"నేనిప్పుడు ముసలిదాన్ని కాలేదా, అత్తా? వయసుదేముంది? మంచి మనసుండాలి."
"ముసలివాళ్ళకి తప్ప ఇంకెవరికీ మంచి మనసుండదా? మారాజాకి చేసుకోవాలని ఎంత అనుకున్నానో. వాడు చదువు చదువంటూ కొన్నాళ్ళు, చదువైపోయాక డబ్బు డబ్బంటూ కొన్నాళ్ళు విదేశాలు పట్టిపోయాడు. ఒక్కదాన్ని! బిక్కుబిక్కుమంటూ ఇంతకొంపలో పడివుంటాను. పిల్లలుపుట్టి ఏం సార్ధకం" ఆవిడ కళ్ళొత్తుకుని "కూర్చో, గీతా!" అంటూ ఉయ్యాల బల్ల చూపింది.
గీతాభవాని ఎంత నెమ్మదిగా కూర్చున్నా కిర్రుమని అటూ ఇటూ ఊగిసలాడింది ఉయ్యాలబల్ల. ఎంత సంబాళించుకొన్నా ఆమె హృదయం కూడా అలాగే ఊగిసలాడింది, గతస్మ్రుతులతో.
... ... ...
"వద్దు. ఇకచాలు. ఊపొద్దు. కళ్ళు తిరుగుతున్నాయి వద్దంటూంటే? అమ్మో." కళ్ళు తిరిగి పడిపోయింది.
క్రింద పడకముందే అతడు నేర్పుగా అందుకొని తన కౌగిట బంధించాడు. అతడి పెదవులు తన పెదవులమీదికి వంగుతున్నాయి. "గీతా! ఐ లౌ యూ!"
ఇంకా భూమి తిరుగుతున్నట్టుగానే ఉంది. కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. "వదులు. ఎవరైనా చూస్తారు." కంగారుగా గింజుకుంది.
"చూడనీ" పెంకెగా అన్నాడు.
"ఛీ! సిగ్గులేదు." అతడి కౌగిలినుండి బయటపడి పరిగెత్తింది ఇంటికి.
... ... ...
రుక్మిణమ్మ లోపలికి వెళ్ళి కుంపటిమీద నీళ్ళు పెట్టి వచ్చింది.
ఉయ్యాలగొలుసుకి తల ఆన్చి స్వప్నావిష్ణురాలిలా కూర్చొని ఉంది గీతాభవాని.
ఆమె కొడుకు రాజశేఖరం డాక్టరుగా న్యూయార్కులో ఉన్నాడట. అక్కడే సెటిలయిన ఒక భారతీయుడి కుమార్తెను పెళ్ళి చేసుకొన్నాడట. ఆమెది ఏ కులమో సరిగా తెలియదట. పెళ్ళయ్యాక ఒకసారి తనతో తీసుకువచ్చాడట. పిల్లలు పుట్టలేదు. బాగా డబ్బు సంపాదించుకు వచ్చి ఇక్కడ పెద్ద నర్సింగ్ హోం కట్టిస్తాడట. తనుండడానికి పెద్ద బిల్డింగ్ కూడా కట్టించుకుంటాడట. అందుకోసం ఊరవతల అయిదెకరాల స్థలం కొనిపెట్టాడట పదేళ్ళ క్రిందటే.
"చదువులో మీ అన్నకీ, మా రాజాకీ పోటీ. ఇద్దరూ ట్యూషన్లు చెప్పుకొని కాలేజీ చదువు సాగించినవాళ్ళే. మా వాడు గొప్ప డాక్టరై పోయాడు. మీ అన్న చిన్న ఇంజనీరుగా మిగిలిపోయాడు."
చిన్న ఇంజనీరుగా ఎందుకు మిగిలిపోయాడు? డ్యూటీలో స్ట్రిక్ట్ గా ఉంటాడు. మడికట్టుకొన్న ఈ ఉద్యోగినుండి ఇటు కంట్రాక్టర్స్ కీ, అటు పై ఆఫీసర్సుకీ ఇబ్బందిగా ఉంటుంది. ఏదో తప్పుడుకేసు బనాయించి రెండేళ్ళు సస్పెన్షన్ లో ఉండేట్టు చేశారు! అయినా వామనరావుకి బుద్దిరాలేదు. అతడి ఆదర్శాలు వదులుకోలేదు. అందుకే చీఫ్ ఇంజనీరు కావలసినవాడు ఎగ్జిక్యూటివ్ కూడా కాలేదు!
ఎందరో వేలకువేలు కట్నమిస్తామని వచ్చారు. కాదని, ఓ పేదింటి పిల్లను కట్నం లేకుండా పెళ్ళిచేసుకొన్నాడు. ఇన్ని ఆదర్శాలున్నవాడు చిన్న ఇంజనీరుగా మిగిలిపోక ఏమౌతాడు?
కాని, తన అన్న హృదయౌన్నత్యం ముందు రాజశేఖరం ఏ పాటి? గీతాభవాని అంతరంగంలో మరో దృశ్యం!
* * *
భయంతో, సిగ్గుతో చెప్పలేక చెప్పింది తనకి నెల తప్పిందని.
"మీ ఆడవాళ్ళు ఉత్త తెలివితక్కువవాళ్ళు. ముందే జాగ్రత్త తీసుకోకూడదూ?" అతడు చిరాకు పడ్డాడు.
"ఇప్పుడు ఏం జరగాలో చెప్పు!"
"అది నువ్వే ఆలోచించుకో. నేను ఈ వారంలోనే వెళ్ళిపోతున్నాను అమెరికా."
"వెళ్ళు! బాగా చదవాలని, గొప్ప డాక్టరు కావాలన్న నీ ఆశయం నెరవేర్చుకో! నే నడ్డుపడను! కాని, వెళ్ళేముందు నా మెడలో పసుపుతాడు కట్టి వెళ్ళు!"
అతడి ముఖంలో అభాసగా, ఒక హేళనాభావం కనిపించింది. "నీకంత సరదాగావుంటే పసుపుతాడు కాకపోతే ఏ రంగుతాడైనా కట్టుకో! నన్ను కట్టమని అడగకు. ఇలాంటి సిల్లీసెంటిమెంట్స్ నాకు పడవు. నీకు ఓపిక ఉంటే నేను చదువు పూర్తిచేసుకొని వచ్చేవరకు వేచివుండు."
"నువ్వు....నువ్వు నీ అవసరానికి వాడుకొన్నావుకదూ?" కన్నీళ్ళు కురిసిన ఆ కళ్ళలోనే నిప్పులు రగిలాయి!
అతడు నిర్లక్ష్యంగా అన్నాడు: "నేను పెళ్ళి వాగ్దానాలేమీ చేయలేదే! ఇద్దరం ఒక ఆకర్షణలో చిక్కుకొన్నాం. సృష్టి సహజంగా ప్రవర్తించాము. మగవాడిని కనుక ముందుగా చొరవ తీసుకొని ఉంటాను. అవసరం నా ఒక్కడిదే తీరిందా?"
మోహనంగా కనిపించే అతడి చూపులు ఈ రోజు కంపరమెత్తించాయి!