Previous Page Next Page 
అసావేరి పేజి 32

    శంకూపైకి లంఘించబోయిన రాజేందర్ అనుచరులకదో అవాంతరమైంది.
   
    సావేరి రాజేందర్ కి మేనకోడలు మాత్రమే కాదు....ఆ జిల్లాలో తిరుగులేని చేవగల వీర్రాజుగారి కూతురు కూడా....
   
    వాళ్ళలా ఆలోచిస్తుండగానే రాజేందర్ సావేరి చేయి పట్టుకుని దూరంగా లాక్కుపోయాడు.
   
    అప్పుడు ప్రారంభమైంది అసలు మారణకాండ....
   
    పైకి లేవబోయిన శంకూ డొక్కలో తన్నారు.
   
    ఏ లోకంలోనో వున్న అమ్మ ప్రేవులు మెలితిరిగేట్ట సన్నని మూలుగు.
   
    ఒకటికాదు.....వరుసగా ముష్టిఘాతాలు శంకూ ఒంటిని తూట్లు చేస్తున్నాయి.
   
    మరో అరక్షణం ఆలస్యమైతే ఏం జరిగేదో.....
   
    ఇంతలో దూరంనుంచి ఎవరో పరుగెత్తుకొస్తున్న అలికిడి....
   
    రాజేందర్ ఏం జరుగుతున్నదీ గుర్తించేలోగానే సురేంద్ర ఆ ప్రదేశాన్ని చేరుకున్నాడు...ఒక్కడు కాదు....మరో పదిమందిదాకా యువకుడులున్నారు అతడి వెంట.
   
    రెప్పపాటులో శంకూని ఓ మూలకిలాగి ఆనరా యివ్వడంతో బాటు రాజేందర్ అనుచరుల్ని చాలా మొండిగా ఎదుర్కొన్నాడు.
   
    ఏటి ఒడ్డున తన కాలేజీ మిత్రులతో పచార్లు చేస్తున్న సురేంద్రకి మంగ పది నిమిషాల క్రితమే శంకూ ఆవేశంగా బొజ్జన్నకొండవేపు పరుగెత్తుకెళ్ళడం గురించి చెప్పింది.
   
    అదే సురేంద్ర తన బృందంతో అక్కడకు రావడానికి ప్రేరణగా మారింది.
   
    అయిదు నిమిషాలపాటు జరిగిన పోరాటంలో రాజేందర్ అనుచరులు కాలికి బుద్ది చెప్పారు....
   
    ఆ పల్లెలో రాజేందర్ కిదో అనూహ్యమైన అవాంతరం యిది.
   
    అసలు ఏ వ్యక్తయినా తననిలా ఎదిరించగలడని అంతదాకా అనుకోకపోవడంతో ముందు అవాక్కయ్యాడు ....తర్వాత తను త్వరలో బుద్ది చెప్పాల్సిన వ్యక్తుల్లో సురేంద్రని ఒకడిగా లెక్కవేసుకుని కదలబోతుంటే....
   
    అభిముఖంగా నిలబడ్డ సురేంద్ర రొప్పుతూ పిలిచాడు సాత్వికంగానే "మిస్టర్ రాజేందర్...."
   
    పిరికితనమన్నది నిఘంటువులోలేని రాజేందర్ సావేరిని విడిచిపెట్టి రెండడుగులు ముందుకేసి "యస్" అన్నాడు పిడికిళ్ళు బిగించి...
   
    "మరోసారి...." సురేంద్ర ఏనాడూ ఇంతటి ఉద్రేకాన్ని ప్రదర్సించలేదు. "శంకూపై మరొక్కసారి ఇలాంటి ప్రయత్నానికి పూనుకుంటే...."
   
    "చెప్పు...."
   
    "అప్పుడు చెప్పడానికి నేను మాటల్ని ఉపయోగించను"
   
    వ్యంగ్యంగా నవ్వాడు "నన్ను ఎదిరించి నిలబడగలరా?"
   
    "మిస్టర్ రాజేందర్.....నేను ఓ సైనికుడికి పుట్టినవాడ్ని....పోరాట లక్ష్యమన్నది రక్తంలోనే జీర్ణించుకున్నవాడ్ని. కోరి గోదారిలో అడుగు పెట్టను కానీ నా వాడూ అనుకున్న శంకూపై ఎలాంటి అఘాయిత్యానికి ఎవరు పూనుకున్నా తిరగబడతాను."
   
    "డైలాగ్ పరంగా బాగుంది. కానీ నేనిలాంటివాటిలో ప్రొఫెషనల్ నని నీకు తెలీదనుకుంటాను...." వ్యంగ్యంగా నవ్వాడు రాజేందర్.
   
    "నేను ప్రొఫెషనల్ ని కాకపోయినా శంకూ విషయంలో చాలా ఎమోషనల్ గా ఆలోచించేవాడ్ని...."
   
    "నాకు కాబోయే భార్య విషయంలో నేనూ అంత ఎమోషనల్ గా ఉంటాను..."
   
    ఈసారి వ్యంగ్యంగా నవ్వడం సురేంద్ర వంతైంది. సావేరిని కించపరచడం అతడి లక్ష్యం కాదు, అయినా అన్నాడు. "నీది ఏదైనా మరొకరు దోచుకుని ప్రతిఘటించి కాపాడుకోవడం సమంజసంకాని, నీదాన్ని కానని సోదాహరణంగా నిరూపిస్తున్న అమ్మాయికోసం ఇలా వెంపర్లాడటం ఆడతనం....."
   
