Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 31


    అదిగో అప్పుడే ఆమె మొహం ఎర్రబడింది. ముక్కుపుటాలు అడురుతూ వుండగా 'డామిట్' అనుకుంది మనసులో.
    చేతిలో కార్డు చింపేద్దామా అనుకుంది మొదట. కానీ దూరం నుంచి అతడు చూస్తున్నాడేమో అని భయం వేసింది. ఒక భయంకరమైన క్రిమిని వేళ్ళతో పట్టుకున్నట్టు దాన్ని బాక్సులో వేసింది.
    ఆ కార్డులో వ్రాసింది తల్చుకున్నకొద్దీ ఆమెకి ఉక్రోషం పెరిగిపోయింది. అందులో ఎక్కువ వాక్యాలు కూడా లేవు.
    "వెంకటేశ్వరస్వామి! మా ఆఫీసులో ఒక అమ్మాయి చేరింది. ఆమెను చూస్తున్నకొద్దీ ఉత్థిష్టంతే అనుకో...."
    అని వుంది అంతే.
    ఆ మరుసటిరోజు ఆఫీసుకు వెళ్ళినప్పుడు తన మొహంలో ఎలాంటి భావమూ కనిపించకుండా వుండటానికి (అంటే తనా ఉత్తరం చదివినట్లు అతనికి తెలియకుండా వుండాలన్నట్టు) ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ కష్టపడే తాపత్రయంలోనే దొరికిపోయింది. "నిన్న ఉత్తరం పోస్టు చేశారా" అని అడిగాడు చాలా క్యాజువల్ గా.
    "వే..... వేశాను. ఎందుకు వెయ్యను?"
    "ఆహా!...."
    "ఉత్తరం ఏమిటి" జయంతి అడిగింది.
    "ఏం లేదు, ఏంలేదు" అని ఏదో పనివున్నట్టు అక్కణ్ణుంచి వెళ్లిపోయింది శార్వాణి. ఆ సాయంత్రం ఆమె సీటు కట్టేసి వెళ్ళబోతుంటే వెనుకనుంచి నెమ్మదిగా 'ఉత్థిష్టంతు' అని వినిపించింది.
    చివుక్కున వెనుదిరిగి చూసింది. శ్రీధరం ఫైల్లో సీరియస్ గా చూసుకుంటున్నాడు. విసురుగా దగ్గరికి వెళ్ళి "ఏవన్నారు మీరు?" అంది.
    "ఏవన్నాను"
    "ఇపుడేదో అన్నారు!"
    "అప్పుడప్పుడు నాలో నేను అలా మాట్లాడుకోవటం అలవాటు"
    "అంతే కానీ నన్ను ఏమీ అన్లేదంటారు"
    "మైగాడ్! కొంపదీసి 'ఉత్థిష్టంతు' అన్నావా ఏమిటి?" అన్నాడు. ఆమె గతుక్కుమని "అదంటే నన్నన్నట్టా" అంది నిలదీస్తున్నట్టు.
    "సారీ అండీ. మీరు వింటున్నారు అనుకోలేదు" అన్నాడు మరింత అమాయకంగా మొహం పెట్టి. ఇదంతా తనని ఏడిపించటంకోసం అని అర్ధమై అక్కణ్ణుంచి విసవిసా నడిచి వెళ్ళిపోయింది.
    శార్వాణి తమ్ముడు లిటరేచర్ బి.ఏ. వాణ్ణి "ఉత్థిష్టంతు' అంటే ఏమిట్రా" అని అడిగింది.
    "ఉత్థిష్టంటా?" అన్నాడు వాడు.
    "ఉత్థిష్టంటు కాదురా. ఉత్థిష్టంతు"
    "డిక్షనరీ చూడు. ఉత్థిష్టంటు అని వుంటుంది. నువ్వు సరిగ్గా విని వుండవు."
    "వెధవా, ఆ మాత్రం నాకు తెలీదా? నిన్ను అడగటం దేనికి?"
    "ఇంగ్లీషయితే అడుగు. టపీమని చెప్పేస్తాను" అన్నాడు. నిఘంటువు వెతికింది. కానీ తనకి కావాల్సింది దొరకలేదు. విసుగ్గా డిక్షనరీ పక్కన పడేసింది.
    ఆ మరుసటిరోజు యధాలాపంగా కమల్తో "ఉత్థిష్టంతు అంటే ఏమిటి" అని అడిగింది. కమల ఉలిక్కిపడి ఆమెవైపు చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అకస్మాత్తుగా ఆమెలో ఆ మార్పు చూసి శార్వాణి కంగారుపడి "ఏం జరిగింది?" అంది.
    "క్షమించు. నేనెప్పుడూ ఆ మాట నీ గురించి అనలేదు" అంది కమల.
    "అంటే మిగతా వాళ్ళందరూ నా గురించి అనుకుంటున్నారనేగా- ఆ శ్రీధరాన్ని, ఆ రాక్షసుడిని ముక్కలు ముక్కలుగా కోసినా పాపంలేదు" అంది కసిగా.
    తన అన్నయ్యని అన్ని మాటలన్నందుకు కమలకి బాగా కోపం వచ్చింది. "నువ్వు నిజంగా ఉత్థిష్టంతువే" అంది కోపంగా.
    శార్వాణి చప్పున తన కోపం మర్చిపోయి "అయితే నీకు తెలుసా దాని అర్ధం" అని నిలదీసింది.
    "ఉహూ! నాకు తెలీదు. ఎందుకో నిన్ను చూస్తూంటే అలా అనిపించింది" అంది కమల.
