"చెయ్యలేదు. వాడ్ని అరెస్టు చెయొద్దు అన్నావుగా?"
"నేను అలా అనలేదే?"
"అంటే అరెస్టు చెయ్యమంటావా?" "అతడు హంతకుడని నిరూపించడానికి నీ దగ్గర ఆధారాలు ఉంటే చెయ్యి."
"లేవు"
"ముందు ఆధారాలు సంపాదించు. సరే! ఇన్నింటికీ ఎవరి వేలిముద్రలు పింపించావ్?"
"పోచయ్యవి"
"మరి నేను అన్నది అదేగా?" అన్నాడు విజయ్.
"సరే! మంచిదే అయింది. నీ అనుమానితుల లిస్టులో నుంచి ఒకడు ఎలిమినేట్ అయ్యాడు."
"ఇకవాడ్ని వదిలెయ్యనా?"
"నీ ఇష్టం!మరో శవం కావాలనుకొంటే వదిలేయ్ " అన్నాడు నరేంద్ర.
"పోచయ్యకు కొన్నివిషయాలు తెలిసిఉండాలి. తెలియక పోయినా హంతకుడికి అనుమానం ఉండొచ్చు. అదే కాంపౌండులో ఉన్న పోచయ్య బ్రతికి ఉండడం ప్రమాదంగా అతడు భావించవచ్చు. హంతకుడు పోచయ్యను చంపవచ్చు."
"పోచయ్యను శంకర్రావు చంపుతాడనేగా నీ భయం?" ఏదో క్లూ లాగుతున్నట్టుగా అన్నాడు నరేంద్రను చూస్తూ.
నరేంద్ర చిరునవ్వు నవ్వాడు.
"హంతకుడు చంపుతాడన్నాను. శంకర్రావు అనలేదు." అన్నాడు నరేంద్ర.
"తిరకాసుగా మాట్లాడుతున్నావ్" అద్వయితం గుర్రుగా అన్నాడు.
"ఇందులో తిరకాసేం లేదు. ముందు మనం తెలుసుకావాల్సింది హంతకుడు ఎవరనేది. రాధారాణి హత్య జరిగి పది రోజులైంది. పోయిన శుక్రవారం రాత్రి జరిగింది. కాని మనం ఇంకా కాలు ఎక్కడ మోపాలో తెలియని స్థితిలోనే ఉన్నాం. శినివారం రాత్రి రామకృష్ణ హహ్త్య జరిగింది. నువ్వేమో హంతకుడుదొరికాడని నిశ్చింతగా ఉన్నావ్. కాని అతడే హంతకుడని నిరూపించడానికి ఆధారాలు మనకు లేవు.....ఇక...."
"ఆగు నరేంద్రా! రామకృష్ణను సూర్యనారాయణే హత్య చేశాడని నేను నిరూపించగలను"
"ఏ ఆధారాలతో?"
"హత్య జరిగిన గదిలో రామకృష్ణ సిగరెట్ కేసు దొరికింది. దానిమీద ఉన్న వేలిముద్రలు అతడివేనని రూఢి అయింది. ఇక అతడు రామకృష్ణను చంపడానికి కారణాలు ఉన్నాయి."
"ఏమిటా కారణాలు?"
"రామకృష్ణను అతడు మోసం చేశాడు. రామకృష్ణ తిరిగి వచ్చాడని తెలిసి భయపడిపోయాడు. రామకృష్ణను ఫాలో అవుతూ రమణరావు దగ్గరకు వెళ్ళాడు. లాయర్ సలహాలకోసం వెళ్తాడు. రామకృష్ణ తననూ అనసూయనూ జైలుకు పంపిస్తాడని విపరీతంగా భయపడి పోయాడు.జైలుకు పంపకపోయినా చిత్రహింసలకు గురిచేస్తాడనే బీతి పట్టుకుంది. అతడు ఏ హొటల్లో దిగాడోకూడా లాయర్ రమణరావును అడిగి తెలుసుకున్నాడు. తిన్నగా హొటల్ కి వెళ్ళి అతడ్ని చంపి నీ దగ్గరకు ఎలిభీకి వచ్చాడు" అన్నాడు అద్వయితం.
"ఓహొ అయితే రమణరావు నుంచి చాలా సమాచారం సేకరించావన్నమాట?" సాలోచనగా అన్నాడు నరేంద్ర.
