"అవును"
"ఎక్కడుంది తను!"
"చార్మినార్ దగ్గర్లో ఓ రహస్య ప్రదేశంలో , మీరు తలుపు తెరిస్తే ........" ఆమె ఇంక ఆలస్యం చేయలేదు. కొంచెం తలుపు తెరిచి మాట్లాడబోయింది. పక్కనే ఉన్న భవానీశంకరు మెరుపు వేగంతో తలుపు సందులోకి జొరబడి బలవంతంగా తలుపులు తెరిచేశాడు. ఆమె ఆ వేగానికి వెనకకు జరిగి బాలెన్స్ తప్పి కింద పడిపోయింది.
"సారీ కామ్రేడ్ - మళ్ళీ బలప్రదర్శన ద్వారానే కలుసుకోవాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాను - " అన్నాడతను నవ్వుతూ.
అతనిని చూస్తూనే సునంద ముఖంలోకి కోపం, ఆశ్చర్యం రెండు వచ్చినాయ్.
"బ్లడీ బాస్టర్డ్" అంది కోపంగా.
భవానీ శంకర్, శ్యామ్ ని కూడా లోపలకు రానిచ్చి తలుపులు మూసి వేశాడు.
మర్యాదగా ఇక్కడి నుంచి పోతారా లేదా?" గట్టిగా అరిచిందామె..
"నువ్వెంత అరచినా లాభం లేదు కామ్రేడ్! బయట వందమంది మా తాలూకు మనుషులు కత్తులతోనూ , కర్రలతోనూ కసరత్తు చేస్తున్నారు. మర్యాదగా మేమడిగిన విషయాలు చెప్పావంటే నీకే హనీ కలగదని హామీ ఇస్తున్నాము - వాడ్డూ యూ సే మిస్టర్ ఆర్.కె శ్యామ్."
"సెంట్ పర్సెంట్ కరెక్టు! ఎవరికీ హాని చేయకూడదనేదే మా పాలసీ!"
"అయితే ఆ పాలసీ అవతలి వాళ్ళు మన సహనాన్ని పరిక్షించనంతవరకే కదూ - మిస్టర్ ఆర్. కె. శ్యామ్?"
"హండ్రెడం డ్ వన్ పర్సెంట్ కరెక్ట్! మనకు సహనం కూడా మిగతా ఆరోగ్యవంతులయిన వారి సహనంతో పోలిస్తే చాలా తక్కువ."
భవానీ శంకర్ చటుక్కున ఆమె చేయి పట్టుకున్నాడు.
"కమాన్ కామ్రేడ్ - త్వరగా చెప్పు - ఆ పుస్తకంలో అడ్రస్ లు ఎవరివి? వాటి కోసం కార్ల చేజింగ్స్, కెమెరా కిల్లింగ్సు, కప్ బోర్డ్ శవాలు, అందాలభామల నాజుకూ దొంగతనాలు - క్యాబరే ఆర్టిస్టుల రహస్య విన్యాసాలు, ఫెల్టు హాట్ విలనీ పిస్టల్ పోటీలూ - ఈ హడావుడి అంతా ఎందుకు? వాటి తాలుకూ ఫ్లాష్ బాక్ కదేమిటి? ఈ కధలో నీ పాత్ర ఏమిటి? రెండు నిమిషాల్లో ఈ వివరాలు చెప్పకపోతే నిర్ధాక్షిణ్యంగా నిన్ను కిడ్నాప్ చేయవలసి వస్తుంది.."
ఆమె విసురుగా చేయి వదిలించుకోటానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాక ఊరుకుండిపోయింది. ఓ నిమిషం మౌనంగా గడిచిపోయింది.
"కమాన్ కామ్రేడ్ ఆర్ - కె- శ్యాం! ఈ చిన్నారికి కిడ్నాప్ సీనులు చాలా ఇష్టమని అర్ధమయిపోయింది - కనుక తీసుకెళ్ళి మన అండర్ గ్రౌండ్ డెన్ లో పడేయటం మంచిది."
