Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 32

   

     అతడు చేతిని ముందుకు సాచాడు.
   
    ఆమె చిన్నపిల్లలా ముణగదీసుకుని పడుకుని వుంది. పెద్ద లిఫ్టే అయినా పొడుగు సరిపోవడం లేదు. ఒక చెయ్యి తలక్రింద వుంచుకుని, మరో చెయ్యి చెంపక్రింద పెట్టుకుని నిద్రపోతూ, నిద్రలోనే అట్నుంచి ఇటు వత్తిగిల్లింది.
   
    అతడు ఆమెవైపే చూస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడూ అలా చూడలేదు. తెల్లటి తెలుపు ఆమె. అలసిపోయిన మొహం నిద్రలో మరింత అందంగా కనపడుతుంది. చిత్రమేమిటంటే, తన భార్యను కూడా ఎప్పుడూ పరీక్షగా అతడు చూడలేదు. చూడటానికేమీ లేదు. కోర్కెకన్నా ఎత్తయిన భావం మనసు నిండినపుడు చూపు ఇంద్రధనస్సు అవుతుంది. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అతడు చిన్న చిన్న కాగితాలమీద గేయాలు వ్రాసుకునేవాడు. ఎక్కువ పాండిత్యంలేదు. కానీ ఆలోచించే భావుకత్వం వుంది. గత కొన్ని సంవత్సరాలుగా అది కామర్సు వెనుక మరుగుపడింది. ఈ రోజు రాత్రి అది పురివిప్పటానికి సమాయత్తమవుతూంది.
   
    ఆటోగ్రాఫ్ పుస్తకాలు తీసుకొచ్చి సంతకాలు పెట్టమానటం నుంచి అర్ధరాత్రి పన్నెండింటికి ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్పటం వరకూ వరుసగా అన్నీ గుర్తొచ్చాయి.
   
    నీ చిరునవ్వు - నక్షత్రం చివరి వెలుగు
    ఇంటిముందు జూకా మల్లెతీగె
    నిన్నరాత్రి వర్షంలో తడిసిన నా గేయం
    బోగస్ విల్లా పందిరి మీద ప్రేమై పూసింది.
    సామాజిక కొమ్మల మధ్యనుంచి
    బెరుగ్గా చూస్తోంది.....
    నా పిరికితనాన్ని చూసి నవ్వే నీ మెడక్రింది లాకెట్టు.
    రెండు రాత్రుళ్ళు మధ్య నలుగుతూన్న పగలులా వుంది.

   
    ఆమె అట్నుంచి ఇటు తిరగడంతో పైట మెడమీదనుంచి క్రిందికి జారి నేలమీద జీరాడుతుంది. ఒక మోచెయ్యి రెండో అరచెయ్యి తలక్రిందే వుండటంవల్ల, మెడనుంచి క్రిందుగా వెళ్ళే గీత మరింత లోతై కారుమబ్బుల మధ్య కదిలే మెరుపుతీగలా వంపు తిరిగి జాకెట్టు లోపలి అదృశ్యమైంది. చేతి మలుపులో ఒక వక్షోజం సగం వరకూ కప్పబడిపోవటం వలన అర్ధభాగం మాత్రమే గోచరమవుతుంది. రెండోది పూర్ణకుంభమవటంతో రెండొందల పేజీల కుమారసంభవం పుస్తకం మీద ఆరొందల పేజీల మనుచరిత్ర పుస్తకాన్ని ఆన్చినట్టుంది.
   
    పూర్ణకుంభపు విశృంఖలత్వం కూడా మనుచరిత్రకు సరిపోయేట్టే వుంది. కుమారాసంభవంలో పార్వతి తండ్రిచాటు బిడ్డకదా పైట వెనుకే బుద్దిగా వుంటుంది. వరూధిని అలాకాదు. అనుకున్నది సాధించగలదు.
   
    అతడు బలవంతంగా కళ్ళు తిప్పుకుని గాలికి ఎగురుతున్న పైటను నిండుగా కప్పేడు. అలా కప్పుతూ వుండగా ఆమెకి సగం మెలుకువవచ్చి ఆ సగం నిద్రలోనే అతడి చెయ్యి గట్టిగా పట్టుకుని అలాగే మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఆమె స్పర్శ గుండెలోపలి కవాటాల్లో గంధం రాసినట్టుంది. చెయ్యి ఆమె మెడ దగ్గిరగా వుండటంవల్ల ఆమె ఉచ్వసించేటపుడు చేతిమీదుగా వెళ్ళే హేమంతపవనం నిస్వసించేటప్పుడు గ్రీష్మమౌతూంది.
   
