Previous Page Next Page 
అసావేరి పేజి 31

    అతను వింటున్నాడో లేడో కూడా తెలుసుకోకుండా తన లావణ్య గురించి ఊదరగొట్టేస్తున్నాడు. "లావణ్య లావుగా వుంటుంది కానీ మాంచి అందంగా వుంటుంది కదూ?"
   
    తలూపాడు శంకూ నోట్సులోకి చూస్తూ.
   
    "లావు ఉన్న వాళ్ళనీ మనం ప్రేమించొచ్చు."
   
    "అలాగే"
   
    "అలా ఉన్నవాళ్ళకి మనసూ అంత లావుగా వుంటుందన్నది లెక్కన్నమాట!"
   
    "అహ"
   
    "కాబట్టే నేనెక్కువ లావున్న వాళ్ళనే ప్రేమిస్తుంటాను."
   
    "ఇప్పటికి ఎంతమందిని ప్రేమించావేంటి.....?" విసుగ్గా అడిగాడు శంకూ.
   
    "కళింకోటలో లావుగా ఉన్న చాలామంది అమ్మాయిల్ని ప్రేమించాను."
   
    "మరి వాళ్ళూ నిన్ను ప్రేమించారా?"
   
    "ఓ.....వాళ్ళకి బక్కగా ఉన్న నాలాంటి వాళ్ళంటే యిష్టం."
   
    "అయితే" సీటు మారిపోదామనుకుంటూ లేచిన అతడిని బలవంతంగా ఆపేశాడు.
   
    "నీకో సీన్ చెప్పనా?" రహస్యంగా అన్నాడు అప్పారావు.
   
    "లావుగా ఉన్న వాళ్ళతో సుఖమేమిటంటే...." చెప్పుకుపోతున్నాడు చాలా అశ్లీలంగా. ప్రేమించానని చెబుతూ యిలా బూతుమాట్లాడటం బొత్తిగా నచ్చలేదు. పైగా యిలా రహస్యంగా సంబంధం పెట్టుకుని ఆ ప్రక్రియని చిలువలు పలువలుగా చెప్పడం ప్రేమని అంగీకరించటానికీ మనసొప్పలేదు.
   
    "నీకు దణ్ణం పెడతాను. నన్నొదిలెయ్ అప్పారావ్....."
   
    అక్కడ వెంకట్ కవితల్లా యిక్కడ అప్పారావు బూతుకథలూ వినలేక యిక లెక్చరర్ వస్తాడనగా బయటికి నడిచాడు.
   
                                                             *    *    *    *    *
   
    ఎప్పుడు క్లాస్ వదిలి వచ్చిందో స్థంభం వారనుంచి ముందుకొచ్చి నిలబడింది సావేరి.
   
    "నువ్వా?"
   
    "ఏం తప్పించుకుందామనుకున్నావా?" రోషంగా మీదికొచ్చింది సావేరి ఆడగూండాలాగే....
   
    "అయ్యో....ఎవరన్నా చూస్తారంటే ఏమిటీ తిక్క!"
   
    "మర్యాదగా నాతో మాట్లాడకపోతే....!"
   
    "ఏం చేస్తావ్?"
   
    "అందరూ చూసేట్టు నీ మీద కలియబడి పళ్ళు రాలగొడ్తాను.....నిన్ను అల్లరి పెట్టేస్తాను."
   
    సావేరి మొహం చూస్తే అంతపనీ చేసేట్టుంది. "ఇప్పుడు కాదు!"
   
    "అయితే సాయంత్రం బొజ్జన్నకొండ దగ్గరికొస్తావా....?"
   
    "....."
   
    "నిన్నే...."
   
    "రాను...." స్థిరంగా అన్నాడు.
   
    "రావాలి. రాకపోతే నేనే మీ యింటికి వస్తాను. ఊరంతా డప్పు లేసినట్టు అందరికీ తెలిసేలా చేస్తాను!"
   
    "వద్దు....బొజ్జన్న కొండకి నేనే వస్తాను."
   
    "మాట తప్పవుగా....!"
   
    మాట్లాడలేదు శంకూ.
   
    "సాయంకాలం అయిదున్నర నుంచి అక్కడ నీ కోసం వెయిట్ చేస్తుంటాను తెలిసిందా. నువ్వొచ్చేదాకా అక్కడే వుంటాను. చీకటిపడినా..అర్ధరాత్రయినా....తెల్లారిపోయినా నీ కోసం ఎదురుచూస్తుంటాను...."
   
    "వద్దు....చీకటి పడితే అక్కడ పాములుంటాయి."
   
    "చస్తాను....నీకేం" హుంకరిస్తూ వెళ్ళిపోయింది.
   
    ప్రేమని అధికారంతో గెలుచుకోవాలనే సావేరి సిద్దాంతం అర్ధం కాక అవాక్కయి చూస్తున్న శంకూకి తెలీదు ఓ మూల నిలబడ్డ సుధాకర్ యిదంతా వింటున్నాడని.
   
