ఆ డైరెక్టర్ పేరు భగీరథ అని తెలుసుకున్నాడు గణపతి.
"ఎక్కడికెళ్ళాడో.... ఏమైపోయాడో....పట్నంలో కంటికి తెలీకుండా కనుపాపని పెకలిస్తారట!" దిగులుగా అంది సూరమ్మ.
ఆ రోజుకి నాలుగు రోజులైంది గణపతి కనిపించక.
ప్రకాశానికి విషయం తెలిసి మండిపడ్డాడు. "వెధవ కనపడితే వీపు చీరేస్తా!" అన్నాడు.
వాతల తాతయ్య "పేపర్లో ప్రకటనిద్దామా?" అన్నాడు.
"అసలంతా నీ వల్లొచ్చింది? "వదిలేసినమ్మా.... వదిలేసినమ్మా వియ్యం అందుతుంటే... అన్నీ విడిచినమ్మెళ్ళి హారతి పట్టిందట..... నువ్వు ఈ దిక్కుమాలిన పేపర్లో పడిన ప్రతి అక్షరం అందరికీ చెప్పకపోతేనేం? ఆ ముసలి సోమరాజుకి మార్కెట్లోకి యవ్వనం ఇచ్చే మందేదో వచ్చిందని చెప్పావుట. వాడు రాత్రికి రాత్రి బొంబాయి వెళ్ళాడు. వాడి మూడో పెళ్ళాం ఒకటే ఏడుపు..... అసలే వాడికి ఒళ్ళంతా బీ.పీ... షుగరూ.... తిరిగొస్తాడో రాడో.....! నువ్వు పొయ్యాకా పెద్ద కర్మకి పేపర్లో ఫోటో వేయిస్తే చూసుకోలేవు కాబట్టి ఇప్పుడే వేయించనేమిటీ?" ప్రకాశం మండిపడుతూ అడిగాడు.
తాయారమ్మ మంచంలో లేచి కూర్చుని "అన్నింటికి వాడ్ని తీసి పారెయ్యకపోతే.... ఓసారి వాడు చెప్పినట్లే చేసి చూడరాదూ! పిచ్చి సన్యాసి.....అసలే ఆకలికి ఆగలేడు!" అంది.
"తీసుకెళ్ళాడుగా పదకొండువేల రూపాయలు! బాబుగారు దర్జాగానే వెలగబెడుతుంటాడు!" అన్నాడు ప్రకాశం.
ఈ మాటలకి సూరమ్మ మళ్ళీ ఏడుపు అందుకుంది.
"ప్రకాశం ... పదకొండువేలు పోతే మన పిల్లాడికి దిష్టి తీసి పారేశాం అనుకుంటాం.... పిల్లాడు క్షేమంగా ఇంటికొస్తే పానకం పోయిద్దాం. సంతర్పణ చేయిద్దాం. ఇంక డబ్బు సంగతి ఎత్తకు!" గట్టిగా చెప్పింది పార్వతమ్మ.
ప్రకాశం వదినగారివైపు చూశాడు. కన్నబిడ్డ ఆర్తితో 'అమ్మా' అంటేనే కాదు, ఏ బిడ్డా బాధతో 'అమ్మా' అన్నా తల్లడిల్లిపోవడమెగా అమ్మతనం అంటే అనిపించింది అతనికి.
"పెద్దాడొస్తే ఈ విషయం తెలిస్తే ప్రళయకాల వీరభద్రుడే అవుతాడు. ఎలాగో ఏమో!" భయంగా అంది సూరమ్మ.
"గుళ్ళో సీతమ్మా.... ఇంట్లో వదినమ్మా ఉన్నారుగా అడ్డుపడడానికీ!" అన్నాడు చిన్నగా ప్రకాశం.
"మాటలతోనే పొద్దుపోతోంది పొలంవైపు వెళ్ళేది లేదా?" అడిగింది మాట మార్చడానికి పార్వతమ్మ.
ప్రకాశం ఆ మాటకి లేచి "స్నానానికి నీళ్ళు పెట్టావా?" అంటూ లోపలికి వెళ్ళాడు.
పార్వతమ్మ సూరమ్మ భుజంమీద చెయ్యివేసి "ఏ శక్తో అడ్డుపడి వాడు వెనక్కొచ్చేట్లు చేస్తుంది చూడు! నామాట ఎన్నడూ పొల్లుపోలేదు! ధైర్యంగా ఉండొదినా!" అంది.
* * *
"ఏమన్నారూ? వేషం లేదన్నారా?" స్లిమ్ గా, ట్రిమ్ గా ఉన్న అమ్మాయి వీణ తీగ మీటినట్లుగా అడిగింది.
బస్ స్టాప్ లో అటూ ఇటూ చూశాడు గణపతి! "మిమ్మల్నే..... గుర్తుపట్టలేదా?" అంది.
