Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 32

  

     "శ్రీలక్ష్మి హాస్పిటల్లో మొదటిసారి డాక్టర్ అశోక్ రాధకు ఎగ్జామ్ చేసినప్పుడు ఓ.పి. చీటీమీద డిటెయిల్సన్నీ రాశాడు. అది నేను చూడాలన్న ఆసక్తిలేక అప్పట్లో చూడలేదు. అందులో అప్పటి పరిస్థితినిబట్టి వున్నది వున్నట్లు రాసేవుంటాడు, వెళ్ళిచూద్దాం" అన్నాడు.
   
    "నేనూ వస్తాను. పద ప్రదీప్!" అంది మాలతి.
   
    వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి హనుమంతరావుగారు అలసిపోయినట్లు ముందు గదిలో పడుకుని వున్నారు. మధ్యగదిలో రాధ కిటికీదగ్గర నిలబడివుంది. తనవి యిప్పుడు రెండూ ఆర్టిఫిషియల్ కళ్ళే, సునీత, అరుణ లోపల పనిలో వున్నారు.
   
    విచారణ అయిపోగానే హనుమంతరావుగారు ఎకాఎకి యింటికి వచ్చేశాడు. మిగతాపన్లు పూర్తిచేసుకోవటం కోసం ప్రదీప్ ఆలస్యంగా బయలుదేరవలసి వచ్చింది.
   
    వాళ్ళని చూసి హనుమంతరావుగారు లేచి కూర్చుంటూ "ఏమిటిలా వచ్చారు?" అనడిగాడు.
   
    "రాధను మొదటిసారి శ్రీలక్ష్మి హాస్పిటల్ కు తీసుకెళ్ళినప్పుడు, డాక్టర్ అశోక్ ఎగ్జామిన్ చేసి ఓ.పి. చీటీ యిచ్చారు. అది ఎక్కడుందో చూస్తారా?" అనడిగాడు.
   
    హనుమంతరావుగారు "అమ్మాయ్!" అని కేకేశాడు.
   
    ప్రదీప్ గొంతు విని రాధ కిటికీవైపునుంచి యిటుకేసి తిరిగింది. ఆమెకు అటు చూసినా చీకటే, ఇటు చూసినా చీకటే.
   
    "అంకుల్!" అన్నట్లు ఆమె పెదవులు చిన్నగా కదిలాయి. ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ, తడుముకుంటూ ముందుగదిలోకి రాసాగింది.
   
    తండ్రి గొంతు విని అరుణ "వస్తున్నా నాన్నా!" అని యివతలకు వస్తూ రాధ తడుముకుంటూ నడవటం చూసి ఆమె భుజంచుట్టూ చెయ్యి ఆసరాగా వేసి బయటకు తీసుకొచ్చింది.
   
    ప్రదీప్ ముందుకు నడిచి రాధను దగ్గరకు తీసుకున్నాడు.
   
    రాధ... అందమైన ముఖం...ముఖ్యమైన, ముఖ్యాతి ముఖ్యమైన కాంతిని కోల్పోయి, నిర్జీవంగా కనబడటం చూసి మాలతి గుండె తరుక్కుపోయింది.
   
    వెలుగులోకి వచ్చిన ఉదంతాలు ఇలాంటివి కొన్నే వుంటాయి. వెలుగులోకి రాలేక వెలుగును కోల్పోయిన జీవితాలు నిక్షిప్తంగా, నిశ్శబ్ద రోదనలతో, నిస్సహాయ ఆక్రందనలతో ఎన్ని వుండివుంటాయో!
   
    కళ్ళలోంచి ఉబుకుకుని రాబోతున్న నీటిని కష్టంమీద అణుచుకున్నది.
   
    "రాధా! ఈసారి నువ్వు కోర్టుకు రావాల్సి వుంటుంది" అన్నాడు ప్రదీప్.
   
    "కోర్టుకెందుకు అంకుల్! నన్నా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళండి."
   
