Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 34


    అతను మాట్లాడుతుండగానే శ్యాం ఒక్కసారిగా ఆర్తనాదం చేసి నేలకొరిగిపోయాడు. అతనికి పిస్టల్ గురిపెట్టి నిలబడ్డ సన్నని వ్యక్తీ అదిరిపోయి వెనక్కు గెంతాడు. లావుపాటి వ్యక్తీ కంగారుగా పక్కకు చూశాడు.
    అంతే!
    ఆ సమయం కోసమే వేచియున్న భవానీశంకరు గాలిలోకి అమాంతం ఎగిరి చేతిలోని పిస్టల్ ని బలంగా తన్నాడు. అదే సమయంలో నేల మీద పడ్డ శ్యాం రెండు చేతులతో సన్నని వ్యక్తీ కాళ్ళు పట్టుకుని అతి వేగంగా తన్నాడు.
    మరుక్షణం పరిస్థితులు తరుమరాయి పోయినాయ్. పిస్టల్స్ రెండూ భవానీ శంకర్, శ్యాం చేతిలోకి వచ్చేసినాయ్.
    అంతవరకూ ఆనందంగా చూస్తోన్న సునంద ముఖం మాడిపోయింది.
    "ఇప్పుడు చెప్పండి కామ్రేడ్ - అడ్రస్ - బుక్ తాలూకు రహస్యం ఏమిటి? ఎందుకు దానికోసం మీరు వీరవిహారం చేస్తున్నారు? మూడు అనే లోపల చెప్పకపోతే నిష్కారణంగా మీ ఆత్మ శాంతి కోసం నేనూ. కామ్రేడ్ ఆర్.కె. శ్యామ్ , కామ్రేడ్ సునంద ప్రార్ధనలు చేయాల్సివస్తుంది."
    భవానీశంకరు మాట్లాడుతుంటే సునంద ఒక్కొక్క అడుగే వెనక్కు వేస్తూ గోడ దగ్గరకు చేరుకుంది. మరుక్షణం ఆమె చేయి లైట్ స్విచ్ మీద పడింది. క్షణంలో అంధకారం నిండి పోయింది గదంతా. శ్యాం అతి వేగంతో సునందను వెనకకు తోసి లైటు స్విచ్ వేసేసరికి ఆ ఇద్దరు వ్యక్తులూ మాయమయిపోయారు.
    సునంద చెంప మీద చెళ్ళుమనిపించాడు భవానీశంకరు. ఆ దెబ్బకు ఆమె కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినాయ్.
    "నువ్వు చేసిన దారుణానికి ఇది చాలా చిన్న శిక్ష కామ్రేడ్! యింక టైము వేస్టు చేయకుండా త్వరగా నీ అత్మకదా- ఆ అడ్రస్ ల పుస్తకం తాలూకు జరిగిన కధా చెప్పేయ్" అన్నాడు పిస్టల్ ఆమెకు గురి పెడుతూ.
    ఆమె కళ్ళల్లో భయం కనిపించింది.
    "అడ్రస్ బుక్ మా వ్యాపారానికి సంబంధించినది."
    "మా" అంటే ఎవరు?"
    "మాధవరావు, సిద్ధార్ధరావు - మా బాస్ లు! మేమంతా వాళ్ళ దగ్గర వర్కు చేస్తున్నాం-"
    "మీ వ్యాపారం ఏమిటి?"
    ఆమె జవాబు చెప్పడానికి నోరు తెరిచింది.
    అంతే! నోట్లో దిగింది కత్తి! చివ్వున చిమ్మిన రక్తం. మరుక్షణం అక్కడే కుప్పగా కూలిపోయిందామె.
    పరుగుతో గది బయటకొచ్చారు భవానీశంకరు.
    అప్పుడే నల్లని కారు ఒకటి శరవేగంతో స్టార్టు అయి అతివేగంగా చీకట్లోకి దూసుకుపోయింది.


