"నేను ఏం చేస్తున్నా కుటుంబ గౌరవంకోసం చేస్తున్నాను! మీకు కూతురైతే నాకు చెల్లెలు. నాకు ప్రేమలేదా? కాని, గీత వెంటనే ఒకింటిది కావాలి."
కూతురు చదువు చదువంటూ పై ఊరికివెళ్ళి ఏదైనా ప్రేమవ్యవహారం సాగించి ఉంటుందా అన్న అనుమానం వచ్చింది వాళ్ళకు. విడమర్చి చెప్పమని అడిగే ధైర్యం లేకపోయింది. "పెళ్ళిచేస్తే చేశావుగాని కాస్త ఈడుజోడైన సంబంధం చూడు" అన్నారు.
"నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. మీరు వద్దని పట్టుబడితే ఈ పెళ్ళి ఆగిపోతుంది. కాని, నేను ఇల్లు విడిచిపోతాను. తిరిగి నా ముఖం చూడరిక."
కొడుకు అంతఖచ్చితంగా చెబుతూంటే వాళ్ళు నోరెత్తలేకపోయారు.
గీతాభవాని అన్న నిర్ణయానికి మౌనంగా తలవంచింది.
చెల్లెలి మేడలో మూడు ముళ్ళు పడ్డ తరువాత సగం బరువు దింపినట్టుగా అయింది వామనరావుకు. మిగతా సగం ఆమె కాపురం చూసివచ్చాక తొలగిపోయింది.
సహజంగా వినయవతీ, సహనవతీ ఆమె. ఆమె స్వభావానికి ఆ ఇంటి వాతావరణం ఎంతో చక్కగా సరిపోయింది. ఇరవయ్యేళ్ళకె నలభయ్యేళ్ళ పెద్దమనిషిలా గృహిణీత్వపు బాధ్యతలు పైన వేసుకొంది. సవతి పిల్లలకి ఈ పిన్నిమీద చెప్పలేనంత ప్రేమా, ఆరాధనా! ఏ పనీ ఈ పిన్నిని కాదని చేయరు. పెద్దమ్మాయికి పన్నెండేళ్ళు చిన్నమ్మాయికి పదేళ్ళు. బంధుమిత్రులకు ఆమెమీద అంతులేని అభిమానం! దాస దాసీజనానికి ఆమెమీద చెప్పలేనంత గౌరవం.
గిరిధరంగారి సంగతి చెప్పనేఅక్కరలేదు. "ఆమె నాకు భార్యకాదు! నా కుటుంబ నావను దరిచేర్చడానికి వచ్చిన దేవత." అన్నారు బావమరిదితో కృతజ్ఞతతో పూడుకుపోయిన కంఠంతో.
వచ్చేప్పుడు వామనరావు చెల్లెలితో అన్నాడు. "గీతా! నిన్ను చూస్తుంటే నాకు చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. చెప్పలేనంత ఆనందంగా కూడా ఉందమ్మా. ఇంతగా వాళ్ళ అభిమానం చూరగొనడానికి నువ్వు ఏం వశీకరణ ప్రయోగించావా అని ఆశ్చర్యం వేస్తూంది."
"వశీకరణా? ఏం లేదన్నయ్యా! దెబ్బతిన్న నా హృదయం వీళ్ళసేవలో సేదదీరుతున్నది. తల్లిప్రేమ కరువైన ఆ పిల్లలు, పత్నీ వియోగం సంభవించిన ఆయన, యజమానురాలిని కోల్పోయిన నౌకర్లు, ఆధారం లేక అల్లాడుతున్న తీగలా ఉన్న వీళ్ళనుచూసి కలత పడుతున్న బంధువులు వీళ్ళందరినీ ఏం కావాలో నాకు తెలుసు. వాళ్ళకు తెలిసింది నేను ఇవ్వగలుగుతున్నాను. అంతే." గీతాభవాని నిర్వికారంగా అంది.
"ఆ 'ఇవ్వడమే' మామూలు విషయంకాదు, గీతా."
"వీళ్ళ సేవలో నా జీవితాని కంటిన బురద ఏమైనా కడుక్కుపోతుందేనని."
"రెండో సంబంధం ఇచ్చానని నా మనసులోఉన్న వ్యధ ఇవాళ నీ సంసారాన్ని చూస్తుంటే, నువ్వు పొందిన స్థానాన్ని చూస్తుంటే మటుమాయమై పోయిందమ్మా! బావగారు ఎంత మంచిమనిషి. ఈ స్థానాన్ని పదిలంగా కాపాడుకో."
