ఆ వ్యక్తి కృష్ణస్వామి వేషంలో వున్న పుష్పరాజ్ గ్రేట్ స్మగ్లర్, క్రిమినల్ పుష్పరాజ్!
* * *
గోడ గడియారం రెండు గంటలు కొట్టింది.
అదే సమయంలో హాల్లో మాటలు వినబడడంతో లేచి కూర్చుంది లిపి.
తమ్ముడు భాస్కరం అప్పుడే వచ్చాడు.
భాస్కరం బాగా తాగి రావడం వల్ల తూలిపోతున్నాడు.
"ఎన్నిసార్లు తలుపు కొట్టాలి? అందరూ అంత బండ నిద్రపోతున్నారా." తల్లిమీద అంతెత్తున ఎగురుతున్నాడు భాస్కరం.
తల్లి రాజ్యం వాడ్ని ఆ పరిస్థితిలో చూడటం అదే ప్రధమం.
"ఏంట్రా నువ్వు తాగుతావా?" ఆశ్చర్యపోతూ అడిగిందావిడ.
"ఏం తప్పా! తప్పా చెప్పు. నేను తాగుతాను. తిరుగుతాను. ఇంకేవేవో పనులు చేస్తాను. నా యిష్టం ... నన్నెవరైనా అడిగితే నేనూరుకోను. తెల్సిందా, తెల్సిందా?" గట్టిగా అరుస్తున్నాడు భాస్కరం,
అదే సమయంలో రూమ్ లోంచి వచ్చిన లిపిని చూసి.....
"ఏం నువ్వు కూడా లెసన్స్ చెప్పొద్దు."
"బాచీ! నువ్వెళ్ళి పడుకో. ఉదయం మాట్లాడుకుందాం" అంది లిపి అనునయంగా ఆమెకయితే షాక్ మీద షాక్ తగిలినట్టుగా వుంది.
"ఏం ఉదయం తిడతావా? ఆ తిట్టేదేదో ఇప్పుడే తిట్టు. నువ్వు తిట్టినా రోజూ నేనిలాగే వస్తాను. నువ్వు నైట్ డ్యూటీ అన్నావ్...... ఇక్కడెలా వున్నావ్?"
వెంటనే జవాబు చెప్పలేదు లిపి.
"నేను ఉద్యోగం మానేశాను. అక్కడ నాకు నచ్చలేదు" లిపి నోటిలోంచి వచ్చిన మాటకు విస్తుపోయింది రాజ్యం.
"అంటే..... అంటే.....ఒక కుట్ర చేసి అందరూ నా దగ్గర తిష్ట వెయ్యడాని కొచ్చారన్నమాట.
నేను మీ అందర్నీ పోషించలేను. ఇప్పుడే చెప్పేస్తున్నాను. నువ్వు ఉద్యోగం చేసి అమ్మా, నాన్నల్ని పోషించుకుంటేనే ఇక్కడుండండి. ఇంటిఅద్దె మాత్రమే నేను కడతాను. లేకపోతే ఎక్కడినుంచి వచ్చారో అక్కడికెళ్ళిపోండి. నేను మిమ్మల్ని పోషించలేను" తూలుతూ తన గదిలోకెళ్ళి పోయి దబ్ మని తలుపేసేసుకున్నాడు భాస్కరం.
తమ్ముడి వ్యక్తిత్వం మొట్టమొదటిసారి తెల్సుకున్న లిపి ఆ పరిస్థితిని వెంటనే జీర్ణించుకోలేకపోయింది.
"ఏమ్మా! ఉద్యోగం మానేశావని నాకెందుకు చెప్పలేదు?" కుర్చీలో విషాద ప్రతిమలా కూర్చుండిపోయిన లిపిని అడిగింది తల్లి. లిపి గాఢంగా నిట్టూర్చిందే తప్ప తల్లి అడిగిన ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయింది.
"వీడి పరిస్థితి అలా వుంది. నీ పరిస్థితి ఇలా వుంది. ఇప్పుడేంచేద్దాం?" తనలో తను అనుకున్నట్టుగా అంది రాజ్యం భారంగా నిట్టూరుస్తూ .
లిపి మనసులోనే కుమిలిపోతోంది. ఆమె మెదడంతా మొద్దుబారి పోయినట్టయిపోయింది. అయినా క్షణాల్లోనే తేరుకుంది.
"నువ్వేం బాధపడకమ్మా! నేను రెండ్రోజుల్లో ఏదో ఉద్యోగం చూసుకుంటాను. మనం వేరే యింటికి వెళ్ళిపోదాం" లిపి కళ్ళల్లోకి ఆనందంగా చూసింది రాజ్యం.
