"అదెట్లా? నాకు చాతగాదే పోనీ మనిద్దరం లేచిపోదామా ఏం?"
అతను నవ్వి 'పద నాకు యిష్టమే' అన్నాడు.
"అమ్మో! ఎంత గడుసుతనమో" అంది గాని ఆమె ముఖం త్వరత్వరగా నల్లబడింది. 'నాకో మంచి మొగుడ్ని చూసిపెడుదూ'అంది కొంచెం ఆగి.
ఓ క్షణమాగి శివనాథరావు భుజాలెగురేశాడు. 'భలే! ఆ పనికోసమే ఈ ఊరొచ్చాను. కానీ అంతా తారుమారయింది.'
విశదీకరించండి.
అప్పుడతను మోహన్ పెళ్ళిచూపుల వృత్తాంతం చెప్పి 'ఆ పెళ్ళికూతురు నువ్వేననుకున్నాను మొదట'అన్నాడు.
"అంత పెద్ద త్యాగమే! బాబో!" అన్నాది సరోజిని మళ్ళీ వెంటనే 'పెళ్ళికూతురి పేరు?' అనడిగింది.
"విమల కాబోలు"
"నా స్నేహితురాలే చాలా మంచిది, కానీ గడుసుదని ఇప్పుడే తెలిసింది. తనని చూడడానికి వస్తున్నారని నాకు చెప్పలేదు చూశావా?"
తర్వాత యిద్దరూ ఏం మాట్లాడాలో తోచలేదు. కాసేపటికి శివనాథరావే సిగ్గుపడుతూ 'ఆరోజు మా యింట్లో నీకు బాగా అవమానం జరిగివుంటుంది. ఏం' అన్నాడు.
సరోజిని తల ఆడించింది 'అవును. నేను పుట్టాక అంత అవమానం ఎప్పుడూ జరగలేదు. కానీ నాకు దాని కారణం తెలుసు - వద్దులే అది నీకు చెప్పను. ఛీ ఏం సంగతి! కాని నీవు చాలా అదృష్టవంతుడివి - మీ పిన్నిని గురించి'
"నువ్వు నిజం ఎంత చక్కగా చెప్పగలవు సరోజినీ?"
"నువ్వు పెళ్ళి చేసుకోవా?" అంది ఆమె రెండు నిముషాలాగి.
"చేసుకుంటాను"
"ఎవర్ని?" అన్నదామె కుతూహలం వ్యక్తపరుస్తూ.
"ఉందిలే ఒకమ్మాయి! పసందుగా వుంటుంది. కాని తనని తప్ప యింకొకర్ని చేసుకోనని దానికి తెలియదు."
"ఓహో! అర్ధమయింది. 'దాన్ని' అని అన్నావు కాబట్టి అర్ధమయింది కానీ అది నీకు దక్కదుగా"
"ఏం"
"కొంచెం పార్వతిలాంటి పిల్ల"
"కాని నేను దేవదాసుని కాదుగా సరోజినీ"
ఆమె నిరుత్తరురాలయింది. ఎలాగో గొంతు పెగల్చుకుని ఖేదంగా "పిల్లల్ని అమ్ముకునే వంశంలో పుట్టటమే పార్వతి చేసిన అపార్ధం. మరి యీ సరోజిని అపరాధం విను. ఆస్థి పోగొట్టుకున్న మనిషి కూతురిగా పుట్టడం. అదీగాక మరో ముఖ్య విషయం వుందిలే. అది చెప్పను. పార్వతి చరిత్ర నిలిచింది. అందరూ ఆమెను తలుచుకుని కన్నీళ్ళు కారుస్తాం. కానీ సరోజినిని గురించి ఒక్క నిట్టూర్పుకూడా విడువదు ప్రపంచం. మరి యిది జీవితం కదా" అంటూంటే దుఃఖంతో ఆమె గొంతు పూడిపోయింది.
అతను ముందునుంచీ అనుమానిస్తూనే వున్నాడు ఈ సన్నివేశం సాఫీగా పూర్తికాదని. బరువెక్కిన గుండెతో 'దుఃఖపడటం నీ వ్యక్తిత్వానికే కళంకం. ఊరుకో నాకో విషయం చెప్పు...ఆ ముఖ్యమైన అవరోధాన్ని గురించి.'
సరోజిని తలెత్తి 'చెప్పను' అంది.
అతనికి ఏదో ఆవేదన కలిగింది. ఆమె వారిస్తున్నా వినకుండా కిటికీ తలుపులు తెరిచాడు.
"మనం యిలా తలుపులన్నీ బిడాయించుకుని కబుర్లు చెప్పుకుంటూంటే యీ కిటికీ చాటునుండి మావాళ్ళు, ఆ తలుపు అవతలనుంచి మీ వాళ్ళు ఆలకిస్తే ఎలా వుంటుంది?"
"అదంతా ఫరవాలేదు. కానీ తలుపులు మూసివుండి, కబుర్లు వినిపించకపోతే..." అంటూ సరోజిని పమిటచెంగు నోట్లో క్రుక్కుకుని నవ్వాపుకుంటోంది. అతనిక్కూడా నవ్వు వచ్చింది. హాయిగా నవ్వి 'మనం యింక విడిపోదాం' అన్నాడు హఠాత్తుగా.
"ఆఁ ఆఁ, నేనూ అదే అనుకుంటున్నాను. వీధి తలుపులు తెరవనా?" అంటూ ఆమె నిజంగానే పోతోంది.