    ఆ విధంగా ఆ రోజునుంచీ శార్వాణికి ఆఫీసు నరకమైంది. అప్పటివరకూ ఆఫీసంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు వెళ్ళాలంటే భయంగా వుంది. ఏ నలుగురు చేరినా తన గురించే అనుకుంటున్నారు అనిపించేది. రకరకాల కంఠాల్తో చుట్టూ ఒక స్వరం (నిశ్చయంగా శ్రీధర్ దే) ఉత్థిష్టంతు- ఉత్థిష్టంతు అని వినిపించేది. ఈ బాధ భరించలేక ఒకరోజు శ్రీధరాన్నే నిలదీసింది. ఇది న్యాయం కాదు అని తిట్టిపోసింది.
    శ్రీధర్ చలించలేదు. "ఇంతకీ మీకేం కావాలి మేడమ్?" అని అన్నాడు తాపీగా.
    "ఉత్థిష్టంతుకి అర్ధం"
    "మైగాడ్, దాన్ని భార్యలగ్గానీ చెప్పకూడదే. అదీ- రహస్యంగా చెవిలో...." చిలిపిగా నవ్వుతూ అన్నాడు.
    అప్పటికే శార్వాణి మొహం కందిపోయింది. అంతకు గంట ముందే సూపర్నెండెంటు ఇంకో యు.డి.సి.తో 'ఆ ఫైలు ఉత్థిష్టంతుగారి దగ్గిర వుందేమో చూడవోయ్' అని అనటం వినిపించి, తన పేరు ఎంత సర్వసామాన్యమై పోయిందో తెలుసుకున్న శార్వాణి ఇక దుఃఖం పట్టలేకపోయింది.
    ఇంటి కెళ్ళగానే తండ్రితో "నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తున్నా నాన్నా" అంది. ఆయనేం చలించకుండా "ఇస్తే ఇచ్చావ్ గానీ అమ్మాయ్, అదేమిటి శ్రీధరాన్ని ఉత్థిష్టంతుకి అర్ధం చెప్పమని అడిగావట. తప్పుకాదూ, నీకు ఉద్యోగం మానేసి పిల్లల్ని కనాలి అని వుంటే మాకు చెప్పాలిగాని అలా అడిగెయ్యటమే" అన్నాడు గంభీరంగా.
    శార్వాణి తెల్లబోయి "దాన్ని అర్ధం నీకు తెలుసా నాన్నా" అంది. "నాకు తెలీదమ్మాయ్. ఇప్పుడే శ్రీధర్ బామ్మగారు వచ్చి వెళ్ళారు. గుంటూరులో మనింటి పక్కే వుండేవార్లే. నువ్వు ఇలా అడిగావనీ, ఇంక ఆగితే లాభంలేదని తాంబూలాలు పుచ్చుకుందామని అన్నారు. శ్రీధర్ కేం చక్కటి కుర్రాడు. నాకేమీ అభ్యంతరం లేదన్నాను" అని తల తిప్పేసరికి కూతురు అక్కడ లేదు.
                                   *    *    *    *
    ఆ పై నెల్రోజులకి వాళ్ళ పెళ్ళి జరిగిపోయింది. మంగళసూత్రం కడుతూ వుంటే జయంతి వంగి చెవిలో "నీ ఉత్థిష్టంతుకి కృతజ్ఞత చెప్పుకోవే. కన్నెపిల్ల లందరూ పటం కట్టించి పెట్టుకోవలసిన పదం అది. కాణీ కట్నం లేకుండా పెళ్ళి చేయించి పెడుతుంది" అంది.
    ఆ రాత్రి మల్లెల మధ్యన-
    దగ్గరికి తీసుకోబోతున్న శ్రీధరాన్ని ఆపి "ముందిది చెప్పండి. ఉత్థిష్టంతుకి అర్ధం ఏమిటి?" అంది. అతడోక్షణం తెల్లబోయి సర్దుకుని "ఛా, ఇప్పుడా?" అన్నాడు తేలిగ్గా.
    "ఉహూ. అదీ చెప్తేగానీ నేను మాట్లాడను"
    "డిక్షనరీ చూడలేకపోయావా?"
    "చూశాను. లేదు".
    "ఉత్థిష్టంటు చూసి వుంటావు. లేకపోతే ఉత్థిష్టంత్ చూసి వుంటావు"
    "మరేం చూడాలి?"
    "ఉత్థిష్టంతు" అని ఆమె బయల్దేరబోతుంటే కంగారుపడి "అరెరె అదేమిటి ఇప్పుడే వెళ్తావా? బయట గొళ్ళెం పెట్టి వుంటారు" అన్నాడు.
    "అది తెలుసుకోకపోతే నా మనసు మనసులో వుండదు"
    "అంతా అయ్యాక చెప్తానేం."
    "ఉహూ."
    ఇక లాభం లేదన్నట్టు శ్రీధర్ ఆమెని దగ్గిరికి తీసుకొని చెవిలో నెమ్మదిగా "ఉత్థిష్టంతు - అంటే" అంటూ అర్ధం చెప్పాడు.
    ఆమె మొహం ఎర్రమందారం అయింది. కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. భుజం దగ్గర రక్తం వచ్చేలా గిల్లుతూ "ఛీ" అంది.
                                                                                    - పల్లకి - 1984.
    (అప్పట్లో పల్లకి వార్షికోత్సవ సభలో రచయితలందరికీ లాటరీ ద్వారా ఒక్కొక్కటైటిల్ తీసి ఇవ్వటం జరిగింది. యండమూరికి వచ్చిన "ఉత్థిష్టంతు" అన్న పేరు మీద అరగంటలో వ్రాసిన కథ ఇది. - పబ్లిషర్స్.)
                          * శుభం *
        (32వ ఎపిసోడ్ నుంచి సాధించేనే మనసా అనే కథ వస్తుంది.)

 Previous Page Next Page