Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 32


    ఆమె ప్రవర్తనలో కొంత మార్పు వచ్చింది . కొంచెం సౌమ్యంగా మారింది ముఖం.
    "సునందా!" ఆశ్చర్యంగా అడిగిందామె . "ఇంతకు ముందు మీరిద్దరూ కలుసుకున్నారా?"
    "అవును-"
    "దానికి వంట్లో బావుండలేదుట ఇంట్లోనే వుంది."
    "ఆ అమ్మాయికి సంధ్యారాణికి చాలా స్నేహం ఉన్నట్లుంది కదూ?"
    "ఆ ప్రశ్నతో త్రుళ్ళిపడిందామె.
    "ఆ - అహ - అవును - మీకెలా తెలుసా విషయం?
    "తనే చెప్పింది చాలా సార్లు."
    ఆమె అనుమానంగా చూసిందతని వేపు.
    "ఇప్పుడు వాళ్ళగురించి ఎందుకులెండి - ఇంక నేను వెళ్ళవచ్చా?" లేచి నిలబడిందామె.
    "నాకు సునంద ఇల్లు ఎక్కడుందో చెప్పగలవా?"
    కొద్ది క్షణాలు అలోచించి జవాబు చెప్పిందామె.
    "మారేడుపల్లిలో దీప్తి నర్సింగ్ హోమ్ పక్కన రెండో ఇల్లు -"
    "థాంక్యూ - ఇదిగో నీ వంద రూపాయలు."
    ఆమె నోటు తీసుకుని , "ఊరికే డబ్బు తీసుకోవటం అలవాటు లేదు." అనేసి అతని పెదవుల మీద గట్టిగా ఓ ముద్దు పెట్టి వెళ్ళిపోయింది.
    భవానీశంకర్ బార్ లో కొచ్చాడు. బేరరు అతని కోసమే ఎదురు చూస్తున్నాడు.
    "నమస్కారం సార్- అల్ ఓకేనా సార్?" అన్నాడు ఆనందంగా నవ్వుతూ.
    "అల్ ఒకే బ్రదర్! ఈ ప్రేమికులకు నువ్వు బృహత్తర సేవ చేస్తున్నావు! త్వరలో నీకు సీవా విభూషణ్ బిరుదు తప్పదు" అంటూ వందనోటు తీసి అతనికిచ్చాడు.
    వాడి ముఖంలో అనందం మరింత వెలిగిపోయింది.
    "థాంక్యూ సార్ ! మీరెప్పుడూ కావాలంటే అప్పుడు తిన్నగా నా దగ్గరకొచ్చేయండి సార్! ఏ డాన్సర్ కావాలన్నా నో ప్రాబ్లమ్ సార్."
    భవానీ శంకర్ శ్యామ్ కోసం బార్ లో వెతుకుతుండగా అతని పక్కకు వచ్చి నిలబడ్డాడో వ్యక్తీ.
    "లైటర్ ఉందా మిస్టర్?"
    "స్మోకింగ్ ఈజ్ ఇన్ జురియస్ టు హెల్త్ కామ్రేడ్! అందుకని నా దగ్గర ఆ సరుకులుండవు" అంటూ కదల బోయాడు గానీ ఆ వ్యక్తీ చేయి భవానీ శంకర్ భుజం మీద పడింది.
    మరో చేతిలోని ఫిస్టల్ బారెల్ తన గుండెల్ని తాకుతుంది.
    ఎప్పుడు అతని చేతిలోకి పిస్టల్ వచ్చిందో భవానీశంకర్ కే అర్ధం కాలేదు.
    "చాలా అద్భుతమయిన వేగం కామ్రేడ్! అంత వేగంగా వస్తువులు సృష్టించటం , మాయం చేయటం , మేజిషియన్స్ కే సాధ్యమవుతుందని నా అనుమానం - బైదిబై నువు మెజీషియన్ "షాడో" ట్రూప్ లో మెంబర్ వా కామ్రేడ్?"
    "ఆ పుస్తకం ఎక్కడుంది?"
    భవానీ శంకర్ ఆశ్చర్యం నటించాడు.
    "ఏ పుస్తకం  కామ్రేడ్? షాడో రాసిన "మాజిక్" పుస్తకమా" మన ఫ్రెండ్ ఆర్. కె శ్యామ్ దగ్గరుంది. వెంటనే మనం ఇంటికెళితే అరువిస్తాడు."
    "అతి తెలివి ప్రదర్శించకు - అడ్రస్ బుక్ మర్యాదగా ఇచ్చేయ్"
    "ఓ - అడ్రస్ బుక్ కావాలా? అది ఏ స్టేషనరీ షాప్ లో అడిగినా దొరుకుతుంది కామ్రేడ్ - మంచి మోడల్ పధ్నాలుగు రూపాయలు ఉంటుంది."
    "నువు చావుకి అతి సమీపంగా ఉన్నావన్న విషయం మర్చిపోకు నిన్ను కాల్చేసినా పట్టించుకునే వారెవరూ లేరిక్కడ.
    సరిగ్గా శ్యామ్ వచ్చి భవానీశంకర్ వెనుక నిలబడ్డాడు.
    "ఎవరూ పట్టించుకోరనటం ఓవర్ స్టేట్ మెంట్ బ్రదర్ - మేమిద్దరం ఎలిమెంటరీ స్కూల్లో చదివే రోజుల్లోనే కలసి ఆ ఆపోజిట్ గాంగ్ తో బాక్సింగ్ చేసేవాళ్ళం" చిరునవ్వు తో అన్నాడు శ్యాం.
    పిస్టల్ వ్యక్తీ కలవ్రపదిపోయాడు.
    శ్యాం పిస్టల్ ఉన్న అతని చేతిని నెమ్మదిగా కిందకు దింపేశాడు.
    "పుస్తకాలూ, కాలాలు. చాక్ పీస్ లూ కావాలంటే ఏదయినా షాప్ కెళ్ళి కొనుక్కోవాలి కామ్రేడ్ - ఇలా బారుల్లోనూ, రోడ్లమీదా పిస్టల్ చూపించి అడక్కూడదు" అన్నాడు భవానీ శంకర్.
    ఆ వ్యక్తిని పక్కకు తోసి ఇద్దరూ బారు బయటకు నడిచారు.
    "నెక్ట్స్ ప్రోగ్రాం ఏమిటి?" అడిగాడు శ్యాం.
    "సునంద ఇంటికి వెళ్ళాలి కామ్రేడ్! అక్కడ గానీ అసలు కధంతా బయటకురాదు"
    "అల్ రైట్ - పద"
    మళ్ళీ సైకిల్ మారేడు పల్లి వేపు బయల్దేరింది. గంటసేపు పట్టింది సునంద ఇల్లు పట్టుకోవడానికి.
    డోర్ బెల్ నొక్కగానే కిటికీలోనుంచి బయటకు చూస్తూ "ఎవరు!" అందామె.
    భవానీ శంకర్ చీకట్లో నక్కి శ్యాంని ముందుకి తోశాడు.
    "నా పేరు శ్యాం! మీతో అర్జెంటుగా మాట్లాడాలి. " అన్నాడు శ్యాం.
    "ఏమి మాట్లాడాలి?"
    "ఇలా రోడ్డుమీద నుంచోబెట్టి అడిగితే ఏమని చెప్పనండి ? మీ మేలు కోరే వచ్చాను."
    "ఎవరు పంపించారు మిమ్మల్ని?"
    "సంధ్యారాణి -"
    ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపించింది.
    "సంధ్యారాణా" నమ్మలేనట్లు అడిగింది.

 Previous Page Next Page