Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 32


    "డాడీకి ఇ.సి.జి. తీయిద్దాం ఒరేయ్, నేను కారులో వెళ్ళి డాక్టరుగార్ని తీసుకురానా?" అన్నాడు మనోజ్.
    
    "నీ వెధవ డ్రైవింగూ నువ్వూనూ ఉండు నేనే వెళ్ళి వస్తాను" అంటూ రాఖేష్ బయల్దేరబోతున్నాడు.
    
    "ఏమండీ! ఏమండీ" అని పిలుస్తూ విశారద అతని భుజాలు పట్టుకుని కుదుపుతుంది.
    
    రాజాచంద్ర నెమ్మదిగా కళ్ళు విప్పి "ఐ యామ్ ఆల్ రైట్" అన్నాడు. గొంతు మాత్రం నీరసంగా ఉంది.
    
                                            * * *
    
    నాలుగురోజులు గడిచాయి. ఆదివార మొచ్చింది. ఆ సాయంత్రమే విజ్ఞత చెప్పిన బెనిఫిట్ షో.
    
    అయిదు గంటలవేళ విశారదతో అన్నాడు.
    
    "ఇవేళ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలున్నాయి. వెళదాం వస్తావా?"
    
    విశారద అతని వంక ఆశ్చర్యంగా చూసింది. "మీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ కు వెళ్ళటమా? శోభానాయుడు డ్యాన్స్, రవిశంకర్ సితార్, బాలమురళీకృష్ణ పాటకచేరీ- వీటికే మిమ్మల్నెంత బ్రతిమిలాడినా, వాళ్ళు ఊరికే కార్డ్స్ పంపించినా వెళ్ళేవారు కాదుగదా. ఇవాళేమిటి విపరీతం?"
    
    "ఎందుకంటే... ఎందుకంటే... వాళ్ళెవరూ బెనిఫిట్ షోకని వస్తే కార్డు డబ్బిచ్చి కొన్నాను కనుక."
    
    "మీరు డబ్బు పోయింది కదా అని బాధపడుతూ కల్చరల్ ప్రోగ్రాం చూడటానికి వెళుతున్నారు. టికెట్ కి ఎంతిచ్చి కొన్నారేమిటి?"
    
    "ఎంత! వంద రూపాయలు!"
    
    "మీ దృష్టిలో ఆఫ్ ట్రాల్ వంద రూపాయలు. వేలకు వేల రూపాయలు కల్లబొల్లి కబుర్లు చెప్పి మీ దగ్గర్నుంచి కాజేస్తున్నా చీమ కుట్టినట్లయినా బాధపడరుగానీ, వంద రూపాయలు ఖర్చు పెట్టినందుకు బాధపడి ఇంట్లోంచి కదుల్తున్నారు."
    
    "అవును నిజంగా" అన్నాడు అబద్దం చెబుతున్నందుకు తనమీద తనే అసహ్యపడుతూ.
    
    విశారద ఏమీ మాట్లాడలేదు.
    
    "రావా? అనడిగాడు.
    
    "మీతో రావాలంటే నాకు సరదానేగాని ఓ గంటనుంచీ, స్టమక్ లో ఇదిగో ఈ పక్క చాలా నొప్పిగా ఉంది. ప్లీజ్! మీరు వెళ్ళిరండి."
    
    రాజాచంద్ర ఆమె ముఖంలోకి చూశాడు. నిజంగా బాధపడుతున్నట్లే కనిపించింది.
    
    "పోనీ నేను కూడా ఆగిపోనా?" అన్నాడు ఆమె ఎంతో బాధ ఉంటేగాని చెప్పదు.
    
    "టాబ్లెట్ వేసుకున్నాను లెండి. కాసేపట్లో తగ్గిపోతుంది. మీరు వెళ్ళక వెళ్ళక వెళ్ళాలనుకున్నారు. పోయిరండి" అంది విశారద.
    
