Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 30

 

    అదీ గాక సమాధానం దొరకని ప్రశ్నలు రోజురోజుకి పెరిగి పోతున్నాయి. స్మితారాణి వెంతబడుతున్న గాంగ్ మెంబర్స్ ఎవరు? వాళ్ళకు కావలసిన వస్తువేమిటి? భార్గవ్ ని ఎవరు చంపారు? సంధ్యారాణి ఎవరు? ఆమె ఇల్లు ఎందుకు ఖాళీగా వుంది? ఆమె ఇంటికి ఈ యువతి దొంగతనంగా ఎందుకొచ్చింది? ఈ చిరునామాల రహస్యం ఏమిటి? ఏమీ అర్ధం కావటంలేదతనికి. ఆమె పక్కనే సోఫాలో పడివున్న లేడీస్ బాగ్ తీసి చూశాడు. లోపల అంతా మేకప్ సామాన్లున్నాయ్ - పైన ఆమె పేరున్న కార్డు కనిపించింది. వి. సునంద, కేరాఫ్ హోటల్ నైటింగేల్.
    టైమ్ చూసుకున్నాడు భవానీశంకర్. నాలుగవుతోంది. తనింక ఆలస్యం చేయటం మంచిది కాదు.
    "సారీ కామ్రేడ్! నీ అతి తెలివి వల్లే నిన్నీ పరిస్థితిలో వదిలి వెళ్ళాల్సి వస్తోంది! బెస్టాఫ్ లక్!" అనేసి బయటకు నడిచి తలుపు మూసి వేశాడు. మెట్లు దిగి వడివడిగా రోడ్ మీదకు వచ్చాడు. నడుస్తూనే ఆర్.కె. శ్యామ్ ఇంటికి బయలుదేరాడు. ఇల్లు చేరుకునే సరికి ఇంచుమించుగా తెల్లారి పోయింది.
    అఖిలభాను నిద్రకళ్ళతో తలుపు తెరిచింది.
    "రాత్రి తెల్లార్లూ తిరగటం తప్ప మీకింక వేరే పనేమీ లేదా?" చిరుకోపంతో అడిగిందామె.
    "ప్రజాసేవకు రాత్రి పగలూ అన్న విచక్షణ వుండదు సిస్టరిన్ లా! ముందు నాకు పడుకుని నిద్ర పోవటానికి పిడికెడు చోటు చూపిస్తే మిగతా వివరాలు నిద్ర లేచాక మాట్లాడుకుందాం!" అంటూ లోపలకు నడిచాడతను.
    అతని వెనకే లోపలకు నడవబోయి అఖిలభాను అతని రూపాన్ని చూసి నిశ్చేష్టురాలయింది.
    "ఏమిటి? దెబ్బలు తగిలినట్లున్నాయే? ఎలా తగిలినాయ్?" ఆత్రుతగా అడిగిందామె.
    "ష్! గట్టిగా అరవకు సిస్టరిన్ లా ! మీ గొంతు విన్నారంటే భారత ప్రజానీకం నా ఆరోగ్యం కోసం దేశమంతా ప్రార్ధనలు జరపటం ప్రారంభిస్తారు అనవసరంగా! ఈ దెబ్బల గురించి మీరేం వర్రీ అవకండి. ఇవి పిల్లల ఆటల్లో తగిలే దెబ్బల్లాంటివి " అన్నాడతను.
    అఖిలభాను లోపలికెళ్ళి పరుపు తీసుకొచ్చి వేసిందతని కోసం. దాని మీద పాడుకుంటూనే గాడనిద్రలో మునిగిపోయాడు భవానీ శంకర్.
    అతనికి తిరిగి మెలకువ వచ్చేసరికి చుట్టూ కూర్చుని అతని ముఖంలోకే చూస్తున్న శ్యా]మ్ , అఖిలభాను. స్మితారాణి, తులసి కనిపించారు.
    "అంకుల్! నువ్ విలన్స్ తో ఫైటింగ్ చేశావు కదూ?" ఆత్రుతగా అడిగింది తులసి.
    "అవును కామ్రేడ్ - ముందు మా వదినమ్మ, గుప్పెడు కాఫీ, పిడికెడు బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేస్తే రాత్రి జరిగిన సినిమా కధంతా వివరించి చెప్పేస్తాను -" అన్నాడతను.
    "అవన్నీ రెడీగా వున్నాయ్ - ముందు లేచి కూర్చోండి -" అంది అఖిలభాను.
    భవానీశంకర్ లేచి ముఖం కడుక్కుని ఫలహారం చేస్తూ రాత్రి తన గదిలోనూ, సంధ్యారాణి ఫ్లాట్ లోను జరిగిన విశేషాలన్నీ వర్ణించి చెప్పాడు.
    శ్యామ్ అతని చేతిలోని ఆ ఎర్ర పుస్తకం తీసుకుని ఒక్కొక్క అడ్రస్ చూడసాగాడు.
    "అరె! ఈ అడ్రస్ మన హైదరాబాద్ లోని ఫేమస్ కంట్రాక్టర్ ది కోట్లు సంపాదించాడతను. ఇదిగో ఈ అడ్రస్ చూశావా? చెమన్ లాల్ - పెద్ద నగల షాపు ఓనర్. ఈ పేరు చూడు నిరంజన్ - అయ్. ఏ. యస్ ఆఫీసర్! కోట్ల లంచాలు తిన్నాడని ఈ మధ్యే యాంటీ కరప్షన్ వాళ్ళు పట్టుకున్నారు. ఇదిగో ఈ అడ్రస్ లన్నీ ఫిలిమ్ ప్రోడ్యుసర్స్ వి"


