Previous Page
రాధ-కుంతి పేజి 33


    "నీ గానం అద్భుతం నందూ. ఎంత గొప్ప సంగీత విద్వాంసులయినా సంగీత పరంగా నీ పాటలో తప్పు పట్టలేరు. కాని నందూ నాన్నగారెప్పుడూ చెపుతుండేవారు. రాగోత్కర్షంతో భావోత్కర్షం మరుగున పడకూడదని. ముఖ్యంగా త్యాగరాజ కృతుల్లో సంగీత సౌందర్యాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే, అందులో రసతాడాత్మ్యాం చెందాలంటే సాహిత్యపుటాహార్యం అతి ముఖ్యం. త్యాగరాజ కృతులను పాడేటప్పుడు భావస్ఫూర్తితో పాడగల అవకాశం ముఖ్యంగా తెలుగు వాళ్ళకే వుంది. ఉదాహరణకు, 'ప్రక్కన నిలబడి' అన్న కృతిలో 'మనసున దలచి మైమరచియున్నారా' అన్న పాదం గొంతును ఉచ్చ స్థాయికి ఎత్తి, శబ్ద వైభోగంతో ఉత్కష్టతను ఖరహర ప్రియరాగంలో అద్భుతంగా చూపించాలి. అది ఎంతో కృషి చేస్తేనే తప్ప రాదు. వినేవాళ్ళలో సంగీత పరిజ్ఞానం కూడా లేని వాళ్ళకు కూడా ఆ సమయంలో సీతా లక్ష్మణులు శ్రీరామచంద్రుడిని మనసులో తలచుకుంటూ, ఆ తలపులో మైమరచిపోయిన దృశ్యం కళ్ళముందు కదలాడాలి. నీకు పాఠాలు చెప్పేంత గొప్పదాన్ని కాదు నందూ. కాని, గుండెలోతుల నుంచి తాదాత్మ్యంతో పాడే గానం పండిత పామరులిద్దరినీ ఆకర్షిస్తుంది."
    ఆ మాటలు సునందిని సంగీత జీవితంలో గొప్ప మలుపుని తీసుకొచ్చాయి. ఆ తర్వాత తను సాధనచేసే ప్రతి కృతిలోనూ శేషమైన కృషి చేసేది. తన సంగీత సాధనను రికార్డుచేసి చంద్రకి పంపేది. ఆమె సలహా కోసం ఎదురు చూసేది.
    "అల కలల్ల లాడగ గని" అన్న కృతిలో "అడగగని" అని పాడేటప్పుడు రిషభ మధ్యమాల మీదే మనస్సు లగ్నం చేస్తున్నావు. స్వరగమకం రిషభ మధ్యమాల మధ్య ఊగిసలాడుతుంటే, ఆ అల్లల్లాడడంలోనే శ్రీరామచంద్రుడి సొగసైన ఫాలంమీద అందంగా చిందులు వేసే అలకలు (ముంగురులు) కళ్ళముందు కదలాలి!"
    ఆ సలహాను ఎలా మర్చిపోగలను? తను పాడిన ప్రతి కచ్చేరీ క్యాసెట్టు చంద్రలేఖకి పంపేది.
    "నీ గానం నేను వినడమే కాదు నందూ. మా కాలనీ వాళ్ళందరికీ వినిపిస్తున్నాను. ఎలాగంటావా? మా ఇంటి ఎదురుగా పిళ్ళయార్ కోవెల వుంది. అక్కడ ఉదయం పూట నీ క్యాసెట్లు పెట్టిస్తాను .సరిగమలు తెలియని వాళ్ళు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా?"
    చంద్రలేఖ ఆనందమే సునందిని ఆనందం, తన కచ్చేరీ మద్రాసులో వున్నప్పుడు ఉత్తరం వ్రాసి, ఆహ్వాన పత్రిక పంపింది. కాని, చంద్రలేఖ రాలేదు.
