"అదేమిటి?" అన్నాడు తెల్లబోయి.
ఆమె జవాబు చెప్పకుండా మెదలకుండా ఊరుకుంది.
"వెళ్ళక ఏం చెయ్యమంటావు చెప్పు?" అన్నాడతను కొంచెం నవ్వి.
ఆమె ముఖం ఎత్తి అతనివంక చూసి తనూ నవ్వింది. "నువ్వు నా దగ్గరకు మామూలుగా వచ్చి గాయంతో వెళుతున్నావు. ఇది నాకు చాలా కష్టంగా వుంది."
"కాదు. గాయంతో వచ్చి మామూలుగా వెడుతున్నాను. నన్ను విడిచిపెట్టు."
ఆమె అతన్ని వదిలేసి, అలా దగ్గరే నిలుచుంది "ఓసారి దీపం చూపిస్తావా? టైము చూసుకుంటాను" అన్నాడు. ఆమె వంగి దీపం తీసుకుని, పైకెత్తి అతనికి చేరువగా ఉంచింది.
"రెండయింది"
"విష్ యు ది బెస్ట్ ఆఫ్ లక్" అంటూ తలుపులు తీసుకుని బయటకు వచ్చాడు.
"అంటే అర్ధం?" ఆమె గుమ్మందాకా వచ్చి అడుగుతోంది.
"నీ పెనిమిటిని అడుగు."
అతని ఛాయా కనిపించేటంతవరకూ అరుగుమీద నిలబడి అలానే చూసి "నువ్వు తప్ప నాకు పెనిమిటి ఎవరు?" అనుకుంది.
ఆమె నేత్రాలనుండి నీళ్ళు జలజల రాలిపోయాయి.
12
నువ్వు ఉషను మనస్పూర్తిగా ప్రేమించలేదా? అట్లైతే విమలని చూడటానికి ఎలా వెళ్ళగలిగావు?" అనడిగాడు.
"నేనేం చేయను? మా యింట్లోవాళ్ళ పోరు పడలేక పెళ్ళిచూపులకి వెళ్ళాను. ఇప్పుడా సంబంధం యిష్టంలేదని చెప్పేశాను" అన్నాడు మోహన్.
"ఛా! ఎంతపని చేశావు? అనవసరంగా ఆ అమ్మాయికి ఎంత బాధ కలిగించావో చూడు. ఇష్టం లేనప్పుడు వెళ్ళి చూడటానికి - ఆ అమ్మాయి మనసులేని ఓ బొమ్మ అనుకున్నావా?" అన్నాడు శివనాథరావు నిందాగర్భితంగా.
మోహన్ బాధపడుతూ "తప్పే అయింది" అన్నాడు.
మరునాటి ఉదయం చంద్రం, కృష్ణా వచ్చారు. కృష్ణ వచ్చినప్పటినుంచీ, కొత్తలేకుండా హడావుడి చేయడం మొదలుపెట్టాడు. మోహన్ బావగారికీ, అతనికీ బాగా దోస్తీ అయింది. కొద్దిగంటల్లోనే, ఇతని జోక్స్ కి ఆయన పగలబడి నవ్వసాగాడు, చల్లగా వుండటంవల్ల పదింటికి అంతా ఏటివొడ్డుకు వెళ్ళారు. ఎరుదాతి అవతల మోహన్ వాళ్ళ మామిడితోటలోకి వెళ్ళారు. సపోటా, జామ చెట్లుకూడా వున్నాయి. శివనాథరావు కొంచెం వెనుకబడ్డాడు. కృష్ణ వెనక్కి తిరిగి గట్టిగా కేకేసాడు "ఓహో ప్రేమికా! తొందరగా రావోయ్" అని. శివనాథరావు గుండె ఝల్లుమంది.