అప్పటినుండి ఇప్పటివరకు ఆ స్థానాన్ని నిలుపుకొస్తున్న గీత ఈ రోజు ఏం చేస్తోంది? ఎలాంటి పిచ్చిపని చేస్తోంది?
10
"నువ్వొచ్చావని విని వచ్చేసరికే నువ్వు హైదరాబాద్ వెళ్ళావన్నారు! బాగున్నావేమే, గీతా? ఒక్కదానివే వచ్చావేం పిల్లల్ని తీసుకురాకుండా?" అంది ప్రక్కింటి రుక్మిణమ్మ వచ్చి.
"వాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటారుకదా?"
"అవును! ఇద్దరూ కవలపిల్ల లేమోననిపించేటట్టుంటారు. భలేముద్దొస్తారు అబ్బా. ఏం అల్లరి? ఏం నువ్వులు? కుదురుగా, ముక్తసరిగ్గా ఉండే మా సీత కడుపున ఇంత రాలుగాయ లెలాపుట్టారా అని ఆశ్చర్యపడుతుంటాం. మీ పెద్దది స్వాతి..."
"స్వాతి కాదు, జ్యోతి."
"పేర్లుకూడా ఎంత చక్కగా అవరేట్టు పెట్టావు. అది నాకేం పేరు పెట్టిందో తెలుసా? కొండముచ్చు మామ్మగారినట."
గీతాభవాని నొచ్చుకొన్నట్టుగా చూసింది. "అలాగా? ఊరికివెళ్ళాక దాని చెవులు మెలిపెడతాను!"
"వద్దులే! నాకేం కోపంలేదు! ఆ వయసు అలాంటిది. ఆ అల్లరి, ఆ త్రుళ్ళిన మా ముసిలాళ్ళకి రమ్మంటేకూడా రావు!" పెళ్ళైయిన ఇరవై సంవత్సరాలలో అంతా మూడు నాలుగుసార్లు వచ్చావు. పుట్టింటిమీద మరీ అంత చిన్న చూపేమిటి?"
"నేను లేకపోతే ఒక్కక్షణం గడవదత్తా! ఆడపడుచులు, బంధువులు ఎవరో ఒకరు వచ్చిపోయే ఇల్లు. ఎందరు నౌకర్లు ఉన్నా పైన అజమాయిషీ చేయనిది ఒక్కపనీ జరగదు."
"మా ఇంటికి రావే. పసుపుకుంకుమ తీసుకువద్దువు." అంటూ లేచింది రుక్మిణమ్మ.
గీతాభవానికి వెళ్ళాలని లేదు. పసుపుకుంకుమ తీసుకొమ్మని పిలుస్తూందే. అయిష్టంగానే ఆవిడతో వెళ్ళింది. చిన్నప్పుడు ఆ ఇల్లు ఎలాగుందో ఇప్పుడూ అలాగేఉంది. వసారాలో తనూ, సుధా ఊగే ఉయ్యాలబల్లఅలాగేఉంది! పొడుగ్గాఉన్న దానిమీద మధ్యాహ్నం వేళ, తనభారీపొట్టమీద తడిబట్టవేసుకొని గుర్రుతీస్తూ నిద్రపోయేవాడు రుక్మిణమ్మ భర్త. గీతాభవాని ఆయన్ని మామయ్యా అని పిలిచేది. తన పెళ్ళయ్యాకే ఆయనపోయాడు.
"సుధకి ఎంతమంది పిల్లలు?"
"నలుగురు. ఇద్దరు ఆడ, ఇద్దరు మగ. అదీ నీలాగే ఏళ్లయినా పుట్టిల్లు గడప త్రొక్కదు. ఏమైనా అంటే ఆయనకీ హోటల్ భోజనం పడదు అంటుంది. నేనే ఎప్పుడైనా వెళ్ళి చూసి వస్తూంటాను. నీలాగా దానికి కార్లు మేడలులేవు. అయితే ఏం? చాలాముచ్చటేస్తుంది దాని సంసారం చూస్తుంటే! ఏమిటో మీ అన్న చూసిచూసి అలాంటి సంబంధం చేశాడు. ఎంత ఐశ్వర్యం ఉంటేనేం ఈడుజోడూ లేకపోయాక?"