ఈ పొగడ్తకు సుజాత హృదయం సంతోషంతో ఉప్పొంగింది. జానకిరాంని ఎవరైనా పొగిడితే ఆమెకు అలానే వుంటుంది.
"నీకు సినిమాలో చాన్స్ వస్తే వెళతావా సుజాతా?" అని ప్రశ్నించాడు ప్రభాకరం.
"తెలియదు."
"అంటే?"
"అది మాష్టర్ యిష్టంమీద ఆధారపడి వుంది."
ప్రభాకరం కాస్సేపాగి "సరియైన నటికోసం ఆయన అయిదేళ్ళు అన్వేషణ సాగించాడు. నీకు తెలుసా సుజాతా? వెదికి వెదికి నిన్ను కనుక్కున్నాడు. నీ లోని టాలెంట్ ని చూసీ చూడగానే ఎట్లా గ్రహించాడో మరి" అన్నాడు.
ఆమె సిగ్గుపడింది "నాలో టాలెంట్ ఏమీలేదు. అలా తయారు చేయబడ్డానంతే" అంది.
ఇద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ నడిచారు. ప్రభాకరం ఈ సంస్థ ఏదో కొత్తనాటకం ప్రదర్శించటానికి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు. ఈ కొత్తనాటకంలో తనకు స్థానముంటుందా అనుకుంది సుజాత. జానకిరాం మరో క్రొత్త హీరోయిన్ని పట్టుకువస్తాడేమో?
ఆమె పరధ్యాస చూసి ప్రభాకరం 'కాఫీ త్రాగుదామా?' అని అడిగాడు.
"వద్దు, పద."
బీచ్ లో సుబ్బారావు కనిపించాడు. అతనీ జంటను పరిహాసంగా చూచి "ఓహో, తలనొప్పి ఎగిరిపోయిందా సుజాతా?" అన్నాడు.
"నువ్వు యిక్కడకు రానని చెప్పావేం?" అని సుజాత అడిగింది.
"క్రొత్త క్రొత్త విషయాలు తెలుస్తాయని."
"తెలుసుకున్నావా?" అందామె వెటకారంగా.
అతను చప్పున నవ్వి "గొప్ప నటివి నువ్వు" అంటూ గబగబా అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
అక్కడ ఇసుకలో కూలబడి, ఆమె కోపంగా "ప్రపంచంలో గొప్పతనం ఎక్కడవుందో భయంకర విమర్శకూడా అక్కడే వుంది" అంది.
ప్రభాకరం ఆమెను ఓదార్చాడు. "బాధపడకు సుజాతా, వాడొట్టి తొందర మనిషి మనసులో మాత్రం ఏమీ వుండదు."
"అదో ప్రత్యేకత కాబోలు" అన్నదామె ఇంకా కోపంగానే "అసలెవర్నీ లెక్కచేయకూడదు. వీళ్ళందర్నీ తృణప్రాయంగా ఎంచాలి" అని మనసులో అనుకుంది.
చీకటి పడేవరకూ ఇద్దరూ అలాగే కూచున్నారు. అప్పుడులేచి ఇంటిదారి పట్టారు.
సుజాత ఇంటికి చేరేసరికి అనూరాధ వచ్చివుంది. లేసు అల్లుకుంటోంది. "ఇవాళ రిహార్సల్స్ అయిపోయిందా చెల్లీ?" అని అడిగింది తల ఎత్తి.
"ఇవాళ లేదు, భోజనం చేద్దాం రా అక్కా" అని లోపలకు నడిచింది సుజాత.
11
ప్యాసింజర్ బండి తూర్పుదిక్కుగా మందగమనంతో సాగిపోతోంది. సెకండుక్లాసు కంపార్టుమెంటులో శివనాథరావు, మోహన్, అతని బావగారూ కూర్చున్నారు. మోహన్, బావగారు ఏదో చెప్పుకుపోతున్నారు. అందులో ఎక్కువభాగం పెళ్ళిళ్ళగురించే.
మధ్యాహ్నం మూడుగంటలకు ఊరు సమీపించసాగింది. శివనాథరావు మనసులో ఆ పొలిమేరలు మధురస్మృతులను రేపాయి. అదో కపోతాల మర్రి ఇది చెరువుగట్టు ఈ గట్టుమీద నిల్చునే పధ్నాలుగేళ్ళ పిల్లవాడూ, పదేళ్ళపిల్లా పరిగెత్తే రైలుబండిని చూస్తూ వుండేవాళ్ళు ఆ రోజుల్లో పైనుంచి క్రిందకు ఏటవాలుగా, సరదాగా జారిపోతూండేవాళ్ళు...దూరంగా ఎడారిలాంటి ఇసుక బయలు సహారాని మరిపిస్తోంది.
రైలు నెమ్మదిగా స్టేషనులో ఆగింది.
ముగ్గురూ ఊళ్ళోకివచ్చి కాలిబాటన నడుస్తున్నారు. శివనాథరావులో పాత స్మృతులు చెలరేగుతున్నాయి.
ప్రపంచంలో ఓ విచిత్రం జరిగింది...వాళ్ళు ఆగిన ఇంటిముందు నిల్చున్న వ్యక్తి వెంటనే తొట్రుపడినా, సర్దుకుని చిరునవ్వుతో ఆహ్వానించాడు. 'ఈ బండిలో వస్తారనుకోలేదు' అన్నాడు. మోహన్ పైజామా లాల్చి తొడిగాడు. కళకళలాడుతున్నాడు.
కుర్చీలలో ఆసీనులయాక, ముందు కాఫీ ఫలహారాలూ, తరువాత పెళ్ళి కూతురూ, ఆ తరువాత మృదు మంజులగానమూ వరుసగా అవతరించాయి.