    అది తగలాల్సినచోట అనుకున్న దానికంటే బలంగా తగిలిందేమో.
   
    "సావేరి నాదీ అనుకోవడానికి దాని అనుమతి నాకు అనవసరం."
   
    "అప్పుడలా సాధించడాన్ని దోపిడీ అంటారు."
   
    "నీ ఎనాల్సిస్ నాకు అక్కర్లేదు...." సావేరి రెక్కపట్టుకుని బర బరా లాక్కువెళుతూ ఒక్కక్షణం ఆగాడు "చూడు మిస్టర్ సురేంద్రా! నీ స్నేహితుడి విషయంలోనే నీకు నిజంగా శ్రద్దే వుంటే చెప్పువాడికి సావేరి నాది.... నాదంటే నాది.... కాదు అంటే కాళ్ళూచేతులు విరగొట్టడం మాత్రమే కాదు. ప్రాణాలు తీయడానికీ వెనుకాడను.... నా గురించి ఇంకా తెలీని కుర్రకుంకలు మీరు..... ఈ క్షణంనుంచీ శంకూగాడు సావేరిని మరిచిపోవాలి..... మరోసారి కలుసుకున్నట్టు తెలిస్తే అదే వాడికి చివరి నిమిషమవుతుంది."
   
    వెళుతున్న రాజేంద్ర ప్రస్తుతం ఆలోచిస్తున్నది శంకూ గురించి కాదు.
   
    శంకూకింతగా వత్తాసు పలుకుతున్న సురేంద్ర గురించే....
   
    నిజమే.... ఒక సంఘటనలో తాత్కాలికంగా స్పందించే సురేంద్ర కన్నా ప్రతి సంఘటనకీ శాశ్వతమైన పరిష్కారం ఆలోచించే రాజేందర్ చాలా బలవంతుడు.....అదే సురేంద్రకి రాజేందర్ గురించి తెలీని అతి ముఖ్యమైన వాస్తవం.
   
                                                                      *    *    *    *
   
    "మావయ్యా...."
   
    అపరాత్రిదాకా మందు సేవిస్తే ప్రపంచ చరిత్ర గురించి మాట్లాడుతూ కూర్చోవడం అలవాటైన వీర్రాజు ఇందాకట్నుంచి రాజేందర్ ఏదో  విషయం అడగాలనో, చెప్పాలనో సంశయిస్తూండటం గమనిస్తూనే వున్నాడు.
   
    నిజానికి మావయ్య దగ్గిర అవసరానికి మించినంత చనువుంది రాజేందర్ కి.
   
    అంతకుమించి తన పరపతికి ఎలాంటి విఘాతమేర్పడినా బలంగా చొచ్చుకుపోగల సమర్ధుడు తన బావమరిది రాజేందర్ ని వీర్రాజుకీ అభిమానముంది.
   
    "ఏమిట్రా" ముందు తానే కదిపాడు. "ఏమన్నా సమస్యలో ఇరుక్కున్నావా...." అంతకుముందురోజు తన యువసేనతో కలిసి సర్దాగా ఓ షాపుని బద్దలుకొట్టి ఆ యజమాని హాస్పిటల్ కెళ్ళేట్టు హడావుడి చేసిన విషయం ఓ ఎస్ ఐ. నిన్ననే చెప్పాడు వీర్రాజుకి....."ఆ షాపు యజమాని చావలేదు... పైగా పోలీస్ కంప్లయింట్ యిచ్చినా ఎస్. ఐ. మనవాడే కాబట్టి నొక్కి పెట్టేసాంగా?"
   
    "నేను చెప్పాలనుకుంటున్నది అదికాదు....అసలు పీకలదాకా వస్తే తప్ప నేను నీతో ఏ విషయమూ చర్చించనని నీకూ తెలుసు...."
   
    "అయితే ఎందుకు వాదిస్తున్నట్టు..." మృదువుగా నవ్వాడు. "రాబోవు ఎలక్షనులో టిక్కెట్టురాదని కంగారు పడుతున్నారా?"
   
    "మావయ్యా" విసుక్కున్నాడు రాజేందర్ "నేను చెప్పాలనుకుంటున్నది మన సావేరిని గురించి...."
   
    కూతురి ప్రసక్తి రాగానే మరింత తేలిగ్గా నిట్టూర్చాడు వీర్రాజు. "ఏమన్నా అందా.... తెలుసుకదరా అదింకా చిన్నపిల్ల."
   
    "అలా నువ్వు సంబరపడు. త్వరలోనే పెద్దపిల్లనని నిరూపించుకుని నీ పరువు పెంటపాడు ఏటిలో కలుపుతుంది."
   
    "అసలు సంగతేమిట్రా....." ఈసారి వీర్రాజు గొంతూ ఖంగుమంది.
   
    "అది పెద్దమనిషై మూడేళ్ళయ్యింది."
   
    కూతురి విషయంలో ఇలాంటి తెలివితక్కువ డిటైల్స్ మాట్లాడ్డం నచ్చలేదేమో "అయితే....ఇప్పుడా విషయం దేనికట."
   
    వీర్రాజు గొంతులో కాఠిన్యానికి కంగారుపడ్డాడేమో. "పెళ్ళీడు వచ్చేసింది."
   
    "అది ఆలోచించాల్సింది నేను."
   
    "అవసరం నాది కనుక గుర్తుచేయడం నా డ్యూటీయే."

 Previous Page Next Page