Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 30


    పాకిస్తాన్ ప్లేయర్స్ బాటింగ్ ప్రారంభించారు. ముదసర్నజర్, మోసిన్ ఖాన్ ఆడుతున్నారు.
    
    "రెండు వందల నలభై అయిదు ఛేజింగ్ అంటే కష్టమే. ఆషామాషీ కాదు" అన్నాడు రాఖేష్.
    
    "పాకిస్తాన్ వాళ్ళు కొట్టిపారేస్తారు" అంది వినూత్న.
    
    "కాదు ఇండియా గెలుస్తుంది" అన్నాడు మనోజ్.
    
    "పందెం!"
    
    "ఎంత?"
    
    "వంద రూపాయలు."
    
    "నువ్వలాగే అంటావు. తరువాత ఇవ్వవు."
    
    "ఇస్తాను."
    
    "అలా అంటే కాదు ఇద్దరం చెరో వంద తీసుకొచ్చి డాడీ దగ్గర కలుపుదాం."
    
    ఇద్దరూ గబగబా గదుల్లోకి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి తండ్రిచేతిలో పెట్టారు.
    
                                           * * *
    
    కారు ఓ గ్రేట్ గార్డెన్ ముందాగింది. లోపల అనాబ్ షాహీ, కిస్ మిస్ గ్రేప్స్ విరగకాసి ఉన్నాయి.
    
    వాచ్ మేన్ వచ్చి గేటు తీశాడు. కారు లోపలకు దారి తీసింది.
    
    గార్డెన్ మధ్యలో ఓ పక్కగా అందాలు చిందే అవుట్ హౌస్ ఉంది.
    
    ఇద్దరూ కారు దిగారు.
    
    దేవీప్రియ సంకోచంగా డోర్ దగ్గరే ఆగిపోయింది. అతను చనువుగా భుజంమీద చెయ్యివేసి లోపలకు తీసుకెళ్ళాడు.
    
    పాకిస్తాన్ బాటింగ్ మొదలయింది.
    
    ముదసర్ నగర్, మోషిన్ ఖాన్ బ్యాటింగ్ చేస్తున్నారు.
    
    ఆస్కింగ్ రేట్ ఫర్ పాయింట్ నైన్ అనే ఓవర్ కు ఇంచుమించు అయిదు రన్స్ చొప్పున తియ్యాలి.
    
    ఇద్దరూ గబగబా రన్స్ తియ్యటానికి ప్రయత్నిస్తున్నారు.
    
    స్కోర్ తొమ్మిది వద్ద ఉండగా చేతన్ శర్మ బౌలింగ్ లో ముదసర్ నగర్ ఎల్.బి.డబ్ల్యూ అయిపోయాడు.
    
    రాఖేష్, మనోజ్, వినూత్న చప్పట్లు కొట్టేశారు.
    
    తరువాత రమీదురాజా వచ్చాడు. ఇద్దరూ కలసి త్వరత్వరగా పరుగులు తియ్యటానికి ప్రయత్నిస్తున్నారు. మదన్ లాల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మొదట రమీదురాజానీ, తరువాత మోసిన్ ఖాన్ నీ క్లీన్ బౌల్ చేసేశాడు. అప్పటికి స్కోర్ అరవై ఒక్క పరుగులు దాటలేదు.
    
    ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతుంది.
    
    జూవిద్ మియానిదాస్ వచ్చాడు- జత.
    
    "వీడొకడు కలియుగ రాక్షసుడు పొగరుగా కనిపించినా అద్భుతంగా బాటింగ్ చేస్తాడు" అన్నాడు మనోజ్.
    
    "ప్రస్తుతం వరల్డ్స్ బెస్ట్ బేట్స్ మేన్ మియాన్ దాద్ అన్నా అనవచ్చు. రిచర్డ్స్, గోపర్, మార్టిన్ కరో కన్ సిస్టెంట్ గా ఆడలేకపోతున్నారు అంది వినూత్న.
    
    అతనికి జతగా సలీంమాలిక్ బాట్ చేస్తున్నాడు. ఇద్దరూ చక్కగా ఆడుతూ స్కోర్ పెంచసాగారు.
    
    వాళ్ళిద్దరూ షాట్స్ కొడుతూంటే ప్రేక్షకులు ప్రాణాలుగ్గబట్టుకుని చూస్తున్నారు.
    
                                             * * *

    అతను దేవీప్రియను గెస్ట్ హౌస్ లోపలకు తీసుకెళ్ళాడు.
    
    చాలా రిచ్ గా, ముట్టుకుంటే మాసిపోయేటట్లుగా, రంగుల స్వప్నంలా ఉంది లోపల.
    
    దేవీప్రియ ఒళ్ళు పులకరిస్తుంది. మనసులో భయం భయంగా ఉంది.
    
    అతని చెయ్యి ఆమె భుజంమీద పడింది. వీపుమీదకు పాకింది. మొహానికి మొహం చేరువగా వచ్చింది.
    
    పెదవులు పెదవుల్ని కలుసుకోబోతున్నాయి.
    
    "వద్దు" అని దేవీప్రియ మొహం పక్కకి తిప్పేసుకుంది.
    
    "ఆల్ రైట్" అని అతను నవ్వుతూ తొందరపడకుండా ఫ్రిజ్ దగ్గర కెళ్ళాడు. బిస్ లరీ సోడా బయటకు తీశాడు. పక్కనున్న షోకేస్ లోంచి రాయల్ సెల్యూట్ బాటిల్ బయటకు తీశాడు.
    
                                               * * *
    
    స్కోర్ నూటపది దగ్గర ఉండగా సలీంమాలిక్ రనవుట్ అయిపోయాడు.
    
    'హమ్మయ్య' అని ప్రేక్షకులు రిలీఫ్ ఫీలయ్యారు.
    
    ఇండియా గెలవటానికి అవకాశాలు మెరుగయినాయి.
    
    టీ.వీ. కెమేరా ఇమ్రాన్ ఖాన్ మీద ఫోకస్ అయింది. మొదట అతనే వద్దామా అన్న ఉద్దేశంలో ఉన్నట్లు కనబడింది. ఆఖరిక్షణంలో ఏమనుకున్నాడో అబ్దుల్ ఖాదిర్ ని పంపించాడు.
    
    ఖాదిర్ వచ్చి ఎడాపెడా షాట్స్ కొడుతున్నాడు.
    
    స్కోర్ నెమ్మదిగా పెరుగుతోంది. ప్రేక్షకుల్లో ఉత్కంఠ క్షణక్షణానికీ పెరిగిపోతుంది.
    
    స్కోర్ నూట ఎనభయి ఒకటి దగ్గర ఉండగా ముప్పయినాలుగు పరుగులు చేసి కపిల్ దేవ్ బౌలింగ్ లో సబ్ స్టిట్యూట్ రామన్ లాంబా కాచ్ పట్టగా ఖాదిర్ అవుటయిపోయాడు.
    
    తరువాత ఇమ్రాన్ ఖాన్ బాటింగుకు వచ్చి ఏడు పరుగులు మాత్రం చేసి మదన్ లాల్ బౌలింగ్ లో అవుటయిపోయాడు.
    
    ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
    
                                                 * * *

 Previous Page Next Page