"దానియిష్టం. చదివితే ఎమ్.బి.బి.ఎస్. చెప్పిస్తాను. లేకపోతే బి.ఎస్.సి. లోనో, బి ఏ లోనో చేరుతుంది. లేకపోతే..."
యువతీ, యువకులిద్దరూ ప్రశ్నార్ధకంగా చూశారు.
"పెళ్ళి చేసేస్తాను" అన్నాడాయన నవ్వి.
"పొండి నాన్నగారూ?" అని సుధ దూరంగా జరిగి కూర్చుంది.
"ఆల్ రైట్" అని ఆయన కూతురివంక క్రీగంట చూసి "పెళ్ళి చేసుకోవటం యిష్టంలేకపోతే లేడీ డాక్టరై, దేశ సేవ చేస్తూ జీవితమంతా అలా వున్నా నా కభ్యంతరం లేదు. అది ఉన్నత స్థితిలో వుండటమే నాకు కావాలి" అన్నాడు ఆర్ద్ర స్వరంతో.
సుధ మాట్లాడకుండా ఉన్నది. కొంచంసేపు గడిచాక సత్యమూర్తి లేచి ఫలహారాలు తీసుకురమ్మని చెప్పటానికి లోపలకు వెళ్ళాడు.
అయిదు నిమిషాలు గడిచాక ముగ్గురు వ్యక్తులతో కూడిన ఆ చిన్న పార్టీ ఆరంభమయింది. ఎప్పుడూ ప్రతి దానిపట్లా ఉపేక్షాభావం గల సత్యమూర్తికి ఆనాడా అంశంపట్ల ఎందుకంత శ్రద్ద కలిగిందోగాని, అల్పాహార విందు అత్యంత ఆకర్షణీయంగా కుదిర్చాడు. ప్లేట్లలో నాలుగయిదు రకాల పదార్ధాలు ఘుమఘుమ వాసనల్తో అతిధుల్లో వయసు దాటిన మనిషిని కవ్విస్తున్నాయి. పేరుకేగాని అది అల్పాహార విందు కాదు. వంటవాడు పరమేశం హడావుడిగా వంటయింటికీ, ఆగదికీ ఎడతెరపి లేకుండా తిరగవల్సి వచ్చింది ఆఖరికి అతని పనితనానికి అట్టహాసం చేస్తున్న అతిధిచేత అతనూ కీర్తింపబడ్డాడు.
ఆ సమయానికి రామ్మూర్తిగాని, రామకృష్ణయ్యగారు గాని యింట్లో లేరు. తమతమ పనుల్లో నిమగ్నులయి వుంటారనటంలో ఆశ్చర్యం లేదు.
ఎక్కడో గదుల్లో తచ్చాడుతూన్న సుభద్రమ్మని యీఘుమఘుమలు నిలవనియ్యటం లేదు. తెగించి వచ్చెద్దామంటే రాధమ్మగారు రౌద్రాకారం దాల్చి వుంది. "వకీలును పిల్చుకువచ్చి తేల్చివెయ్యరా అంటే పార్టీల్లో మునిగితేలుతున్నాడూ" అంటూ కదను తొక్కుతోంది. వెధవది ఎంతయినా జిహ్వ! వీరభద్రం మనసిక్కడ లేక అల్లకల్లోలంగా వుంది. రాలుగాయి పిల్లలు "మాకు మిఠాయి కావాలీ" అని రాగాలు మొదలుపెట్టారు.
ఇక్కడ యిలా వుండగా సత్యానందంగారు కాఫీ త్రాగటం ముగించి, కిళ్ళీ వేసుకుని, సోఫాలో అమ్మయ్య అని వెనక్కి వాలి పైప్ తీసి ముట్టించాడు.
"వెరీగుడ్, ఓటమి అంగీకరించామండీ...కాని ఒక్కటే విచారించాల్సిన సంగతి-మీరు స్థిమితంగా వున్నట్లు లేరు" అన్నాడు తాపీగా.
"లేదు. లేదు బాగానే వున్నానే" అన్నాడు సత్యమూర్తి ఉలికిపడి.
సుధ యిద్దరివంకా అర్ధంగాకుండా చూస్తోంది.
అంటే...యిందాక యింటిలోకి రాగానే పరిస్థితి అట్లా అనిపించింది లేండి. ఐమీన్...మీ పర్సనల్ వ్యవహారాల్లో కలగజేసుకుంటున్నానని అపోహ పడకండి. ఏదో పెద్దవాడ్ని. మీ కుటుంబ శ్రేయస్సు కోరేవాడ్ని. వసారాలోంచి నడిచి వస్తోంటే వాగ్వివాదం కాస్త చెవిన పడటం జరిగింది. అందుకని..."
సత్యమూర్తి ఎక్కడ అఫెండ్ అవుతాడోనని సుధ భయంగా, ఆత్రుతగా చూస్తోంది.
కాని అతను అలాంటి కోప చిహ్నాలేవీ ప్రదర్శించలేదు. పేలవమైన ఓ నవ్వు పెదవుల మీదికి తెచ్చుకుని "ఏం చేయనండీ? అమ్మది మొదట్నుంచీ ఆవేశపడే తత్వం. దానికి దోహదంగా ప్రక్కన కొన్ని గ్రహాలు చేరాయి. మనమేం చెప్పినా వినిపించుకొదు...."అన్నాడు.
"కొన్ని కొన్ని జరగక తప్పదనుకోండి" అన్నాడు సత్యానందం గారు వేదాంతము చెబుతూన్నట్లు. "ప్రకృతిలో కొన్ని శాపాలుంటాయి. అన్నీ మన చేతుల్లో వుండవు. కాని సీరియస్ స్టెప్ తీసుకునేటప్పుడు ముందూ వెనుకా ఆలోచించి ఎంతో జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది."
సత్యమూర్తి మాట్లాడలేదు. మనసు పని చెయ్యటం మానేస్తోంది.
తండ్రి యింకాలోతుగా మాట్లాడటం సుధకు యిష్టంలేదు. "పోనిలే నాన్నగారూ యిప్పుడెందుకు ఆ గొడవలు. మనం సరదాగా కాలక్షేపము చేయటముకోసం వచ్చాముగాని కలతలు లేపుకొనటము కోసం కాదుగా" అంది ప్రేమగా.
ఆయన కూతురి భుజం మీద ప్రేమగా నిమిరాడు. "నిజమే తల్లీ....పెద్ద ప్రాణం గనుక అవసరమైన విషయాల వైపు బుద్ది కేంద్రీకరించబడుతూ వుంటూంది. ఆల్ రైట్" ఒక్కసారి బిగ్గరగా నవ్వి "కాసేపు హేపీగా పేక ఆడుకుందాము. కార్ద్సువున్నాయా మీ దగ్గిర?" అని సత్యమూర్తిని అడిగాడు.
అతను సిగ్గుపడుతూ "లేవు...నాకు కార్ద్సు అట్టంకూడా రాదు" అన్నాడు.
"వండర్! ఒకరోజన్నా క్లబ్బుకి వెళ్ళకుండా నేనెప్పుడూ వుండలేదు. చేతులు దురద పెడతాయి. ఇంటర్నేషనల్, రమ్మీ ఏం మజా?"
"రోజూ వందా రొండొందలూ వదిలించుకోవటంగురించి చెప్పరేం?" అని కూతురు ఎత్తిపొడిచింది.