"ఎవరు వెళ్ళారు?"
"ప్రదీప్ గారు తీసుకువెళ్ళారు."
"మీ అమ్మాయిని- మీరు కాకుండా ప్రదీప్ గారు తీసుకువెళ్ళే అవసరమేమిటి?"
"ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్."
"మీకాయన ఎప్పట్నుంచీ ఫామిలీ ఫ్రెండ్?"
"కొన్ని రోజులనుంచి."
"అంటే షుమారు ఎన్నిరోజులనించి?"
"రాధకు యింకా యిరవై, ముఫ్ఫై రోజులకు జబ్బు చేస్తుందనగా, స్నేహమయింది."
"అంటే యించుమించు జబ్బు చేసినప్పట్నుంచే ఆయన మీకు ఫ్యామిలీ ఫ్రెండ్ గా మారారు కాని, అంతకుముందు కాదు. అవునా?"
"అవును."
"పాపకు ఎడమకంటిలో ఫలానా జబ్బు అనీ, కుడికంటిలో ఫలానా జబ్బు అనీ డాక్టరు చెప్పారని ప్రదీప్ చెబితే మీకు తెలిసింది అవునా?"
"అవును."
"డాక్టర్ అశోక్ దగ్గరకు ఎవరు వెళ్ళారు?"
"ప్రదీప్ గారే."
"డాక్టర్ అశోక్ గారితో ఆపరేషన్ కు ముందు మీరు స్వయంగా మాట్లాడలేదు. అవునా?"
"అవును."
"డాక్టర్ అశోక్ ఫలానా చెప్పారని ప్రదీప్ గారు చెబితే మీకు తెలిసింది. లేకపోతే తెలీదు. అవునా?"
"అవును."
"కాబట్టి డాక్టర్లు ఆ జబ్బుగురించి ప్రత్యక్షంగా ఏంచెప్పారో మీకు తెలీదు."
"......"
"మీకు తెలీదు. అవునా?"
"తెలీదు."
"కేవలం ప్రదీప్ గారి మాటలే మీకాధారం. అవునా?"
"అవును."
"రాధకు ఎడమకంటితోబాటు కుడికంటిలోకూడా రెటీనాబ్లాస్టోమా వుండటానికి అవకాశం వుంది. అవునా?"
హనుమంతరావు ఏం జవాబు చెప్పాలో తెలీక మిర్రిమిర్రి చూపులు చూశాడు.
ప్రదీప్ తన సీటులోంచి లేచాడు. "అబ్జక్షన్ యువరానర్! కేవలం ఊహా గానాలు మీదవేసి క్లయింట్ ను కన్ ఫ్యూజ్ చేసే ప్రశ్నను వెయ్యటం నే ఒప్పుకోను" అన్నాడు.
"యువరానర్! హనుమంతరావుగారు ఇద్దరు ఐ స్పెషలిస్టులలో ఏ ఒక్కర్నీ సంప్రదించలేదు స్వయంగా. కేవలం యితరులు చెప్పిన మాటలు ఆధారం చేసుకొని సాక్ష్యం చెబుతున్నారు. ఈ నిజాన్ని బయటకు తీయించతానికే నేనీప్రశ్న వేస్తున్నాను" అన్నాడు ప్రతాపరావు.
"ఏమిటి నిజం? లేనిది కల్పించటమా?" అనడిగాడు ప్రదీప్.
"లేనిది కల్పించడం కాదు. ఉన్నది కప్పెట్టకుండా వుండటం" అన్నాడు ప్రతాపరావు.
"అడగనివ్వండి" అన్నాడు మేజిస్ట్రేట్ గారు.
ప్రదీప్ తన సీటులోకి వెళ్ళి కూర్చున్నాడు.
"మీరు డాక్టర్లతో ముఖాముఖి మాట్లాడలేదు. ఇతరులు చెప్పిన మాటలు మినహాయించి మీకు సత్యాసత్యాలు తెలియవు. రెండుకళ్ళూ అయిదారు రోజుల తేడాలో ఎర్రబడ్డాయని మీరు ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఎడమకంటితోబాటు కుడికంట్లోకూడా రెటీనా బ్లాస్టోమా వుండటానికి అవకాశముంది. అవునా?"
హనుమంతరావు జవాబు చెప్పకుండా గుడ్లప్పగించి చూస్తున్నాడు.
"చెప్పండి. అవకాశం వుందా లేదా?"
హనుమంతరావు కాళ్ళు వణికాయి. సహాయంకోసం అన్నట్లుగా ప్రదీప్ వంక చూశాడు. ప్రదీప్ కళ్ళతో ఏదో చెప్పాడు. కాని ఆ కంగారులో అతనికర్ధం కాలేదు.
"అవకాశం వుండవచ్చు" అన్నాడు.
ప్రతాపరావు పెదవులమీద చిన్న చిరునవ్వు మెదిలింది.