"వీడెప్పుడూ ఇంతే" అనుకున్నాడు. అనాలోచితంగా గుండెల్ని దూసుకుపోయేమాట ఏదో ఒకటి అనేస్తాడు. తోట కావలివాడి కూతురు ఎదురుగా వస్తోంది. వీళ్ళని చూసి దూరంగా తప్పుకుపోతోంది. కొంచెం ఎడంగాపోయిన కృష్ణ "యిక్కడ దగ్గర్లో మంచినీళ్ళ బావివుందా?" అని అడుగుతున్నాడామెను. 'ఏడిశావు పద" మని గదమాయించి చంద్రం అతన్ని యివతలకు లాక్కువచ్చాడు. "నేను శివుడితో వస్తే బాగుండే"దని వాపోయాడు కృష్ణ చంద్రం ఓదార్చాడు. కాపలవాడి కూతురు జామచెట్టు చాటున నిల్చుని తొంగి తొంగి చూస్తోంది. ఆమె ఒకటి నముల్తోంది. కృష్ణ నాళిక బయటపెట్టి వెక్కిరించాడు. ఆ అమ్మాయి సిగ్గుపడి నవ్వుతోంది. ఇంతలో శివనాథరావుకూడా వచ్చి వాళ్ళని కలిశాడు. అంతా కలిసి గుబురుగా వున్నా ఓ ప్రదేశం చేరారు. వేసవికాలంలో యిక్కడ పిక్ నిక్ కి బాగుంటుందన్నాడు చంద్రం. సిగరెట్ వెలిగించి మోహన్ కి ఒకటి యిచ్చాడు. ఒక జామచెట్టు కాయలు బాగా పండివున్నాయి. కృష్ణ పైకి ఎగబ్రాకాడు. "ఒరేయ్ కోతీ దిగరా" అన్నాడు చంద్రం. కృష్ణ కోపం వచ్చినట్లు నటించి ఓ కాయతీసి చంద్రాన్ని కొట్టాడు. కానీ అతను దాన్ని లాఘవంగా పట్టుకుని "థాంక్స్" అని తినసాగాడు.
అక్కడో మామిడి అంటు వుంది. "ఇటు చూడండి కాస్త" అన్నాడు శివనాథరావు "దీన్ని నేనూ, మోహన్ కలిసి నాటాము" అన్నాడు.
"ఓహో! ప్రేమ వృక్షమా?" అన్నాడు కృష్ణ చెట్టుమీదనుంచి.
"కాదు. స్నేహవృక్షం" అన్నాడు చంద్రం..పదకొండున్నరకు యింటికి తిరిగి వచ్చారు.
ఆ మధ్యాహ్నం అడివికి బయలుదేరారు. ముందు రెండు మైళ్ళకుపైగా నడవాలి. నడచి కొండప్రాంతాన్ని చేరుకున్నారు. ఎక్కడం ప్రారంభించారు. దారి సరిగ్గా లేదు. ఎటుచూసినా నాగజెముడు చెట్లు. త్రోవ తప్పినట్లు సంశయం వెలిబుచ్చడానికి మోహన్ సందేహిస్తున్నాడు. అతనెప్పుడో చిన్నప్పుడు వచ్చాడు. అతనూ, శివనాథరావూ ఓ పెద్దబండమీద చతికిలబడి ఆయాసం తీర్చుకుంటున్నారు. కెమేరా తీసుకుని చంద్రం, కృష్ణా పైకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడినుండి చూస్తోంటే ఏరు పంటకాలవలా వుంది. ఊరు బుల్లిబుల్లిగా వుంది. ఇద్దరూ పైకి చూశారు. చంద్రం, కృష్ణా ఒక నిముషం కనిపిస్తున్నారు, ఒక నిముషం మాయమౌతున్నారు. అక్కడక్కడా ఆగి వేటినో ఫోటోలు తీస్తున్నారు. ఇంక క్రిందకు రమ్మని ఎలుగెత్తి అరిచాడు మోహన్. రామని సౌంజ్ఞచేసి ఇంకా పైకి వెళ్ళిపోతున్నారు. దట్టంగా పెరిగిన పెనువృక్షాల చాటున, ఆ డొంకల్లో క్రమక్రమంగా మాయమైపోయారు. ఆకాశాన మేఘాలు క్రమ్ముకు వస్తున్నాయి. మోహన్ కంగారుగా పేర్లు పెట్టి పిలిచాడు. ప్రత్యుత్తరం లేదు. కొండ దిగువన ఎక్కడో ఓ మేక "మే మే" అని అరుస్తోంది. శివనాథరావు తన కాలిక్రింద వున్న ఓ పెద్దరాతిని గట్టిగా కాలితో తోశాడు. అది పెద్దచప్పుడుతో దొర్లుకుంటూ క్రిందకు మహావేగంగా పడిపోయింది. ఇంతలో చంద్రం కొండ శిఖరంపై ఉదయించాడు. చేతి రుమాలు ఊపుతున్నాడు.
