Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 32


                         సాధించేనే మనసా
    సమయం ఉదయం ఏడుగంటలవుతోంది.
    దాదాపు గంటన్నర సేపటినుంచి సాగుతున్న సాధనను 'సౌరాష్ట్ర రాగం'లో 'నీ నామరూపములకు, నిత్య జయ మంగళం' అన్న త్యాగరాజ కృతితో ముగించింది సునందిని. ఎదురుగా వున్న వీణావాణికి భక్తిగా నమస్కరించి లేచింది. గత పదిహేనేళ్ళుగా క్రమం తప్పకుండా సాగుతున్న కార్యక్రమం అది.
    దేశ విదేశాల్లో వేలాదిశ్రోతలముందు గంటలు గంటలుగా కచ్చేరీలిచ్చే సునందినికి ఈ ఉదయంపూట ఏకాంతసాధన ఇచ్చిన తృప్తి మరెప్పుడూ కలగదు. ఆ దేవి ఒక్కతే తనకు శ్రోత అయినట్లు మనసా, వాచా, కర్మణా తన శక్తి సామర్ధ్యాలను భక్తితో - ఆనందంతో ఆవిడకు నైవేద్యం పెడుతున్నట్లుగా భావిస్తుందామె.
    గది తలుపులు తెరిచి బయటకు రాబోతూ ఆగిపోయిందామె. హాల్లో సెక్రటరీ వివేక్ ఎవరితోటో గట్టిగా మాట్లాడుతున్నాడు.
    "వీలుపడదండీ. మీరేమో పదహారు రాత్రికి ప్రోగ్రాం అంటున్నారు. పదిహేడున సాయంత్రం ఢిల్లీలో మేడమ్ ప్రోగ్రాం వుంది. అదీ ప్రధానమంత్రి గారి సమక్షంలో. పదహారు ఉదయం ఫ్లయిట్ కే టికెట్స్ బుక్ అయిపోయాయి" అంటున్నాడు వివేక్.
    "పదిహేడు ఉదయం ప్లయిట్ లో వెళ్ళవచ్చు కదండీ. మూడు గంటలేగా ప్రయాణం" అంటున్నాడా వ్యక్తి.
    "ఈ రోజుల్లో విమాన సర్వీసుల్ని నమ్మలేం కదండీ! లేట్ అవుతాయి. కాన్సిల్ అవుతాయి. అవతల పెద్దవాళ్ళతో వ్యవహారం. సారీ ముందురోజు వెళ్ళక తప్పదు" అన్నాడు వివేక్.
    "మా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీచంద్రగారికి సునందినిగారి గానం అంటే విపరీతమైన అభిమానం. ఆవిడ కచ్చేరీ ఇస్తున్నారంటే సాధారణంగా మిస్సవ్వరు. ఆవిడను పరిచయం చేసుకొన్నారు కూడా. తన ఒక్కగానొక్క కూతురు పెళ్ళిలో ఆవిడ కచ్చేరీ పెట్టించాలన్నది ఆయన చిరకాల వాంఛ. అది ఒక గొప్ప కోసమో, స్టేటస్ చూపించడానికో కాదండి. ఆయన సంగీతాభిమానమే కారణం. ఉదయం లేవగానే కనీసం అరగంటసేపు ఆవిడ పాట వినకపోతే ఆయనకు తోచదు".
    సునందినికి శ్రీచంద్ర గుర్తువచ్చాడు. మద్రాసులో తను యిచ్చే ప్రతి కచ్చేరీకి వచ్చేవాడు. ఒకటి, రెండుసార్లు వచ్చి పలకరించాడు. అభినందనలు తెలపకుండా వెళ్ళడు.
    కానీ వివేక్ వాదనలో తప్పులేదు.
    "నిజమే కావచ్చు కాని, పరిస్థితులలా వున్నాయి. ఏం చెయ్యగలం? శ్రీచంద్రగారికి నచ్చ చెప్పండి."