    అతడికి తన భార్య గుర్తొచ్చింది. స్త్రీలో బేలతనాన్నీ, ఆధారపడే గుణాన్నీ ప్రేమించినంతగా మరేదాన్నీ ప్రేమించడు పురుషుడు. ఆమె పడుకున్న భంగిమలోనే ఆ తత్వం కనపడుతూంది. మాధవి ఏనాడైనా పడుకుందా?
   
    ఒకే దిండుమీద మన రెండు తలలు.
    దగ్గరవలేని ఉత్తర-దక్షిణ ధృవాలు.....

   
    అతడు కళ్ళు మూసుకున్నాడు.
   
    ఈపాటికి సినిమా వదిలి వుంటారు. ఇంటివరకూ వచ్చి దిగబెట్టటాలూ, చిరునవ్వు చెయ్యివూపులూ, నవ్వుకుంటూ మెట్లెక్కటాలూ......ఆలోచిస్తూ అతడు మగత నిద్రలోకి జారుకున్నాడు.
   
    నిద్రలో కల వచ్చింది. ఆమెవరో అతడికి తెలీదు. పదిహేను సంవత్సరాల క్రితం జ్ఞాపకమో, నిద్రలోకి వెళ్ళబోయే పదిహేను సెకన్ల ముందు అనుభవమో, ఒక ఆకృతిదాల్చి అతడివైపు పరుగెత్తుకు వస్తూంది. అతడు చేతులు సాచగానే అందులో ఒదిగిపోయింది. ముద్దుచప్పుడికి పెదవిమీది నిశ్శబ్దం పఠేలున పగిలింది. చేతి వత్తిడికి శరీరం సర్వమై మెలికలు తిరిగింది. శిరోభాగపు చర్మం క్రింద తడి ఎప్పుడు చెమటై నుదుటిమీద నిలుద్దామా అని తొందరపడుతుంది. ద్వంద యుద్దానికి రణరంగ మక్కరలేదు. స్వంతమగ్గానికి ముహూర్తమవసరంలేదు.
   
    అతడు కలలో మునిగి వుండగానే ఎప్పుడు తెల్లవారిందో తెలీదు. లిఫ్టు నెమ్మదిగా క్రిందికి జారటం ప్రారంభించింది. కలకీ నిజానికీ తేడా తెలియని పరిస్థితిలో వున్నారు వారిద్దరూ. క్రింద వాచ్ మెన్, మరో ముగ్గురు పైకి వెళ్ళటం కోసం నిల్చుని వున్నారు.
   
                          *    *    *
   

    లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగేసరికి ఒక స్వాప్నికావస్థ నుంచి బయటకొచ్చిన మెలకువ వచ్చింది రవితేజకి. ముందొక క్షణం ఏమీ అర్ధంకాలేదు. అకస్మాత్తుగా మబ్బులు విడినట్టు అనిపించి చూచుకుంటే, ఛాతీమీదనుంచి లేస్తున్న ప్రియంవద కనిపించింది.
   
    ఆ తరువాత కనిపించారు-లిఫ్ట్ బయట శిలాప్రతిమల్లా నిలబడి చూస్తున్న ముగ్గురూ వాచ్ మెన్, గదులువూడ్చేవారు ఇంకొకరు. ఒక నిముషంపాటూ అయిదుగురూ అలాగే వుండి పోయారు. ఊహించని రీతిలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ని అంత తెల్లవారుజామునే లిఫ్టులో చూసినందుకు భయపడాలో, వేరే ఒక అమ్మాయితో కనిపించినందుకు (ఆ భంగిమలో) మొహం తిప్పుకోవాలో ఆ ముగ్గురికీ తెలియలేదు.
   
    రవితేజకయితే, నిద్రలోకి ఎప్పుడు జారుకున్నాడో, తన వక్షాన్ని ఆమె ఎప్పుడు తల దిండుగా చేసుకుందో అర్ధంకాలేదు.
   
    అందరికన్నా ప్రియంవద స్థితి మరీ అన్యాయంగా వుంది.
   