'జాగేలరా' అంటూ కామాలూ, కదలికతోపాటూ అతి సున్నితంగా చూపులూ విదిలిస్తూ-చాకచక్యంగా పెళ్ళికొడుకుని అవలోకించటం శివనాథ రావుకు ముచ్చటవేసింది.
పెళ్ళికూతురు ఆ పాత ఆపి తలవంచుకుని కూర్చుంది. 'ఎంతసేపని అలా కూర్చుంటావు? లోపలకు వెళ్ళమ్మా' అన్నాడు మోహన్ బావగారు.
పెళ్ళికూతురు తెల్లని చిరునవ్వుతో తల వాల్చుకుని కూర్చుంది.
"లేమ్మా, లోపలకు వెళ్ళు" అని తండ్రి ఆదరంగా అన్నాడు.
ఆ అమ్మాయి లేచి చిన్నచిన్న అడుగులు వేస్తూ సుతారంగా లోపలకు వెళ్ళిపోయింది. 'నీకన్నా అందం నీ పాదం' బహుశా మోహన్ ఆ పాదాలసొగసు చూసి పరవశుడైపోవచ్చు.
సాయంత్రం ఆరుగంటలకు అంతా రైలు స్టేషన్ కు చేరుకున్నారు. అప్పుడు శివనాథరావు అన్నాడు హఠాత్తుగా 'నేను రేపు వస్తాను.'
"అదేం?"
"ఈ ఊళ్ళో మాకు చుట్టాలున్నారు. వాళ్ళ యింటికి పోవాలి."
"ఇప్పటిదాకా చెప్పావు కాదేం?"
"అదో తమాషాలే."
"నువ్వు లేకుండా వెళ్ళడం కొంచెం కష్టమే."
శివనాథరావు నవ్వి "మనమిద్దరం మాట్లాడుకోవలసిన విషయాలు చాలా వున్నాయని నాకుతెలుసు. ఒకరాత్రి ఓపిక పట్టాలి మరి" అన్నాడు.
"సరే, సరే."
రైలు వచ్చింది. మోహన్, అతని బావగారు ఎక్కి కూర్చున్నారు. ఓ మూడు నిముషాలకు బండి కదిలింది. కనిపించేటంతవరకూ చూసి స్టేషన్ బయటకు వచ్చాడు. దగ్గరలో వున్న చిన్న కాఫీ హోటలుకు వెళ్ళి టీత్రాగి, అక్కడే చీకటి పడేవరకూ కూర్చున్నాడు. అప్పుడు బయటకు వచ్చి నడక సాగించాడు.
అక్కడక్కడా వీధిదీపాలు వెలుగుతున్నాయి. ఆ చిన్నిచిన్ని సందుల్లో అసలు సందడే లేదు. ఓ పావుగంట గడిచాక ఒక యింటిముందుకు వచ్చి ఆగాడు.
రెండు మెట్లుఎక్కి అరుగుమీదకు పోయి కిటికీలోంచి లోపలకు తొంగి చూశాడు. లోపల ఎక్కడినుంచో దీపం వెలుగు కనిపిస్తోంది. బాగా లోపలగా మనుషులు మెదుల్తోన్న సవ్వడి....తలుపు తట్టాడు.
"ఎవరూ?" ఓ స్త్రీ గొంతు లోపలినుంచి ఓ నిముషం గడిచాక తలుపు తెరుచుకుంది చేతిలో దీపం పట్టుకుని ఎదురుగా సరోజిని నిలుచుని వుంది.
సరోజిని దీపం కొంచెం పైకెత్తి "నువ్వా?" అంది కంపితస్వరంతో.
అతను మెదలకుండా నిలబడ్డాడు.
"ఎందుకొచ్చావ్?"
"రాగలిగాను."
"రా, లోపలికి రా" అంది సరోజిని వెనుదిరుగుతూ.
"సరోజినీ" అన్నాడతను బలహీనంగా "నేనిక్కడ అల్లరిపాలవుతానా?"
"నన్ను మరోసారి అవమానంపాలు చేయకు" అందామె విసుగ్గా.
అతనామెను మౌనంగా అనుసరించాడు. "ఎవరే?" అంటున్నాడతని మామయ్య పెరట్లో మంచం మీదనుంచి.
"బావ!"
"ఏ బావ?"
ఆమె ఏమీ సమాధానం చెప్పకముందే, అతని ఉనికిని గమనించి "పొమ్మను ఇక్కడినుంచి" అని అరిచాడు కోపంగా.
శివనాథరావు నిశ్శబ్దంగా నిలబడ్డాడు.
"ఎవరు రమ్మన్నారతన్ని ఇక్కడికి? ఏం పని ఇక్కడ?"
శివనాథరావు తన ప్రక్కనున్న సరోజినితో మెల్లగా "చెప్పలేదా సరోజినీ వీళ్ళు నన్నవమానం చేస్తారు" అన్నాడు.
"లెక్కచేయకు" అందామె "నేను లెక్కచేయలేదప్పుడు."
అతని మామయ్య ఇంకా తన ధోరణిలో "నీ మొహం నాకు..." అంటూ వుండగా అంతవరకూ స్థాణువులా నిలబడ్డ అతని అత్తయ్య "మీరు కాస్త నోరు ముయ్యండి...రా నాయనా" అంది. అతను ఎవరివంకా చూడకుండా వెళ్ళి అక్కడ ఖాళీగా వున్న ఓ మంచంమీద కూర్చున్నాడు.
"ఇదేనా రావడం?" అనడిగిందావిడ.