    "నీ ఆహ్వానం నన్ను కదిలించింది. నందూ నీ పాట ప్రత్యక్షముగా వినాలని, ప్రతిక్షణం నీ గాన మాధుర్యాన్ని తనివితీరా అనుభవించాలని ఎంత కోరికగా వున్నా అనారోగ్యులయిన అత్తమామల్నీ, చంటిపిల్లల్నీ వదలి వచ్చే పరిస్థితి కాదు నాది. ఇది నా దురదృష్టంగా బాధపడుతూ వ్రాయడం లేదు. నాలాంటి మధ్యతరగతి గృహిణికి అది ఖరీదయిన కోరిక. అందని వాటికోసం అర్రులు చాచేదాన్ని కాదు. నా కోసం ఆ దేముడిని ప్రార్ధించేది ఒక్కటే. మా సునందిని కచ్చేరీ మా ఊళ్ళో ఒకటి పెట్టించమని. అప్పుడు ఎలాంటి పరిస్థితిలోనయినా వచ్చి ముందు వరసలో కూర్చుని నీ గానం వింటాను."
    చంద్రలేఖలో అభిమానాన్ని అర్ధం చేసుకున్నాక సునందిని మరెన్నడూ ఆ ప్రస్తావన తేలేదు. ఇన్నాళ్ళకు వచ్చిన ఈ అవకాశాన్ని వదలదల్చుకోలేదు కూడా. తన ప్రోగ్రాం సంగతి వివరిస్తూ వచ్చి కలుసుకోవలసిందిగా ఉత్తరం రాసింది.
    చాలా చిన్న ఆడిటోరియం అది. అంతా ఎ.సి. చేయబడింది. కేవలం డెబ్బయిమంది శ్రోతలు మాత్రమే వున్నారు. అందరూ ఆమె గానం వినడానికి ఉవ్విళ్ళూరుతున్నవాళ్ళే. నిశ్శబ్దంగా కూర్చుని ఆమె పాట మొదలు పెట్టడం కోసం ఎదురు చూస్తున్నారు.
    సునందిని కళ్ళు మాత్రం ఎంట్రన్స్ తలుపువైపే వున్నాయి. ఆమె ఆశించినట్లుగా చంద్రలేఖ ముందు వరుసలో లేదు. అసలు రాలేదు కూడా. 
    ఫ్లయిట్ లేటవడంతో ఆమె శక్తినగర్ చేరేసరికి చాలా ఆలస్యమయిపోయింది. అనుకున్నట్లుగా చంద్ర గెస్ట్ హౌస్ లో ఎదురుచూడడం కూడా లేదు. తన ఉత్తరం అందలేదా? అసలామె ఊళ్ళో ఉందో లేదో కూడా తెలియడం లేదు. ఆమెలో ఉత్సాహమంతా గాలి తీసేసిన బెలూన్ లా అణగారి పోయింది. ఏదో నైరాశ్యం - గుండెలో శూన్యం.
    పక్కవాద్యగాళ్ళు శ్రుతి సరిచేసుకుని సిద్ధపడటంతో అన్యమనస్కంగానే గానం మొదలు పెట్టింది. అంతా తన్మయులై వింటున్నారు. ఆమె పాటలో లోటుని, అసంపూర్ణత్వాన్ని గమనించింది శ్రీచంద్ర ఒక్కడే.
    కచ్చేరి ముగిసేసరికి రాత్రి పదిన్నర దాటిపోయింది. శ్రీచంద్ర స్వయంగా వచ్చి ఆమెను గెస్ట్ హౌస్ లో దింపి వెళ్ళాడు. ఉదయం ఆరుగంటలకు హెలికాఫ్టర్ బయలుదేరుతుందని అయిదింటికల్లా తన సెక్రటరీ వచ్చి ప్రయాణపు ఏర్పాట్లు చేస్తాడని చెప్పి వెళ్ళాడు.
    సునందినికి నిద్ర పట్టడం లేదు. బయటకు వచ్చింది. గేటు దగ్గర కూర్చున్న వాచ్ మెన్ ఆమెను చూడగానే లేచి దగ్గరగా వచ్చాడు.
    "సాయంత్రం నాకోసం ఎవరయినా వచ్చారా?" అడిగిందతడిని.
    "ఎవరో ఒకావిడ వచ్చిందమ్మా. కాని, ఎమ్.డి.గారి ఆర్డరు. ఆయన అనుమతి లేకుండా ఎవరూ మిమ్మల్ని కలవకూడదని. పాపం చాలాసేపు నిలబడి వెళ్ళిపోయింది" అన్నాడు.
    "పెళ్ళికి వర్కర్లందర్నీ పిలుస్తున్నానని చెప్పారు. పిలవలేదా?"