    "రాధా?!"
   
    "అవునంకుల్! అతను నాకు కనిపిస్తే? ఓ, కనిపించడు. నేను చూడలేనుగా అతని దగ్గరకు తీసుకెడితే, అతను నా యెదురుగా వుంటే...." ఆమెలో ప్రజ్వరిల్లుతున్న ఆవేశం, అగ్ని... పూర్తిగా వ్యక్తం కాకుండా చూపులేని కళ్ళు దాచేస్తున్నాయి.
   
    "రాధా! కసిని ఆ విధంగా తీర్చుకోకూడదమ్మా! తప్పు చేసినవాడ్ని దోషిగా ప్రపంచంముందు నిలబెట్టటానికే నేను తాపత్రయపడుతున్నాను. నీకు చూపు లేకపోతేనమ్మా? నువ్వు బంగారుతల్లివి, నిన్ను బ్లైండ్ ప్యూపుల్ స్కూల్లో చేర్పించి సర్వవిద్యలూ వచ్చేలా చేస్తానమ్మా! నిన్నొక గొప్ప వ్యక్తిగా రూపొందింప చేస్తానమ్మా" అన్నాడు ప్రదీప్ ఆవేశంగా.
   
    రాధ ఏమీ జవాబివ్వలేదు. కానీ ఆమె ఎంత ఉద్రిక్తతను అణుచుకుంటున్నదో ఆమె పంటిక్రింద నొక్కుకుపోతున్న కింది పెదవిని చూస్తే తెలిసిపోతుంది.
   
    "అవునూ! ఆ లాయరు నన్నలాంటి ప్రశ్నలు వేస్తాడేమిటీ? కోర్టు అంటే యిలా వుంటుందా? ఏమో అనుకున్నాను" అన్నాడు హనుమంతరావు. అతని గుండెలో అదురింకా తగ్గలేదు.
   
    ప్రదీప్ అతనిమాటకు సమాధానం చెప్పకుండా "రాధను మొదటిసారి  డాక్టర్ అశోక్ దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు అతను వివరాలు రాసిచ్చిన ఓ.పి చీటి వుండాలి. అది ఎక్కడ వుందో చెప్పగలరా?" అడిగాడు మళ్ళీ గుర్తుచేస్తూ.

    "ఏమో! అలాంటివన్నీ అరుణే జాగ్రత్త చేస్తూ వుంటుంది" అని అక్కడే వున్న అరుణణు "చూడమ్మా ఆ డాక్టరు రాసిన కాయితాలు మనదగ్గర వున్నవా?" అని అడిగాడు.
   
    అరుణ చాలా జాగ్రత్త మనిషి సాధారణంగా ఏం వస్తువూ నిర్లక్ష్యంగా పోనివ్వదు. దాంతో ఎప్పటికైనా అవసరమొస్తుందేమో అన్నట్లు పదిలపరుస్తూ వుంటుంది.
   
    ఆమె గుర్తు చేసుకుంటూ "బీరువాలోనే పెట్టాను నాన్నా!" అని బీరువా తెరిచి సొరుగంతా వెదికింది. కనబడలేదు. ఒకవేళ ఎక్కడైనా పెట్టానేమో అనుకుంటూ అల్మైరా, డ్రాయరూ అన్నీ ఓపిగ్గా వెదికింది. ఆ కాగితం ఎక్కడా కనబడలేదు.
   
    "అరుణా!" అని పిలిచింది సునీత. ఆమె దగ్గరకు వచ్చాక "ఒకవేళ సుబ్బులు గానీ తీసిందేమో! ఆ మధ్య ఏవేవో కాయితాలు సవరిస్తుంటే చూసి అక్కర్లేని పనులన్నీ నీకెందుకు?" అని కసిరాను అన్నది.
   