"ఈ కాలంలో కొడుకులు అక్కరకు రారు! కూతుళ్ళే. వీరబ్రహ్మం స్వామి చెప్పింది ఉత్తినే పోదు" మంచం మీద నడుం వాలుస్తూ అందామె .
చాలాసేపు ఎన్నో విధాలుగా ఆలోచించుకొన్న మీదట తన సమస్యకు పరిష్కారం దొరికాక ఆమె ఉత్సాహంగా లేచి తన బెడ్ రూమ్ లోకెళ్ళింది.
ఆమెకు వెంటనే నిద్ర పట్టేసింది.
ఆ సమస్యకు పరిష్కారం.....
మర్నాడు డా|| రమణకు ఫోన్ చెయ్యడం!
* * *
డా||కుమరన్ రిపోర్ట్స్ అన్నింటినీ మరొక్కసారి సీరియస్ గా పరిశీలించి ఎదురుగా కూర్చున్న అభినవ్ తో చెప్పడం ప్రారంభించాడు.
"నందినికి చిన్నప్పుడు ఆమెకు తెలీకుండానే స్పైనల్ కార్డ్ మీద బలమైన దెబ్బ తగిలింది. బహుశా అయిదారేళ్ళ వయసులో కావచ్చు తగిలిందా?"
"నాకు తెలీదు" చెప్పాడు అభినవ్.
"నీకే కాదు! ఆమెకు కూడా తెలిసుండకపోవచ్చు. అప్పట్లో అది చాలా మైనర్ ఇన్ జురీ కావచ్చు. కానీ ఇప్పుడది సీరియస్ గా మారిపోయింది.
రెండు నెలలపాటు మెడిసిన్స్, ఇంజక్షన్స్ కంటిన్యూవస్ గా వాడాక రిజల్ట్స్ చూసి, ఈ కేసుని నేను టేకప్ చెయ్యాలా, అమెరికాకు పంపించాలనే విషయం చెప్పగలను" చెప్పాడాయన.
"ఈజిట! వెరీ సీరియస్" ఆతృతగా అడిగాడు అభినవ్.
"ఈ వ్యాధిలో ఉన్న ప్రధాన లక్షణం- మిగతా జబ్బుల్లా ఇది సీరియస్గా కనిపించదు. కానీ డెడ్ లీ సీరియస్!
స్పెనల్ కార్డ్ ఇన్ జ్యురిస్ లో చాలా వింత వింత సంఘటనలు అమెరికాలో జరిగాయి. 1986లో అనుకుంటా - రావ్ నుజీ అనే ఒక వ్యక్తి ఇరవై ఎనిమిదేళ్ళ యువకుడు తన కారుని ఓ ట్రక్కుకి ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో నుజీ మెడకు బలమైన గాయం తగిలింది.
వెంటనే నుజీని హాస్పిటల్ కు తీసికెళ్ళారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెద్ద స్పెషలిస్టులు నుజీకి టెస్ట్ చేశారు. అక్కడ విచిత్రం ఏమిటంటే నుజీ కాన్షస్ గానే వున్నాడు. తను డాక్టర్లనీ, నర్సుల్నీ చూస్తున్నాడు. కానీ అతని శరీరం మాత్రం కదలికలు ఆగిపోయాయి.
నర్స్ సారా వేమన్ తనవేపు చూస్తున్న నుజీని చూసి "మిస్టర్ నుజీ! మీ భుజాలు కదపగలరా?" అని అడిగింది. నుజీ భుజాలు కదపడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మెడను తిప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతను తన చేతుల్ని, కాళ్ళను, పాదాల్ని ఎంతమాత్రం కదపలేకపోయాడు.
నర్స్ సారా అతని భుజం పై భాగంలో వుండే చర్మాన్ని పట్టుకుంది. అక్కడ స్పర్శ అతనికి తెలుస్తూనే వుంది. భుజం కింది భాగంలో అసలు స్పర్శ లేదు. ఆ చర్మం మెత్తగా, దూదిలా అయిపోయింది.
అప్పుడు డాక్టర్స్ ఏం నిర్మయించారో తెలుసా? అతని నరాల కదలికలకుకేంద్రస్థానమయిన నాడీమండలానికి దెబ్బ తగిలిందని. పాములాగా వీపు వెనకున్న ఆ భాగం చివర నాళాలకు దెబ్బ తగలడమే స్పైనల్ కార్డ్ ఇంజురీ అంటారు. కొంతమంది పెద్ద ప్రయత్నమేమీ లేకుండా అతి త్వరలో కోలుకుంటారు. మరికొందరు కోలుకున్నట్టు కన్పించినా అకస్మాత్తుగా వారిలో నరాలు చచ్చుబడిపోతుంటాయి. ప్రముఖ సినిమా నటుడు నూతన ప్రసాద్ కి దాదాపు ఇలాంటి ప్రమాదమే సంభవించింది.