"ఎందుకు?"
"వెళ్ళిపోదువు గాని"
"నీకేమన్నా పిచ్చెక్కిందా భలేదానివే? కావాలని ప్రమాదాలు కోరుకోకు. ఈ అర్దరాత్రివేళా యిల్లు విడిచిపోతే వాళ్ళంతా ఏమనుకుంటారు?"
"ఆ పూచీ నాది. అదంతా ప్రమాదకరమైన విషయం మాత్రంకాదు. నిన్ను వేడుకుంటాను. చప్పున ఇక్కడ్నుంచి వెళ్ళిపో" అని ప్రాధేయపడింది.
"నువ్వెందుకింత తొందరపెడుతున్నావో చెబితేగాని నేనిక్కడనించి కదలను" అన్నాడతను మొండిగా.
"అబ్బ! అది కూడా చెప్పాలా?" అని విసుగ్గా "అయితె విను. తెల్లారితే నీ మొహం చూడలేను" అంది.
"సరే తలుపులు తెరువు" అన్నాడు శివనాథరావు విషణ్ణవదనంతో.
సరోజిని చప్పుడు చేయకుండా వీధి తలుపులు తెరిచింది.
"ఆలస్యం చేయకు" అంది.
"ఆలస్యం చేయను" అంటూనే అతను కదలటం మానేశాడు.
"బావా" అంది కంపిత స్వరంతో ఆమె. గొంతెత్తి ఏదో చెప్పబోయింది. సాద్యం కాలా. మాటమార్చి 'చీకట్లో నువ్వు నడుస్తూంటే ఎలా ఉంటావో చూడాలని కోరిక. చూపించు' అని ముఖం అతనికి కనిపించకుండా ప్రక్కకి త్రిప్పుకుంది.
అతడు ద్వారాన్ని సమీపించాడు. దాన్ని దాటి వెనక్కి తిరిగి, "మనిద్దరి మధ్య ఈ తలుపులు..." తర్వాత పూర్తి చేయలేకపోయాడు. ఒక్క ఉరుకులో బయటకు పోదామనుకున్నాడు. అనుకున్నాడంతే కాని మరుక్షణంలోనే లోపలకు వచ్చి తలుపులు మూసి, వాటిని ఆనుకున్నాడు.
"అదేం పని?" అంది సరోజిని బలహీనంగా.
"సరోజినీ! నువ్వు నటించకు. నాకు నీ నిజరూపం కావాలి" అన్నాడతను దురపిల్లుతూ.
'వేరే ఏముందయ్యా! ఇదే... ఇదే... నా..... అసలు'
"ఒద్దు సరోజినీ! అంత క్రూరంగా మాట్లాడకు. ఈ కపటనాటకం చాలించుదాం యిహ."
"ఉష్!" అన్నది సరోజిని. 'ఎందుకు గొడవ? ఎంత తెలివిహీనుడివి అయిపోయావ్?'
అతని నిగ్రహం మరీ సడలిపోయింది. 'సరోజినీ! సరోజినీ!' అన్నాడు బాధగా. 'నన్ను కసిదీరా తిట్టు' అన్నాడు గట్టిగా అరుస్తూ ఆవేశంతో.
ఆమె చప్పున తనచేత్తో అతని నోరుమూసి "వెర్రివాడవు కాబోకు" అంది. తనచేతిని మళ్ళీ లాక్కునే అంతలో అతను ఆమెను తన రెండు హస్తాల్లో బంధించి ఆమె ముఖాన్ని తన ముఖంమీదకు లాక్కోబోయాడు.
"విడు" అన్నది సరోజిని పెనుగులాడుతూ.
"అతని ఉచ్చ్వాస నిశ్చ్వాసాలు అధికమైనాయి. పెంకెతనం చేయబోయాడు" ఆ తామసానికి ఆమె అదిరిపడి కోపంతో....
"అబ్బ!" అని అతనామెను విడిచి తన చేతివైపు చూసుకున్నాడు బాధగా. అతని చేతిమీద ఆమె పళ్ళు గుంటలుపడ్డాయి.
ఆకస్మికంగా సరోజిని అతని పాదాలమీద ఒరిగింది. "ఛీ! ఇదేం పని!" అంటూ అతను అవతలకు జరిగి, నిర్ఘాంతపోయి చూడసాగాడు. ఆమె నిశ్శబ్దంగా నేలమీద అధోముఖియై వుండిపోయింది. తల ఎత్తేసరికి కళ్ళు నీళ్ళను వర్షిస్తున్నాయి.
"ఇది నీ నిజరూపమా?" అన్నాడతను చకితుడై.
ఆమె ప్రయత్నం మీద లేచి నిలబడి "బాగా నొప్పి పుడుతుందా?" అంది జాలిగా.
"ఈ అపరాధానికేనా క్షమాపణ అడగటానికి సిద్దపడ్డావు?"
అవునన్నట్లు తలవూపింది - నీరసంగా.
వీపుమీద ఛళ్ ఛళ్ మని ఎవరో కొరడాతో కొట్టినట్లయింది. "ఓ! యివాళ నాకు ఎంత సంతోషం? ఎన్ని అనుభూతులు?" అంటూ అక్కడ్నుంచి కదిలాడు.
కాని ఆమె అతని చేతులు రెండూ గట్టిగా పట్టుకుని "నిన్నిలా వెళ్ళనీయను" అంది.