. అప్పటి వరకూ తీసుకోనివారు ఆజ్ఞకోసం చూస్తున్నట్లు సింహకిశోరం వంక చూస్తున్నారు.
    "లెక్క ప్రకారం మాకు నేయంగా రావల్సిందియ్యండి! లేకపోతే పని సెయ్యం - ఈడ్నుంచి కదలం!"    
    ఫ్యాక్టరీ గేటుముందు కూచున్నాడు బాల సింహం. చిన్నపిల్లలంతా గుసగుసలాడుతూ అతడి కిటుపక్కా, అటుపక్కా వరస తీర్చారు.    
    చెయ్యి ఎత్తబోయిన గూండాని కనుసైగతో ఆపుచేశాడు క్లర్క్. హడావుడిగా లోపలికెళ్ళాడు. రాబర్ట్ తో తిరిగి వచ్చాడు. విసురుగా వచ్చిన రాబర్ట్, అక్కడే నిలబడి బారులు తీర్చిన బాల కూలీలను ఆనందంతో గమనిస్తోన్న శకుంతలను చూసి ఆగిపోయాడు. శకుంతల ధోరణి అప్పటికే అతనికి అర్ధమయింది. ఈ అందమయిన అమ్మాయి ముందు సంకుచిత హృదయుడుగా బయటపడటం అతనికిష్టంలేదు.    
    కనుబొమలు చిట్లించి, "చూశారా, ఈ న్యూసెన్స్! మనం వీళ్ళ కోసం ఎంత పాటుబడ్డా వీళ్ళిలా అల్లరి చెయ్యక మానరు. వీళ్ళవెనుక సంఘ విద్రోహక శక్తులున్నాయని ఇప్పుడే విన్నాను."    
    "సంఘ విద్రోహక శక్తులా -అవి అల్లరెందుకు చేస్తాయి! రాజ్యాలు పాలిస్తాయి" అదొకరకంగా నవ్వుతూ అంది శకుంతల.
    ఈడ్చి కొట్టినట్లయింది అతనికి. గుటకమింగి ఒకసారి టై సర్దుకొని "ఇలా అల్లరి చెయ్యాలని వీళ్ళంతట వీళ్ళకు తోచదు. ఎవరో చెప్పిపెట్టే వుంటారు" అన్నాడు.
    "జరిగిన అన్యాయాలు తెలిసాక ఆగకుండా ఎవరుండగలరు? అయినా రిజిష్టర్ లో ఒకటి వ్రాసి వీళ్ళకు మరొక రకంగా ఇస్తున్నారా?"    
    ఈ మాటలు విన్న బాలసింహం ముఖం వెలిగింది.    
    "ఒకసారి రిజిస్టర్ సూడండమ్మగారు! మీకే తెలుస్తాది చూడండి!" శకుంతల దగ్గరకు వచ్చి నమస్కారంచేసి అన్నాడు.    
    "క్లర్క్ ని రమ్మనండి! - వీళ్ళందరికి రాసివున్న ప్రకారం జీతాలిద్దాం__ఈ గొడవదేనికి?"    
    రాబర్ట్ ముఖం కఠినమయింది కంఠమూ కటువుగానే పలికింది.    
    "మేడమ్! ఈ ఫ్యాక్టరీ మీ ఒక్కరిదే కాదు ఇంకా ఇద్దరు యజమానులున్నారు. ఏం చేసినా ముగ్గురి అంగీకారంతోనూ చెయ్యాలి!"    
    "ఆల్ రైట్!" వెంటనే అక్కడినుంచి వెళ్ళిందిశకుంతల ఆమెకోసం జీప్ ఎప్పుడూ రెడీగానే వుంటుంది.    
    "అమ్మమ్మా! నాకొక అయిదువేల రూపాయలు కావాలి. ఇవ్వవా?" గారాలుపోతూ అడిగింది.    
    రాజవల్లి తెల్లబోయింది. శకుంతల కేదైనా ఇవ్వటం రాజవల్లి కెంతో ఇష్టం. కానీ శకుంతల ఏనాడు నాకీ చీర కావాలనికానీ అడగలేదు. రాజవల్లి తానే తెప్పించి ఇస్తే - 'రాజవల్లికోసం' అన్నట్లు తీసుకొనేది. అలాంటిది ఈనాడు ఒక్కసారిగా అయిదువేలు అడిగింది.    
    శకుంతల అంటే రాజవల్లికి ఎంత ప్రేమవున్నా, ఆమెకు సహజమైన పీనాసి గుణం రక్తంలో అణువణువునా ప్రవహిస్తుంది.    
    "అంత డబ్బు ఎందుకమ్మా?"    
    "పో అమ్మమ్మా! 'ఎందుకూ, ఏమిటీ' అని అడక్కుండా ఇయ్యాలి. ఇయ్యకపోతే నేనే సంపాదించుకుంటాను."

 Previous Page Next Page