Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 31


    
    దేవీప్రియ కళ్ళలో మత్తు, పైట పూర్తిగా పక్కకి జారిపోయింది.
    
    'డియర్... డియర్' అన్నట్లు ఆమె పెదవులు గొణుగుతున్నాయి. మనసు అలలు అలలుగా తేలికై, ఇంకా తేలికై... ఎటో ఊగిపోతుంది.
    
    ఆమె మొహం మీదకు వంగాడు. ఈసారి తల పక్కకి తిప్పుకోలేదు. అతని కళ్ళలోకి చూస్తూ నవ్వింది.
    
    పెదవులు,  చల్లగా మండాయి.
    
    పొంగే గుండెలమీద వెచ్చటి స్పర్శ నరనరాలా విద్యుత్ పాకి, మైకంతో కళ్ళు మూసుకుంది.
    
    ఆమె భుజాలు పట్టుకుని లేవదీసి బెడ్ మీదకు తీసుకెళ్ళాడు.
    
                                            * * *
    
    మియాన్ దాద్ సెటిల్ అయిపోయాడు. అతన్ని అవుత చెయ్యటం ఎవరి తరమూ కావటంలేదు.  నిలకడగా ఆడటమే గాకుండా వేగంగా పరుగులుకూడా తీస్తున్నాడు.
    
    క్షణం క్షణం టెన్షన్ పెరిగిపోతోంది.
    
    రెండోవైపు వికెట్లు పడిపోతున్నాయి. స్కోర్ మాత్రం పెరిగిపోతున్నది.
    
    రాజాచంద్ర ఎవరితో మాట్లాడటంలేదు. చాలా సీరియస్ గా ఉన్నాడు.
    
    ఈలోపల ఆఫీస్ నుంచి రెండుసార్లు ఫోన్ వచ్చింది.
    
    విశారద ఫోన్ లో మాట్లాడి వచ్చి "మేనేజర్ గారు పిలుస్తున్నారండీ బాంబే నుంచి ఎవరో కస్టమర్స్ వచ్చారట" అంది.
    
    "నేనిప్పుడు రాను ఇప్పుడు మాట్లాడను" అన్నాడు రాజాచంద్ర కోపంగా.
    
    విశారద ఫోన్ దగ్గరకు మళ్ళీ వెళ్ళి వచ్చి "పాతికవేలదాకా వచ్చే ట్రాన్సాక్షన్ టండీ. వాళ్ళు మళ్ళీ నాలుగింటికల్లా వెళ్ళిపోతారట. అనవసరంగా ఎందుకు పోగొట్టుకోవాలి అంటున్నాడు మేనేజరు."
    
    "నేను రాను."
    
    "ప్లీజ్."
    
    రాజాచంద్ర జవాబు చెప్పకుండా టీ.వీ. వైపు చూస్తున్నాడు.
    
    విశారద ఇహ లాభంలేదని గ్రహించి ఫోన్ దగ్గరకెళ్ళి ఏదో మాట్లాడి వచ్చేసింది.
    
    నలభయి తొమ్మిదో ఓవర్ కపిల్ వేస్తున్నాడు.

    "ఇదేమిటి?" అంటూ రాఖేష్ విసుక్కున్నాడు. "బాట్స్ మెన్ ని కొంచెమో గొప్పో కంట్రోల్ చెయ్యగలిగింది కపిల్ ఒక్కడే. చివరి ఓవర్ తనకి రాకుండా మిస్టేక్ చేశాడేమిటి?"
    
    "ఆ మాత్రం క్యాలిక్యులేషన్ తెలీనివాడు కెప్టనేమిటి? చివరి ఓవర్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి" అంది వినూత్న.
    
    ఆ ఓవరయిపోయింది. కపిల్ కు వికెట్ రాలేదు.
    
    చివరి ఓవర్ చేతన్ శర్మ బాల్ చేతిలోకి తీసుకున్నాడు.
    
    ఇంకా రెండు వికెట్లు ఉన్నాయి. ఆరు పరుగులు మాత్రం చెయ్యాలి.
    
