శ్రీనాద్ గది మద్యలో కుర్చీలో కూర్చుని తల వెనక్కు వాల్చి టేప్ రికార్డ్ లో నెమ్మదిగా వినబడుతున్న ముఖేష్ పాట తన్మయత్వంతో వింటున్నాడు.
"చాంద్ కీ రీవార్ నతోడీ---ప్యార్ భారదిల్ తోడ్ దియా......"
అతని ముందు టీపాయ్ మీద మందు బాటిలూ, సగం నింపిన గ్లాసూ, నీళ్ళ జగ్ వున్నాయి.
ఉండుండి తను కూడా ఆ పాటతో పాటు గొంతు కలుపుతున్నాడు.
అతని వంకే చూస్తుంటే మళ్ళీ నిద్రలో వచ్చిన కలలోకి వెళ్ళిపోతున్న ఫీలింగ్ కలుగుతోంది.
అతని కౌగిట్లో వాలిపోవటం, అతని గొంతు విని పులకించి పోవడం, తన్మయత్వం తో కళ్ళు మూసుకోవటం......అలా ఎంతసేపు నిలబదిపోయిందో తెలియదు.
"మీరా!" అతని గొంతు అతి సమీపంలో విని చటుక్కున కళ్ళు తెరిచింది.
అతను అవతలి వేపు కిటికీ దగ్గరకొచ్చి నిలబడ్డాడు.
అతని చేతిలోని గ్లాస్ ఖాళీ అయిపొయింది.
ఉమాదేవి సిగ్గుపడింది.
"ఈ టేప్ రికార్డర్ తో మిమ్మల్నేమీ డిస్టర్బ్ చేయలేదు కదా?"
"ఉహు.........అదేం లేదు. నాకే నిద్రపట్టక ఏం చేస్తున్నారో చూద్దామని ఈ కిటికీ తెరిచాను."
"చాలా మంచి పని చేశారు. కుర్చీ లాక్కుని కూర్చోండి. కాసేపు కబుర్లు చెప్పుకుందాం."
కుర్చీ కిటికీ దగ్గరకు లాక్కుని సెటిలయ్యాడు.
ఉమాదేవి కూడా కుర్చీలో కూర్చుంది.
మీరీ మందు ఎక్కువగా తాగి షూటింగ్ లకు వెళ్లకపోవటం వలనే సినిమా ఫీల్డ్ కి దూరమయ్యారని వారపత్రికలలో చదివాను. ఎందుకంతగా తాగుడికి అలవాటు పడిపోయారు?"
"ముందు కంపెనీ కోసం తాగేవాడిని తర్వాత ప్రొడ్యుసర్ డబ్బులతో తాగుతున్నాం కదా అని మరికొంచెం తాగడం నేర్చుకున్నాను. ఆ తర్వాత మా హీరోయిన్ రత్నాతో గొడవొచ్చినప్పుడు యింక తిరులేనంతగా అలవాటయిపోయింది."
ఉమాదేవి నవ్వింది.
"మీరు , రత్నా చాలాకాలం ప్రేమకలాపాలు జరిపారని అప్పట్లో పత్రికల్లో రాశారు. నిజమేనా?"
నిజమన్నర! జరపకేం చేస్తాం? పక్క పక్క బిల్డింగ్స్ కదా! కాకపోతే గోడవెక్కడోచ్చిందంటే పెళ్ళి చేసుకుందామని పట్టుబట్టింది. నా పెళ్ళాం పిల్లల్ని వదిలి తనను చేసుకుంటే ఇద్దరం అల్లరయిపోతామని ఎంత చెప్పినా విన్లేదు. మా ఇద్దరికీ ఎఫయిర్ జరుగుతోందని జెలసీ ఫీలయే జనం చాలామంది వుంటారు కదా! వాళ్ళు ఆమెకి వున్నవీ, లేనివీ కల్పించి చెప్పి నాకు వ్యతిరేకంగా ఓ సినిమా పత్రికలో స్టేట్ మెంట్ యిప్పించారు....." శ్రీధర్ నన్ను పెళ్ళి చేసుకుంటానని మోసగించాడు" అని.
"అవును! మేమంతా ఆ పత్రిక కొని మరీ చదివాం ఆ విషయం" వుత్సాహంగా చెప్పింది ఉమాదేవి.
"అప్పుడేమనుకున్నారు మా గురించి?"
"మీరు ఇంకో హీరోయిన్ మోజులో పడి ఆమెను మోసగించారానుకున్నాం! మా ఫ్రెండ్స్ ఏమో ఈ సినిమా వాళ్ళందరూ యింతే! రోజుకో కొత్త పార్టనర్ కావాలి అన్నారు" నవ్వేస్తూ చెప్పింది.
శ్రీనాద్ కూడా నవ్వేశాడు.
"మీరేమనుకున్నారు?"
ఉమాదేవి సిగ్గుపడింది. పైట సర్దుకుంది అప్రయత్నంగా.
"మీరు మోసగాళ్లనే........"
అతను నవ్వేశాడు.
"మీ అడాళ్ళందరితో ఇదే చావు. నాకు తేలీకడుగుతాను? ఇద్దరికీ యిష్టమైనప్పుడు యింక 'మోసం' అనే ప్రశ్న ఎందుకొస్తుంది?"
"పెళ్ళి చేసుకుంటానని చేసుకోకపోవటం మోసం కాదా?"
"ఎలా అవుతుంది? పెళ్ళి వేరు, సెక్స్ వేరు కదా?"
ఉమాదేవి తల వంచేసుకుంది. "నాకు తెలీదదంతా!" అంది నెమ్మదిగా.
"ఉదాహరణకి మీరంటే నాకు ఇష్టం ఏర్పడిందనుకోండి! అలాగే నేనన్నా మీకు యిష్టముందనుకోండి! ఇద్దరం ప్రణయం జరుపుతాం! ఇందులో పెళ్ళి ప్రసక్తి ఎందుకొస్తుంది? అవునంటారా? కాదంటారా?"
"అవును!"
"అయితే మరెప్పుడు?"
ఆమె కంగారు పడింది.
"ఏమిటి ఎప్పుడు?"
"అదే! మనిద్దరం కలుసుకోవటం"
ఉమాదేవి చప్పున లేవబోయింది తొట్రుపాటుతో.
అతను పకపకా నవ్వసాగాడు.
"అరెరే' అంత భయపడిపోతున్నారేమిటి? మీకిష్టం లేకపోతే అలా మాట్లాడనులెండి! కూర్చోండి."
"ఇంక నాకు నిద్రొస్తోంది."
'అంతా అబద్దం! అన్నట్లు మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు?"