"మీరు ఆడవాళ్ళ గురించే ఎందుకు చెపుతారు సార్. నిజానికి తొంభైశాతం మొగవాల్లె అంత, మా కుటుంబ విషయమే తీసుకుంటే..." ఆగింది. అతడు అభావంగా చూశాడు. ఆమె చెప్పటం కొనసాగించింది. "అమ్మ ఎంతో మంచిది. నాన్న తననెప్పుడూ అర్ధం చేసుకోలేదు. మేమందరం గాలికి పెరిగినట్టు పెరిగాం. పాతిక సంవత్సరాలు మా అమ్మ తన ఇష్టాలన్నీ పక్కకు పెట్టి ఒక చెట్టులా కాలం గడిపింది.....కేవలం స్త్రీగా పుట్టినందుకు!! నాన్నకి తన ప్రపంచమే తనది. అమ్మ నెప్పుడూ ఒక మనిషిగానే గుర్తించేవాడు కాదు." ఆమె మరి చెప్పలేదు. ఆ జ్ఞాపకాలవల్ల ఆమె మొహం మ్లానమైంది.
ఆ పరిస్థితి ఇంకా కొనసాగించడం ఇష్టం లేదన్నట్టుగా అతడు లేచి, "వెళ్దామా, క్రింద టాక్సీ వచ్చి వుంటుంది" అన్నాడు. ఆమె కూడా అర్ధం చేసుకున్నట్టు లేచి, బ్యాగ్ చేతిలోకి తీసుకుంది.
ఇద్దరూ హాల్లోకి వస్తూవుండగా, "శర్మగారు తనక్యాబిన్ లో వున్నారేమో" అంటూ ఆమె తన దగ్గిర ఇంటర్ కమ్ బటన్ నొక్కింది. అతడు నిలబడి చూశాడు. నిముషమైనా అట్నుంచి సమాధానం లేకపోవటంతో, "ఇంత రాత్రివరకూ ఆయనెందుకుంటారు? పద వెళ్దాం" అంటూ లిఫ్ట్ వైపు నడిచాడు.
ఇద్దరూ క్రిందికి లిఫ్ట్ లో దిగుతూ వుండగా అతనన్నాడు. "నువ్వు చెప్పింది నిజమే. భార్యాభర్తల్లో ఎవరిది తప్పు అనేది నిర్ణయించలేం. ఎవరి వాదనలు వారికి వుంటాయి. తప్పంతా మన పటిష్టమైన వైవాహిక వ్యవస్థది!" లిఫ్ట్ మూడో అంతస్తు దాటి, రెండో అంతస్తుకి దిగుతూ వుంది.
"ఈ వ్యవస్థలో భార్యాభర్తలు ఎన్ని మనస్పర్ధలున్నా కలిసే వుండాలి. పోనీ అది తప్పు అనుకుంటే - ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోయే అవకాశం వున్న అమెరికాలో కూడా దంపతులు సుఖంగా వున్నారనుకొను. మరి తప్పు ఎక్కడుందో ఆ దేవుడే నిర్ణయించాలి."
అతడి మాటలకి ప్రియంవద నవ్వుతూ వుండగా లిఫ్ట్ ఆగిపోయింది.
మొదటి అంతస్థుకీ రెండో అంతస్థుకీ మధ్య - మొదటి అంతస్థులోకి సగం దిగింది. ఈ హఠాథ్ సంఘటనకి
అతడు నిర్విన్నుడై "మైగాడ్" అన్నాడు. ఈ కుర్రవాడు టైమ్ ఆఫీసులో ఏం చెప్పాడో! కారు లేకపోయేసరికి అందరూ వెళ్ళిపోయారనుకుని మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి వుంటారు - అది నిజమైతే -
ప్రియంవధ అయోమయంగా అతడివైపు చూసింది. మొదటి అంతస్థు వరండాలోంచి వచ్చే గాలి, లిఫ్ట్ ఇనుప వూచలగుండా రివ్వున లోపలికి వస్తూంది. వరండా వెలుతురు కాళ్ళమీద పడుతుంది.
"అదే నిజమైన పక్షంలో ప్రొద్దున్నవరకూ ఇది కదలదు-" పూర్తిచేశాడు రవితేజ బలంగా బెల్ నొక్కుతూ. లిఫ్ట్ కదల్లేదు!
"ఇప్పుడేమిచెయ్యటం?" అంది ప్రియంవద ఆందోళనగా.