"ప్లీజ్, నోట్ దిస్ పాయింట్ యువరానర్!" అన్నాడు.
కోర్టుకు ఆరోజు ప్రత్యేకంగా యీ కేసుకోసమని ప్లెయింటిఫ్, ఎక్యూజ్ డ్ ల మందీమార్భలంతోబాటు జర్నలిస్టులు చాలామంది వచ్చారు.
ఈ పరిణామానికి అంతా ఆశ్చర్యపోయి వాళ్ళల్లో వాళ్ళు రణగొణధ్వనిగా గుసగుసలాడుకోసాగారు. బిళ్ళబంట్రోతు 'సైలెన్స్' అని అరిచాడు. అంతటా నిశ్శబ్దం వ్యాపించింది.
"కాబట్టి, మీ పాప జీవితం అంధకార బంధురం కావటం విధివైపరీత్యంగా సహజంగానే జరిగిందనీ, అందులో డాక్టరు తప్పేమీ లేదనీ, పాపకు రెండు కళ్ళల్లోకూడా రెటీనో బ్లాస్టోమా వున్నదనీ, రెండుకళ్ళనూ ఆపరేషన్ చెయ్యటానికి నిర్ణయం జరిగి, ఒకే సిటింగ్ లో చెయ్యటానికి సాధ్యంకాక ముందుగా ఒక కంటికి ఆపరేషన్ చెయ్యటం జరిగిందనీ, ఆ కన్ను కుడికన్ను కావటం యాదృచ్చికమనీ అంటున్నాను" అన్నాడు ప్రతాపరావు తన క్రాస్ ఎగ్జామినేషన్ ముగిస్తూ.
హనుమంతరావుకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. గుడ్లు మిటకరించి చూడటం తప్పిస్తే ప్రత్యుత్తరం ఏదీ ఇవ్వలేకపోయాడు.
డాక్టర్ అశోక్ కోర్టుహాలులో బెంచీమీద కూర్చుని వున్నాడు. ఆవేశంతో అతన్లో రక్తం వడివడిగా ప్రవహించి శరీరం వేడెక్కింది.
"నో" అంటూ లేవబోతుండగా ప్రక్కనున్న ఉపేంద్ర అతన్ని భుజంపట్టుకుని వెనక్కి లాగి 'ఉష్' అంటూ సౌంజ్ఞ చేశాడు.
"యువరానర్! దీనికి సంబంధించిన కేస్ షీటూ, పాపను మొదట డాక్టరు పరీక్షించినప్పుడు డాక్టరు రాసుకున్న రిపోర్టు, ఎగ్జిబిట్స్ గా ప్రజెంట్ చేస్తున్నాను. చిత్తగించండి" అన్నాడు ప్రతాపరావు. ఆ కేసుకు సంబంధించిన కాగితాలు, రిపోర్టులు అన్నీ మేజిస్ట్రేట్ గారి ముందు వుంచుతూ.
ఆయన వాటిని ఓసారి గబగబ చూసి ఫైలు చెయ్యటానికని బెంచిక్లర్క్ కిచ్చాడు. అతను వాటికి నంబర్లు వేసి ఫైలు చేశాడు.
కేసు మరుసటి వారానికి వాయిదా పడింది.
15
ప్రదీప్, మాలతి కారులో తిరిగి వస్తున్నారు. ప్రదీప్ కారు డ్రైవ్ చేస్తున్నాడు గాని మనసంతా అన్యమనస్కంగా వుంది. ముఖం నల్లబడిపోయింది.
"మైగాడ్! ప్లెయిన్ గావున్న కేసును లాయర్లు ఎలా డైవర్టు చేసేస్తారు?" అన్నది మాలతి ఆశ్చర్యంగా.
"క్లయింట్ ను డిఫెండ్ చేయటం కోసం ప్రొఫెషనల్ జీనియస్ నంతా ఉపయోగించక తప్పదు."
కొన్ని నిముషాలు యిద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు.
మాలతి ప్రదీప్ కేసి చూసింది. ఆమె మనసంతా జాలితో నిండిపోయింది ఎందుకోసం? ఓ ఆశయంకోసం అతనింత శ్రమకి గురి అవుతున్నాడు!
ఉన్నట్టుండి ప్రదీప్, "మాలతీ!" అన్నాడు. గొంతులో చిన్నటెన్షన్ వుంది.
మాలతి ప్రశ్నార్ధకంగా చూసింది.
"మనం ఒకసారి హనుమంతరావుగారింటికి వెళ్ళివద్దాం. నిన్ను హాస్పిటల్లో దించి వెళ్ళనా? నువ్వుకూడా వస్తావా?" అన్నాడు.
అతని గొంతులో ఆదుర్దా గమనించిన మాలతి "ఏమిటి ప్రదీప్ సంగతి?" అనడిగింది.