"కృష్ణ ఏడీ?" అని గట్టిగా అరిచాడు మోహన్.
"వాడు పైకి ఎక్కలేక పోయినాడు" అని చంద్రం గొంతు కీచుగా వినిపించింది పైనుంచి.
"నువ్వు దిగి రా"
"ఉహు" అంది కీచుగొంతు. "మీరు వెళ్ళండి"
"అదేమిటి?"
"ఏమిటో వినిపించటల్లా"
"నువ్వు ఎందుకు రావూ?"
ఒకసారి చంద్రం చుట్టూ కలియచూడటం అస్పష్టంగా గోచరించింది. "నేను కొత్తదారి కనుక్కున్నాను"
"ఏడిశావ్!"
"ఏమిటో?"
"ఏడిశావ్!" వినిపించిందా? దిగి రా."
"నేను రాను" అని అంటుండగానే అతని స్వరూపం అక్కడినుండి అదృశ్య మైపోయింది. "ఒరేయ్ చంద్రం" అని మోహన్ కంగారుగా అరిచాడు. కానీ జవాబులేదు. అతను నిస్పృహతో "మొండి వెధవ" అన్నాడు.
ఇంతలో కృష్ణ దిగివచ్చాడు.
"శతవిధాలా ప్రయత్నించాను. ఎక్కలేకపోయాను" అన్నాడు విచారంగా.
"ఇక దిగిపోదామా?" అన్నాడు శివనాథరావు.
"మరి చంద్రం విషయం?"
"వాడు వస్తాడులే. చచ్చిపోయే రకం కాదు."
మోహన్ అయిష్టంగానే బయలుదేరాడు. అంతా కలిసి క్రిందకు దిగసాగారు. చినుకులు పడసాగాయి. మధ్యలో "పెద్దపులులేం కనిపించలేదేం?" అనడిగాడు కృష్ణ. అతని ప్రశ్నకు ఎవరూ జవాబు చెప్పలేదు.
కొండ మొదట్లోకి వచ్చేసరికి చీకటి పడసాగింది. వర్షంకూడా పెద్దదయింది. చంద్రాన్ని తలచుకుని ప్రతివాడూ మనస్సులో బాధపడుతూనే వున్నాడు. చక్కగా తడిసిపోయారు.
ఎంత త్వరగా నడిచినా యిల్లు చేరుకునేసరికి ఓ గంటకుపైగా పట్టింది. లోపలికి అడుగు పెడుతోంటే అందరి ముఖాలూ దీనంగా వున్నాయి. కాని లోపలిగదిలో చాప పరుచుకుని మోహన్ బావగారితో పులిజూదమాడుతున్న వ్యక్తిని చూసి ముగ్గురూ నిర్ఘాంతపోయారు.
"ఎవరు ముందు వచ్చారు?" అనడిగాడు చంద్రం ఆటలోంచి తల ఎత్తి నవ్వుతూ.
ఎవరికీ కొంచెంకూడా అభిమానం వేయలా ఏదో బరువు తీరినట్లు అనుభూతి.
ఆ రాత్రి పడుకున్నప్పుడు మెల్లిగా చంద్రం శివనాథరావుతో అన్నాడు "ఆమెను మళ్ళీ చూశాను."