అఖిలభాను తన కుర్చీలోని దిండు తీసి విసిరి కొట్టింది శ్యామ్ మీద.
అందరూ గట్టిగా నవ్వేశారు.
9
రాత్రి ఎనిమిదయింది. శ్యామ్, భవానీశంకర్ కలిసి నైటింగేల్ హోటల్ చేరుకునే సరికి భారత సంస్కృతీకి అనుగుణంగా స్టేజీ మీద నలుగురు అమ్మాయిలు భరతనాట్యం చేస్తున్నారు.
రాత్రి పదకొండయ్యేసరికి ఆ భరతనాట్యమే కాబరేడాన్స్ గా మారిపోతుందని అందరికీ తెలుసు.
భవానీ శంకర్, శ్యామ్ స్టేజీకి దగ్గరగా వున్న టేబుల్ ముందు కూర్చున్నారు. బేరర్ వినయంగా వచ్చి నిలబడ్డాడు ఆ టేబుల్ దగ్గర.
"ఏం కావాలి సార్?"
"ఆ డాన్స్ చేస్తున్న అమ్మాయిల్లో ఒకమ్మాయ్ కావాలి?"
బేరర్ అదిరిపడి భవానీశంకర్ వేపు మరోసారి చూసి తల గోక్కున్నాడు.
"ఇప్పుడా సార్?"
"ఇప్పుడే."
"రాత్రి పన్నెండు తరువాతయితే ఒకమ్మాయి దొరుకుతుంది సార్" ఈలోగా కావాలంటే కష్టం!"
"ఒకవేళ నీకు యాభయ్ రూపాయలిస్తామనుకో! అప్పుడు కూడా దొరకదా!" అడిగాడు భవానీశంకర్. వాడి ముఖంలో ఆశ స్పష్టంగా కనిపించింది.
"కష్టం సార్-"
"పోనీ వందరూపాయలు నీకిస్తే?"
వాడు అడిరిపోయాడు, "సరే సార్! ఇప్పుడే వస్తాను" అంటూ లోపలికెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నలుగురు డాన్సింగ్ గాళ్స్ లో ఒకామె లోపలికి వెళ్ళిపోయింది. మరికొద్ది సేపటి తర్వాత బేరర్ తిరిగి వచ్చాడు.
"ఓ అమ్మాయి ఒప్పుకుంది సార్. కాని ముందే చెప్పమంది వెయ్యి రూపాయలివ్వాలట!"
"డబ్బు కోసం వర్రీ అవకు కామ్రేడ్! కుక్కను తంతే పడుతుంది డబ్బు! కాకపోతే ఏ కుక్కనీ అనేది తెలీటంలేదు మనకి!"
"అయితే ఇలా - నావెంట రండి సార్- వెనుక వేపు మెడ మీద గదులు వున్నాయి. " భవానీశంకర్ లేచి శ్యాం కి కన్ను కొట్టాడు.
"వెళ్ళి వస్తాను కామ్రేడ్! పదినిమిషాలు టైమిచ్చి ఆ ఆతరువాత మనం అనుకున్న కార్యక్రమం ప్రారంభించు" అంటూ శ్యాంతో చెప్పి బేరర్ వెంబడి లోపలికి నడిచాడు భవానీశంకర్. హోటల్ వెనుక వున్న గార్డెన్ లో నిలబడి తనకోసమే ఎదురుచూస్తోంది ఆ అమ్మాయి.
"హలో" అంది భవానీశంకర్ని చూస్తూ చిరునవ్వుతో.
"హలో అంటూ ఆమెకి సమీపంగా నడిచాడతను.
ఆమెలో అందం కన్నా, సెక్స్ తనం ఎక్కువగా వుంది. శరీరపు వంపుల్ని కావాలనే బహిర్గత పరుస్తోన్నట్లు తెలిసిపోతోంది.
:"మీరు చాలా సెక్సీగా వున్నారు కామ్రేడ్! మనం స్వర్గద్వారాల వరకూ ప్రయాణం చేద్దాం పదండి" అన్నాడతను ఆమె చేయి పట్టుకుని.
ఆమె అందంగా నవ్వింది.
"పదండి"
ఇద్దరూ మేడమీద గదిలోకి నడిచారు. చాలా చిన్న గది అది. ఒక డబల్ కాట్, వాష్ బెసినూ, మాత్రం వున్నాయి. అయితే గది నీటుగా వుంది. గదిలోకి రాగానే తలుపులు మూసి బోల్టు వేసిందామే.
"లైటు వుంచాలా , తీసేయాలా?" అడిగిందామె అతనికి అభిముఖంగా నిలబడి.
"నేను నీతో మాట్లాడటానికి వచ్చాను కామ్రేడ్ - నువ్వనుకుంటున్నట్లు ఫన్ ఫన్ ప్రోగ్రాం కోసం కాదు"
"ఏం మాట్లాడటానికి?" తన మాక్సీ హుక్స్ తీయబోతూ ఆపి అనుమానంగా అడిగిందామె.
"కొన్ని వివరాలు కావాలి కామ్రేడ్ - చాలా అర్జెంట్"
ఆమె వూడిన హుక్స్ మళ్ళీ పెట్టేసుకుంది.
"అలాగయితే ప్లీజ్ గెటౌట్" అందామె తలుపు మళ్ళీ తీయబోతూ.
భవానీశంకర్ చప్పున లేచి తలుపు తెరవకుండా ఆమె చేతి మీద చేయి వేసి పట్టుకున్నాడు.
"వదులు నీకేం కావాలో నాకు తెలుసు! నువ్వో రచ్జయితవో, జర్నలిస్టువో అయ్యుంటావు! నేనెలా ఈ వృత్తిలోకొచ్చాను, ఎంత సంపాదిస్తున్నాను. ఎవరివరితో గడిపాను ఇవన్నీ కావాలి నీకు. అది పబ్లిష్ చేసి వెయ్యో, రెండు వేలో సంపాదిస్తావూ కదూ?" కోపంగా చేయి విదిలించుకుంటూ అందామె.
"పొరపాటుపడ్డావు ఫ్రెండ్! కేస్ అదికాదు"
"నా జీవిత చరిత్ర కావాలని చెప్పి - కిందటిసారి ఆ రచయితేవరో రాత్రంతా నన్నూ, నా కధనూ రెండూ వాడుకుని నాకివ్వాల్సిన డబ్బు కూడా బాకీ పెట్టి పారిపోయాడు. బాస్టర్డ్ - అప్పటినుంచీ నాకు రచయితలన్నా, జర్నలిస్టులన్నా ద్వేషం , ఐ హెట్ దెం"
భవానీశంకర్ ఆమెను బలవంతంగా లాగి మంచం మీద కూర్చోబెట్టి తను పక్కనే కూర్చున్నాడు.
"నన్నోదులు" కోపంగా అందామె.
"నేను చెప్పేది విని తర్వాత మాట్లాడు కామ్రేడ్ -రేడియో ఇంటర్వ్యులూ, ప్రోగ్రామ్స్ లో లాగా అందరూ ఒకేసారి మాట్లాడకూడదు. నాకు కావలసింది నువ్వు కాదు నీ ఆత్మ కాదు."
"మరి?"
"సునంద గురించి వివరాలు కావాలి. ఆ వివరాలు అందజేసినందుకుగ్గాను ఇదిగో ఈ వందరూపాయలు నీదవుతుంది - ఏమంటావు?"