"నాకు నచ్చినవాడు దొరకలేదు."
"అంటే ఎలాగ వుండాలేమిటి? నాకంటే అందగాడయి వుండాలా?"
"అదికాదు! డబ్బు కోసం కాకుండా , నాకోసం నన్ను పెళ్ళి చేసుకునే వాడయి వుండాలి."
"అలాంటి వాడొక్కడు కూడా లేడా?"
"లేడని నేనన్నానా గానీ.....నా బాడ్ లక్ ! అంతే!"
"మీరు విప్లవనారీ సమితి మెంబరంట కదా?"
"ఎవరు చెప్పారు?"
"నటరాజ్!"
"నా గురించి ఎంక్వయిరీ చేశారన్న మాట!"
"మా సినిమా వాళ్ళ వీక్ నెస్ అది! కళ్ళు చెదిరే అందం కనబడితే చాలు........వెంటనే పూర్తీ వివరాలు సేకరించేస్తాం."
"నేనేం అంత అందగత్తెను కాదులెండి."
"మాములు జనం కళ్ళు వేరు......మా సినిమా జనం కళ్ళు వేరు."
నటరాజ్ కళ్ళు నులుముకుంటూ వచ్చాడతని గదిలోకి.
"గదిలో నుంచి ఒకటే మాటలు వినబడుతున్నాయేమిటా అని వచ్చాను. మంచి కంపెనీ దొరికింది మీకు. విప్లవనారీ సమితి గురించి కబుర్లు మొదలెట్టారంటే రెండు మూడేళ్ళు సరిపడా మేటర్ డిక్టేట్ చేస్తుందామె!"
ఉమాదేవికి కోపమొచ్చింది.
"ఏయ్ నటరాజ్! నీ సంగతి నువ్వు చూసుకో!" అంటూ కిటికీ తలుపులు మూసేసింది విసురుగా.
మిగతా రాత్రంతా కూడా ఉమాదేవికి నిద్ర పట్టలేదు.
ఎందుకో తెలీని ఎగ్జయిట్ మెంట్!
శ్రీనాద్ తనమీద మోజు పడటం ఓ వింత అనుభూతినిస్తోంది.
ఎంతో మంది అందగత్తెలయిన హీరోయిన్లతో ప్రణయాలు జరిపిన వ్యక్తికీ తన మీద ఆకర్షణ కలిగిందంటే.........దాన్నెలా తీసుకోవాలి?
గర్వపడాలా? చిరాకు పడాలా? అసహ్యించుకోవాలా?
మనసు శరీరం .....రెండూ తన స్వాధీనం తప్పుతున్నాయా?
కళ్ళు మూస్తే చాలు అతని కౌగిట్లో నలిగిపోతున్న ఫీలింగ్! ఏదీ కలో ఏది నిజమో తెలీని వింత పరిస్థితి.
ఎందుకింత ఆరాటపడిపోతోంది తను?
ఉదయం లేచి ఎప్పుడూ లేనిది చాలా శ్రద్ధగా అలంకరించుకుందామే. అన్ని అలంకరణలు అయ్యాక అద్దంలో చూసుకుంటుంటే ఒకవేళ శ్రీధర్ తన అందం గురించి చెప్పిన మాటలు నిజమేనేమోననిపించింది.
ఎప్పుడూ కనిపించనంత అందంగా వుంది.
బహుశా దీపం ఆరిపోయే ముందు వెలిగే వెలుగు లాంటిదేమోయిది.
తనలోని యవ్వనం వాడిపోయే ముందు వెలిగే అందం. ఆ అందాలు వాదేలోగానే తమ ఆనందాల్ని అందుకోబాలి.
అప్పుడే పెద్ద శబ్దంతో అద్భుతమైన క్వాలిటీతో వినిపించసాగింది పాట.
"అందమే అనందం- ఆనందమే జీవిత మకరందం"
ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి.\
పెద్ద పెద్ద అంగలతో రామచంద్రమూర్తి ఇంటివేపు నడిచింది.
హాల్లో అంతా అమితమైన ఆనందంతో ఆ పాట వింటున్నారు.
గ్రామఫోన్ యధాప్రకారం దాని స్థానంలో వుంది. కొత్త రికార్డ్ అవటం వల్ల పాట చాలా చక్కగా వినబడుతోంది.
"హలో ఉమాదేవి! రా! రా! చూసావా గ్రామఫోన్.......మళ్ళీ వచ్చేసింది" గర్వంగా అన్నాడు రామచంద్రమూర్తి.
"ఎలా తెచ్చారు?"
"శ్రీనాద్ గారి దయ ఉదయం అడ్వాన్స్ యిచ్చారు. ఇవ్వగానే డబ్బు కట్టి వెళ్ళి తీసుకొచ్చేసాను" అన్నాడు నటరాజ్.
శ్రీనాద్ తనవంకే తదేకంగా చూడటం గమనించి సిగ్గుపడి చూపులు మరల్చుకుందామె.
"'అవునూ ఇవాళ ఉమాదేవి గెటప్ మారిపోయిందేమిటి?" సంబరంగా చూస్తూ అడిగాడు రామచంద్రమూర్తి.
సీత మోహంలో విస్మయం కనబడుతూనే వుంది. ఆమెకు ఉమాదేవి అలంకరణ అనుమానం కలిగించింది.
"సినిమా హీరోలు మనింట్లో ఉన్నప్పుడు సినిమా వాతావరణం వచ్చేస్తుంది కదా" అందామె.
ఉమాదేవి ఉలిక్కిపడింది.
సీత సామాన్యురాలు కాదు. తన విషయం పసిగట్టేసింది. కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి.
"నాకింకా ఇంత గ్లామర్ ఉందంటే నమ్మబుద్ది కావటం లేదు. నేను ఈ ఫీల్డ్ నుంచి పూర్తిగా రిటైరయిపోయినా కూడా తెలుగు ప్రజలు నన్ను యిలాగే అభిమానిస్తారంటారా?" రామచంద్రమూర్తిని అడిగాడతను.
"నన్నడిగితే తమరు రిటైరయితే ఇంకా ఎక్కువ ఆదరిస్తారండీ!"
"అంటే నీ ఉద్దేశ్యం?"
అందరూ ఘొల్లున నవ్వేశారు.
",మరేం లేద్సార్! మీ అభిమానులు మీకెప్పుడూ ఎలాగూ ఉంటారు. మీరంటే , మీ నటనంటే బొత్తిగా నచ్చని వారు కూడా మీరు రిటైరయ్యారు కాబట్టి మిమ్మల్ని అభిమానిమ్చటం మొదలుపెడతారు. అంటే మీ అభిమానుల సంఖ్య పెరిగినట్టే కదా?"