    మియాన్ దాద్ అప్పటికే సెంచరీ పూర్తిచేసి పైన ఇంకా కొన్ని పరుగులు చేశాడు.
    
    కపిల్ దేవ్ ఫీల్డింగ్ ఎరేంజ్ మెంట్స్ తెగచేసి పారేస్తున్నాడు.
    
    ఫస్ట్ బాల్ కీ మియాన్ దాద్ సింగిల్ మాత్రం చెయ్యగలిగాడు.
    
    అటుకేసి ఉన్న జుల్ కర్ నైన్ బాటింగ్ సైడ్ కి వచ్చాడు.
    
                                              * * *
    
    జుల్ కర్ నైన్ షాట్ కొట్టి రన్ తియ్యబోయి రనవుటయిపోయాడు.
    
    టీ.వీ. చూస్తోన్న కొన్ని లక్షలమంది ప్రేక్షకుల గుండెలు గబగబా కొట్టు కుంటున్నాయి.
    
    తాసిఫ్ మహమద్ బాటింగ్ కు వచ్చాడు.
    
    చేతన్ శర్మ కూడా బౌలింగ్ వెయ్యటానికి చాలా టెన్షన్ ఫీలవుతున్నాడు.
    
    బాల్ వేశాడు.
    
    తాసిఫ్ మహమద్ ఎలాగో సింగ్ తీసి అటుకేసి వెళ్ళిపోయాడు.
    
    మియాన్ దాద్ ఫేస్ చేస్తున్నాడు. ఓవర్ లో ఇంకా ఒక్క బాల్ మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితి వచ్చింది.
    
    నాలుగు పరుగులు మాత్రం చెయ్యాల్సి ఉంది.
    
    చేతన్ శర్మ బాల్ చేతిలోకి తీసుకున్నాడు.
    
    కొన్ని లక్షలమంది టీ.వీ. ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.
    
    బౌండరీ కొట్టాలి. ఏం చేస్తాడు? మూడు పరుగులు తీస్తే స్కోర్ సమానమవుతుంది. కాని వికెట్ల పతనం లెక్కలోకి తీసుకుంటే ఇండియా గెల్చినట్లవుతుంది.
    
    చేతన్ శర్మ బాల్ వేశాడు. కావాలని వేశాడో, గూగ్లీ వేద్దామనుకుంటే అలా జరిగిందో, అది ఫుల్ టాస్ గా మారి మీదకు వచ్చింది.
    
    మియాన్ దాద్ అరసెకన్లో వెయ్యోవంతు దిమ్మెరబోయాడు. వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. శరీరంలోని ప్రతి అణువులోని శక్తినీ చేతుల్లోకి తీసుకుని గట్టిగా కొట్టాడు.
    
    ఫీల్డర్స్ తలలమీదుగా బాల్ గాల్లోంచి వేగంగా వెళ్ళిపోతోంది.
    
    ఊహించని ఈ పరిణామనికి ఫీల్డర్స్ షాక్ తిని,  నిస్సహాయంగా తలలెత్తి చూస్తున్నారు.
    
    బాల్ ఎగురుకుంటూ వెళ్ళి బౌండరీ లైన్ దాటి అవతల పడింది.
    
    సిక్సర్.
    
                                                 9
    
    రాజాచంద్ర సోఫాలో వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకుని ఉండిపోయాడు.
    
    "ఏమండీ" అని పిలిచింది విశారద ఆందోళనగా.
    
    రాజాచంద్ర కళ్ళు తెరవలేదు.
    
    "డాడీ! డాడీ!" అని పిలుస్తున్నారు పిల్లలు. రాజాచంద్ర పలకటల్లేదు.
    
    "డాడీకి హార్ట్ ఎటాక్ వచ్చిందేమో ఇలాంటి సస్పెన్స్ మేచ్ లు చూసినప్పుడల్లా కొన్ని వందలమందికి హార్ట్ ఎటాక్ రావటం, అందులో ఒకరిద్దరు..."అని రాఖేష్ ఏదో అనబోతూ విశారద తనవైపు ఉరిమి చూసేసరికి టక్కున నోరు మూసుకున్నాడు.

 Previous Page Next Page