ఏదో చిక్కుముడి విడిపోయినట్టుగా ఒక్కసారిగా నరేంద్ర ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
"నరేంద్రా! నాకు అర్థం కాని విషయం ఒక్కటేనయ్యా"
"ఏమిటి?"
"హంతకుడు సూర్యనారాయణ అనే విషయం ఇంత స్పష్టంగా తెలిసిపోతున్నది. అయినా నువ్వు అతడ్ని ఎందుకు నిర్దోషిగా నిరూపించడానికి ప్రయత్నిస్తున్నావో నాకు అర్థంకావడంలేదు" అద్వయితం కంఠం అదోలా పలికింది.
"ఏమిటి నీ ఉద్దేశ్యం? హంతకుడితో నరేంద్ర చేతులు కలిపాడంటావా? చివ్వున కుర్చీలోనుంచి లేచి నిల్చున్నాడు విజయ్.
"అరెరె!నేను అలా అనలేదు విజయ్!"
"విజయ్!ఉద్రేకపడకు! కూర్చో" అన్నాడు నరేంద్ర.
నరేంద్ర ఇన్స్ స్పెక్టర్ ను చూస్తూ అన్నాడు. "నీ అనుమానాలకు నేను ఇప్పుడు సమాధానాలు ఇవ్వను. ఒకటి మాత్రం గుర్తుంచుకో. ఇంతకుముందే నీకు చాలాసార్లు చెప్పాను. సూర్యానారాయణ నిర్దోషి అని అనలేదు. కాని అతడ్ని దోషిగా నిరూపించడానికి బలమైన ఆధారం మనకు ఇంకా దొరకలేదు అంటున్నాను."
"ఇంకా ఏం బలమైన ఆధారం కావాలి? ఆ సిగరెట్...."
"కేసు పోలీసోళ్ళే తీసుకెళ్ళి ఆ గదిలో పడేశారు అంటున్నాడు సూర్యనారాయణ."
"అంటే నేనే తీసుకెళ్ళి పడేశానంటావా?"
"నేను అనలేదు. అతడు అంటున్నాడు," దృఢంగా పలికింది నరేంద్ర కంఠం.
"నీ అభిప్రాయం నాకు కావలి!"
"మరొకరికి అతడి సిగరెట్ కేసు దొరికి ఉండొచ్చును. హత్యానేరం అతడి మీదకు మళ్ళించడానికి ఆ సిగరెట్ కేస్ తీసుకెళ్ళి హంతకుడు ఆ గదిలో వదిలేసి ఉండవచ్చును. సూర్యనారాయణకూ రామ కృష్ణకూ ఉన్న సంబందాలను బట్టి హంతకుడు ఆ పని చేసిఉండొచ్చుగా?" అన్నాడు నరేంద్ర.
"మళ్ళీ ఇదో మెలిక వేశావేమిటయ్యా బాబూ!" నీరుకరిపోతూ అన్నాడు అద్వయితం.
"హంతకుడు తప్పించుకోవడానికి ఎన్నిఉపాయాలు పన్నుతాడో వాటిని చేదించడానికి మనం కూడా క్షుణ్నంగా అన్నివిషయాలనూ పరిశీలించాలి" అన్నాడు నరేంద్ర.
"నా సర్వీసులో ఇలాంటి కేసులు ఎప్పుడూ ఎదురవలేదు."
"ఎప్పటికప్పుడు నువ్వు ఇలాగే అంటూ ఉంటావులే" అన్నాడు విజయ్.
"నువ్వుండవయ్యా బాబు! ఇవ్వాళ మధ్యాహ్నం మా డి.సి.పి.పిల్చాడు అసలే అతడు గబ్బర్ సింగ్ లాంటివాడు. భయపడుతూనే వెళ్ళాను. అక్షితంలు వేశాడు. తర్వాత ఏదో సర్దిచెప్పుకున్నాననుకో."
"ఏమంటాడు?"
"రాధారాణి హత్య జరిగి పదిరోజులైంది. ఇంతవరకు ఎలాంటి ఆచూకి దొరకలేదా అన్నాడు. ఆ కేసు నువ్వు చూస్తున్నావనీ, త్వరలోనే హంతకుడ్ని అరెస్టు చెయ్యబోతున్నామనీ చెప్పి తప్పించుకున్నాను."
"ఆ తర్వాత?"
"రామకృష్ణ కేసులో హంతకుడ్ని అరెస్టు చేశాననీ ఒకటి రెండు రోజుల్లో అతడ్ని జుడిషియల్ కస్టడీకి పంపిస్తాననీ చెప్పాను. అంతటితో చల్లబడ్డాడు."
