Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 31

    కాని ఆ ఘాతుకత్వం అంతటితో ఆగిపోయింది. ఎంత హఠాత్తుగా  ఆ చేతులామెను చుట్టుకున్నాయో అంత నాటకీయంగా విడిపోయాయి.

    ఓ నిమిషం గడిచాక లైట్లు వెలిగే వరకూ ఆమె నిశ్చేష్టురాలయి నిలబడిపోయింది.

    తెలివితెచ్చుకునేసరికి ఆ చిన్న సందులో తాను ఒక్కతే నిలబడి ఉన్నట్లు గ్రహించింది. ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది?

    అక్కడే వొంటరిగా నిలబడి, వెక్కి వెక్కి ఏడవాలనిపించింది. తర్వాత యింటికెలా చేరిందో ఆమెకే తెలీదు.


                 *                   *                 *


    రాత్రి చాపమీద పడుకుని ఏడుస్తూనే ఉంది. తన దార్న తను బ్రతుకుతూ ఉంటే యీ మనుషులు  ఎందుకలా  తనలోకి చొచ్చుకువస్తారు? ఆర్ధికంగా తమ కుటుంబం అన్ని విధాలా చితికిపోయి ఉంది. అన్ని విధాలా కూడా తమని నాశనం చెయ్యాలనుకుంటోందా ప్రపంచం? ఆ దుర్మార్గుడెవడో  తన వంటిమీద చెయ్యి వేశాడు. తలుచుకుంటూనే కంపరంగా ఉంది.తనని ...తనని...ముద్దు పెట్టుకున్నాడు.

    అబ్బ ! ఛీ! ఎంత రోత !

    తాను ...మలినపడిందా ?

    తేజయితే ఏమంటుంది ?

    "ప్రజ్ఞా ! ఈ నాలుగు గోడల మధ్యా కూచుని పురాణాలు, మంత్రాలూ వల్లెవేసుకుంటూ జీవితానికి వందమైళ్ళు  వెనుకన నడవడం జీవితమనిపించుకోదు. సిటీస్ లోకి పోయిచూడు. ఎంత ఫాస్ట్ గా, ఎడ్వంచరస్ గా వెళ్ళిపోతున్నారో జనం ! అలా ఉండటాన్ని నేను సమర్దిస్తున్నానని అర్ధం కాదు. కాని ప్రతిదీ తప్పనుకోవటం _ మైలపడిపోయానను కోవటం అవివేకం. ప్రజ్ఞా! నువ్వు నమ్మిన వేదాంతులేమన్నారు? ఈ శరీరం మిధ్య. ఆత్మ ఒక్కటే నిజం. ఒక వస్త్రం విప్పి యింకో వస్త్రాన్ని ధరించినట్లు అవసరాన్నిబట్టి యీ ఆత్మ అనేక శరీరాలను ధరిస్తూ వుంటుంది. వాటి బాగోగులతో శరీరానికి నిమిత్తం లేదు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం శరీరం అందంగా ఉండటం పైపై మెరుగులయితే మైలపడటం కూడా అలాంటి అబద్దమే.

    ప్రజ్ఞ సమాధాన పడలేకపోతోంది. శరీరం వేరూ, ఆత్మ వేరూ అనేది కొన్ని సిద్దాంతాల ప్రకారం  నిజమయితే కావచ్చుగానీ _ శరీరం బాగోగులు అవసరం లేదనడం ఆమె భరించలేకపోతోంది.


                                                 12



    గోపీకృష్ణ అయిదారు రోజులనుంచీ పెచ్చెక్కినట్లుగా అయిపోతున్నాడు. అస్మిత పరీక్షలయినప్పట్నుంచీ అసలు కనబడటం మానేసింది. ఒకవైపు యింట్లో ఆర్ధిక పరిస్థితుల వత్తిడి ఎక్కువయిపోతోంది. తండ్రి రోజు రోజుకూ మూలపడిపోతున్నారు. అయిదూ పదీ కావాలంటే అక్కయ్య నడిగి తీసుకోవాల్సి వస్తుంది. కాని అవెందుకూ సరిపోవటం లేదు. తల్లి ప్రవర్తన రోజు రోజుకూ వింతగా మారుతోంది. ఒక రకంగా ఆమె సైకియేమో అనిపిస్తుంది.

    ఈ చాలీ చాలని జీవితంలో తాను యిమడలేకపోతున్నాడు. మనిషై పుట్టాక జీవితాన్ని సాధించి తీరాలి. డబ్బు సంపాదించాలి. కాని యీ రకం కుటుంబాలలో పుట్టి అడ్డదార్లు లేకుండా డబ్బు సంపాదించటమసాధ్యమని అర్ధం చేసుకున్నాడు.
    అందుకే ...అస్మితను పొంది తీరాలి.

    ఆమె నెలాగైనా కలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆమె యింటిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.
    చివరకు ఓ రోజు అతని ప్రయత్నం ఫలించింది. ఓ సాయంత్రం ఆరుగంటలవేళ అస్మిత వాళ్ళ  అమ్మగారితో కలిసి బయటికొచ్చింది. ఇద్దరూ కలిసి రిక్షాలో బజారుకెళ్ళారు. గోపీకృష్ణ దగ్గర్లో వున్న ఓ అద్దెసైకిల్ అద్దెకు తీసుకుని వెనకాల వెళ్ళాడు.

    అస్మితా, వాళ్ళమ్మగారు ఓ బట్టల కొట్లోకెళ్ళారు. గోపీకృష్ణ సిగరెట్ కాల్చుకుంటూ ఫుట్ పాత్ మీద నిలబడి ఓరకంట  వాళ్ళని గమనిస్తున్నాడు.

    అస్మిత అతన్ని చూస్తోనే వుంది. సమయమొస్తే బయటికొచ్చి అతన్ని పలకరిద్దామని ఆమె మనసు ఉవ్విళ్ళూరుతోంది.

    అస్మిత తల్లి షోకేస్ లోని చీరలన్నీ బయటకు తీయించి ప్రక్కన పెట్టిస్తోంది. అది నగరంలోని పెద్ద షాపుల్లో ఒకటి.

    అక్కడ ఉన్నన్ని వెరయిటీస్  చాలా తక్కువ షాపుల్లో వుంటాయి" అన్నాడు సేల్స్ మన్.

    ఆమె చీరల మైకంలోపడి అస్మిత వంక 'రా' అన్నట్లు చూసింది.

    "నేనిక్కడ కూచుంటాను. నువ్వే వెళ్ళి చూసిరా మమ్మీ!" అంది అస్మిత.

    చీరల పిచ్చిలో ఆమె కుమార్తె చుట్టూ విధించిన నిబంధనలు తాత్కాలికంగా మరిచిపోయింది. సేల్స్ మన్ వెంట లోపలికెళ్ళింది.

    అస్మిత అలాంటి అదను కోసమే చూస్తోంది. తల్లి లోపలకు వెళ్ళగానే గభాల్న లేచి రోడ్డుమీదకు వచ్చింది.

 

 Previous Page Next Page