                                                            10

    కొద్ది క్షణాలు గిలగిల కొట్టుకుని నిశ్చలంగా పడిపోయిందామే. చటుక్కున వంగి కూర్చుని ఆమె చేతిని పట్టుకుని ఫల్స్ చూశాడు శ్యామ్.
    "షి ఈజ్ డెడ్" అన్నాడతను ఆందోళనగా. "బహుశా ఈ కత్తి పాయిజనస్ అయుంటుంది" భవానీశంకర్ మనసంతా ఆమె మీద జాలితో నిండిపోయింది.
    "కరెంటు పోగానే అ రాస్కేల్స్ పారిపోయి ఉంటారని భ్రమ పడ్డాము కామ్రేడ్. మనం ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే పాపం సునంద ప్రాణాలు పోయేవికావు" ఆమె ఆత్మశాంతికి భగవంతుని ప్రార్ధించటం కోసం మనం అర్జెంటుగా ఈ ప్రదేశం వదిలేయాలి శ్యాం! ఆలస్యమయితే పోలీసులతో గొడవ" అన్నాడతను.
    ఇద్దరూ బయటకు పరుగెత్తారు.
    ఆ అమ్మాయిని ఎవరు చంపి ఉంటారు?" దారిలో అడిగాడు శ్యామ్.
    "నేనుహిస్తోంది కరెక్టు అయితే మాధవరావ్, సిద్దార్ధరావ్ గ్రూప్ వాళ్ళు చంపి వుండాలి."
    "ఈ మాధవారావ్, సిద్దార్ధరావ్ లు ఎవరసలు?"
    "ఇంకెవరు? మాధవరావ్ మన పార్లమెంట్ మెంబర్ కామ్రేడ్! మన సిటిలోని కల్లు కాంపౌండ్ బార్ లు సినిమాహల్సూ ప్రారంభోత్సవం చేస్తుంటాడు కదా ఎప్పుడూ! ఇక సిద్దార్ధరావు సంగతి నీకూ తెలిసే ఉంటుంది. నోటోరియస్ గుండా లీడర్. మాధవరావు పొలిటికల్ సపోర్టుతో సిద్దార్ధరావ్ ఎన్నో రకాల క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకున్నాడు. అలాగే తన రాజకీయాలకూ, ఎలక్షన్స్ కీ సిద్దార్ధరావ్ ని ఉపయోగించుకుంటున్నాడు మాధవరావ్ - ఈ విషయాలన్నీ మన జర్నలిస్టు ఫ్రెండ్స్ చెపుతుండేవారు."
    శ్యాం కొద్ది క్షణాలు మాట్లాడలేదు.
    "పాపం? నాకింకా ఆ అమ్మాయి ముఖమే కళ్ళముందు కనబడుతుంది" అన్నాడు జాలిగా.
    "వాళ్ళ రహస్యం బయట పడకుండా - ఆమెను అంత దారుణంగా చంపారంటే వాళ్ళేదో చాలా పెద్ద నేరమే చేస్తుండి ఉండాలి?"
    "అందులో అనుమానం లేదు కామ్రేడ్! అందుకే ఇన్ని హత్యలు ఇంత గందరగోళం జరుగుతోంది. ఇప్పుడు ఆ పుస్తకం మనకు దొరికిందన్న విషయం వాళ్ళకు తెలిసిపోయింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి."
    శ్యాం సైకిల్ స్లో చేశాడు. రియల్ మిర్రర్ లో కనబడుతోన్న దృశ్యం అతనికి కలవరం కలిగిస్తోంది. ఎర్ర రంగు మారుతీ కారు తమ సైకిల్ వెనుకే వస్తోంది.
    "అంటే మన ఇంటిమీద కూడా వాళ్ళు ఎటాక్ చేసే అవకాశం ఉందంటావా!" అద్దంలో జాగ్రత్తగా చూస్తూ అడిగాడతను.

 Previous Page Next Page