Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 32

   

     "మధ్యాహ్నం వచ్చాను."
   
    "పని మీదనా?"
   
    "ఒక స్నేహితుడితో వచ్చాను. అతనికి పనివుంటే యిక్కడ."
   
    "ఇదో వంక" అన్నాడాయన.
   
    "మీరు ఊరుకోండి. శివుడ్ని గనుక ఒక్కమాటయినా అంటే నేను సహించను."
   
    "ఆ మాదిరి వెనకేసుకురావటం నీకు చేతవును. నీకు సిగ్గయినా లేదే?"
   
    "మిమ్మల్ని కాస్త నోరు ముయ్యమని చెబుతున్నాను."
   
    "చెబుతావు, చెబుతావు ఇన్నాళ్ళూ నీ మాటలువిని నోరుమూసుకోబట్టే ఈ సంసారం ఇలా తగలడింది."
   
    "తెలివితేటలకు సంతోషించాం గానీ దుప్పటికప్పుకుని గమ్మున పడుకోండి. మీరీ విషయంలో ఏమీ జోక్యం చేసుకోనవసరంలేదు."
   
    "ఇది నా యిల్లు నా యిష్టంవచ్చిన విషయంలో జోక్యం చేసుకుంటాను."
   
    ఆవిడకు కోపం వచ్చింది. "మీరిక్కడినుంచి కదుల్తారా? కదలరా?"
   
    "నన్నవతలకు పంపి మీరంతా కలిసి గూడుపుఠాణి చేద్దామనా?"
   
    'ఛీ' అవకతవక మాటలు మాట్లాడకండి. నన్నాట్టే రేపకండి చెబుతున్నా."
   
    'ఏడవండి" అని ఆయన విసురుగా లేచి, "ఎట్లా అయినా మీరూ మీరూ ఒకటి. సిగ్గూలేదు, శరమూలేదు. దగుల్భాజీ కొంప" అంటూ బయటకు వెళ్ళిపోయాడు.
       
    "శివా" అంది అత్తయ్య "దా, భోంచెయ్యి."
   
    "పద అత్తయ్యా! నేను మీయింట్లో భోంచేస్తాను. బాగా ఆకలేస్తోంది నాకు."
   
    భోజనం చేస్తున్నంతసేపూ ఎవరూ మాట్లాడలేదు. సరోజిని నిశ్శబ్దంగా తల్లి చేయమన్న పనల్లా చేస్తోంది... చెయ్యి కడుక్కుని మళ్ళీ మంచంమీదకు వచ్చి కూర్చున్నాడు. ప్రక్క మంచంమీదనుంచి వాసూ, వాడి చెల్లెలూ దుప్పటిలోంచి తొంగిచూసి మళ్ళీ ముసుగు కప్పుకుంటున్నారు. అతని అత్తయ్య వచ్చి వంటింటి గుమ్మంలో కూర్చుని కుశలప్రశ్నలు వేయసాగింది. సరోజిని వంటయిల్లు శుభ్రంచేసి వచ్చి, గూట్లో దీపం చిన్నదిచేసి కొంచెందూరంలో చాపమీద కూర్చుని తల వంచుకుంది.
       
    షుమారు పదకొండు గంటలదాకా అలా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. 'విషయాలు' ఏమీ కనపడలేదు.
   
    అతనికి చికాకుగా వుంది. ఇహ నిద్ర వస్తోందని దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. కావాలని యిప్పుడు సంకటంలో యిరుక్కున్నాడు. అతన్ని  ఆలోచనలు కాలుస్తున్నాయి. మెల్లిగా నిద్రపోయాడు.
   
    "కనులు విప్పేసరికి పైన చుక్కలు కనబడుతున్నాయి. ముఖంమీద దుప్పటి ఎవరు లాగేశారు? కళ్ళు మూసుకున్నాడు. 'ఫూ' అని మృదువుగా గాలి కన్నులమీదా, చెంపలమీదా ఎవరో ఊదినట్లయింది.' అతనికి అర్ధమయింది."
   
    "అబ్బ! వెళ్ళిపో నాతో మాట్లాడకూడదు" అన్నాడు చాలా చిన్నగా.
   
    "ఉహు మాట్లాడకుండా ఒదలను" అన్నది ఓ సన్ననికంఠం చెవిలో.
   
    "సాహసమనుకుంటాను"
   
    "అయినా తప్పదు"
   
    అతను లేచి కూర్చుని నెమ్మదిగా ఏం చేయమంటావు చెప్పు? అన్నాడు సరోజినితో.
       
    "మాట్లాడబోకు, నీకు పుణ్యముంటుంది" అన్నది సరోజిని.
   
    "నా వెనక రా"
   
    సరోజిని దీపం తీసుకుని జాగ్రత్తగా వంటింటి తలుపులు తెరిచింది. వెనుకనే అతను పోతున్నాడు. గదులన్నీ దాటి ముందుగదిలోకి వచ్చారు. ఆమె తెరచివున్న కిటికీ తలుపులు మూసింది. 'ఇప్పుడు చెప్పు' అంది దీపం క్రిందపెట్టి.
   
    "నేనేం చెప్పేది?" అన్నాడు తెల్లబోయి.
   
    "ఈ పనికి పురమాయించింది నువ్వు"
   
    "సరే, నేనే అడుగుతాను. ఈ ఊరికి యింత ఆకస్మికంగా రావటంలో అంతరార్దమేమిటి?"
   
    "అంతరార్దాలు నేనెరుగను సరోజినీ. అలా అయితే నా దారిన నేను మూఢంగా అలా నిద్రపోయేవాడిని కాదు."
   