    "సుబ్బులెవరు?" అనడిగాడు ప్రదీప్. వాళ్ళింట్లో పనిమనిషి ఎవరూ వుండరనీ, ఎంతపనయినా అక్కచెల్లెళ్ళిద్దరూ చేసుకుంటూ వుంటారనీ అతనికి తెలుసు.
   
    "రాధకు ఆపరేషన్ జరిగి, యింట్లో పరిస్థితి అంతా కకావికలంగా వుండటం, రెండో ఆపరేషనప్పుడు హాస్పిటల్ లో వుండాల్సి రావటం, యింటికి హాస్పిటల్ కూ తిరుగుతూ వుండటం- యీ గొడవల్లో యింటిపని కుదరక సుబ్బుల్ని అంట్లు తోమటానికి పెట్టాం" అన్నది సునీత.
   
    "ఇప్పుడు కూడా పనిచేస్తున్నదా?"
   
    "లేదు అవసరం తీరాక మానిపించేశాను" అని గుర్తుచేసుకుంటూ "మేము మానిపించేంత వరకూ వుండలేదు. పది పదిహేనురోజులు చేసి తనే మానేసింది" అన్నది.
   
    "తనంతట తనే మానేసిందా?" అసలామెణు పనిలో ఎవరు పెట్టారు?"
   
    "ఎవరూ పెట్టలేదు. తనంతట తానే వచ్చి తమ కుటుంబపరిస్థితి బాగాలేదనీ, పనిలో పెట్టుకోమనీ అడిగింది. మొదలు వద్దన్నాం కాని తర్వాత రెండుమూడుసార్లు తిరిగేసరికి అప్పటి పరిస్థితిని బట్టి అవసరమనిపించి పెట్టుకున్నాం."
   
    "తనంతటా తానే వచ్చి అడిగిందా?"
   
    "అవును."

    "ఆమెకి ఎన్నేళ్ళుంటాయి?"
   
    "ఇరవై ఏళ్ళుంటాయేమో! పెళ్ళి కాలేదని చెప్పింది."
   
    ప్రదీప్ మనసులో అనేక ఆలోచనలు చోటుచేసుకుంటున్నాయి. "ఆమె యిల్లెక్కడో తెలుసా?" అనడిగాడు.
   
    "సరిగ్గా తెలియదు. మాటల సందర్భంలో ఒకసారి దోమల్ గూడా ప్రాంతంలో పాకల్లో వుంటున్నానని చెప్పింది."
   
    "సరే" అంటూ ప్రదీప్ మాలతితో సహా అక్కడ్నుంచి కదిలాడు.
   
    హనుమంతరావు గుమ్మందాకా వచ్చి "ఓ గంటపోయాక మీ యింటికి వస్తాను. వొళ్ళంతా చాలా బడలికగా వుంది" అన్నాడు రిలీఫ్ కావాలి అన్నట్లుగా.
   
                            * * *


    ప్రదీప్ దోమల్ గూడా వెళ్ళి ఆ పరిసరప్రాంతమంతా పాక అంటూ వున్న చోటల్లా సుబ్బుల్ని గురించి ఓపిగ్గా వాకబుచేశాడు. మాలతికూడా అతన్తోపాటు వుంది.

    ఆమె కుటుంబంలో మిగతావారెవరో తెలియదు. అసలు సుబ్బులు చెప్పిన అడ్రెస్ కూడా కరెక్టు అవునో కాదో తెలియదు. అయినా ఏమయినా ప్రయోజనం వుంటుందేమోనన్న మిణుకు మిణుకుమనే ఆశతో కనబడ్డ వాళ్ళందర్నీ అడిగాడు.
   
    ఓ సందుచివర వున్న కిళ్ళీకొట్టు దగ్గర బెంచీమీద చారలలుంగీ కట్టుకున్న ఓ నడివయస్సు మనిషి కూర్చుని వున్నాడు. జర్దాకిళ్ళీ బుగ్గన పెట్టుకుని మధ్యమధ్య ఉమ్మివేస్తున్నాడు.

 Previous Page Next Page