Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 30

    ప్రజ్ఞ ఆలోచిస్తోంది.

    "తర్వాత తమ వంటికి, యింటికి అన్నీ అమర్చుకోవాలనే తాపత్రయం ఆడదానికి. అదేదో సూక్తిముక్తావళిలా, పెళ్ళి అయ్యేదాకా అది ఎలా అవుతుందా అనే ఆలోచన. అయాక అయినదానికి, కానిదానికీ ఏవేవో కారణాలు కల్పించుకుని పుట్టింటికి పరిగెడుతూ వుండటం ఓ డర్టీ హంగామా. ఇద్దరి మధ్యా సభ్యత పదిపాళ్ళూ, కీచులాడుకోవటం తొంభై పాళ్ళూ వుంటుంది."

    "అందరూ అలాగే వుంటారా ?"

    "తొంభయి శాతం. కొందరు బయటపడుతూ ఉంటారు. కొందరు మానసికంగా కృంగిపోతూ ఉంటారు."

    "భార్యాభర్తా యిద్దరి మధ్యా ప్రేమ ఉండదంటారా ?"

    "భార్యా భర్త యిద్దరి మధ్యా ఉండేది సెక్స్. దానికే ప్రేమ అనీ, అనురాగమనీ, బంధమనీ రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటారు."

    "అయ్యో!" అంది బాధగా ప్రజ్ఞ. "అది చాలా పవిత్ర బంధమండీ. దానికిలాంటి పేర్లు పెట్టటం ..."

    "ఇంకో రకంగా అనుకున్నా _ భార్యా భర్తల మధ్య ఉండే సంబంధం ఓ వ్యాపారం లాంటిది. ఇచ్చి పుచ్చుకోవటాలు  అన్న అంశానికి యిక్కడ చాలా ప్రాధాన్యత ఉంటుంది. చివరకు యిద్దరి మధ్యా రాజ్యం చేసేది డబ్బే. "నేనింత యిచ్చాను. నువ్వేమిచ్చావు?" అనే సూత్రం చివరిదాకా అమలుపర్చబడుతూ వుంటుంది. ఒకరికొకరు యిష్టపడే సమయాలకన్నా ద్వేషించుకొన్న  క్షణాలే  ఎక్కువ. ప్రేమ అనే ఆత్మవంచనలో, ఆకర్షణ అన్న సగం నిజంలో, స్వార్ధం అనే మైకంలో కాబోలు, నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. పిల్లలు పుట్టాక యీ వ్యాపారం మరింత ఎక్కువవుతుంది. "మా తల్లిదండ్రులు మాకేం చేశారు" అని పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. "మాపిల్లలు మాకేం ఒరగబెడుతున్నారు" అని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. "మీకు జన్మనిచ్చాం, పెంచాం, కుటుంబ పరపతికి, ఆర్ధిక వ్యవహారానికీ మీరేమిస్తారు" అన్నట్లుంటుంది తల్లిదండ్రుల ధోరణి. పరస్పరారోపణలతో, వ్యాఖ్యలతో, అసంతృప్తులతో  జీవితాలు రాలిపోతూ  ఉంటాయి. ఇదే సంసారమంటే" అంది తేజ.

    "కాదు" అంది ప్రజ్ఞ నిశ్చల స్వరంతో. "మీరు చెప్పినవి ఎక్కడో ఓ శాతం ఉంటే ఉండవచ్చు. ప్రపంచంలో ప్రేమ ఉంది, అనురాగముంది. భార్యాభర్తల మధ్య దైవత్వంతో  కూడిన అమరజీవితముంది. పవిత్రత ఉంది ఎప్పటికైనా ...మీరన్న మాటలు అబద్ధాలని రుజువు చేస్తాను."