ఆర్.కె. శ్యామ్ ఆమె వేపు ఓ అడుగు వేసి ఆగిపోయాడు.
"కానీ అక్కడ ఇప్పటికే అరుశవాలు ఉన్నాయ్ కదా - పాపం ఈ బాల ఆ శవాల మధ్య ఎలా ఉంటుంది?" అడిగాడతను అనుమానంగా.
"తప్పదు కామ్రేడ్! ఒక్కొక్కరికీ ఒక్కొక్క హాబీ! ఈ బాలకు శవాల మధ్య కూర్చుని సీరియల్స్ రాయడం ఎంతో సరదా-"
శ్యాం ఆమె రెండో చేయి పట్టుకోబోయాడు. ఆమె కళ్ళల్లో భయం కన్పించింది.
"వదలండి - చెప్తాను - " అంది కలవరపాటుతో .
భవానీ శంకర్ చిరునవ్వు నవ్వాడు.
"స్పోర్ట్స్ మన్ స్పిరిటు అంటే అదే కామ్రేడ్ - కమాన్ - అంతా చెప్పెసేయండి -- ఆ అడ్రస్ బుక్ కధేమిటో ముందు చెప్పండి" అంటూ ఆమె చేతిని వదిలేశాడు.
ఆమె చెప్పటం ప్రారంభించింది.
"ఆ అడ్రస్ పుస్తకం - "అంటుండగానే తలుపు ధభేలుమని మూసుకున్న చప్పుడయింది. భవానీ శంకరు శ్యాం మెరుపులా వెనుకకు తిరిగారు - లావుపాటి వ్యక్తీ, సన్నపాటి వ్యక్తీ చేతుల్లో పిస్టల్స్ తో నిలబడి వున్నారు.
"నేను చెప్పలేదూ! మళ్ళీ వీడే వచ్చాడు" అన్నాడు లావుపాటివాడు సన్న వ్యక్తితో.
"కిందటి సారి మనం ఇచ్చిన షాక్ ట్రీట్ మెంటు అప్పుడే మరిచిపోయినట్లున్నాడు" అన్నాడు సన్నటి వ్యక్తీ.
"ఈసారి ఇంకోడిని కూడా తీసుకొచ్చినట్లున్నాడు -"
"వీడొక తీన్ మారు ఖాన్ కాబోలు - " శ్యాం వంక వెటకారంగా చూస్తూ అన్నాడు. భవానీ శంకర్ గుండె మీదకు పిస్టల్ నొక్కి పెట్టాడు లావుపాటి వ్యక్తీ.
"వీడేనా అడ్రస్ బుక్ పట్టుకెళ్ళింది?" అడిగాడు సునందను.
"అవును-' అందామె.
"ఎక్కడ పెట్టావ్ రా అది?" అడిగాడతను.
"చాలా సిల్లీ ప్రశ్న కామ్రేడ్! అలా హోటల్ పక్కన అజయ్ భాయ్ బుక్ షాపులో మోడల్ క్వొశ్చన్స్ దొరుకుతాయ్. వాటిని ప్రాక్టీస్ చేస్తే ప్రశ్నలు ఇంప్రూవ్ చేసుకోవచ్చు-"
"చూశావా బాస్ - మళ్ళీ అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు."
"అవును మరి పాఠం చెప్పేద్దామా?"
లావుపాటి వ్యక్తీ పిస్టల్ ట్రిగ్గర్ నిక్కబోతున్నట్లు వెళ్ళు కదిపాడు.
"అడ్రస్ బుక్ సంగతి చెప్తావా లేదా?"
"నటనలు వద్దు కామ్ర్రేడ్? చీఫ్ మినిస్టరు దగ్గర్నుంచి [ప్రధానమంత్రి వరకూ వీర నటన ప్రదర్శిస్తోంటే ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. అడ్రస్ బుక్ దొరికే వరకూ మీరు నన్నేమీ చేయలేరని నాకు తెలుసు. అంచేత బెదిరింపులు మానేస్తే బిజినెస్ మాట్లాడుకుందాం."