                                                             8

    ఈ పుస్తకంలో వున్న అద్రసుల్లో కొన్నే వారికి తెలిసినాయ్. మిగతావి ఎవరివో వాళ్ళెం చేస్తుంటారో ఆ వివరాలేమీ లేవు.
    "దీన్ని బట్టీ చూస్తుంటే ఈ అడ్రస్ లన్నీ బాగా ధనవంతులు పేరు ప్రఖ్యాతలు వున్న వారివే అని అర్ధమవుతోంది - " అన్నాడు శ్యామ్.
    'అంతవరకూ కరక్టే. కానీ ఆ అడ్రస్ లు ఎందుకు నోట్ చేశారు. ఈ పుస్తకం ఆ అమ్మాయి ఎందుకు దొంగతనం చేసింది. మనల్ని స్మితారాణినీ ఆ గ్యాంగ్ యివ్వమని బెదిరిస్తోన్న వస్తువు ఈ పుస్తకమేనా? ఈ విషయాలన్నీ తేలాలి ముందు" అంది అఖిలభాను.
    "అవి తేలాలంటే ఇవాళ సాయంత్రం నేనూ, కామ్రేడ్ శ్యామ్ కలిసి హోటల్ నైటింగేల్ కెళ్ళాలి! అక్కడ మిస్ సునందను కలుసుకుంటే అన్ని వివరాలు తెలుస్తాయ్" అన్నాడు భవానీ శంకర్.
    "అంటే మళ్ళీ ఫైటింగ్ చేస్తావా అంకుల్! ఉత్సాహంగా అడిగింది తులసి.
    "ఇంతవరకూ జరిగిందేదో జరిగిపోయింది. ఇంక మీరు ఇల్లు కదలకుండా కూర్చోండి కొన్నాళ్ళు! వాళ్ళ జోలికి వెళ్ళవద్దు- " అంది అఖిలభాను కోపంగా.
    "ఛఛ! వీరపాంచాలి పుట్టిన దేశంలో అఖిలభాను లాంటి స్త్రీలు కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది!" అన్నాడు భవానీశంకర్ ఆమెను అవహేళన చేస్తూ. "అన్నట్లు కామ్రేడ్ శ్యామ్ ఇంత పిరికి వదినమ్మను ఎలా పెళ్ళి చేసుకున్నావ్ నువ్వు?" శ్యామ్ నడిగాడతను.
    "అంతా విధివ్రాత బ్రదర్! ఏం చేస్తాం? ఆ సమయంలో మంచి అమ్మాయిల కొరత తీవ్రంగా ఏర్పడింది అంచేత-"

 Previous Page Next Page