    తేజ నవ్వింది "ప్రజ్ఞా! నువ్వెంత అమాయకురాలివి? కాలుష్యం ఎంత పేరుకుపోయి ఉన్న ప్రపంచంలో మనం జీవిస్తున్నామో నీకు తెలీదు. మనిషికీ మనిషికీ మధ్య ఉన్న  సంబంధం అబద్దమే. నిజం చెప్పటానికి వీలులేని, నిజాన్ని తప్పనిసరిగా దాచి ఉంచాల్సిన వికృత ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఇలాంటి సమాజంలో పవిత్రతను వెదుక్కోవటం  మనని మనం త్యాగం చేసుకున్నట్లవుతుంది."

    "కాదు. ఈ ప్రపంచంలో నీతి, ప్రేమ, నిజాయితీ  ఉన్నాయని నిరూపించి తీర్తాను" అంది ప్రజ్ఞ పట్టుదలగా.
    ఆమె కంఠంలో గొప్ప దృడత్వం ధ్వనిస్తోంది.

    తేజ ఏమీ మాట్లాడలేదు. ఎటో చూస్తూ చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె కళ్ళు శోణిమ కాంతితో మెరుస్తున్నాయి.

    ప్రజ్ఞ యింటిదారి పట్టి రోడ్డుమీద ఓ ప్రక్కగా నడుస్తుంది.

    మనసంతా వ్యాకులపాటుతో చిన్నాభిన్నంగా వుంది.

    తేజ హృదయం మంచిదే. కాని ఆమెతో మాట్లాడినప్పుడల్లా భయంగా, గుండె రాపిడిగా ఉంటుంది. ఇహ తనతో యిలాంటి విషయాలు చర్చించకూడదనుకుంటుంది.

    ఉన్నట్లుండి వీధిలో దీపాలన్నీ  ఆరిపోయాయి. కరెంటు పోయినట్టుంది. ఆమె తృళ్ళిపడి ఉన్నచోటనే నిలబడిపోయింది.

    చుట్టూ గాఢాంధకారం వ్యాపించి ఉంది.

    ప్రజ్ఞకు భయమేసింది. ఏం చెయ్యాలో తెలియలేదు. నడిరోడ్డు అలా ఎంతసేపని నిల్చుని ఉంటుంది. ధైర్యం తెచ్చుకుని  ఒకడుగు ముందుకు వేసింది.

    భుజం మీద ఎవరిదో చెయ్యి పడింది. కెవ్వున  అరవబోయి తమాయించుకుంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా...కాని అది పొరపాటు కాదని మరుక్షణంలో తెలిసిపోయింది. ఆ చెయ్యి భుజం మీద నుంచి మెడచుట్టూ ప్రాకి అక్కడ సవరిస్తోంది. అక్కడ్నుంచీ...

    ఈసారి గట్టిగా అరవటానికి ప్రయత్నించింది. కాని అవతలి వ్యక్తి తాలూకూ రెండో చెయ్యి బలవంతంగా ఆమె నోరు అదిమిపట్టి కేక వెయ్యటానికి వీల్లేకుండా చేసింది. తర్వాత క్షణంలో ఆమె ప్రక్కనే ఉన్న సందులోకి లాక్కుపోబడుతున్నట్లు గ్రహించింది.

    ప్రజ్ఞకు క్షణంసేపు ఊపిరాడలేదు. ఎలాగో తెప్పరిల్లి తన భుజం మీద నుంచి, ముఖం మీద నుంచి ఆ చేతులు త్రోసివెయ్యడానికి ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. పైపెచ్చు ఆమె శరీరంమీద ఆ చేతులు బిగుసుకుంటున్నట్లనిపించింది. ఎంత పెనుగులాడుతున్నా ఆ చేతులామె శరీరాన్ని ఎక్కడెక్కడో  తాకుతున్నాయి. ఆ వ్యక్తి ముఖం ఆమె ముఖానికి దగ్గర్లోకి వచ్చింది. దూరంగా త్రోసిపారెయ్యటానికి ప్రయత్నిస్తోంది. ఆమెవల్ల కాలేదు. ఆ వ్యక్తి పెదవులామె బుగ్గను తాకి 'ప్చ్' అని శబ్దం చేశాయి. ఆమె వంట్లో బలం తప్పుతూన్నట్లు నిస్సహాయంగా నిలబడిపోయింది.

   

 Previous Page Next Page