    సిగ్గుతోనూ, లజ్జాభావంతోనూ ఆమె చప్పున లేచి నిలుచుంది. అందరిలోకీ ముందుగా తేరుకున్నది రవితేజ!
   
    తెరిచి వున్న తలుపులోంచి బయటికి అడుగుపెట్టాడు. క్షణాల్లో అతడు ఆ సంస్థ అధికారిగా మారాడు.
   
    "టైమ్ ఆఫీసులో ఎవరున్నారో పిలువు" అని వాచ్ మెన్ ని ఆజ్ఞాపించాడు. మరు నిముషం సెక్యూరిటీ మొత్తం అతడిముందు గజగజా వణుకుతూ నిలబడ్డారు.

    "లిఫ్ట్ ఆఫ్ చేసేముందు పైన ఇంకా ఎవరయినా వున్నారో లేదో చూసుకోనవసరం లేదా?"
   
    ఎవరూ మాట్లాడలేదు. "బోయ్ ఏం చెప్పాడు మీకు?"
   
    "టాక్సీ పంపమని చెప్పాడు సార్".
   
    "మరి పంపారా?"
   
    "పంపాము సార్."
   
    "ఎక్కడికి?"
   
    "ఇంటికి" అన్నాడు ఆ సర్దార్జీ. రవితేజకి నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. ఇక వాళ్ళని తిట్టికూడా లాభంలేదు అనుకున్నాడు. "బయట ఏమైనా వెహికల్స్ వున్నాయా?" అని అడిగాడు.
   
    "క్లాత్ వాన్ వుంది సార్."
   
    "పంపించు-"
   
    అంతా హడావుడిగా వుంది. వాన్ లో ప్రియంవదని దింపి, అతడి ఇంటికి బయలుదేరాడు. సగం కూర్చునీ, సగం పడుకునీ నిద్రపోవటం వల్ల వళ్ళంతా నొప్పులు. తల దిమ్ముగా వుంది. వాను వెళ్తూవుంటే తల వెనక్కి వాల్చి అలసటగా కళ్ళు మూసుకున్నాడు.
   
    ఒక్కసారి ఎమ్.డి. వెళ్ళిపోగానే, అప్పటివరకూ క్రింది జనంలో వున్న టెన్షన్ పోయింది. టెన్షన్ పోగానే, ఈ వార్త అందమైన రెక్కలు తొడుక్కుని విహరించటానికి బయలుదేరింది.
   
    రవితేజ టెక్స్ టైల్స్ ఎమ్.డి. తన సెక్రటరీతో రాత్రంతా లిఫ్ట్ లో గడిపాడంటే......ఏదో పొరపాటున మధ్యలో లిఫ్ట్ ఆగిపోయిందంటే-అందులో 'మసాలా' పూర్తిగా లేదు. మొదటి వ్యక్తినుంచి రెండో వ్యక్తి- రెండో మనిషినుంచి మూడో మనిషి - వరకూ అది సవ్యంగానే వెళ్ళింది. అవతలివాడికి ఈ కథ 'ఇలాగే' చెప్తే అందులో "వినే ఆసక్తి" వుండటం లేదని గ్రహించిన ఇవతలివాడు- ".....తెల్లవార్లూ గదిలో గడిపి, మూడోకంటికి తెలియకుండా బయటపడే ప్రయత్నంలో సెక్యూరిటీకి దొరికిపోయారు" అనే ఉప్పూకారం జల్లి, అవి వినేవాడి మొహంలో సంభ్రమాశ్చర్యాల్ని కలిగించాడు.
   
    ఇలా పాకిన ఈ వార్త వాన్ కన్నా వేగంగా ప్రయాణంచేసి, రవికన్నా ముందే మాధవిని చేరుకుంది. అతడు వెళ్ళేసరికి ఆమె రణరంగానికి సిద్దమై వుంది.
   
    "వచ్చారా? తెల్లవారిందా? అక్కడే వుండలేకపోయారా?" అని ప్రారంభించింది. అతడికి ముందు అర్ధంకాలేదు.
   
    "ఎందుకలా ఏమీ ఎరగనట్టు మొహం పెడతారు? మనం చూడకపోయినా మనని లక్ష కళ్ళు గమనిస్తూ వుంటాయని గ్రహిస్తే మంచిది. ఇంతకూ ఎవత్తె అది?"
   
    "నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్ధం అవుతుందా?"

 Previous Page Next Page