అప్పుడు గుర్తుపట్టాడు ఆమెను ఆమె తిలకా కొయిరాలా!
"లేదు తప్పకుండా ఇస్తానన్నాడు!" అన్నాడు.
ఆమె విరక్తిగా నవ్వి, "ఇవ్వను అని చెప్పినందుకు బాధపడటం లేదు నేను. ఏమీ చెప్పకుండా తెగ తిప్పిన వాళ్ళకంటే ఇతనే బెటర్!" అంది.
"ఇంత టాలెంట్... ఇంత అందమూ, తెలివీ ఉన్న మీకు ఛాన్స్ లు ఎందుకు రావడంలేదూ?" అన్నాడు.
ఆమె అక్కడున్న గుంజకి ఆనుకుని నిలబడి "బ్యాకింగ్ లేక?" అంది.
గణపతి కాస్త చొరవగా "ఎక్కడికెళ్ళాలీ?" అని అడిగాడు.
"అన్నపూర్ణా స్టూడియోస్ కి!" అంది.
గణపతి కళ్ళు విశాలం చేసి "ఎందుకూ?" అన్నాడు.
"అదృష్టం బాగుంటే ఏదో ఓ చిన్న వేషం దొరక్కపోదు కనీసం తిప్పలు పడక్కరలేదు!" అంది.
"వెళ్ళి అడిగితే ఇస్తారా?" అడిగాడు కుతూహలంగా.
ఆమె అతనివంక జాలిగా చూసి, "జూనియర్ ఆర్టిస్ట్ సప్లైర్ ఉంటాడు. అతన్ని అడిగితే ఎడ్జస్ట్ చేస్తాడు. సాధారణంగా నాకు, ఉన్నా చెప్పడు!" అంది.
"ఏం?"
"నేనిలా హీరోయిన్ వేషాలకోసం ట్రై చేస్తున్నానని అతనికి మంట. చెప్పిన మాట వింటే నెలంతా ఎక్కడో చోట పనిప్పిస్తానుగా అంటాడు. పొద్దుట టిఫినూ... మధ్యాహ్నం, రాత్రీ భోజనం పెట్టి నూటయాభై ఇస్తారు!"
"మరి ఇంకేం?" అన్నాడు గణపతి.
ఆమె అతడి కళ్ళల్లోకి తీక్షణంగా చూసింది. "సంవత్సరాల తరబడీ ఇక్కడ కూర్చుని రచయితలుగానో, డైరెక్టర్ లుగానో, ఏక్టర్లగానో, ప్రూవ్ చేసుకోవాలను కుంటున్న వాళ్ళంతా ఒకపూట తిండికోసం వేరే వృత్తులు చేసుకోలేని వాళ్ళు కాదు! ఒక డెఫినెట్ గోల్ పెట్టుకుని దాన్ని ఎచీవ్ చెయ్యాలనుకుంటారు. గొప్పింటి కుర్రాడిలా ఉన్నావు. నీ దగ్గర ఘాటైన వాసన కొడ్తోంది....మీనాన్నకి మిరపచేనుందా!" అంది.
గణపతికి తను గొప్పింటి కుర్రాడిలా కనిపించినందుకు కాస్త గర్వం అనిపించినా ఆమెకి ఎందుకో అబద్దం చెప్పాలనిపించలేదు. "నాకు నాన్న చిన్నప్పుడే పోయాడు. మా అమ్మ నన్ను తీసుకుని మా మేనమామల దగ్గరకొచ్చేసింది. మావయ్యకి వ్యవసాయం ఉంది. వరి పండుతుంది!" అన్నాడు.
తిలక నిట్టూర్చి "ఏ ఊరూ" అంది.
"వరదరాజపురం!"
"బాగుంటుందా?"
"ఆ..... రేపల్లెలా ఉంటుంది."
"రాధ కూడా ఉందా?" చిలిపిగా అడిగింది.
గణపతికి రాధ గుర్తొచ్చింది. ఆమె వయసే ఉన్న తిలక నిట్టూర్పులో ఎంత బరువుందీ! జీవితాన్ని కాచి వడబోసిన వైరాగ్యం ఉంది.
"మా మావయ్య కూతురి పేరు అదే! కానీ మాధవుడు వేరే ఉన్నాడు!" అన్నాడు.
తిలక నవ్వి, "హాయిగా పెరుగన్నం తిని, గుమ్మపాలు తాగేవాడివి ఇక్కడ ఏం చేయడానికొచ్చావు? తాటి చెట్టుకింద కూర్చుని పాలు తాగినా నమ్మరు. మీ ఊరెళ్ళిపో - అనుభవంతో చెప్పుతున్నాను!" అని కాస్త తూలి పడిపోయింది.