    శంకూ, సావేరిల కదలికల్ని గమనించమని సుధాకర్ ని ఎంప్లాయ్ చేసింది రవి కాదు....
   
    రాజేందర్....సావేరి మేనబావ.
   
                                        *    *    *    *    *
   
    సాయంకాలం ఆరు కావస్తూంది. నవారుమంచంపై ముడుచుకుని పడుకున్నాడు శంకూ.
   
    ఎక్కడికీ వెళ్ళాలనిలేదు. సావేరి అంటే చచ్చేంత ప్రేమున్నా ఆ ప్రేమని మొండిగా అయినా చంపేసుకోవాలని భీష్మించుక్కూచున్నాడు.
   
    చీకటి క్రమంగా పేరుకుంటూంది.
   
    సరిగ్గా ఆ సమయంలో మంగ వచ్చింది ఇంటికి.
   
    రావటమే కాదు, సరాసరి శంకూని చేరి రహస్యంగా అడిగింది. "సావేరమ్మని చూశావా....."
   
    "చూశాను కాలేజీలో...." అంటుంటే అసంకల్పితంగా గుర్తు కొచ్చిందేదో.
   
    "ఏం ఇంటికి రాలేదా?"
   
    "ఇంటికొచ్చింది శంకూ.....వచ్చాక చెప్పాచెయ్యకుండా బయటి కెళ్ళిందట రాధమ్మ చెప్పింది. చీకటి పడుతూండగా.....ఇంకా తిరిగి రాలేదని అమ్మగారు కంగారుపడుతున్నారు."
   
    "అంటే..." బోధపడిపోయింది శంకూకి. సావేరి తాను అన్నట్టే బొజ్జన్నకొండ దగ్గరికి వెళ్ళివుంటుంది.
   
    నిర్మానుష్యంగా ఆ ప్రదేశంలో చీకట్లో తన కోసం ఎదురుచూస్తూ వుంటుంది.
   
    మంగకి జవాబు చెప్పలేదు.....వేగంగా బయటికి పరుగెత్తాడు శంకూ.
   
    మసక చీకటిలో మెరకవీధి రాజుగారి లోగిలి....గవరవీధి దాటుకుని ఊరి పొలిమేరకి రెండు కిలోమీటర్ల ఆవలవున్న బొజ్జన్నకొండని చేరుకోవడానికి పదినిమిషాలు పట్టింది.
   
    పేరుకుంటున్న చీకటిలో బౌద్దారామం చరిత్ర విసిరేసిన శిలాశాసనంలా వుంది.
       
    కీచురాళ్ళ రొద తప్ప అంతటా నిశ్శబ్దం.
   
    కోటిలింగాల గుట్టని సమీపించి అరిచాడు గట్టిగా.
   
    "సా....వే....రీ...."
   
    గుట్టలు ప్రతిధ్వనించాయి.
   
    మరోసారి....ఇంకోసారి....గొంతునాళాలు పగిలేట్టు కేకపెట్టాడు.
       
    దూరంగా గుట్టపై ఓ ఆకారం కదిలిన అలికిడి.
   
    అదికాదు. మనసు మెలిపెట్టేట్టు ఓ ఆర్తనాదం "శంకూ...." దూసుకుపోతుంటే బలంగా ఓ చేయిపడింది భుజంపై.
   
    వెనువెంటనే మెడ పగిలేట్టు ఓ దెబ్బ!
   
    తూలిపడిపోయాడు.
   
    పైకి లేవాలని ప్రయత్నిస్తూ చూశాడు.
   
    రాతిలింగాల వెనకవేపునుంచి ఒక్కొక్కరూ బయటికి వస్తున్నారు. ఎంతమంది పొంచిందీ గుర్తులేదు.
   
    కానీ తోడేలులా నవ్వుతున్న రాజేందర్ నిలబడి వున్నాడు శంకూకి సమీపంలో.
   
    అదికాదు.
   
    సావేరిని ఒడిసిపట్టుకున్నా రాజేందరే అంటున్నాడు నెమ్మదిగా "నా కథ ప్రారంభానికి ముందు నీ కథ ముగించాలన్నదే నా ప్రయత్నం శంకూ....అందుకే నన్ను చూసి కదలబోయిన సావేరిని నువ్వొచ్చేదాకా ఆపాను. ఓ.కే!"
   
    నరమేథం ప్రారంభమైన సూచనగా శంకూ పెదవులపై పిడికిలితోబలంగా గుద్దాడు.
   
    శంకూ మూలుగు అక్కడి ప్రకృతిలో కలిసి ఓ అనాథ స్త్రీ ప్రసవ వేదాన్ని గుర్తు చేసింది.
   
    రాజేందర్ వూహించలేదు సావేరి అంత సాహసం చేయగలదని గభాలున పంటితో అతడి చేతిని కొరికి పట్టు విడిపించుకుని శంకూని చేరుకుంది.

 Previous Page Next Page