    ఆమె అలా ఉంటే వెళ్ళటం అతనికి కలతగానే ఉంది. అయినా ఇవేళ..ఎందుకో వెళ్ళాలని ఉంది.
    
    "తొందరగా వచ్చేస్తాను" అంటూ బయటకు కదిలాడు.
    
                                             * * *
    

    ఓ అరగంటయాక ఫోన్ రింగయితే, నొప్పితో బాధపడుతూ మంచంమీద పడుకున్నదల్లా లేచి వెళ్ళి రిసీవ్ చేసుకుంది.
    
    "హలో" అంది.
    
    రాజాచంద్రగారున్నారాండీ?" అంది అవతల్నుంచి ఎవరో అమ్మాయి.
    
    ఒక్కసారిగా నరాలు జివ్వుమని లాగాయి. ఆ గొంతు... చాలా పరిచిత మైనదిలా ఉంది. కాని ఎవరో గుర్తు పట్టలేకపోయింది.
    
    "లేరు బయటకు వెళ్లారు."
    
    "మీరు..."
    
    "ఆయన మిసెస్ ని."
    
    "నమస్కారమండీ. రాజాచంద్రగారికి బెనిఫిట్ షోకి టికెట్ ఇచ్చాను. అడగ్గానే వెయ్యి రూపాయలిచ్చి తీసుకున్నారు. రావటం మరిచిపోతారేమో రిమైండ్ చేద్దామని."
    
    "కళాక్షేత్రంలో ప్రోగ్రాం గురించేనా మీరు చెప్పేది?"

    "అవునండీ."
    
    "అక్కడికే వెళ్ళారు."
    
    "అలాగా? మీరుకూడా రాకపోయారా?" అన్నదా అమ్మాయి.
    
    "నాకు... కొంచెం ఒంట్లో బాగుండక రాలేనని చెప్పాను."
    
    "అయ్యో! అందా అమ్మాయి.
    
    విశారద ఏమీ మాట్లాడలేదు.
    
    "ఉంటానండీ" అని ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసింది.    
    
    విశారద మొహమంతా నల్లబడిపోయింది. ఇంత చిన్న విషయంలో రాజాచంద్ర అబద్దం దేనికి చెప్పారు? అతను వేలకు వేలు తనకున్న దయాగుణంవల్ల వృథా చేస్తుంటాడనీ, ఆ అలవాటు అతను మానుకోలేడనీ తెలుసు. అతను ఏ బెనిఫిట్ శోకో వెయ్యిరూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే తను పట్టించుకాదు. అతని ఆఫీసు విషయాల్లో అతనెప్పుడయినా తనంతట తాను చెబుతే తప్ప, ఎప్పుడూ జోక్యం కలిగించుకాదు. అసలతని ఆఫీసెక్కడుందో కూడా తనకే తెలియదు. అటువంటిది ఇంత చిన్న సందర్భాన్ని గురించి అబద్దం ఎందుకు చెప్పారు?
    
    మనసంతా వికలమైపోయింది. మెల్లగా వెళ్ళి మంచంమీద పడుకుంది.
    
    రాజాచంద్ర!
    
    చాలా లోతుగా పరిశీలిస్తే అతని ప్రవర్తనలో చిన్న మార్పు వస్తున్నట్లు గోచరిస్తోంది. అదేమిటో, ఆ సున్నితమైన తేడా ఎక్కడుందో చెప్పలేకపోతుంది.
    
    తమ ఇద్దరి మధ్యా ఏమయినా పొరలు ఏర్పడనున్నాయా?
    
    ఊహించటానికి కూడా కష్టంగా ఉంది. అతను తన ప్రాణం, సర్వస్వం, ఊపిరి, దైవం ఈ ఇరవై ఇరవై రెండేళ్ళ కాపురంలో తన మధ్య ఎలాంటి కలతలూ రాలేదు. అతన్నో పసివాడిలా, కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తుంది.

 Previous Page Next Page