Previous Page Next Page 
విషవలయం పేజి 31

    "దానిదేముందమ్మా? గేమ్ యీజ్ ఫర్ గేమ్ సేక్. గెలుపూ ఓటమీ తాత్కాలికం."

    "అలా ఏం కాదు. మీరు యింతవరకూ పేకాటమీద పోగొట్టుకున్న డబ్బుతో పది పేకల్ని తయారుచేసే కంపెనీలు పెట్టవచ్చు"

    ఈ మాటకి ఆయన "ఒహ్హహ్హ..."అని విరగబడి, పగలబడి నవ్వాడు. కాస్సేపటికి కష్టంమీద తేరుకుని "అలా చూసుకుంటే దేనికైనా సుతి ఏముందమ్మా? ప్రపంచములో రోజూ పేకాటలో కోల్పోబడిన డబ్బుతో ఒక ప్రపంచయుద్దానికి కావల్సిన సామగ్రి కొనవచ్చు. లేకపోతే భూమ్మీద దరిద్రమే లేకుండా చేయవచ్చు" అని గంభీరంగా దాన్ని గురించి కొన్ని నిమిషాలు ఆలోచించాడు.

    ఇలా కబుర్లతో, కాలక్షేపంతో మెల్లిగా ఆరుదాటింది. "ఇంక వస్తాము. చాలా వేళయిపోయింది" అని అప్పుడు హడావుడి పడుతూ లేచాడు. సుధ కూడా లేచి నిల్చుంది "తరచూ వస్తూండండి. తప్పకుండా  వస్తూండండి" అని మరీమరీ చెప్పి తండ్రి కూతుళ్ళిద్దరూ క్రిందకు దిగి వెళ్ళిపోయారు. సత్యమూర్తి కూడా వెనుకనే గేటు వరకూ వెళ్ళి పంపి వచ్చాడు.

    పైకి వచ్చి, తన గదిలోకి వెళ్ళి కిటికీదగ్గర నిలబడ్డాడు. సందుమలుపు తిరుగుతూన్న సత్యానందంగారి కారు దూరంగా కనిపించింది.

    ఎన్ని అనుభూతులు, అర్ధంలేని అనుబంధాలు!! యీ సత్యానందం గారితో యిన్నాళ్ళబట్టీ, ఇన్నేళ్ళబట్టీ లేని స్నేహం యిప్పుడెందుకు పెంపొందుతోంది? అంతలో గడబిడ, అంతలో నైర్మల్యం? అబ్బ! ఈ యింటిలో ఎలా నివాసం చేయటం?

    ఎండ దాదాపు తగ్గిపోయింది. గాలి చల్లగా తిరిగింది. ఆ సందులో గుండా మనుషుల రాకపోకలు ఎక్కువయినాయి. ప్రక్కన పాకల్లో-పని పాటలకు వెళ్ళిన వాళ్ళంతా తిరిగివచ్చినట్లుగా వున్నారు సందడి మొదలయింది. ఆడవాళ్ళు ఎకసెక్కా లాడుకుంటున్నారు. ఒ యువతి పాలు పిదుకుతోంది. మధ్య మధ్య ప్రక్కనే కూర్చొని చూస్తోన్న తన చెల్లెల్తో కబుర్లు చెప్తోంది.

    ఆ పాకల్లో ఓ గాజులవాడున్నాడు. వాడు వొట్టి త్రాగుబోతు. రాత్రిళ్ళు సాధారణముగా యింటిపట్టున వుండడు. ఉన్న కాసేపటిలో ఉన్నట్లుండి పెళ్ళాన్ని చితకబొడవ నారంభిస్తాడు. ఆ కొట్టడం ఎలా వుంటుందంటే. వళ్ళంతా వాచిపోయేటట్లు, రక్తము కారేటట్లు చావగొడతాడు ఎందుకు కొడతాడో ఎవరికీ తెలీదు. సాధ్యమైనంతవరకూ కల్పించుకోకుండా వుందామని మిగతావాళ్ళు ప్రయత్నిస్తారు. కాని "ఓయమ్మో. ఓరి నాయనోయ్" అన్న ఆమె కేకలు ఆకాశాన్నంటేసరికి మనసు వుండబట్టక పరిగెత్తుకువచ్చి వారించుకుందామని చూస్తారు. "నా యిష్టం. నా పెళ్ళాన్ని కొట్టుకుంటాను, చీల్చుకుంటాను" అని ఆ వీరుడి ప్రగల్భం. ఇలా సాగిపోతూ వుంటుంది.