    "అదంత సులభం కాదండి. నేను వెళ్ళి చెప్తే ఆయనే స్వయంగా వస్తారు. పదిహేడో తారీఖు ఉదయం ఫ్లయిట్ లో మిమ్మల్ని ఢిల్లీ పంపే బాధ్యత మాది."
    "ఒక్క విషయం ఆలోచించండి. మీరు ప్రోగ్రాం పెడుతున్నది శక్తినగర్ లో, మద్రాసుకు అరవై కిలోమీటర్ల దూరం. ఉదయం ఏడు గంటలకే ఢిల్లీ ఫ్లయిట్. ఆరు గంటలకల్లా ఆవిడ ఎయిర్ పోర్ట్ లో వుండాలంటే ఎంత శ్రమో ఆలోచించండి."
    "అదేం పెద్ద సమస్య కాదండి. మాకు సొంత హెలికాఫ్టర్ ఉంది. మద్రాసు ఎయిర్ పోర్టుకి పావుగంటలో చేరవచ్చు. మీకు తెలియదు వివేక్. శ్రీచంద్రగారు చాలా విశిష్టమైన వ్యక్తి. ఆయన ఈ పెళ్ళి మద్రాసులోనే పెట్టుకోగలరు. కాని, తన కింద పనిచేసే వర్కర్లందరూ కూడా పెళ్ళికి హాజరు కావాలని ఆయన కోరిక.సునందినిగారు పెళ్ళిళ్ళలో పాడడానికి ఎక్కువ ఇష్టపడరనీ ఆయనకు తెలుసు. అందుకే ఈ కచ్చేరీకి కేవలం సంగీతాభిమానులయిన శ్రోతలనే ఆహ్వానిస్తున్నారు. ఆవిడ సంగీతంలోని మాధుర్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలవాళ్ళే వారంతా. నన్ను నమ్మండి" అన్నాడాయన వేడుకోలుగా. 
    "శక్తినగర్" పేరు వినగానే సునందినిలో ఆనందం ఎగిసిపడింది. మనసులో ఉద్వేగాన్ని ముఖంలో కనిపించనివ్వకుండా ప్రయత్నం చేస్తూ హాల్లోకి వచ్చింది.
    ఆమెను చూడగానే వచ్చిన వ్యక్తి ముఖం విప్పారింది. లేచి నిలబడి "నమస్తే మేడమ్, నేను శ్రీచంద్రగారి సెక్రటరీని" అన్నాడు.
    "నమస్తే వివేక్, నేనంతా విన్నాను. ప్రోగ్రాం ఫిక్స్ చేసుకోండి" అంది.
    "కాని, మేడమ్..." వివేక్ సందిగ్ధంగా ఆగాడు.
    "ఉదయం నా సంగీత సాధనకు వీలుకాదని, నేను శ్రమపడాల్సి వస్తుందనేగా మీ ఆలోచన? ఫర్వాలేదు. ఒక్కరోజేగా, ఎలాగో కష్టపడతాను" అదే తన నిర్ణయం అన్నట్లుగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది.
    ముప్పయి అయిదేళ్ళ జీవితకాలంలో ఏనాడూ కలగని ఉద్వేగం, మొదటిసారిగా కచ్చేరీ ఇవ్వబోతున్నంత ఫీలింగ్. ఆలోచిస్తే అది బాల్య చేష్టలాగే అనిపించవచ్చు. కాని, అలాంటి ఫీలింగ్స్ లేని జీవితాలు వ్యర్ధమే అనిపించవచ్చేమో.
    "చంద్రీ, నేను మీ ఊరొస్తున్నాను. మరి నీ మాట నిలబెట్టుకుంటావా?" ఆల్బంలో ఫోటోను చూస్తూ మనసులోనే ప్రశ్నించింది పాతిక సంవత్సరాల తర్వాత బాల్య స్నేహితురాలిని, తన నెచ్చెలిని, అభిమానిని. గురువుని చూడబోతున్నానన్న ఆనందంతోపాటు, ఆమెకు ప్రత్యక్షంగా తన గానం వినిపించే అవకాశం కలుగుతున్నందుకు ఉద్విగ్నంగా కూడా వుంది. ఆమె మనసు బాల్యంలోకి దూసుకుపోయింది.