    "వాళ్ళను విడిగా నిన్న సాయంత్రం డిన్నర్ కి పిలిచారమ్మా. ఈ రోజు మాత్రం బంధువులని, స్నేహితులని మాత్రమే రానిచ్చారు".
    సునందినికి అర్ధమయింది. ఎంతటి ఉదార స్వభావుడయినా అంతస్థు, హోదాలకి లొంగిపోక తప్పదనీ, లక్ష్మణరేఖలు గీయక తప్పదనీ.
    శ్రీచంద్ర గెస్ట్ హౌస్ కి ప్రొద్దున్న అయిదున్నరకే చేరుకున్నాడు.
    సునందినికి స్వయంగా వీడ్కోలు చెప్పాలని అతడి ఉద్దేశం. అతడి కారుని చూడగానే సెక్రటరీ గాబరాగా దగ్గరకు వచ్చాడు.
    "సార్, సునందినిగారు ఉదయం నాలుగున్నరకే గుడికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళారు. ఇంతవరకూ రాలేదు. వచ్చేవరకు అందర్నీ ఇక్కడే వెయిట్ చెయ్యమని మరీ మరీ చెప్పారుట" అన్నాడు.
    "గుడికా! ఈ ఊళ్ళో అలాంటి గుడి ఏముంది?"
    "కాలనీలో గుడికి అని డ్రైవర్ తో చెప్పడం వాచ్ మెన్ విన్నాడట".
    "సరే నేను వెళ్ళి చూస్తాను." శ్రీచంద్ర కారు స్టార్ట్ చేసి కాలనీ వైపు పోనిచ్చాడు. లేబర్ కాలనీలో గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందో అతడికి అర్ధం కావడంలేదు. తమ ఆఫీసు ప్రాంగణంలో పాలరాతితో కట్టిన విష్ణుదేవాలయం వుంది.
    దూరంగా తమ కారు కనిపించడంతో తెరిపిన పడ్డాడు. మరికాస్త ముందుకు వెళ్ళాక వినిపించింది పాట.
    ఆ గుడిలో ఉదయం పూట సునందిని గానం చేసిన రికార్డులు పెడతారని విన్నాడు కానీ, ఆ వినిపిస్తున్న దాన్లో ఏదో తేడా కనిపిస్తోంది. కారు ఆపి వింటేగాని అతడికా తేడా అర్ధం కాలేదు. ఆ గానానికి వాద్యసహకారం లేదు. అంటే...? అతడు కన్ ఫ్యూజ్ అయి మెల్లిగా అటువైపు నడిచాడు. దూరంగా కనిపిస్తున్న ఆ దృశ్యం అతడిని అచేతనుడిగా చేసింది.
    రెండు గంటల కచ్చేరీకి ఖర్చులతోపాటు పాతికవేలు ఛార్జి చేసే సునందిని వాద్యాలు లేకుండా ఆ గుడి మండపంలో నేలమీద బాసింపట్టు వేసుకుని కూర్చుని తాళంవేస్తూ పాడుతోంది. అక్కడ వున్న ఒకే ఒక శ్రోత నూలుచీరలో వున్న సాధారణ గృహిణి తన్మయత్వంతో ఆ గానంలో లీనాయిపోయింది.
    ఆరభి రాగంతో 'సాధించేనే మనసా' కృతి సాగిపోతోంది.
    ఆ శ్రోతకు తన పాట వినిపించాలనే తపన నిండిన మనసు సాధించిన విజయమో లేక ఆమె పాట వినాలనే కోరిక నిండిన శ్రోత హృదయం సాధించిన విజయమో అర్ధంకాని రీతిలో ఇద్దరి ముఖాల్లోనూ అనిర్వచనీయమైన సంతృప్తి. గత రాత్రి ఆమె పాటలో లోపించిన పరిపూర్ణత్వం ఈ గానంలో సంతరించుకోవడం సంగీత కళాభిమాని అయిన శ్రీచంద్రకి స్పష్టంగా వినిపిస్తోంది. ఫ్లయిట్ ఆలస్యమవుతుందన్న ఆలోచన కూడా మర్చిపోయి ఎదురుగా కనిపించిన బండరాయి మీద కూర్చుని గానంలో లీనమయ్యాడు ఎం.డి. శ్రీచంద్ర.
                                                * శుభం *

 Previous Page