"చెయ్యటానికేమీ లేదు. ఎవరికైనా పైకి వచ్చే అవసరం వుండి మళ్ళీ లిఫ్ట్ ఉపయోగిస్తే తప్ప లేకపోతే ప్రొద్దున్నవరకూ ఇంతే.... మీ ఇంట్లో ఎవరైనా కంగారుపడతారా?"
ఆమె జవాబు చెప్పలేదు.
"సినిమాహాలు నుంచి వచ్చిన మా డ్రైవరు కేదైనా అనుమానం వస్తే బహుశ పైకి రావొచ్చు. అసలీ ఆఫీస్ బోయ ఏం చెప్పాడో ఏమో-" విసుగ్గా వాచీ చూసుకుంటూ అన్నాడు.
17
టైమ్ పదకొండున్నర కావొస్తూంది.
"ఎంతసేపలా నిల్చుంటావు కూర్చో" అన్నాడు. ఆమె మొహమాటంగా నవ్వింది. కళ్ళల్లో అలసట కనిపిస్తూంది.
అతడికి జాలేసింది. పాపం ప్రొద్దున్ననగా వచ్చింది. తన మూలాన ఇలా ఇరుక్కుపోయింది అనుకున్నాడు.
"కూర్చో" అన్నాడు.
"ఫర్వాలేదు సర్!"
తను కూర్చోకపోతే ఆమెకూడా ఆ పని చేయదని గ్రహించి అతడు ఒకవైపు ఆనుకుని కూర్చుంటూ, ఆమెవైపు సైగ చేశాడు. ఆమె బిడియపడుతూ ఒద్దికంగా కూర్చుంది ఒక మూలకి. ఆమెలో ముందున్న భయం, ఆందోళన తగ్గటం గమనించాడు.
"ఒకందుకు మనం అదృష్టవంతులం. మొదటి అంతస్తు సగంలో నిలబడిపోవటంవల్ల ఈ గాలి అయినా వస్తోంది. రెండు అంతస్తుల మధ్య ఆగిపోయి వుంటే ఊపిరాడక చచ్చిపోయి వుండే వాళ్ళం" అన్నాడు.
అతడికి మాధవి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఏం చేస్తూ వుంటుందీపాటికి? సుధాకర్ పక్కన కూర్చుని వుంటుందా? మిసెస్ పాండే పక్కనా?
అంతలో అతడి దృష్టి, తనలో తనే నవ్వుకుంటున్న ప్రియంవధ మీద పడింది. "ఎందుకు నవ్వుతున్నావు?" అని అడిగాడు. ఆమె ముందు చెప్పలేదు. రెట్టిస్తే "మనం ఇలా ఇరుక్కుపోవటం చూస్తూంటే మా ఫ్రెండ్ చెప్పిన కథ గుర్తొచ్చింది సార్" అంది. "....ఇలా టెక్స్ టైల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం అంటే చీరెల మీద ఒక కథ చెప్పింది." "ఏమిటీ?"
"నలుగురు నురుద్యోగా పట్టభద్రులు ఎంతకీ ఉద్యోగం దొరక్క చివరికి ఒక బ్యాంకు దొంగతనం చేద్దామనుకున్నారట. అందులో ఒక తెలివైన వాడున్నాడట. బ్యాంకు దొంగతనం అంటే మనకంత అనుభవం లేదు. నేనింకో ప్లాన్ చెపుతాను. ఫలితంగా నా షేరుకి నేను అడిగిందివ్వాలి. పైగా మీకు బ్యాంకుకన్నా ఎక్కువ దొరుకుతుంది. రిస్క్ కూడా తక్కువ అన్నాడట. అదేమిటో చూద్దామని మిగతావాళ్ళు సరేనని ఒప్పుకున్నారట.
కొన్ని రోజులకి ఆ ఊర్లో పెద సుబ్బయ్య చౌదరిగారి అమ్మాయి పెళ్ళి జరిగిందట. నగరంలో ప్రముఖులు, పట్టుచీరెలు రెపరెపలాడించుకుంటూ వారి భార్యలూ, కార్లూ, స్కూటర్లు అంతా హడావుడిగా, ఆర్భాటంగా వుందట అక్కడ. ధగధగా మెరిసి పోతున్నారట అందరూ. పెళ్ళికి రెండు గంటలముందు ఎవరిదో గాత్ర సంగీతం హాల్లో ఏర్పాటు చేశారట. మనవాళ్ళు నలుగురూ అన్ని తలుపులూ వేసేసి స్టేజిమీద మైకు దగ్గిరకొచ్చేసి బొమ్మ పిస్టల్ తో బెదిరించేసరికి అందరికీ ఏం చెయ్యాలో తోచలేదు. పెళ్ళికదా పోలీసు లెవరుంటారు?