                    *    *    *
    చంద్రలేఖ తండ్రి విశ్వనాథంగారు సంగీతం టీచర్. యింటికి దగ్గిర్లోనే ఉండడంతో ఆరేళ్ళ సునందినిని ఆయన శిష్యురాలిగా చేర్చారు ఆమె తల్లిదండ్రులు. సమ వయస్కులవడంతో ఆ ఇద్దరికీ ఒక్కరోజులోనే స్నేహం కుదిరిపోయింది. ఏదో కళక్షేపానికన్నట్లు మొదలు పెట్టిన సంగీత పాఠాలు చంద్రలేఖ పరిచయంతో అత్యంత ఉత్సాహకరంగా మారాయి. చంద్రి స్వరం చాలా బాగుంటుంది. భవిష్యత్తులో ఆమె గొప్ప గాయకురాలయిపోయినట్లు, తనామెకు శ్రోతగా మిగిలిపోయినట్లు భావిస్తుండేది సునందిని. నాలుగేళ్ళపాటు వాళ్ళ స్నేహం అంచెలంచెలుగా పెరిగిపోయింది. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని స్టేజికొచ్చేశారు. దురదృష్టవశాత్తూ సునందిని తండ్రికి ట్రాన్స్ ఫరవడంతో వాళ్ళు విడిపోక తప్పలేదు.
    తండ్రి ఉద్యోగరీత్యా విజయనగరం రావడం సునందినికి మంచే చేసింది. అప్పటికే సంగీతం పట్ల అభిరుచి పెంచుకున్న ఆమెకు మంచి గురువులు కూడా లభించడంతో శ్రద్ధగా సంగీత విద్యాభ్యాసం సాగించింది. దాదాపు ఆరేళ్లపాటు చాలా కృషి చేసింది. ఆ కృషికి తగ్గ ఫలితం కూడా లభించింది. విజయనగరం సంగీత కళాశాలలో డిప్లొమా అత్యున్నత శ్రేణిలో పాసవడం మొదటి విజయం. ఆ సంవత్సరమే రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి బహుమతి గెల్చుకుంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందడానికి మరో రెండేళ్ళు పట్టింది. ఇరవై ఏళ్ళ వయసులో బాలమురళి నుంచి 'సంగీత విశారద' బిరుదు అందుకున్నప్పుడు దాదాపు అన్ని పత్రికలు ఆమె ప్రతిభను గురించి వ్యాసాలు ప్రచురించాయి. అప్పుడే ఆమె చంద్రలేఖ నుంచి మొదటి ఉత్తరం అందుకుంది.
    గొప్ప సంగీత విద్వాంసురాలుగా, గానకోకిలగా పేరు తెచ్చుకుంటుందనుకున్న చంద్రలేఖ మామూలు గృహిణిగా మిగిలిపోయింది. సునందిని విజయనగరం వచ్చిన రెండేళ్ళకే తండ్రి పోవడంతో ఆమె సంగీత సాధన కూడా ఆగిపోయింది. పద్దెనిమిదేళ్ళకే పెళ్ళి, యిరవై ఏళ్ళకే మాతృత్వం ఆమెను సంసార బాధ్యతలలో ముంచేశాయి.
    కాలక్షేపం కోసం మొదలు పెట్టిన తను సంగీత విద్వాంసురాలుగా మారడం, ఒక సంగీత విద్వాంసుడి కూతురయి, సంగీతం పట్ల భక్తీ శ్రద్ధా కూడా ఉన్న చంద్ర మామూలు గృహిణిగా మిగిలిపోవడం తలచుకున్నప్పుడల్లా సునందినికి ఆశ్చర్యంగా అనిపించేది. చంద్రలేఖ ఉత్తరంలోని చివరి వాక్యాలు మాత్రం సునందిని ఎన్నడూ మర్చిపోలేదు.

 Previous Page Next Page