    "ఓహో!" అని ఆమె తల ఎగురవేసింది. కొంచెం ఆగి మంద్రంగా "నీ పెళ్ళికి పిలవటానికి వచ్చావనుకున్నానులే" అంది.
   
    "ఆ వార్త నీకు సంతోషం కలిగించదు కద!"
   
    "ఎట్లా? అదే సంతోషం, ఆనందం అని భ్రమించాలి. లేకపోతే ఔచిత్యం తెలియని ఆడదానివని నిందిస్తావు రేప్రొద్దున్న."
   
    "నువ్వు మనస్తత్వాలతో చెలగాటాలాడవద్దు సుమా, కానీ చాలా మాటలు నేర్చుకున్నావే?"
   
    "నీ చలవే....బావా! నువ్వోసారి నన్నో పద్యం చదవమని అడిగావు గుర్తుందా? ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహ తాపంబులు దీరిపోవు" అప్పుడు సిగ్గుపడ్డాను. ఇప్పుడెందుకో నీముందు సిగ్గుపడబుద్ది కావడంలేదు. చదవమంటావా?"
   
    "వద్దు. మీవాళ్ళు లేస్తారు. అందులో యిది రాత్రి"
   
    "అందుకే భలే బాగుంటుంది....పోనీ ఆ గుణాలేమిటంటావు?"
   
    "ఆ పద్యం విషయమా...? నమ్మించి ద్రోహం చెయ్యటం-యిత్యాదు లేమో?"
   
    "కానీ నమ్మించి ద్రోహం చేసినవాడిని కూడా స్త్రీ ప్రేమిస్తుంది. అబల కావటం ఒక్కటే దీనికి కారణం కాదు."
   
    "దీనితోబాటూ మరో విషయంకూడా తెలుసుకోవాలి. తాను నమ్మించి ద్రోహం చేసిన స్త్రీని తానింకా ప్రేమిస్తూనే వుంటాడు పురుషుడు!"
   
    "నమ్మాను"
   
    "ద్రోహం అని అన్నావు. అసలు ద్రోహం అంటే నిర్వచనమేమిటో చెప్పు వింటాను."
   
    సరోజిని ముఖం చాటుచేసుకుని నవ్వి "నిర్వచనాలు చెప్పుకునేందుకు నేను నిన్నిక్కడికి తీసుకురాలేదు. అయినా ఈ ప్రశ్నకు జవాబుచెప్పే నేర్పు, జీవితానుభవం నాకు లేవు" అనిఊరుకుంది.
   
    కిటికీలో ఆనీ ఆననట్లు కూర్చున్నవాడల్లా కొంచెం ఉలికిపడి "ఇంత తెలివితేటలు ఎప్పుడు నేర్చావు?" అన్నాడు.
   
    "నీకన్నా తెలివితేటలు సంపాదించడానికి మరింకెవరితోనూ స్నేహం చేయలేదులే" అందామె రోషంగా.
   
    'ఇవాళ మన సమావేశం చిత్రంగా వుంది. నాకెందుకో చాలా సంతోషంగా వుంది సరోజినీ. మనం ఇదివరకు కలసిమెలసి కొన్ని రాత్రులు మా యింట్లో గడిపాం. కానీ అప్పటికన్నా యిప్పుడే నిర్భయంగా వుంది' అని నిట్టూర్పును అణచుకుంటూ 'నేను చెప్పేదంతా నువ్వు శ్రద్దగా వినాలి తెలిసిందా?' అన్నాడు.
   
    "మీ చిత్తం" అని సరోజిని కుదురుగా నిల్చుంది.
   
    "ఒకరోజు మనం ఎంత హఠాత్తుగా కలుసుకున్నామో, అదే విధంగా మరోరోజు విడిపోయాం కానీ యీ సంగతి నాకంటే కొంచెం ముందుగా తెలిసింది నీకు."
   
    "చాలా విచిత్రమైన సంగతి."
   
    "పరిహాసాలు కూడదు."
   
    "చెప్పుకుంటే సిగ్గు అవ్వ, బావగారితోనా పరిహాసాలు?"
   
    "గ్రహించాను నేనే కాదు, నువ్వూ మారావు"
   
    "మారిపోవడం శాశ్వతంగా వుండదు. నేనింత నిబ్బరం కలదాన్ని కానని నువ్వు గుండెలమీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. కానీ గతించిన అనుభవాలేమీ యీ సందర్భంలో గుర్తు చేయవద్దని మనవి."
   
    "ఏమీ? అన్నీ మరచిపోవడంలో నెగ్గావా?"
   
    "అది నాకు తెలియదు. కానీ అవన్నీ యిప్పుడు నీ నోటిగుండా వినడం నాకు యిష్టంగా ఉండదు."
   
    "నువ్వు చాలా కఠినాత్మురాలవు సుమీ! నీ గుండె ఇంత తొందరగా ఎలా బండబారింది?"
   
    "ఇది స్త్రీ గుండె దీన్ని గురించి మీ మొగలోకంలో చాలా నమ్మకాలు అపోహలూ వున్నాయి కానీ..." అతనివైపునుంచి చూపు త్రిప్పుకుని నవ్వి, మళ్ళీ శాంతంగా 'నాకు ఒక్కటే అనుమానం బావా! గడ్డ కట్టిన మంచు-గాలిలో వుంచితే తిరిగి ఎలా నీరైపోతుందో, అలాగే ఈ బండబారిన గుండె మళ్ళీ తన కాఠిన్యాన్ని కోల్పోతుందేమోనని..." అన్నది.
   
    "దానికి ఒకటే ఉపాయం"
   
    "అంటే?"
   
    "సంసార బంధంలో కాలుపెట్టటమే!"

 Previous Page Next Page