ఆడవాళ్ళందర్నీ స్టేజి పక్కనున్న గ్రీన్ రూమ్ లోకి పంపించారట. అక్కడో రెండొందలు నూలు చీరలున్నాయట. వాటిని కట్టుకుని, సీతమ్మవారు అడవికి వెళ్ళేముందు తయారైనట్టు ఐదు నిముషాల్లో తయారై వారందరూ తిరిగి హాల్లోకి రావాలని బెదిరించారన్నమాట! వాళ్ళ చీరలూ నగలూ తీసుకొని ఆ నలుగురూ అక్కన్నుంచి జారుకున్నారు. మొత్తం అంతా పావుగంటలో అయిపోయింది. ఊరి చివరకు వెళ్ళాక తెలివైనవాడిని మిగతా ముగ్గురూ ప్రశంసించారట. 'ఇదే బ్యాంకయితే నాల్గయిదు లక్షలకన్నా ఎక్కువ దొరక్కపోవును. పెళ్ళిలో ఇంత పోగవుతుందని మాకు ఆలోచనే రాలేదు సుమా' అని....'ఇంత మంచి సలహా ఇచ్చినందుకు నీకేం కావాలో తీసుకో' అన్నారట.
"బంగారం మీరు పంచుకోండి చీరెలు నాకిచ్చెయ్యండి అన్నాడుట అతడు.." అంటూ ఆపింది ప్రియంవద.
"అదేమిటి" అన్నాడు రవితేజ. ".....బంగారం వదిలి చీరలు తీసుకోవటం ఏమిటి?"
ప్రియంవద - "వాళ్ళక్కూడా అదే అనుమానం వచ్చింది. కానీ అతడు పట్టుపట్టడంతో సరే నీ ఖర్మ అని చీరెల్ని అతడికి వదిలేసి తాము బంగారం పంచుకుని విడిపోయార్ట. ఒక్కొక్క చీర వెయ్యికి తక్కువకాదు కాబట్టి అతడి వాటా రెండు లక్షలు వచ్చింది. బంగారం అమ్మబోయిన వాళ్ళకి మాత్రం ఒక్కొక్కరికి అందులో సగం కూడా రాలేదట" అంది.
"అదేం?"
"అందులో సగం పైగా రోల్డుగోల్డు కాబట్టి-"
రవితేజ ఒక్కసారిగా బిగ్గరగా నవ్వేశాడు. అతడు అంత బిగ్గరగా నవ్వటం అదే ప్రథమం. ప్రియంవద కూడా చిరునవ్వుతో "మీ దగ్గిర ఉద్యోగం అనగానే మా ఫ్రెండు అదే చెప్పింది-బంగారంతో మోసం చెయ్యవచ్చేమోగానీ చీరల్లో చెయ్యలేమట. అంతేకాదు బంగారంకన్నా ఖరీదైన చీరలు వచ్చేరోజు తొందర్లోనే వుందట-"
"తొందర్లో ఏమిటి-వచ్చేస్తేనూ" అన్నాడు అతడు.
* * *
రాత్రి ఒంటిగంట దాటింది.
మాగన్నుగా పట్టిన నిద్రలోంచి హఠాత్తుగా అతనికి మెలకువ వచ్చింది. తను కూర్చున్న భంగిమ చూసుకుంటే నవ్వొచ్చింది. ఆమె ఆవులిస్తూ నెమ్మదిగా తల వెనక్కి వాల్చటం అతడికి తెలుసు. తనుకూడా నిద్రలోకి జారుకుంటానని మాత్రం అనుకోలేదు.
బయట వరండాలో ఎక్కడా అలికిడి లేదు. పగలంతా హగావుడిగా వుండే ఆఫీసు తనుకూడా రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నట్టు వుంది.
బయటనుంచి వెలుతురు డైరెక్టుగా ఆమెమీద పడుతూంది. ముందు మోకాళ్ళమీద పడుకుని, నిద్రలోనే పక్కకి జారిపోయినట్టుంది ఆమె. తలక్రింద వున్న చేతిమీద ముంగురులు జీరాడుతున్నాయి. తెల్లటి చర్మంమీద నల్లటి కాంట్రాస్టు.