"ఊ" నరేంద్ర సిగరెట్ వెలిగించుకున్నాడు.
"ఇక భారతి కేసు గురించి. ఆ ఏరియా ఇన్స్ స్పెక్టర్ రజాక్ కమీషనర్ కు కంప్లైంటు ఇచ్చాడట."
"ఏమని?"
"నేను అనవసరంగా తన జూరిస్ డిక్షన్ లోకి జొరబడుతున్నానని డి.సి.పి. ఆ కేసు నువ్వెందుకు తీసుకున్నావని అడిగాడు. మొదటి రెండు హత్యలతో సంబంధం ఉన్నవాడే ఈ హత్యకూడా చేసినట్టు మాకు అనుమానంగా ఉందని చెప్పాను."
"గుడ్! ఇక్కడ తెలిసో తెలియకో కరెక్టుగా చెప్పావ్."
"అంటే? ఈ మూడు హత్యులూ ఒక్కడే చేశాడంటావా?"
"ఖచ్చితంగా అనలేను. కాని నా అనుమానం అంతే!"
"నీ అనుమానం ఎవరిమీద?"
"త్వరలోనే చెబుతాను,కొంచెం ఓపికపట్టు" అన్నాడు నరేంద్ర.
నరేంద్ర సిగరెట్ పీకను యాష్ ట్రేలో వేసి లేచి నిల్చున్నాడు.
"వెళుతున్నావా?"
"కాదు వెళుతున్నాం పదా!"
"ఎక్కడికి?"
"నల్లకుంట"
"కమలాంబ ఇంటికా?" ఆశ్చర్యంగా అడిగాడు అద్వయితం.
"అవును"
"ఇప్పుడు అర్థం అయిందిలే"
"ఏమిటి?"
"నువ్వు అనుమానిస్తున్నదెవర్నో"
"ఎవర్ని?"
"శంకర్రావును" ఏదో రహస్యం కనిపెట్టినట్టుగా ముఖం పెట్టి అన్నాడు అద్వయితం.
నరేంద్ర సమాధానం ఇవ్వలేదు. బయటికి నడిచాడు.
"ఏడుకొండలూ! పద!" హెడ్డును హెచ్చరించి ఇన్స్పెక్టర్ నరేంద్ర వెనకే స్టేషన్ బయటికి వచ్చాడు.
ఇన్ స్పెక్టర్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు.
"ఎక్కు" అన్నాడు విజయ్ తో నరేంద్ర.
"మీరు వెళ్ళండి. నాకు వేరే పని ఉంది" అన్నాడు విజయ్
"ఏం మరదలు పిల్లతో సినిమా ప్రోగ్రాం ఉందా?" గలగల నవ్వాడు అద్వయితం.
"కాదులే. మనవాడు అవసరమైన పనిమీదే వెళుతున్నాడు. వెళ్ళు జాగ్రత్త!"
విజయ్ ముందుకు వెళ్ళి ఖాళీగా నిలబడిఉన్న ఆటో ఎక్కడు.
"జాగ్రత్త అంటున్నావ్? ఏం పనిమీద వెళుతున్నాడు?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
"మనవాడికి రాధారాణి హత్యుకు సంబంధించిన ఒక క్లూ దొరికిందిలే. దాన్ని పట్టుకొని బయలుదేరాడు"
ఇన్ స్పెక్టర్ తో ఆ విషయం అంతకుముందే విజయ్ చెప్పాడు. అయినా ఏమీ తెలియనట్టే నటించాడు.
"రాధారాణి హత్యకు సంబంధించిన క్లూ దొరికిందా? మరి ఇంత వరకూ నాకు చెప్పలేదేం? ఏమిటా క్లూ? తెచ్చిపెట్టుకొన్న ఆశ్చర్యం ప్రశ్నించాడు అద్వయితం.
"బంగారు గుండీ!"
"తస్సాదియ్యా అదా సంగతి? మొన్న కమలాంబ ఇంట్లో గుండీల గురించిన ప్రసక్తి వచ్చిందిగా?"
"ఆ అదే!"
"అయితే రాధారాణిని శంకర్రావుగానీ, రమణరావుగానీ చంపిఉండాలి" అన్నాడు అద్వయితం.
"కానీ అంటే ఎలా? ఎవరై ఉంటారో ఆలోచించు."
అద్వయితం ఆలోచనలో పడ్డాడు.