    హఠాత్తుగా సత్యమూర్తికి తానుచాలా వంటరిననిపించింది ఒకప్పుడు ఈ యింటిని సమాధి అని విసుక్కునేవాడు. ఇప్పుడా సమాధినే అంటిపెట్టుకుని, ఆశ్రయించుకుని, అందులో లీనమైపోతున్నాడు. బ్రతుక్కి అర్ధం కనిపించటములేదు. గృహ కల్లోలాలు, అంతశ్చిద్రాలూ, తాపత్రయాలూ...

    కాని తాను వాటికి లొంగిపోతున్నాడు. అదే ఆశ్చర్యం. ఎందుకు? ఎందుకు?

    తండ్రి-బలరామయ్యగారు అంత్య సమయంలో చేసిన గురూపదేశం చెవుల్లో మార్మోగసాగింది అంత శక్తివంతమైనదా అది? అంత బలహీనుడా తను? తాను మారిపోయాడని అంతా అంటున్నారు. అద్దం అరుస్తోంది. సుధా నిర్మొహమాటంగా చాటింది. ఉష!

    అతని గుండె ఝల్లుమంది.

    ఆమెకు జవాబువ్రాయలేదు. వ్రాయకలేకపోయాడు. "నన్ను మరచిపో. నేనింక అక్కడికి రాను. నేను నిజంగా మారిపోయాను. కారణము తెలీదు. నేనంతే, నువ్వంటే భయంగావుంది. అక్కడికి రావాలనిపించడము లేదు." అని ఇట్లా రాద్దామనుకున్నాడు.

    అది చేతకాలేదు. తను వొట్టి అసమర్ధుడు, పిరికివాడు. మరోమారు నిందించుకుంటున్నాడు. కసితీరా నిందించుకుంటున్నాడు. ఆత్మ సంతృప్తికోసం మనశ్శాంతికోసము నిందించుకుంటున్నాడు.

    కాసేపటిలో గది బయట అడుగులు చప్పుడవుతాయి. తండ్రి వస్తాడు_పెద్ద ఉపోద్ఘాతము చెప్పుకుంటూ. లేకపోతే వీరభద్రం వస్తాడు-"ఏం చేశారు అక్కయ్య చెప్పిన విషయమంటూ, ప్లీడర్లని పిలిచారా? ఇంకా ఆలస్యమెందుకు? త్వరగా ఊ. త్వరగా"

    అతనికి వర్ణించ నలవిగాని బాధ కలిగింది. నిట్టూర్పు విడిచి, అలాగే చూస్తూ నిలబడ్డాడు.

    చీకటి అలుముకుని వస్తున్నది.
   
                                                                                      11

    పంచుకోవటము పూర్తయింది_వీలునామా ప్రకారము, ప్రస్తుతము వుంటూన్న మేడ సత్యమూర్తికి వచ్చింది. ఊళ్ళోనే వున్న మరోమేడ- అద్దెలు వస్తున్నది. రాధమ్మగారికి వచ్చింది పొలాలూ, స్థలాలూ అన్నీ సరిగ్గా చెరిసగంగా పంచేసుకున్నారు.

    సత్యమూర్తికి చెప్పరాని బాధగా వుంది. విపరీతమైన అశాంతికి గురి అవుతున్నాడు. తనకు తెలీకుండా తను ఓ పాత్ర నిర్వహిస్తున్నాడు. కొన్ని విపరీత సంఘటనలకు కారకుడౌతున్నాడు.
   

 Previous Page Next Page